సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై సోషల్‌మీడియాలో జోకులు పేలుతున్నాయని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ధర్మపోరాటదీక్షలో చంద్రబాబు బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పోరాడిందని చెప్పడం మండిపడ్డారు.
చంద్రబాబుకు మతి స్థిమితం ఉందా? అంటూ ప్రశ్నించారు. ఇదే ప్రశ్నను నెటిజన్లు కూడా అడుగుతున్నారని అన్నారు. అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా, సత్య నాదెళ్లను మైక్రోసాఫ్ట్ సీఈవోగా, హైదరాబాద్‌ను తాను నిర్మించానని, భారత్‌కు సెల్‌ఫోన్‌ను తెచ్చానని చంద్రబాబు చెప్పుకోవడమే ఈ అనుమానం కలిగిస్తోందని చెప్పారు. తిరుపతి బహిరంగ సభలో కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు అల్టిమేటం జారీ చేస్తారని ప్రజలు ఆశించారన్నారు. అయితే, అందుకు భిన్నంగా చంద్రబాబు టీడీపీ బ్రిటీష్‌పై పోరాటం చేసిందనడంతో ప్రజలందరూ నవ్వుకున్నారని చెప్పారు.
‘మహాత్మాగాంధీ వెంట గనుక చంద్రబాబు తిరిగినట్లుయితే స్వతంత్రం కోసం ఇంగ్లండ్ వెళ్లి పోరాటం చేయాలని చెప్పేవారు. ప్రత్యేక హోదాపై ఆంధ్రలో పోరాటంలో చేయకూడదని చంద్రబాబు అంటున్నారు. మరి ధర్మపోరాట దీక్షలను ఢిల్లీలో చేయొచ్చుగా. ఆంధ్రప్రదేశ్‌లో మూడు సెంటీమీటర్ల వర్షపాతం కురిస్తే సెక్రటరియేట్‌లోని ప్రతిపక్ష నేత చాంబర్‌లో ఆరు సెంటీమీటర్ల వర్షం పడింది. చంద్రబాబు అనేక దోపిడీలకు, అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడ్డారు. ఆయన చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం తప్ప మరో పరిష్కారం లేదు.
ఇక ప్రజలను మోసం చేయనని, ప్రత్యేక హోదా గురించి నిజంగా పోరాడతానని చంద్రబాబు ప్రజలతో చెప్పాలి. ఆ తర్వాత ప్రత్యేక హోదా గురించి మాట్లడాలి. అప్పటివరకూ ప్రత్యేక హోదా గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు. టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయించండి. అలా చేయకుండా కాకమ్మ కబుర్లు చెప్పకండి. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక రాష్టంలోని 13 జిల్లాలను 25 జిల్లాలుగా మార్చబోతున్నాం. కృష్ణా జిల్లా కృష్ణాగానే ఉంటుంది. రెండు భాగం అయ్యే జిల్లాకు నందమూరి తారక రామారావు జిల్లాగా నామకరణం చేస్తాం.
వచ్చే ఎన్నికల్లో తననే గెలిపించాలని చంద్రబాబు చెబుతున్నారు. 2014లో గెలిపిస్తే ఈ ఐదేళ్లలో ఏం చేశాడు. వచ్చే ఐదేళ్లలో మళ్లీ అధికారం ఇస్తే ఏం చేస్తాడు. ఒక్క అవకాశాన్ని వైఎస్సార్ సీపీకి ఇవ్వండి. 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్ సీపీని గెలిపించండి. కచ్చితంగా మార్పు తెచ్చి చూపిస్తాం.’ అని అంబటి రాష్ట్ర ప్రజలను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment