
నాలుగున్నరేళ్లుగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలోని పేదల సంక్షేమానికి చేపడుతున్న వివిధ కార్యక్రమాలను అడుగడుగునా అడ్డుకోవడానికే ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి.
సాక్షి, అమరావతి: పేదలకు ఇళ్లస్థలాలు, ఇళ్ల నిర్మాణం విషయంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మోసం చేయడమే కాకుండా, ప్రజాధనాన్ని పూర్తిగా దోపిడీ చేసినట్లుగా కనిపిస్తోందంటూ పవన్‌కళ్యాణ్ ప్రధాని మోదీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఓ లేఖ రాశారు. పేదలకు సొంతిల్లు పేరుతో కేవలం స్థలాలను సేకరించడం కోసం వైసీపీ ప్రభుత్వం రూ.35,141 కోట్ల నిధులను వెచ్చించిందని, ఇందుకు సంబంధించి నిధులు పక్కదారి పట్టాయని పేర్కొన్నారు.
ఈ మొత్తం పథకంలో ఉన్న అన్ని విషయాలను గమనించి ఈ పథకం అమలు తీరుపై సీబీఐతోపాటు ఈడీ విచారణ చేపడితే పేదల గృహ నిర్మాణ పథకంలో జరిగిన అవినీతి బయటపడే అవకాశం ఉందంటూ తెలిపారు. కాగా, నాలుగున్నరేళ్లుగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలోని పేదల సంక్షేమానికి చేపడుతున్న వివిధ కార్యక్రమాలను అడుగడుగునా అడ్డుకోవడానికే ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి.
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఒకేసారి రాష్ట్రంలో దాదాపు 31 లక్షల మందికి పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడంతో పాటు, ఈ మూడున్నర ఏళ్ల కాలంలో 22 లక్షల ఇళ్ల నిర్మాణం కార్యక్రమాన్ని చేపట్టిన విషయం విదితమే. గతంలో తెలుగుదేశం పార్టీ అనేక వేదికలపై చేసిన విమర్శలనే తిరిగి కొత్తగా పవన్‌కళ్యాణ్ ప్రధానికి తాను రాసిన లేఖలో పేర్కొనడం గమనార్హం.