నిన్న సర్దుబాటు చార్జీలు.. రేపు అసలు బాదుడు | Everything is set to drastically increase the actual electricity charges from April | Sakshi
Sakshi News home page

నిన్న సర్దుబాటు చార్జీలు.. రేపు అసలు బాదుడు

Published Sun, Dec 1 2024 3:51 AM | Last Updated on Sun, Dec 1 2024 3:51 AM

Everything is set to drastically increase the actual electricity charges from April

ఏప్రిల్‌ నుంచి అసలు కరెంటు చార్జీలను భారీగా పెంచేందుకు సర్వం సిద్ధం

నేరుగా కుదరకపోతే పరోక్షంగా చార్జీలు వేసేలా పూర్తయిన కసరత్తు

ఏపీఈఆర్సీకి చేరిన డిస్కంల ఆదాయ అవసరాల నివేదిక

2025–26 సంవత్సరానికి విద్యుత్‌ చార్జీల పెంపుపై ప్రతిపాదనలు

కూటమి పాలనలో విద్యుత్‌ వాడాలంటేనే భయం వేసే పరిస్థితులు.. ఇప్పటికే సర్దుబాటు పేరుతో రూ.15,485 కోట్ల చార్జీలు మోపిన ప్రభుత్వం

సాక్షి, అమరావతి: కనీవినీ ఎరుగని రీతిలో.. మునుపెన్నడూ ఏ ప్రభుత్వంలో, ఏ సీఎం హయాంలోనూ లేని విధంగా ఆరు నెలల్లోనే ప్రజలపై రూ.15,485 కోట్ల విద్యుత్‌ సర్దుబాటు చార్జీల భారం మోపిని చంద్రబాబు కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు అసలు చార్జీల వడ్డింపునకు సిద్ధమవుతోంది. 

ప్రత్యక్షంగానో, కుదరకపోతే దొంగ దారిలో శ్లాబుల విధానంలోనే కరెంటు చార్జీలు పెంచడం ద్వారా ప్రజలపై మరికొన్ని వేల కోట్ల రూపాయల భారం వేసేలా విద్యుత్‌ పంపిణీ సంస్థల (డిస్కంల)తో కసరత్తు పూర్తి చేయించింది.

ఈ మేరకు 2025–26 సంవత్సరానికి ­ఆదాయ అవసరాల నివేదిక (అగ్రిగేట్‌ రెవెన్యూ రిక్వైర్‌మెంట్‌)ను ఆంధ్రప్రదేశ్‌ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి శనివారం అందజేశాయి. 

ఈ నివేదికలపై ఏపీఈఆర్‌సీ బహిరంగ విచారణ చేపడుతుంది. అనంతరం టారిఫ్‌ (ధర) ప్రకటిస్తుంది. దాని ప్రకారం వచ్చే ఏడాది (2025) ఏప్రిల్‌ 1 నుంచి కొత్త విద్యుత్‌ చార్జీలు అమలులోకి వస్తాయి.

ప్రజలపై చార్జీల భారం వేయని వైఎస్‌ జగన్‌
విద్యుత్‌ చార్జీల భారంతో ప్రజల నడ్డివిరిచే ప్రభుత్వాలను గతంలో చూశాం. కానీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో సామాన్యులకు ఎలాంటి విద్యుత్‌ చార్జీలు పెంచని ప్రభుత్వం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వమే. ఇదే కాకుండా, రైతులకు 9 గంటల పాటు వ్యవసాయానికి పగటిపూట ఉచిత విద్యుత్‌ను అందించింది కూడా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వమే. 

వివిధ వర్గాల పేదలకు సైతం ఉచితంగా, రాయితీతో విద్యుత్‌ను ఇచ్చింది వైఎస్‌ జగన్‌ హయాంలోనే. ప్రస్తుత 2024–25 ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే విధానాన్ని కొనసాగిస్తూ.. రాష్ట్రంలోని దాదాపు 2 కోట్ల కుటుంబాలపై ఎలాంటి విద్యుత్‌ చార్జీల భారం లేకుండా టారిఫ్‌ ఆర్డర్‌ను ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఆమోదించేలా నాటి పాలకులు చేశారు. 

2024–25 సంవత్సరానికి మూడు డిస్కంలకు ప్రభుత్వం నుండి అవసరమైన సబ్సిడీ రూ.13,589.18 కోట్లను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వమే భరించింది. తద్వారా విద్యుత్‌ చార్జీలను పెంచాల్సిన అవసరం లేకుండా చేసింది. 

అంతా గోప్యం
ఏపీఈఆర్‌సీకి సమర్పించిన ఏఆర్‌ఆర్‌లో ఏముందో డిస్కంలు బయటకు చెప్పడంలేదు. శనివారంతో గడువు ముగుస్తున్నందున సాంకేతికంగా నివేదిక సమర్పించామని, పూర్తి నివేదిక సోమవారం ఇస్తామంటూ తప్పించుకుంటున్నాయి. 

ఏఆర్‌ఆర్‌లు సమర్పించారని, వాటిని పరిశీలించి, ప్రజల ముందుంచడానికి కొద్ది రోజులు పడుతుందని ఏపీఈఆర్‌సీ చెబుతోంది. ఇప్పటికే సర్దుబాటు చార్జీలు భారీగా వేయడంతో కూటమి సర్కారుపై ప్రజల్లో వ్యతిరేకత వస్తోంది. టారిఫ్‌ కూడా పెంచితే మరింత ప్రజాగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం డిస్కంలతో వినియోగదారులను ఏమార్చేలా ప్రతిపాదనలు ఇప్పించినట్లు సమాచారం. 

చార్జీల పెంపు ప్రత్యక్షంగా పెంచడం కుదరకపోతే గతంలో చంద్రబాబు హయాంలో చేసినట్లుగానే ఇప్పుడూ స్లాబులు మార్చి, వినియోగదారులను ఏమార్చి బిల్లులు పెరిగేలా డిస్కంలు ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement