
ముఖ్యమంత్రి పదవి గురించి ఎవరో విలేకరి ప్రశ్న వేసినప్పుడు ఆయన నవ్వుతూ కూర్చుని లోకేష్‌ను సమాధానం ఇవ్వాలని కోరడం గమనించదగిన అంశమే. లోకేష్ మాత్రం సూటిగా సమాధానం ఇవ్వకుండా దాటవేశారు.
ప్రజల కోసమే తాము పొత్తు పెట్టుకున్నాం.. ఏపీ భవిష్యత్తు కోసమే తాము కలిశాం.. ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్‌లు చేసిన ప్రకటన. ఇదంతా అమాయకులను నమ్మించే యత్నం తప్ప ఇంకొకటి కాదని ఇట్టే తెలిసిపోతుంది. నిజానికి వారిద్దరి రాజకీయ భవిష్యత్తు ఎక్కడ అంధకారంలో పడిపోతుందో అన్న భయంతో పెట్టుకున్న పొత్తు తప్ప మరొకటి కాదని వారి మాటలను బట్టే అర్ధం అవుతుంది. వారిద్దరూ కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నప్పుడు పవన్ కళ్యాణ్ చాలా సంతోషంగా కనిపించారు.
✍️ముఖ్యమంత్రి పదవి గురించి ఎవరో విలేకరి ప్రశ్న వేసినప్పుడు ఆయన నవ్వుతూ కూర్చుని లోకేష్‌ను సమాధానం ఇవ్వాలని కోరడం గమనించదగిన అంశమే. లోకేష్ మాత్రం సూటిగా సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. అంటే దీని భావం ఏమిటి? టీడీపీ, జనసేనలు ఎలాంటి షరతులు లేకుండా పొత్తు పెట్టుకున్నట్లా? లేక ఏదో ఒప్పందం కుదిరింది కాని దానిని రహస్యంగా ఉంచాలని అనుకున్నట్లా?. పవన్ కళ్యాణకు అయితే టీడీపీ నుంచే ఆ మాట రావాలని అనుకున్నారేమో తెలియదు కాని ఆయన ఆ ప్రశ్నకు బదులు ఇవ్వలేదు. మరి పవన్ ముఖంలో ఆ నవ్వు ఎందుకు కనిపించింది? టీడీపీ సంక్షోభంలో ఉంది కనుక తనపై ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడిందని అనుకున్నారా?లేక చంద్రబాబు అరెస్టు పరిణామాల వల్ల తనకు గిరాకి పెరిగిందనా? ఏదైనా కావచ్చు.
✍️రెండు పార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ గురించి చర్చించారట. ఇది నిజమే కావచ్చు. కాకపోతే ప్రజల సమస్యల గురించి మాట్లాడుకున్నామన్న దానిలో ఎక్కువ భాగం నిజం కాకపోవచ్చు. వారి లక్ష్యం ఇప్పుడు ఎలా ఈ కష్టాన్ని అధిగమించాలనే ఉంటుంది తప్ప ఇంకొకటి కాదు. చంద్రబాబుపై వచ్చిన అవినీతి కేసులలో పార్టీ ఆత్మరక్షణలో పడినందున దానిని ఎదురుదాడిగా ఎలా మార్చాలని చర్చించి ఉండవచ్చు. రెండు పార్టీల క్యాడర్‌కు ఎలా నచ్చచెప్పాలన్న దానిపై మదనపడి ఉండవచ్చు. ఇందులో పవన్ కళ్యాణ్ ఎలాంటి పాత్ర పోషించాలన్నదాని గురించి ఆలోచించి ఉండవచ్చు.
✍️పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇతర రాజకీయ పార్టీల నేతలను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని అన్నారు. ఎవరిని ఎలా అసౌకర్యానికి గురి చేసింది? పవన్ కళ్యాణ్ కాని, చంద్రబాబు నాయుడు కాని, లోకేష్ కాని తమ సభలలో ఎలా ప్రజలను రెచ్చగొట్టినా సహించి ఊరుకున్నారే! ఒక్క అంగళ్లలో మరీ రెచ్చిపోయి తన కార్యకర్తలతో దాడులు చేయించిన ఘటనలోనే కదా పోలీసులు ఆయనపై కేసు పెట్టి చర్య తీసుకోవాలని ప్రయత్నించింది. అంతకుముందు ఎన్ని రకాల కుట్రలు ప్రతిపక్షాలు చేసినా ఒపికగానే ప్రభుత్వం వ్యవహరించింది కదా! ఉదాహరణకు ఆలయాలపై దాడులు చేసి, తిరిగి ప్రభుత్వంపైనే ఆరోపణలు చేసి అశాంతి సృష్టించడానికి యత్నించింది ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ వంటి పార్టీలు కాదా! కొన్ని చోట్ల ఆధారసహితంగా టీడీపీ, జనసేన క్యాడర్ దొరికిపోయారే! ప్రతిదానికి ఏదో ఒక గొడవ చేయాలని, కేసులు పెట్టించుకుంటే నలభైఎనిమిది గంటలలో హైకోర్టు నుంచి బెయిల్ ఇప్పిస్తానని చెప్పింది లోకేష్ కాదా!
✍️చంద్రబాబు సమక్షంలోనే పుంగనూరులో పోలీసుల వాహనాలపై దాడిచేసి దగ్దం చేయడం వాస్తవం కాదా! ఆయా చోట్ల ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి మీటింగ్‌లు పెట్టింది చంద్రబాబు కాదా! కందుకూరులో జరిగిన తొక్కిసలాటకు కాని, గుంటూరు తొక్కిసలాటకు కాని, తద్వారా పదకుండు మంది మరణానికి గాని కారణం టీడీపీ కాదా! ఇలాంటి వాటినన్నిటిని సమర్ధించే దుస్థితికి పవన్ కళ్యాణ్్ చేరుకోవడం కనిపించడం లేదా! పవన్ కళ్యాణ్ కూడా వలంటీర్ల మొదలు ఎవరిని పడితే వారిని నోటికి వచ్చినట్లు దూషించడం సరైన చర్యా! పైగా ప్రభుత్వంపై ఆరోపణా!
✍️ఏపీలో మహిళలు మిస్సింగ్, పిల్లల మరణాలు అంటూ పచ్చి అబద్దాలు ప్రచారం చేసినా ప్రభుత్వం ఆయనపై ఎలాంటి చర్య తీసుకోలేదే! అయినా ప్రభుత్వం ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెడుతోందని చెబుతారా! విధానాలపై కాకుండా, వ్యక్తిగత దూషణలకు దిగుతోంది టీడీపీ, జనసేన నేతలే కదా! ఈ సంగతి పక్కనబెడితే పవన్ కళ్యాణ్ గతంలో చెప్పినట్లు తెలుగుదేశం పార్టీకి జనసేన కార్యకర్తలు, నేతలు లొంగి ఉండాలని అన్నారు.
✍️అదే ప్రకారం ఇప్పుడు కూడా సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన కూడా అలాగే లొంగి ఉన్నారా? సీఎం పదవి ఇస్తే స్వీకరిస్తానని చెప్పి చానాళ్లయినా టీడీపీ ఇంతవరకు బహిరంగంగా స్పందించకపోవడం ,అయినా పవన్ వారి వెంట తిరిగి అవినీతి కేసులో చంద్రబాబుకు అండగా నిలవడం లొంగుబాటులో భాగమేనా!లేక ఏదైనా టిడిపి ఆశచూపితే దానికి సంతృప్తి చెంది ఆ విషయం జోలికి వెళ్లలేదా! మరో కారణం కూడా ఉండవచ్చు. ఇరుపక్షాల మద్య సీట్ల పంపకం, సి.ఎమ్.పదవిలో వాటా గురించి ఇప్పుడే ప్రకటిస్తే రెండు పార్టీల కార్యకర్తల మద్య గొడవలు వస్తాయని అనుకున్నారా! ఏమో !ఏమైనా కావచ్చు. అయితే మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్‌ను ఎవరూ కొన్ని ప్రశ్నలు వేయకపోవడం ఆశ్చర్యం అనిపిస్తుంది.
✍️2019 ఎన్నికలకు ముందు చంద్రబాబుపైన, లోకేష్ ల పైన తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వాటి గురించి ఏమని అనుకుంటున్నారో అడగాలి కదా! ఇద్దరూ పక్కపక్కన ఉన్నప్పుడు అలాంటి వాటిలో ఇద్దరూ కలిసి క్లారిటీ ఇవ్వవలసిన బాద్యత లేదా! పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి లోకేష్ గతంలో ఏమన్నారు? పవన్ ది ఏముంది.. అంతా చంద్రబాబుదే అని అన్నారా?లేదా? ఏదో అప్పుడు అలా అన్నాంకాని, అదంతా తప్పు అని పవన్ ఇప్పుడు చెబుతారా? చంద్రబాబు, లోకేష్ లు కడిగిన ముత్యాలు అని పవన్ కళ్యాణ్ సర్టిఫికెట్ ఇస్తారా! తనకు గుండు కొట్టించారని టీడీపీ ఆఫీస్ నుంచి జరిగిన ప్రచారం, లోకేష్ తన తల్లిని అవమానించారని గతంలో చెప్పిన విషయాల గురించి పవన్ కళ్యాణ్ ఏమైనా వివరణ కోరారా? లేదా? అన్నది తెలియదు.
✍️అయితే తాజాగా చంద్రబాబు అవినీతి కేసులో పవన్ మాట్లాడిన తీరు మాత్రం ఆయన ద్వంద్వ నీతికి అద్దం పడుతుంది. చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలు ఏమిటి?ప్రత్యేకించి స్కిల్ స్కామ్ కేసులో 240 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, షెల్ కంపెనీల ద్వారా డబ్బు చేతులు మారిందన్న ఆరపణలు అవాస్తవమని పవన్ చెప్పదలిచారా? అక్రమ కేసు అని పవన్ చెప్పడం ద్వారా అవినీకి మద్దతు ఇచ్చినట్లు అవడం లేదా!చంద్రబాబుకు బెయిల్ రాకుండా సాంకేతిక కారణాలతో ప్రభుత్వం అడ్డుపడుతోందని పవన్ అనడం ఏమిటి? గవర్నర్ అనుమతి తీసుకోలేదని చెబుతూ సాంకేతిక కారణం చూపి కేసు లేకుండా చేసుకోవాలని చంద్రబాబు తరపు లాయర్లు ప్రయత్నిస్తూ బెయిల్ కు తొలుత అప్లై చేయని విషయం నిజం కాదా! చంద్రబాబు మాజీ పి.ఎస్. ఎందుకు పారిపోయారో పవన్ కళ్యాణ్ అయినా చెప్పగలరా! వీటన్నిటిని విస్మరించి పవన్ మాట్లాడడం చూస్తుంటే, అవినీతి విషయంలో ఇంతగా దిగజారి పోవాలా అని జనసేన కార్యకర్తలకు అనిపించదా!
చదవండి: పవన్ కల్యాణ్ కొత్త ప్లాన్.. బీజేపీ లొంగుతుందా?
✍️వైసీపీ ప్రభుత్వంపై ఆయన ఏవేవో ఆరోపణలు చేస్తూ, టీడీపీని సమర్ధిస్తున్న తీరు గమనిస్తే, టీడీపీని తానే నడుపుతున్నట్లు పవన్ ఏమైనా భావిస్తున్నారా? అన్న అనుమానం కలుగుతోంది. లేక చంద్రబాబు అరెస్టుపై పైకి సానుభూతి చూపుతూ లోపల సంతోషపడుతున్నారేమోనన్న అనుమానం కూడా ఆయన ముఖ కవళికలను బట్టి వస్తుంది. ఎన్.డి.ఎ.లో ఉన్నామని, టీడీపీతో కలిసి పనిచేస్తున్నామని చెప్పడంలోనే ఆయన నైతికత ఏమిటో తెలిసిపోతుంది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్, లోకేష్‌లు తమ రాజకీయ భవిష్యత్తు గురించే ఆలోచిస్తున్నారు తప్ప ఇంకొకటి కాదన్నది పచ్చి నిజం.
✍️గత శాసనసభ ఎన్నికలలో ఓడిపోయిన వీరిద్దరూ భేటీ అయితే అది చారిత్రాత్మక కలయిక అవుతుందా? ఒకరకంగా పవన్ కళ్యాణ్ మరోసారి చారిత్రక తప్పిదం చేస్తున్నారనిపిస్తుంది. జనసేన కార్యకర్తలను, తనను అభిమానించే కాపు సామాజికవర్గాన్నికాని, ఇతర అభిమానులను కాని తన స్వార్దానికి వాడుకుంటున్నారన్న విమర్శలకు ఆస్కారం ఇస్తున్నారు. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్, లోకేష్‌లు ఇద్దరూ పోటీపడి చంద్రబాబు మాదిరే అబద్దాలు ఆడినట్లు అనిపిస్తుంది. వైసీపీ తెగులుకు టీడీపీ-జనసేన పొత్తు వాక్సిన్ అని పవన్ వ్యాఖ్యానించారు కాని, తెగులే లేని చోట వాక్సిన్ వేస్తే అది వికటించే అవకాశం ఉంటుంది. నిజానికి ప్రస్తుతం అబద్దాల వైరస్ సోకింది టీడీపీ, జనసేనలకే! దానికి సరైన వాక్సిన్ వేయవలసింది ఆంధ్రప్రదేశ్ ప్రజలే!
-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్