నాడు తిట్లు.. నేడు పొగడ్తలు
ఐదేళ్లక్రితం ప్రధాని మోదీని నోటికొచ్చినట్లు తిట్టిన చంద్రబాబు
ఆయనో టెర్రరిస్టు అని, దేశాన్ని సర్వ నాశనం చేశారని తిట్లు
నేడు అవసరార్ధం మోదీ ఇంద్రుడు, చంద్రుడు అంటూ పొగడ్తలు
మోదీజీ గారూ.. అంటూ అతి వినయం
కేవలం కేసుల భయంతోనే మోదీని పొగిడిన బాబు
వేదికపై చంద్రబాబు, పవన్‌ని పెద్దగా పట్టించుకోని మోదీ
ఇద్దరినీ ఏకవచనంతో సంబోధించిన ప్రధాని
ఐదేళ్ల క్రితం
మోదీ వల్ల దేశం సర్వ నాశనమైపోయింది. మోదీ ఒక టెర్రరిస్టు. ఆయనకు భార్య లేదు. తల్లిపై గౌరవం లేదు. మోదీ వల్ల దేశంలో ఎవరికీ ఉపయోగం లేదు.
ఆదివారం
మోదీ భారతదేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్న ఒక శక్తి. మోదీ అంటే అభివృద్ధి. మోదీ అంటే సంస్కరణ. మోదీ అంటే భవిష్యత్తు.
ఈ మాటలు మాట్లాడిన నాలుక ఒక్కటే. మడతపడిందంతే.. ఇంతలా మడతపడే నాలుక ఉన్నది చంద్రబాబు ఒక్కరికే అని ఆదివారం జరిగిన బొప్పూడి సభలో మరోసారి నిరూపితమైంది. ఆ నాడు మోదీని నోటికొచ్చినట్లు తిట్టిన చంద్రబాబు.. నేడు తన అవసరార్థం అదే నోటితో మోదీని ఇంద్రుడు, చంద్రుడు.. అంటూ పొగడ్తల్లో ముంచెత్తారు. మోదీజీ అని పిలిస్తే సరిపోయేదానికి మోదీజీ గారూ.. అంటూ గారూ అన్న పదాన్ని అదనంగా చేర్చి చంద్రబాబు ప్రదర్శించిన అతి వినయం, ఆయన్ని పొగిడేందుకు పడిన తాపత్రయాన్ని చూసి ప్రజలతోపాటు టీడీపీ శ్రేణులు కూడా ముక్కున వేలేసుకున్నారు.
మోదీ ప్రపంచం మెచ్చిన మేలైన నాయకుడంటూ పొగుడుతూ సాగిలపడిపోవడం చూసి చంద్రబాబుకు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చనే సెటైర్లు సోషల్ మీడియాలో పేలుతున్నాయి. నోట్ల రద్దు, జీఎస్‌టీ వల్ల ఉపయోగం లేదని గతంలో దుమ్మెత్తి పోసిన విషయాన్ని జనం మరచిపోయారనుకుని, ఇప్పుడు ఆ రెండింటి వల్ల దేశ ఆర్థిక ముఖ చిత్రం మారిపోయిందని, మార్చిన వ్యక్తి మోదీ అంటూ మాట మార్చేశారు. తాను ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారనే రీతిలో చంద్రబాబు మాట్లాడారు.
మధ్యలో బీజేపీ సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ నినాదాన్ని హిందీలో చెప్పి మోదీని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఇంత వంగిపోయి మరీ ప్రధానిని పొగడటం వెనుక కారణం చంద్రబాబును వెంటాడుతున్న కేసులే. తనపై ఉన్న కేసులను ఎక్కడ తిరగదోడతారో, ఎక్కడ జైల్లో పెడతారో, ఎక్కడ తన అవినీతి చరిత్రను పెకలిస్తారో అనే భయంతోనే మోదీ కరుణ కోసం చంద్రబాబు పాకులాడారు.
పెద్దగా పట్టించుకోని మోదీ.. గౌరవం కోల్పోయిన బాబు
ఎంత భజన చేసినా ప్రధాని మోదీ మాత్రం చంద్రబాబును పెద్దగా పట్టించుకోలేదు. పక్కనే కూర్చున్నా మొక్కుబడి మాటలు తప్ప చిరునవ్వుతో అప్యాయంగా మాట్లాడేందుకు ఆయన ఇష్టపడలేదు. పిలుపులోనూ గతంలో ఇచ్చిన గౌరవాన్ని ప్రధాని మోదీ ఇప్పుడు చంద్రబాబుకు ఇవ్వలేదు. చంద్రబాబునాయుడు జీ అంటూ గతంలో మోదీ ఆయన్ని సభల్లో సంబోధించేవారు.
బొప్పూడి సభలో చంద్రబాబునాయుడు అంటూ ఏకవచనంతో సంబోధించడం ద్వారా ఆయనపై తనకున్న భావాన్ని వ్యక్తంచేశారు. దీన్నిబట్టి చంద్రబాబు తన గౌరవాన్ని కోల్పోయినట్లు కనపడింది. రెండు రోజుల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కూడా చంద్రబాబు గురించి చులకనగా మాట్లాడిన విషయం తెలిసిందే. గతంలో మోదీని టెర్రిరిస్టు అని ఎన్డీఏ నుంచి వెళ్లిపోయిన చంద్రబాబు బుద్ధి తెచ్చుకుని మళ్లీ తిరిగి వచ్చారని, స్వాగతించామని అమిత్‌షా ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే చంద్రబాబు కాళ్లావేళ్లా పడటంవల్ల కూటమిలోకి రానిచ్చినట్లు చెప్పకనే చెప్పారు.
బొప్పూడి సభలో చంద్రబాబు పట్ల మోదీ కూడా అలాగే వ్యవహరించినట్లు స్పష్టంగా కనిపించింది. కేసుల భయం, రాజకీయ అవసరార్థం వచ్చిన బాబుతో ఆయన కూడా అంతే రాజకీయంగా వ్యవహరించి, బాబు పట్ల తమకు ఏమాత్రం గౌరవం లేదని చూపించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను కూడా మోదీ అసలు పట్టించుకోలేదు. అందరితో సమానంగా నమస్కారం పెట్టడమే తప్ప ఆయనకు గౌరవం కూడా ఇవ్వలేదు. తన ప్రసంగంలో పవన్ కళ్యాణ్ అని ఏకవచనంతోనే సం¿ోదించారు. బొప్పూడి సభలో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి కలయిక అంతా మొక్కుబడి తంతుగానే కనిపించింది. - సాక్షి, అమరావతి
Comments
Please login to add a commentAdd a comment