సాక్షి, అమరావతి: చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎన్నో ఆశలు పెట్టుకున్న చిలకలూరిపేట ప్రజాగళం.. వాళ్లిద్దరికీ నిరాశ కలిగించింది. ప్రధాని వస్తాడని, వైఎస్సార్‌సిపి ప్రభుత్వాన్ని ఎంతో విమర్శిస్తాడని ఎదురు చూశారు కానీ.. ప్రధాని ప్రసంగం మాత్రం వారిద్దరి ఆశలకు భిన్నంగా సాగింది. ప్రధాని సభ అత్యంత ప్రతిష్టాత్మకమని ప్రచారం చేసినా.. ఎక్కడా ఆ జోష్ కనిపించలేదు. పైగా కీలకమైన సమయంలో మైక్‌లు పని చేయకపోవడం వచ్చినవారిని ఊసురుమనిపించేలా చేసింది.
మీటింగ్‌పై జనం ఏమన్నారంటే?
చిలకలూరి పేటలో టీడీపీ కూటమి మీటింగ్ అట్టర్ ప్లాప్ అయింది. జనం రాకపోవడంతో సభా ప్రాంగణం అంతా వెలవెల బోయింది. పవన్, చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో అయితే సభలో ఖాళీ కుర్చీలు కనిపించాయి. కుర్చీలు కూడా నిండకపోవడంతో… స్టేజీ దగ్గర కార్యకర్తలతో హడావిడీ చేయించింది టీడీపీ. కార్యకర్తల హడావిడితో సౌండ్ సిస్టమ్ కాస్తా మొరాయించింది. దీంతో ప్రధాని మోదీ ప్రసంగానికి అడుగడుగునా అంతరాయం కలిగింది.
ఒక సమయంలో మాట్లాడుతున్న ప్రతీసారి మైక్ ఆగిపోవడంతో ప్రధాని మోదీ ఒకింత అసహనానికి గురయ్యారు. వేరే అవకాశం లేకపోవడంతో చేసేది లేక అలాగే ప్రసంగం కొనసాగించారు ప్రధాని మోదీ. సాధారణంగా ప్రసంగిస్తున్న సమయంలో …తన సహజశైలిలో కాకుండా ప్రధాని మోదీ కూడా కోపంగా కనిపించారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నప్పుడు గానీ.. చంద్రబాబు స్పీచ్ ఇస్తున్నప్పడు గానీ.. చిలకలూరిపేట సభకు వచ్చిన మూడు పార్టీల కార్యకర్తల నుంచి కనీస స్పందన కనిపించలేదు.
మైక్‌లు ఎందుకు మూగబోయాయబ్బ.?
పవన్ కల్యాణ్ మాట్లాడుతుంటే మైక్ బాగానే పని చేసింది. చంద్రబాబు మాట్లాడుతుంటే కూడా మైక్ బాగానే పని చేసింది. కానీ ప్రధాని మోదీ మాట్లాడుతుంటే మాత్రం మైక్ నాలుగు సార్లు కట్ అయింది. అసలు ప్రధాని స్థాయి వ్యక్తి మాట్లాడుతుంటే.. తెలుగుదేశం చేసిన ఏర్పాట్లు ఇంత దరిద్రంగా ఉన్నాయని ప్రజలు తిట్టుకోవడం కనిపించింది. పైగా కేంద్ర పథకాలు చెప్పుకుంటున్న ప్రతీసారి మైక్ ఎందుకు కట్ అవుతుందని ప్రజలతో పాటు ప్రధాని కూడా అసహనంగా ఫీలయ్యారు.
యూటర్న్‌లకే బాబు చంద్రబాబు
2019 ఎన్నికల సందర్భంగా చంద్రబాబు చేసిన ఘాటు విమర్శలు బీజేపీ నేతలే కాదు.. సామాన్యులెవరూ ఇప్పటివరకు మరిచిపోలేదు. అప్పట్లో మోదీని విమర్శించడానికి తెగ తాపత్రయపడ్డ బాబు.. ఈ సభలో అందుకు భిన్నంగా కనిపించాడు, వినిపించాడు. సాధారణంగా ఏ సభలోనయినా.. తన గురించి తాను చెప్పుకోకుండా.. కంప్యూటర్లు కనిపెట్టానని.. సెల్ ఫోన్ కనిపెట్టానని.. అమరావతిని సింగపూర్ చేశానని చెప్పుకోకుండా.. ప్రధాని మోదీని పొగడడానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాడు బాబు. అయితే దానికి బిన్నంగా ప్రధాని మాత్రం ఎన్టీఆర్ గురించి ప్రస్తావన తీసుకొచ్చి చంద్రబాబును మరింత ఇరకాటంలో పడేశాడు.
మీటింగ్ తర్వాత ఏం జరిగింది?
చిలకలూరిపేటలో చేసిన ఏర్పాట్లపై ప్రధాని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. జనసమీకరణ భారీగా చేస్తామని చెప్పి.. కనీసం కూడా తీసుకురాకపోవడం ఆయన్ను ఇబ్బందికి గురిచేసింది. పైగా మైక్‌లు పని చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. మీటింగ్ జరిగిన తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ.. ఇలా మీటింగ్‌లు జరిగితే కష్టమే అంటూ చెప్పినట్టు తెలిసింది. సరిగ్గా బహిరంగసభను పెట్టలేని వారు ఎలక్షన్ ఎలా చేయగలరంటూ చురకలు అంటించినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment