టీడీపీకి బీజేపీ, పవన్ కళ్యాణ్ లు షాక్ ఇస్తారా!
టీడీపీకి బీజేపీ, పవన్ కళ్యాణ్ లు షాక్ ఇస్తారా!
Published Fri, Aug 22 2014 5:05 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
తెలంగాణ రాష్ట్రంలో అమిత్ షా పర్యటన నేపథ్యంలో జనసేన నేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ మళ్లీ తాజా రాజకీయాల్లో చర్చకు తెర తీశారు. గత కొద్దికాలంగా ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ పార్టీకి పవన్ కళ్యాణ్ సన్నిహితంగా ఉంటున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూటమికి మద్దతు తెలిపి ప్రచారం నిర్వహించిన పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనకు త్వరలోనే ఎన్నికల కమిషన్ గుర్తింపు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఒకవేళ జనసేన పార్టీకి గుర్తింపు లభిస్తే.. బీజేపీతో కలిసి అడుగులేస్తారనే విషయం స్పష్టం కనిపిస్తోంది. ఒకవేళ రాజకీయ పార్టీగా గుర్తింపు పొందిన తర్వాత ప్రభుత్వాలను ప్రశ్నించడమే పవన్ కళ్యాణ్ బాధ్యతగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం విధానాలను వ్యతిరేకిస్తేనే జనసేనకు ఓ గుర్తింపు ఉంటుందనేది నూరుపాళ్లు సత్యం. ఇక రాజకీయాల్లో స్వతహాగా రాణించడం, పార్టీని బలంగా తయారు చేయాలంటే అధికార పార్టీతో చేతులు కలిపితే అనుకున్న లక్ష్యాలను చేరుకోవడం అసాధ్యమనేది పవన్ కళ్యాణ్ కు తెలియని విషయమే కాదు.
ఇలాంటి చిత్రమైన పరిస్థితి నేపథ్యంలో అధికార తెలుగుదేశం పార్టీకి చెక్ చెప్పి.. బీజేపీ తో చేతులు కలపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుత టీడీపీ, బీజేపీ కూటమిని ఎదురించే అవకాశాలు కనిపించడం లేదు. ఒకవేళ ప్రస్తుత అధికార కూటమిని విమర్శిస్తే మోడీకి, బీజేపీకి దూరమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది పవన్ కు సాధ్యపడే విషయం కాకపోవచ్చు. ఇలాంటి అనేక సమీకరణాలు.. ప్రశ్నలను పవన్ లేవనెత్తకుండా బీజేపీకి సన్నిహితంగా ఉంటే జనసేన లక్ష్యాలను అధిగమించడం కష్టమైన పనే.
బీజేపీ మద్దతు లేకుండా ఒంటరిగానే ఉండి.. కుల, వ్యక్తిగత బలంతోనే అధికారాన్ని చేజిక్కించుకోవడం కలగానే మిగులుతుంది. అంతేకాకుండా మరో ప్రజారాజ్యంగా జనసేన మారే ప్రమాదం అవకాశం కూడా ఉంటుంది. గత అనుభవాలను, ఇతర కారణాలన్నింటిని దృష్టి పెట్టుకుని బీజేపీతో సన్నిహితంగా ఉంటేనే పవన్ తాను అనుకున్న లక్ష్యాలను చేరుకోవడం చాలా తేలిక అవుతుంది. ఒకవేళ బీజేపీతో కలిసి తాను రూపొందించుకునే లక్ష్యాలను చేరుకోవాలంటే టీడీపీని తప్పని పరిస్థితిలో వ్యతిరేకించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఒకవేళ టీడీపీపై ఎదురుదాడి ఎందుకనుకుంటే బీజేపీలో జనసేన విలీనం చేయడమే పవన్ ముందున్న సమాధానం. అలా అయితే పురుడు పోసుకున్న కొద్ది రోజులకే జనసేన పార్టీని విలీనం చేశారనే.. మరో అపవాదును పవన్ కళ్యాణ్ మూటకట్టుకోవాల్సి వస్తుంది. సో.. తప్పని పరిస్థితిలో టీడీపీని వ్యతిరేకించాల్సిన బాధ్యత జనసేనపై ఉంది. అయితే బీజేపీతో పవన్ కలిసి టీడీపీని వ్యతిరేకిస్తాడా? లేక బీజేపీకి దూరంగా ఉండి టీడీపీని జనసేన టార్గెట్ చేస్తాడా అనేది కాలమే సమాధానం చెబుతుంది.
-రాజబాబు అనుముల
Advertisement
Advertisement