
కమలం పార్టీతో ఓ పక్క పొత్తులో ఉంటూనే.. ఇటీవలే తిరిగి టీడీపీతో స్నేహం ప్రారంభించారు పవన్ కల్యాణ్. రాష్ట్రంలో పని చేయడానికి తనకు బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వలేదని చెప్పారాయన. తనతో స్నేహం కోసం ఎప్పటి నుంచో తహతహలాడుతున్న చంద్రబాబుతో దోస్తీని కొనసాగించడానికే రెడీ అయ్యారు పవన్. ఈ క్రమంలో జనసేనను బీజేపీ పూర్తిగా పట్టించుకోవడం మానేసిందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
చదవండి: వైరల్ వర్సెస్ రియల్: వీరి పరిస్థితి ఎంత దయనీయమో?
ఇటీవల కాలంలో పవన్ అనుసరిస్తున్న తీరుతో బీజేపీ నాయకత్వం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. 2019లో ఎన్నికలు ముగియగానే బీజేపీతో రెండోసారి స్నేహం ప్రారంభించారు పవన్. జనసేన ద్వారా బీజేపీకి దగ్గరవ్వాలని టీడీపీ అధ్యక్షుడు అప్పటి నుంచే ఎంతగానో ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడంలేదు.
అప్పుడలా.. ఇప్పుడిలా.!
గత ఎన్నికలకు ఏడాది ముందు నుంచీ బీజేపీపై విమర్శలు ప్రారంభించారు చంద్రబాబు. ఎన్నికల్లో ప్రధాని మోదీని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి విమర్శలు చేశారు. ఎన్నికల్లో దారుణ ఓటమితో సైలెంట్ అయిపోయారు. గత ఏడాది కాలంగా మళ్ళీ బీజేపీతో స్నేహం కోసం అర్రులు చాస్తున్నారు. అందులో భాగంగానే తన దత్తపుత్రుడు పవన్‌ను ముందుకు నడిపించి... కమలదళంతో స్నేహం చేయించారు. ఆ తర్వాత తాను కూడా బీజేపీతో పొత్తు కుదుర్చుకునేలా ప్రయత్నాలు ప్రారంభించారు.
బాబు బండారం బట్టబయలు
అయితే చంద్రబాబుతో రెండుసార్లు స్నేహం చేసిన అనుభవం ఉన్న కాషాయ పార్టీ మూడోసారి ఆయన్ను దగ్గరకే రానివ్వడంలేదు. సందర్భం వచ్చిన ప్రతీసారీ బీజేపీ నేతలు టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదని చెబుతూ వస్తున్నారు. జనసేన అధ్యక్షుడు ఒకవైపున బీజేపీతో దోస్తీ చేస్తూనే తన దత్తత తండ్రి పార్టీ తెలుగుదేశంతో స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలోని వైఎస్ జగన్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోయడానికి చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం ఎప్పటికప్పుడు కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్రజల్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
ముసుగు తీసిన బాబు, పవన్
ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు అడ్డుకోవడమే లక్ష్యంగా టీడీపీ రూపొందిస్తున్న స్క్రిప్ట్‌ను పవన్ ఫాలో అవుతున్నారు. ఇటీవల విశాఖలో అలజడి సృష్టించడానికి ప్రయత్నించి విఫలమై విజయవాడకు వచ్చినపుడు ఆయన్ను పరామర్శించే పేరుతో ... హోటల్లో పవన్‌ను కలిసి చంద్రబాబు జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇక రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయనే విషయాన్ని వారు చెప్పకుండానే అందరికీ అర్థమయ్యేలా చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వంపై పోరాడేందుకు బీజేపీ తనకు రోడ్ మ్యాప్ ఇవ్వనందుకే టీడీపీతో కలుస్తున్నట్లుగా పవన్ బహిరంగంగానే ప్రకటించారు.
నమ్మడం కష్టం
ఒకపక్క తమతో పొత్తులో ఉంటూనే... టీడీపీతో స్నేహం చేయడాన్ని బీజేపీ అగ్రనాయకత్వం గమనించింది. నిలకడ లేని పార్టీగా పవన్‌కల్యాణ్‌పై ఇప్పటికే బ్రాండింగ్ ఉంది. కొన్నాళ్లు మాయావతి వెంట, మరి కొన్నాళ్లు కమ్యూనిస్టుల వెంట, ఇంకొన్నాళ్లు.. ఇంకేదో బాట.. ఇలా పవన్ కళ్యాణ్ అంత నమ్మదగ్గ నాయకుడిగా కమలం పార్టీ పరిగణించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment