
విద్యుత్ చార్జీలు పెంచడంలేదంటూనే చంద్రబాబు దొంగ దెబ్బ
టైమ్ ఆఫ్ డే టారిఫ్ పేరుతో పీక్ అవర్స్‌లో చార్జీల బాదుడు
ఇప్పటివరకు హెచ్‌టీ సర్వీసులున్న పెద్ద పరిశ్రమలకే ఈ పద్ధతి
ఇకపై ఎల్‌టీ వాణిజ్య సర్వీసులకూ వర్తింపు
చిరు వ్యాపారుల నుంచి పరిశ్రమల వరకు బాదుడే
ఉదయం 6 నుంచి 10 వరకు, సాయంత్రం 6 నుంచి రాత్రి 10 వరకు అదనపు చార్జీలు
లోడ్‌నుబట్టి 50 పైసల నుంచి 1 రూపాయి వరకు పెరిగే అవకాశం
ఏప్రిల్ 1 నుంచి అమలు.. 2025–26 టారిఫ్ విడుదల చేసిన ఏపీఈఆర్‌సీ
సాక్షి, అమరావతి/తిరుపతి రూరల్: వ్యాపారాలు, చిన్న పరిశ్రమలతో స్వయం ఉపాధి కల్పించుకొని, మరికొందరికి ఉపాధి కల్పిస్తున్న చిరు వ్యాపారులు, చిన్న పరిశ్రమలపై చంద్రబాబు ప్రభుత్వం దొంగ దెబ్బ కొట్టింది. ఓ పక్క విద్యుత్ చార్జీలు పెంచడంలేదని చెబుతూనే.. వీరిపై టైమ్ ఆఫ్ డే టారిఫ్ (టీఓడీ) పేరుతో పీక్ అవర్స్‌లో అదనపు విద్యుత్ చార్జీల భారం మోపుతోంది. అంటే విద్యుత్ ఎక్కువగా వాడే ఉదయం, సాయంత్రం సమయాల్లో అదనపు చార్జీలు పడతాయి.
చిన్న షాపుల్లో సాయంత్రం వేళ వ్యాపారం జరిగినా, జరగకపోయినా కరెంటు చార్జీలు మాత్రం భారీగా పడతాయి. ఈ సమయాల్లో లోడ్‌నుబట్టి యూనిట్‌కు 50 పైసల నుంచి 1 రూపాయి వరకు అదనపు భారం పడనుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త టారిఫ్‌లు అమల్లోకి రానున్నాయి.
ఇక బాదుడు మామూలుగా ఉండదు
అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రూ అప్, ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో ప్రజల నుంచి అత్యధికంగా విద్యుత్ చార్జీలు వసూలు చేస్తూ రూ.15,485 కోట్ల విద్యుత్ చార్జీల భారం వేసిన చంద్రబాబు సర్కారు.. ఇప్పుడు సమయాన్ని బట్టి బాదుడు మొదలెట్టింది. ఇన్నాళ్లూ హై టెన్షన్ (హెచ్‌టీ) కనెక్షన్ ఉన్న పెద్ద పరిశ్రమలకు మాత్రమే అమలులో ఉన్న టైమ్ ఆఫ్ డే టారిఫ్ చార్జీలను ఇకపై లో టెన్షన్ (ఎల్‌టీ) పరిశ్రమలు, వాణిజ్య సర్వీసులకూ అమలు చేయనుంది. ఈ మేరకు 2025–26 ఆర్థిక సంవత్సరం రిటైల్ సరఫరా ధరలు (టారిఫ్ ఆర్డర్)ను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) గురువారం తిరుపతిలో విడుదల చేసింది.
విద్యుత్ వినియోగించే సమయాన్ని బట్టి వినియోగదారులపై భారం మోపేందుకు ఏపీఈఆర్‌సీ అనుమతినిచ్చిoది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ‘పీక్ అవర్’ వినియోగంలో ఒక విధంగా, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ‘ఆఫ్ పీక్ అవర్’లో మరో విధంగా చార్జీలు వసూలు చేస్తారు. మిగతా సమయంలో ఇప్పుడున్న చార్జీలే వర్తిస్తాయి. ఈమేరకు చార్జీల వసూలుకు డిస్కంలు చేసిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఎఆర్‌ఆర్) ప్రతిపాదనలకు ఏపీఈఆర్‌సీ ఆమోదం తెలిపింది.
గ్రిడ్ డిమాండ్ ఎక్కువగా ఉండే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో చార్జీలు మరింతగా పెంచి విద్యుత్ బిల్లుల్లో వేయనున్నారు. పైగా ఇదీ కిలోవాట్ల లెక్కన లోడ్‌నుబట్టి మారిపోతుంది. అంటే 11 కేవీ, 33 కేవీ, 132 కేవీ, 220 కేవీ లోడ్ ప్రకారం చార్జీ పడుతుంది. ఏమాత్రం లోడ్ పెరిగినా బిల్లు భారీగా పెరుగుతుంది.
డిమాండ్‌కు సరిపడా సరఫరా చేయాలి
ఈ వేసవిలో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 260 మిలియన్ యూనిట్లకు పెరిగే అవకాశం ఉన్నందున ఎలాంటి కోతలు లేకుండా సరఫరా చేయాలని డిస్కంలను ఏపీఈఆర్‌సీ ఇన్‌చార్జి చైర్మన్ ఠాకూర్ రామ్‌సింగ్ ఆదేశించారు. తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గృహావసరాలకు అవసరమైన అదనపు లోడ్లను డిస్కంల పరిధిలో క్రమబద్ధీకరించి కోతలు లేకుండా చూడనున్నట్లు చెప్పారు. ఇప్పుడు వాడుతున్న విద్యుత్‌కు అదనంగా విద్యుత్ అవసరమని అంచనా వేశామన్నారు.
స్మార్ట్ మీటర్లు ఎక్కడా ఏర్పాటు చేయడంలేదని, వాటిని ఇంకా ఆమోదించలేదని, ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టును మాత్రమే ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం విద్యుత్ వాడకం పెరుగుతుండడంతో అందుకు తగినట్లుగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని వెల్లడించారు. ఏపీఆర్సీ సభ్యుడు వెంకట్రామరెడ్డి, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
టారిఫ్ ఆర్డర్‌లోని మరికొన్ని నిర్ణయాలు
» ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు సమర్పించిన ఏఆర్‌ఆర్ ప్రకారం.. ఆదాయ అవసరం రూ.57,544.17 కోట్లను ఏపీఈఆర్‌సీ ఆమోదించింది. ఇది డిస్కంలు అడిగిన దానికంటే రూ.1,324.35 కోట్లు మాత్రమే తక్కువ. మొత్తం ఆదాయం రూ.44,323.30 కోట్లుగా నిర్ణయించింది.
» రూ.12,632.40 కోట్ల ఆదాయ అంతరాన్ని ఆమోదించింది. ఇది డిస్కంలు దాఖలు చేసినదానికంటే రూ.2,050.86 కోట్లు తక్కువ.
» రాష్ట్ర ప్రభుత్వం రూ.12,632.40 కోట్ల ఆదాయ అంతరాన్ని సబ్సిడీగా భరించేందుకు అంగీకరించింది.
» ఎంపిక చేసిన వర్గాలకు ఉచిత విద్యుత్, రాయితీలు కొనసాగుతాయి.
» రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని జెన్‌కోలు దిగుమతి చేసుకున్న బొగ్గు రవాణాకు రైలు, సముద్ర మార్గాలను వినియోగించుకోవచ్చు.
» స్వల్ప కాలిక విద్యుత్ అవసరాల కోసం తొలిసారిగా అవర్లీ డిస్పాచ్‌ను తీసుకువర్వీచ్చింది.
» ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇళ్లను నిర్మించుకునే లేదా పునర్నిర్మిoచే వ్యక్తులు వాణిజ్య టారిఫ్‌కు బదులుగా డొమెస్టిక్ టారిఫ్ బిల్ చెల్లించుకోవచ్చు.
» స్థిరమైన టారిఫ్‌లు గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సె‹స్ వినియోగదారులకే కాకుండా ఓపెన్ యాక్సెస్ వినియోగదారులకూ వర్తిస్తాయి.
» 150 కేడబ్ల్యూ వరకు కనెక్ట్ చేసిన ఈవీ ఛార్జింగ్ స్టేషన్లకు ఎల్‌టీ వోల్టేజ్ స్థాయిలో విద్యుత్ సరఫరా చేయడానికి ఆమోదం. డిమాండ్ చార్జీలు లేకుండా ఈవీల టారిఫ్ యూనిట్‌కు రూ.6.70 వసూలు చేస్తారు.
కొత్తగా అదనపు లోడ్ క్రమబద్దీకరణ పథకం
డెవలప్‌మెంట్ చార్జీల్లో 50 శాతం చెల్లించడం ద్వారా గృహ వినియోగదారులు అదనపు లోడ్‌ను క్రమబద్దీకరించే పథకాన్ని ఏపీఈఆర్‌సీ ఆమోదించింది. ఈ పథకం 2025 మార్చి 1 నుంచి 2025 జూన్ 30 వరకు అమలులో ఉంటుంది. ఆన్‌లైన్ విండో ద్వారా వినియోగదారులు స్వచ్ఛందంగా అదనపు లోడ్‌లను ప్రకటించవచ్చు. డిస్కంలు అదనపు లోడ్‌లను క్రమబద్దీకరిస్తాయి. డెవలప్‌మెంట్ ఛార్జీల్లో 50 శాతం వసూలు చేస్తాయి. అదనపు లోడ్ కోసం సెక్యూరిటీ డిపాజిట్లు కూడా సేకరిస్తాయి. ఈ అవకాశం ఒకసారి మాత్రమే ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment