ఏపీలో ప్రతిపక్ష పార్టీల రాజకీయాలు తమాషాగా ఉన్నాయి. ప్రధానంగా తెలుగుదేశం, జనసేనలు కలిసే డ్రామా రాజకీయాలు నడుపుతున్నాయన్న భావన కలుగుతోంది. ఎందుకంటే ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 175 నియోజకవర్గాలలో.. టీడీపీ గెలుస్తుందనో, లేక గెలవాలనో పార్టీ నేతలకు చెబుతున్నారు. మరో వైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పార్టీకి అధికారం ఇవ్వాలని కోరుతూ ఉపన్యాసాల యాత్ర సాగిస్తున్నారు. తనను ముఖ్యమంత్రిని చేయాలని కూడా ఆయన ప్రజలను అడుగుతున్నారు. కాకపోతే ఒక్కోసారి నోరుజారి తాను ఓడిపోతానని తెలుసునని, తాను ముఖ్యమంత్రి పదవికి చాలనేమోనని అంటుంటారు.
✍️ ఇంతకాలం ఇద్దరు నేతలు పోటీపడి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వబోమని చెప్పేవాళ్లు.. జనసేనతో కలుస్తున్నామంటే వైఎస్సార్‌సీపీ ఎందుకు వణుకుతోందని కూడా చంద్రబాబు ప్రశ్నించేవారు. మీరు ఎందరు కలిసి వచ్చినా తాను సింగిల్ గానే ఎదుర్కుంటానని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సవాలు విసురుతుండడం చూస్తూనే ఉన్నాం. జగన్ వైఖరిలోకాని, మాటలోకాని ఎలాంటి మార్పులేదు. ఆయన రాజకీయం స్ట్రెయిట్గా ప్రజలతోనే చేస్తున్నారు. చంద్రబాబు, పవన్‌లు మాత్రం ఏమి రాజకీయం చేస్తున్నది ప్రజలకు తెలియకుండా, వారిని మాయచేసేలా ఉండడానికి యత్నిస్తున్నారనిపిస్తోంది. పోనీ.. నిజంగానే వీరిద్దరూ ఇప్పుడు మాట్లాడుతున్నదాని ప్రకారం కలవకుండా ఉంటారా? అంటే అవునని చెప్పలేని పరిస్థితి. వీరిద్దరు కలిసి ఉన్నట్లు నటిస్తూనే, ఒకరిపై మరొకరు ఎత్తుగడలు పన్నుతున్నారా అనే సందేహం కలుగుతుంది.
✍️ జనసేనకు ఉన్న కాపు సామాజికవర్గ బలాన్ని వాడుకోవాలన్నది చంద్రబాబు లక్ష్యం. టీడీపీకి ఉన్న క్యాడర్ ఆధారంగా కొన్ని సీట్లు పొందాలన్నది పవన్ కల్యాణ్ ఉద్దేశం. అయితే వీరిద్దరి ఈ విషయాన్ని పైకి కనబడనివ్వకుండా ప్రస్తుతం రాజకీయం చేస్తున్నారు. పవన్‌ను సాధ్యమైనంత తక్కువ చేసి చూపించడం ద్వారా జనసేనకు పదో, ఇరవయ్యో సీట్లు ఇచ్చి సరిపెట్టుకోవాలన్నది చంద్రబాబు ఆలోచన కావచ్చు. అయితే తన బలం బాగా ఎక్కువగానే ఉందని, ప్రత్యేకించి ఉభయ గోదావరి జిల్లాలలో టీడీపీ కన్నా తనకు అధిక ప్రజాదరణ ఉందని అనుకోవాలన్నది పవన్ భావన కావచ్చు. ప్రత్యేకించి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలో ఆయన యాత్ర పెట్టుకున్న కారణం కూడా అదే. తనను చూడడానికి వచ్చే అభిమానులంతా తన ఓటర్లే అన్న భ్రమ కలిగించాలన్నది ఆయన ప్రయత్నం. కాపు సామాజికవర్గం బాగా ఎక్కువగా ఉన్న ప్రాంతాల గుండానే ఆయన టూర్ ను ప్లాన్ చేసుకోవడం అంతా గమనించారు.
✍️ చంద్రబాబు, పవన్‌లు కలిసి ఉన్నట్లు పరోక్ష సంకేతాలు ఇస్తూనే.. మళ్లీ ఈ రహస్య ఎజెండాతో వీరిద్దరు పనిచేసుకుంటున్నారనిపిస్తుంది. గత టరమ్ లో చంద్రబాబు పాలన గురించికాని, అప్పుడు జరిగిన అక్రమాల గురించికాని పవన్ కల్యాణ్ నోరెత్తడం లేదు. కొంతకాలం వీరిద్దరి మద్య అలయ్-బలయ్ నడిచినా, కారణం ఏమైనా పవన్ గుంటూరు వద్ద ఒక భారీ సభ పెట్టి చంద్రబాబు ప్రభుత్వాన్ని తీవ్రంగానే విమర్శించారు.పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేశారు. ఆ తర్వాత మళ్లీ రాజీపడి ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల చీలిక ద్వారా టీడీపీ గెలిపించాలని పవన్ కృషి చేశారన్నది పలువురి అభిప్రాయం. అందులో వాస్తవం ఉందని పలు దృష్టాంతాలు చెబుతున్నాయి.
✍️ జనసేన,సీపీఐ వంటి పార్టీల అభ్యర్ధులను చంద్రబాబే ఖరారు చేయడం, ఆర్దిక వనరులు సమకూర్చడం చేశారని అంటారు. అలాగే ఎన్నికల సమయంలో కుప్పం , మంగళగిరి వైపు పవన్ వెళ్లలేదు. గాజువాక, భీమవరంలలో చంద్రబాబు తొంగి చూడలేదు. 2019 లో ఒటమి తర్వాత మళ్లీ కలిసి పనిచేయడం ఆరంభించారు. చంద్రబాబు సూచన మేరకే పవన్ ఢిల్లీ వెళ్లి బిజెపితో పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు బీజేపీని, టీడీపీని జతచేయాలని పవన్ విశ్వయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ సొంత ఎజెండా లేకుండా కేవలం బలప్రదర్శనకు మాత్రమే ఈ యాత్ర చేస్తున్నట్లనిపిస్తుంది. తద్వారా చంద్రబాబు వద్ద ఎక్కువ సీట్లకు బేరం పెట్టవచ్చన్నది ఆయన ప్లాన్.
✍️ చంద్రబాబుకాని, టీడీపీ మీడియాకాని పవన్ను కాస్త తగ్గించే యత్నం ఈ యాత్రలో చేశారని చాలా మంది నమ్ముతున్నారు. చంద్రబాబు తన ప్రచారంలో ఏవైతే విమర్శలు చేస్తున్నారో, వాటినే కొంత మార్చి పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారు. అందుకే వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆయనకు ప్యాకేజీ స్టార్ అనో, దత్తపుత్రుడు అనో పేరు పెట్టి విమర్శిస్తుంటారు. అయినా పవన్ తన ధోరణి మార్చుకుని సొంత ఆలోచనలోకి రాలేకపోతున్నారనిపిస్తుంది. తాను అధికారంలోకి వస్తే ఏమి చేస్తానో ప్రజలకు వివరించడంలో పవన్ విఫలం అవుతున్నారు. ప్రజలకు సంబంధించిన ఒక ఎజెండా లేకుండా యాత్ర చేస్తున్న నేత బహుశా ఈయనే అయి ఉంటారు. అలాగే పవన్ కళ్యాణ్ పై ఎలాంటి విమర్శలు చేయకుండా చంద్రబాబు జాగ్రత్తపడుతున్నారు. అదే టైమ్ లో జనసేనతో సంబంధం లేకుండా మినీ మానిఫెస్టోని విడుదల చేసి ఆ పార్టీని గందరగోళంలో పడేశారు.
✍️ ఈ రకంగా ఎత్తుగడలతో వీరి స్నేహం సాగుతోంది. కాకపోతే చంద్రబాబు వ్యూహం ముందు పవన్ తేలిపోతారు. సోషల్ మీడియాలో పవన్ కు పది,పదిహేను సీట్లు ఇస్తే చాలని టీడీపీ అభిమానులు ప్రచారం చేస్తుంటారు. అప్పుడు మాత్రం జనసేనవారు కౌంటర్ ఇస్తుంటారు. ఇక బీజేపీ వాళ్లు టీడీపీతో కలవకూడదని మొదటినుంచి అనుకుంటున్నా, బీజెపీలో చేరిన టీడీపీ నేతల ఒత్తిడికి కొంత మెత్తపడుతున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. వాళ్లు ఎన్నికల నాటికి టీడీపీ, జనసేనలతో కలిసి వెళ్లరని గ్యారంటీగా చెప్పలేం. కాకపోతే ఇప్పటికైతే బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు టీడీపీతో పొత్తు లేదనే అంటున్నారు. అయినా అదంతా అదిష్టానం చూసుకుంటుందని మెలిక పెడుతున్నారు.
✍️ ఇంకో ఆసక్తికరమైనఅంశం ఏమిటంటే సీపీఐ ఏదో రకంగా తెలుగుదేశంతో జట్టు కడుతుందట. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో టీడీపీ మద్దతు తీసుకుని రెండు స్థానాలలో పోటీచేయవచ్చన్న ప్రచారం ఒకటి జరుగుతోంది. ఒకవేళ బీజేపీతో టీడీపీకి పొత్తు కుదిరితే.. నేరుగా పొత్తు పెట్టుకోవడం ఇబ్బంది అవుతుంది కనుక పరోక్ష కాపురం చేస్తారని కొందరు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదు కనుక పెద్దగా ఆశలు పెట్టుకోవడం లేదు. మొత్తం మీద టీడీపీ, జనసేనల మధ్య అక్రమ రాజకీయ సంబంధం ఎప్పటికి క్రమబద్దం అవుతుందో ఆ రెండు పార్టీలే చెప్పలేకపోతున్నాయి. బిజెపిని వదలివేసినట్లు పవన్ చెప్పలేకపోతున్నారు. బీజేపీ తమతోనే జనసేన ఉందని చెబుతుంది. టీడీపీఏమో తమకు, జనసేనకు పొత్తు ఖాయమని ప్రచారం చేస్తూనే.. జనసేనను ఎలా బాగా లిమిట్ చేయాలా అనే ఆలోచన సాగిస్తోంది. బీజేపీ అంటే భయమో,లేక మరే కారణమో తెలియదు కాని ప్రస్తుతానికి లివింగ్ టుగెదర్ రిలేషన్ షిప్‌ను ఈ రెండు పార్టీలు కొనసాగిస్తున్నాయి. ఒకరకంగా దేశ రాజకీయాలలోనే ఇది ఒక వింతైన పోకడ అని చెప్పాలి.
:కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్
Comments
Please login to add a commentAdd a comment