ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు మారతాయా? ఆ పరిణామాలు ఏ పార్టీకి ప్రయోజనం? ఏ పార్టీకి నష్టం ? అన్న చర్చ సహజంగానే జరుగుతుంది. ముఖ్యంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, జనసేనలు కలిసి పొత్తు పెట్టుకుని వచ్చే శాసనసభ ఎన్నికలలో పోటీచేస్తే అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు నష్టం కలుగుతుందా అన్న సందేహం కొందరికి రావచ్చు. కాని అందులో ఎంత నిజం ఉందన్నది విశ్లేషించడం ఆసక్తికరంగా ఉంటుంది. విజయవాడ నోవాటెల్ హోటల్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ కాగానే టీడీపీకి మద్దతు ఇచ్చే మీడియా కొత్త ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది.
చదవండి: ‘అలా’ అనకూడదంటే ఎలా?
వార్ వన్ సైడ్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారానికి దిగింది. ఇంకేముంది.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసిపోయారు.. ఉభయ గోదావరి జిల్లాలలో క్లీన్ స్వీప్.. అంటూ శీర్షికలతో కూడిన వార్తలు, టీడీపీ టీవీ చానళ్లలో హోరు.. వీటిని గమనించినవారికి టీడీపీ, జనసేనలు ఎప్పుడు కలిసిపోయాయి అన్న సందేహం వస్తుంది. ఎందుకంటే ఈ రెండు పార్టీలు ఇంతవరకు అధికారికంగా పొత్తు కుదుర్చుకోలేదు. సీట్ల సర్దుబాటు జరగలేదు. పైగా భారతీయ జనతా పార్టీతోనే జనసేన పొత్తులో ఉంది. ఆ పొత్తును వదలివేస్తున్నామని పనవ్ చెప్పలేదు. పైగా తనకు మోదీ, షా అంటే గౌరవమని, అయినా బీజేపీకి ఊడిగం చేస్తానా అని ప్రశ్నించారు. ఇదంతా ఎలా ఉందంటే ఎవరైనా వ్యక్తిగత జీవితంలో పెళ్లి ఒకరితో, సహజీవనం మరొకరితో చేసినట్లుగానే, రాజకీయాలలో కూడా చేయవచ్చని ఈ ఘటన రుజువు చేస్తోందన్న అభిప్రాయం కలుగుతోంది.
బీజేపీతో పొత్తు ఉన్నా, పవన్ కల్యాణ్, చంద్రబాబులు గత కొద్ది నెలలుగా ఒకరికొకరు ప్రేమ లేఖలు రాసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ ప్రేమ సందేశాలు రాయబారాలుగా మారి, ఏదో ఒక వంకతో వీరిద్దరూ ఒక హోటల్‌లో భేటీ అయ్యేంతవరకు వెళ్లింది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఒక వేదిక ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించినట్లు వీరిరువురు ప్రకటించుకున్నారు. ఈ వేదికలో ఎవరెవరు పాలు పంచుకుంటారో ఇంకా స్పష్టత రానప్పటికీ ఇప్పటికే టీడీపీకి తోక మాదిరి నడుస్తున్న సీపీఐ వారి వెంట ఉండవచ్చు. అలాగే ఈ మధ్యకాలంలో సడన్‌గా ఎవరైనా కలిసి వస్తే పొత్తు పెట్టుకుంటామని ప్రకటించిన లోక్ సత్తా కూడా వీరితో కలిసే అవకాశం ఉండవచ్చు.
సీపీఎం వంటి పార్టీలు ఇంకా వేచి చూసే ధోరణిలో ఉంటాయి. ఎందుకంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎలాగైనా జనసేనతో పాటు బీజేపీని కూడా తన దారికి తెచ్చుకుని పొత్తు పెట్టుకోవాలని విశ్వయత్నం చేస్తున్నారు. కాని బీజేపీ కేంద్ర నేతలు మాత్రం గత టరమ్‌లో చంద్రబాబుతో ఎదురైన చేదు అనుభవాలు, అవమానాలను మర్చిపోలేకుండా ఉన్నారు. అయినా బీజేపీలో ఉన్న టీడీపీ కోవర్గులు తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో చూస్తే రెండు మూడు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. బీజేపీ కూడా సిద్దపడితే టీడీపీ, జనసేనలతో కలిసి కూటమి ఏర్పాటు చేయడం, ఈ కూటమిలోకి రావడానికి ఓకే అంటే లోక్ సత్తాను కలుపుకోవడం. బీజేపీతో టీడీపీ, జనసేనలు కలిస్తే వామపక్షాలు ఆ కూటమిలో కలవడం కుదరదు. అందువల్ల వామపక్షాలు విడిగానే ఉండవలసి వస్తుంది.
బీజేపీతో జనసేన విడిపోయి టీడీపీతో కలిస్తే మాత్రం వారితో వామపక్షాలు, లోక్ సత్తా కలవడానికి అవకాశాలు ఉంటాయి. వీరికి ఆమ్ ఆద్మి పార్టీ కూడా జత కలిస్తే కలవవచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో మరో విషయం చెప్పాలి. ఒకవేళ టీడీపీ, జనసేనల మధ్య సీట్ల సర్దుబాటులో ఇబ్బంది వచ్చినా, ముఖ్యమంత్రి పదవి పై ఇరు పక్షాల మధ్య అవగాహన కుదరకపోయినా పొత్తుకు బ్రేక్ పడే అవకాశం ఉంటుంది. అయితే సీఎం పదవిని తనకు వద్దని పవన్‌తో చంద్రబాబు చెప్పించగలిగితే పొత్తు తేలికగా వస్తుంది. ఈ రకంగా పవన్ కల్యాణ్‌ను ఒప్పించడం పెద్ద కష్టం కాదని టీడీపీ భావిస్తుండవచ్చు. కాగా బీజేపీతో జనసేన తెగతెంపులు చేసుకోవడంలో ఏవైనా ఇబ్బందులు వస్తాయా అన్నది కూడా చూడాలి.
పవన్ కల్యాణ్ తన అవసరాల కోసం ఈ నాలుగేళ్లు తమను అంటకాగారని, ఇదంతా చంద్రబాబు ప్లాన్‌లో భాగమేనని బీజేపీ భావిస్తే, వారు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవచ్చు. ఇలా రకరకాల రాజకీయ ఆప్షన్‌లు ఉన్నప్పటికీ, ఇప్పటికే జనసేన తమతో వచ్చేసిందని, వార్ వన్ సైడ్ అని టీడీపీ మీడియా గంతులు వేస్తే ఏమి ప్రయోజనం ఉంటుంది. నిజంగానే అంత ధైర్యం ఉంటే టీడీపీ ఎమ్మెల్యేలు ఒక ముగ్గురు, లేదా నలుగురు అమరావతి అంశం లేదా మరే అంశంపైన అయినా రిఫరెండమ్‌కు సిద్దమని సవాల్ చేసి తమ పదవులకు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు ముందుకు రావచ్చుకదా.
నిజంగానే ఆ ఉప ఎన్నికలలో టీడీపీ లేదా జనసేన గెలిస్తే వారికి ఊపు వస్తుంది కదా? ఆ ధైర్యం ఈ రెండు పార్టీలకు లేదు. ఎందుకంటే గత ఎన్నికలలో వైసీపీకి ఏభై శాతం ఓట్లు వస్తే, టీడీపీకి నలభై శాతం ఓట్లే వచ్చాయి. జనసేనకు ఆరు శాతం వరకు ఓట్లు లబించాయి. అయినా వైసీపీనే ఆధిక్యతలో ఉంటుంది. దానికి తోడు స్థానిక ఎన్నికలలో ఎన్నికలలో వైసీపీకి 65 శాతం ఓట్లు వస్తే, టీడీపీ ఓట్ల శాతం ఇరవై ఐదుకు పడిపోయింది. ఇది టీడీపీకి మరింత ఆందోళన కలిగించింది.
దాంతోనే ఎలాగొలా ఇతర పార్టీలను కలుపుకుని వైసీపీని ఓడించాలని చంద్రబాబు ప్లాన్ చేసుకుని తదనుగుణంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా పవన్‌ను తనవైపు లాగడంలో కొంతవరకు సఫలం అయ్యారు. కాని దీనివల్ల జనసేన, టీడీపీ క్యాడర్‌లో కొంత అసంతృప్తి కూడా ఉంటుంది. జనసేనకు ఇచ్చే సీట్లన్నీ ఓడిపోయేవేనని టీడీపీ క్యాడర్ భావిస్తుంది. అలాగే టీడీపీ నేతలు కొందరు తమ అవకాశాలు పోతాయని ఆందోళన చెందుతారు. ఇవన్ని ప్రభావం చూపుతాయి. 2009లో చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేసి టీఆర్ఎస్‌తోను, సీపీఐ, సీపీఎంలతో పొత్తు పెట్టుకుని గట్టి ప్రయత్నమే చేశారు.
అయినా వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఈ మహాకూటమిని ఓడించి మరోసారి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత అనూహ్యంగా వైఎస్సార్ హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించడంతో రాజకీయాలు మారిపోయాయి. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత బీజేపీ, జనసేనలను బతిమలాడుకుని చంద్రబాబు పొత్తు పెట్టుకుని అతి తక్కువ తేడాతో అంటే ఒకటిన్నర శాతం ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చారు. తదుపరి వైసీపీ ఎమ్మెల్యేలు 23 మందిని టీడీపీలోకి లాక్కున్నారు. వైసీపీని దెబ్బతీయడానికి ఎన్నో కుటిల ప్రయత్నాలు చేశారు. అయినా జగన్ తన పాదయాత్ర, మానిఫెస్టో ప్రజలకు చెప్పడం ద్వారా టీడీపీని ఓడించి రికార్డు స్తాయిలో 151 సీట్లు సాధించారు.
చదవండి: టీడీపీ స్పాన్సర్డ్.. ఫేక్ యాత్ర అసలు ‘లోగుట్టు’ ఇదే..
టీడీపీ కేవలం 23 సీట్లకే పరిమితం అయింది. ఆ తర్వాత టీడీపీ మరింత బలహీనపడింది. దానిని కవర్ చేయడానికి చంద్రబాబు పడుతున్న పాట్లు ఇన్ని, అన్నీ కావు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ను ఓడించడం సాధ్యం కాదని భావించే చంద్రబాబు ఈ తంటాలు పడుతున్నారన్న సంకేతం ప్రజలలోకి వెళ్లింది. ఆ భావం ప్రజలలోకి వెళ్లకుండా చేయడానికి టీడీపీ మీడియా వార్ వన్ సైడ్ అంటూ ప్రచారం చేస్తోంది. బాబు, పవన్‌ల కలయికతో వైసీపీ నేతలలో వణుకు అంటూ మరో టీడీపీ పత్రిక బాజా వాయించింది. అది నిజమా. అసలు వైసీపీని ఓడించలేమన్న వణుకు పుట్టి కదా.
జనసేనను, బీజేపీ వంటి పార్టీలను కలుపుకోవాలని టీడీపీ నానా తంటాలు పడుతోంది. ఆ విషయాన్ని దాచి వైసీపీ ఏదో భయపడుతున్నట్లు టీడీపీ మీడియా చెప్పడం విడ్డూరమే. ఇదే సమయంలో వైసీపీకి ఏర్పడిన ఓటు బ్యాంక్ కాని, సామాజికవర్గాల కలయిక కాని ఏ మాత్రం మారినట్లు కనిపించదు. అది చెక్కు చెదరనంతవరకు జగన్‌ను ఓడించే పరిస్థితే ఉండదు. దానిని కప్పిపుచ్చి టీడీపీ అధికారంలోకి వచ్చేస్తుందన్న భ్రమ కల్పించి ఆ పార్టీ క్యాడర్ లో కదలిక తెప్పించడానికే ఈ బాధ తప్ప మరొకటికాదని అర్థం చేసుకోవచ్చు.
-కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment