జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముసుగు తీసేశారు. తన అభిమానుల గుండెల్లో గునపాలు దించారు. టీడీపీతో పొత్తులో సీఎం పదవి కండిషన్‌ను వదులుకోవడమే కాదు.. మరో సంకేతం కూడా ఆయన ఇచ్చారనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీవారు పదో, ఇరవయ్యో సీట్లు ఇచ్చినా సరిపెట్టుకుంటానని ఆయన పరోక్షంగా చెప్పినట్లుగా ఉంది. ఎందుకంటే గత ఎన్నికలలో ముప్పై, నలభై సీట్లలో గెలిపించినా సీఎం అభ్యర్ధిగా ఇప్పుడు రంగంలో ఉండేవారట. అంటే ఏమిటి దాని అర్థం. తనకు ముప్పై సీట్లు గెలుచుకునే సత్తా కూడా లేదని చెప్పడమే కదా!
కొంతకాలం క్రితం ఆయన ఒక మాట అంటుండేవారు.. ఎప్పుడూ తామే త్యాగాలు చేయాలా అని అంటూ ఈసారి సీఎం పదవి తమకు ఇస్తామన్న షరతుకు టీడీపీ ఒప్పుకోవల్సిందేనని చెప్పేవారు. కాని తాజాగా ఆయన ఆ మాటను కూడా త్యాగం చేయడానికి సిద్దపడుతున్నారు. పవన్ ఎక్కడకు వెళ్లినా ఒక సమూహం ఎప్పుడూ సి.ఎం., సీఎం.. అంటూ నినదిస్తుంటుంది. వారిని చూసి ఆయన ఆనందపడుతుంటారు. కాని ఇప్పుడు అలాంటివారి నోళ్లను పవన్ నొక్కేశారు. వారు మూసుకుని తెలుగుదేశం పార్టీ జెండాను భుజాన వేసుకుని మోయాల్సిందేనని పవన్ కోరుకుంటున్నట్లుగా అనిపిస్తుంది.
ప్రముఖ సినీ నిర్మాత రాంగోపాల్ వర్మ వ్యాఖ్యానించినట్లు పవన్ కళ్యాణ్ తన అభిమానులను, కాపు సామాజికవర్గం వారినే కాదు.. తనకు తానే వెన్నుపోటు పొడుచుకున్నారు. బహుశా దేశ రాజకీయాలలో ఇలా తనకు తానే వెన్నుపోటు పొడుచుకున్న నేతగా పవన్ మిగిలిపోతారేమో! నిజంగానే ఈయనకు ముఖ్యమంత్రి పదవి అంటే ఇష్టం లేదా? అది కరెక్టు అయితే 2019 శాసనసభ ఎన్నికలలో ఎందుకు సీఎం అభ్యర్ధిగా ఎందుకు ప్రొజెక్ట్ అయ్యారు? వామపక్షాలు, బీఎస్పీతో కలిసి కూటమి కట్టి 137 చోట్ల ఎందుకు పోటీచేశారు
ఆ ఎన్నికలలో ఆయన బలం ఎంతో తెలుసుకోలేకపోయారా? తానే రెండు చోట్ల పోటీ చేయడంలోని ఉద్దేశం ఏమిటి? చిత్తశుద్ది లేకుండా పరోక్షంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు సహకరించి, ఆయన సూచించినవారినే జనసేన అభ్యర్ధులుగా ఎందుకు చేశారు. అందువల్లే కదా అప్పట్లో ప్రజలు ఈయనను విశ్వసించలేదు. తత్పలితంగానే జనసేనకు దారుణ పరాభవ పరాజయం ఎదురైంది. ఓడిపోయిన వెంటనే ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను బతిమలాడుకుని మరీ వారితో పొత్తులోకి వెళ్లారు. కాని అదే సమయంలో టీడీపీతో రాజకీయ అక్రమ సంబంధం కొనసాగించారు. దానివల్ల ప్రజలలో పరపతి, ప్రతిష్ట పడిపోయాయి. ఈయనకు ఒక సిద్దాంతం లేదన్న భావన ఏర్పడింది.
బీజేపీ వారితో పొత్తుకు వెళ్లడం కూడా చంద్రబాబు కోసమేనన్న సంగతి అందరికి తెలిసిపోయింది. ఈ తంతు నాలుగేళ్లపాటు నడిపి, ప్రస్తుతం తను కప్పుకున్న ముసుగును తొలగించారు. చంద్రబాబుతో అంటే టీడీపీతో నేరుగా పొత్తు పెట్టుకుంటానని చెబుతున్నారు. బీజేపీ వారిని కూడా ఇందుకు ఒప్పిస్తామని అంటున్నారు. బలం లేకుండా తనను బిజెపి అయినా టిడిపి అయినా ఎందుకు సీఎం అభ్యర్ధిని చేస్తాయని అమాయకంగా ప్రశ్నిస్తున్నారు.
తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా బిజెపి ఇన్ చార్జీ సునీల్ ధియోధర్ తన ప్రసంగాలలో పవన్ తమ రెండు పార్టీల సీఎం అభ్యర్ది అని ప్రకటించారు. దాంతో వీరిద్దరి మద్య బంధం బలపడుతుందని ఉభయ పార్టీల అభిమానులు అనుకున్నారు. కాని పవన్ మాత్రం పెళ్లి ఒకరితో, సంసారం మరొకరితో అన్న చందంగా వ్యవహరించి బీజేపీని దెబ్బదీశారు. బీజేపీ వారు తమను అవమానించిన టీడీపీతో పొత్తుకు ససేమిరా అంటున్నా, వారిని బతిమలాడి ఒప్పించే పనిలో పవన్ పడ్డారు.
ఆ క్రమంలోనే చంద్రబాబు కూడా తన స్వరం పూర్తిగా మార్చుకుని, ఒకప్పుడు తాను బండబూతులు తిట్టిన ప్రధాని మోదీని పొగడడం ఆరంభించారు. అది ఆయన వ్యూహం. ఎలాగొలా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ అండతో ఏపీలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేయాలన్నది చంద్రబాబు లక్ష్యం. తద్వారా వచ్చే ఎన్నికలలో లబ్ది పొందాలన్నది ఆయన ఆశ. అది జరుగుతుందా? లేదా? అన్నది పక్కనబెడితే పవన్ కళ్యాణ్‌ను అయితే ఆయన పూర్తిగా తనకు సరెండర్ అయ్యేలా చేసుకోవడంలో సఫలం అయినట్లే అనిపిస్తుంది.
చంద్రబాబుకు కాపులను పవన్ కళ్యాణ్ తాకట్టు పెట్టారని మంత్రి అంబటి రాంబాబు తదితరులు విమర్శిస్తుంటారు. ప్రస్తుతం ఆ దిశగానే పవన్ పయనిస్తున్నారని చాలామంది అనుకుంటున్నారు. ఏపీలో ఉన్న సామాజికవర్గాల కూర్పులో రెడ్డి, కమ్మ వర్గాలవారు రాజకీయాలలో ఆధిపత్యంతో ఉంటున్నారు. అత్యధిక కాలం ఈ రెండువర్గాల నుంచే ముఖ్యమంత్రులు అయ్యారు. ఈ నేపథ్యంలో సంఖ్యారీత్యా గణనీయంగా ఉన్న తమ నుంచి కూడా సీఎం అవ్వాలని కాపు సామాజికవర్గం కోరుకుంటోంది. 2009 లో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించినప్పుడు ఆ వర్గం అంతా ఆయనకు అండగా నిలిచింది.
అయినా వ్యూహాత్మక తప్పిదాలతో చిరంజీవి ఆశించిన లక్ష్యం చేరుకోలేకపోయారు. కేవలం ఆంధ్ర, రాయలసీమలలో 16, తెలంగాణలో రెండు శాసనసభ సీట్లనే సాధించారు. ఆ తర్వాత 2014లో ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఏర్పాటు చేశారు కాని, అసలు ఎన్నికలలో పోటీచేయకుండా అదరిని ఆశ్చర్యపరిచారు. అయినా ఆనాటి పరిస్థితులలో మోదీ, పవన్‌ల మద్దతుతో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అప్పుడప్పుడు స్పెషల్ ఫ్లైట్‌లలో విజయవాడకు రప్పించుకుని పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు సంతోషపెడుతుండేవారు. కాని ఆ తర్వాత కాలంలో ఎక్కడో కొద్దిగా తేడా వచ్చి టీడీపీ ప్రభుత్వాన్ని కొంతకాలం పవన్ తూర్పారపట్టారు.
అదే ఊపుతో ఆయన 2019 ఎన్నికలకు వెళతారని అనుకుంటే చంద్రబాబుతో రహస్య అవగాహనకు వచ్చి మొత్తం పార్టీని సంక్షోభంలోకి నెట్టేశారు. దాంతో కేవలం ఒక్క సీటుకే పరిమితం అయ్యారు. తానే రెండు చోట్ల పరాజయం చెందారు. ఆ తర్వాత నుంచి కొత్త డ్రామాలు సృష్టిస్తూ, బిజెపితో స్నేహం నటిస్తూ, టీడీపీతో కాపురం చేస్తూ నెట్టుకువస్తున్నారు. బీజేపీ టార్గెట్ 2029 వ్యూహానికి పవన్ సిద్దపడడం లేదు. ముఖ్యమంత్రి పదవి లేకపోతే పోయే, కనీసం ఎమ్మెల్యేగా గెలిస్తే చాలన్న అభిప్రాయంతో ఇప్పుడు తన ప్రతిష్టను తానే దిగజార్చుకున్నారు.
తన అభిమానులను ఆయన నట్టేట ముంచేశారు. నిజానికి పవన్ కళ్యాణ్ బెట్టు చేస్తే చంద్రబాబు దిగివచ్చేవారన్నది ఎక్కువమంది నమ్మకం. ఎందుకంటే జనసేన మధ్దతు ఇస్తే తప్ప తాను జగన్ కు పోటీనే ఇవ్వలేనని భయపడుతున్నారు. అలాంటప్పుడు పవన్ ఎలాంటి కండిషన్‌లు పెట్టినా ఒప్పుకోవలసి వచ్చేది. దానిని పవన్ వదలుకున్నారు. రాజకీయాలలో తనకు ఉన్న బలం తక్కువే కావచ్చు. కాని తనతో పొత్తులో ఉండాలనుకుంటున్నవారికి ఈ బలమే కీలకం అయినప్పుడు వారికి ప్రాధాన్యత పెరుగుతుంది.
దానిని దృష్టిలో ఉంచుకుని ఎవరైనా రాజకీయాలు చేస్తారు. అటు సినిమా షూటింగ్‌లు, ఇటు రాజకీయ షూటింగ్‌ల మధ్య పవన్ కు సొంత ఆలోచన కొరవడినట్లుగా ఉంది. ఇంతకాలం ఆయనను నమ్మిన కాపు వర్గం ఎందుకు మద్దతు ఇస్తుంది. కృష్ణా,గుంటూరు, ఉభయగోదావరి వంటి జిల్లాలలో సామాజికవర్గాల రీత్యా కమ్మ, కాపుల మధ్య వైరుధ్యం ఉంది. ముఖ్యంగా వంగవీటిరంగా హత్య తర్వాత అది అలాగే కొనసాగుతోంది. అయినా పవన్ కోసం కొందరు రాజీపడినా, ఇప్పుడు వారిని కూడా ఆయన అవమానిచినట్లయింది. దీనితో పవన్ టీడీపీ జెండా మోసినా, ఆయన అభిమానులు అనండి, కాపు వర్గంవారు అనండి ఆయనను అనుసరిస్తారా అన్నది అనుమానమే.
మాజీ మంత్రి, కాపు సంక్షేమ సంఘం నేత చేగొండి హరిరామజోగయ్య వంటివారు గౌరవప్రదమైన వాటా లేకుండా టిడిపితో పొత్తు వద్దని సూచించినా పవన్ వినడానికి సిద్దంగా లేరు. తనకు బలంగా ఉన్న చోట ముప్పై శాతం ఓట్లు వస్తాయని చెబుతున్నారు. దానిని గమనంలోకి తీసుకుని కనీసం ఒక ఏభై సీట్లు అయినా టీడీపీతో బేరం ఆడుతారులే అనుకున్న జనసైనికులకు ఆయన పూర్తిగా నిరాశ మిగిల్చారు. ఆయనకు మద్దతు ఇచ్చే ఒక చానల్ అయితే టీడీపీతో చెరి సగం వాటానే కోరుకోవాలని ప్రచారం చేసింది. అయినా ప్రయోజనం దక్కలేదు.
ఈ నేపథ్యంలో అసంతృప్తిలో ఉండే కాపు వర్గం వైసీపీకి మరోసారి మద్దతు ఇచ్చే అవకాశం కనబడుతోంది. పవన్ కళ్యాణ్ చెబుతున్నదాని ప్రకారం ఉభయ ఉమ్మడి గోదావరి జిల్లాలలోను, విశాఖలో కొన్ని చోట్ల మాత్రమే జనసేకు బలం ఉందని అనుకోవాలి.అక్కడ ఏ పదో,పరకో సీట్లు తీసుకుని పవన్ సంతృప్తి చెందబోతున్నట్లుగా కనబడుతుంది. నిజానికి పవన్ సొంతంగా పోటీచేసి పది,ఇరవై సీట్లు తెచ్చుకున్నా ఆయనకు విలువ వస్తుంది. అలాకాని పక్షంలో కేవలం టీడీపీ కోసం పనిచేసినట్లు అవుతుంది.
రాజకీయాలలో ఎప్పుడు ఏ అవకాశం ఎలా వస్తుందో చెప్పలేం. జార్కండ్ రాష్ట్రంలో కాంగ్రెస్,బిజెపి, జె ఎమ్.ఎమ్‌లకు పూర్తి మెజార్టీ రాకపోతే ఒకే ఒక్క సీటు గెలుచుకున్న మధు కోడా అనే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేని సీఎంను చేసుకున్నారు. ఎందుకంటే ఆ రోజున ఆయన ఎటు వైపు ఉంటే అటే ప్రభుత్వం. అందుకే ఆయనకే ఆఫర్ ఇచ్చారు. కర్నాటకలో పట్టుమని ఇరవై లోక్ సభ సీట్లు కూడా గెలుచుకోలేకపోయినా, ఆనాటి జెడి యు అధినేత, అప్పటి ముఖ్యమంత్రి దేవెగౌడ దేశ ప్రధాని అయ్యారు.
చదవండి: సీఎం రేసులో లేను.. ఆ మాట టీడీపీ ఎలా చెబుతుంది?: పవన్ కల్యాణ్
లోక్ సభకు ఎన్నికకాకుండానే ఐకె గుజ్రాల్ యునైటెడ్ ప్రంట్ తరపున దేశ ప్రధాని అయ్యారు. కర్నాటకలో జెడిఎస్ పక్షాన కుమారస్వామి రెండుసార్లు తనకు పెద్దగా బలం లేకపోయినా ముఖ్యమంత్రి కాగలిగారు. ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. రాజకీయాలలో పోరాట బలం ఉండాలి. వ్యూహాలు ఉండాలి. పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకోవాలి. అలాకాకుండా దేని గురించో లొంగిపోతే ఎప్పటికి తాను అనుకున్న పదవిని చేపట్టడం సాధ్యం కాకపోవచ్చు. అది అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది. అందుకు పవన్ కళ్యాణే ఉదాహరణగా నిలుస్తారు.
-కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడమీ ఛైర్మన్
Comments
Please login to add a commentAdd a comment