
ప్రజలపై భారం తగ్గించేందుకు కేటాయింపులు శూన్యం
డిస్కం అప్పులకు ఒక్క రూపాయి కూడా విదల్చని కూటమి
ఎన్నికల ముందు చెప్పిన సౌర పంపు సెట్ల ప్రస్తావనే లేదు
ఇంధన సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఒట్టిమాటే
కేంద్ర పథకాలైన పీఎం సూర్యఘర్, కుసుమ్‌లే దిక్కు
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగానికి ఒక్క రూపాయి కూడా అదనంగా కేటాయించకుండా చంద్రబాబు ప్రభుత్వం మరోసారి చేతులెత్తేసింది. ఓటాన్ బడ్జెట్‌లోనే ఇంధన శాఖకు అరకొరగా కేటాయింపులు చేసి చేతులు దులుపుకున్న చంద్రబాబు ప్రభుత్వం.. వార్షిక బడ్జెట్‌లోనూ మొండి చేయి చూపించింది. రాష్ట్ర ప్రజలపై రూ.15,485 కోట్ల విద్యుత్ చార్జీల భారం వేసి బిల్లులు వసూలు చేస్తున్న ప్రభుత్వం.. ఇంధన రంగానికి, రాయితీలు, సబ్సిడీల కోసం బడ్జెట్‌లో కేవలం రూ.13,600 కోట్లే కేటాయించింది.
కనీసం చార్జీల రూపంలో ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నంత కూడా ఇవ్వలేకపోయింది. విద్యుత్ రంగం రూ.1.29 లక్షల కోట్లకు పైగా నష్టాల్లో ఉందన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. ఆ అప్పులను తీర్చేందుకు ఒక్క రూపాయి కూడా సాయంగా ప్రకటించలేదు. పైగా అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచ్చిoదని.. అందుకే ట్రూ అప్ చార్జీల పేరుతో ప్రజలపై పెనుభారం మోపామని సమర్థించుకునే ప్రయత్నం చేశారు.
నిజానికి గత టీడీపీ హయాంలో జరిగిన అనవసర అధిక ధరల విద్యుత్ కొనుగోళ్ల వల్లే.. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు అప్పుల ఊబిలోకి కూరుకుపోయాయనే వాస్తవాన్ని మంత్రి ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారు. నూతన సమగ్ర ఆంధ్రప్రదేశ్ సమీకృత క్లీన్ ఎనర్జీ విధానం–2024 ద్వారా పునరుత్పాదక ఇంధన తయారీ జోన్‌లను ఏర్పాటు చేసి, పెట్టుబడులను ఆకర్షించి 7.5 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి వెల్లడించారు.
అయితే ఇప్పటివరకూ ఎన్ని ప్రాజెక్టులు తెచ్చారో, ఈ రంగంలో ఎన్ని ఉద్యోగాలిచ్చారో మంత్రి చెప్పలేకపోయారు. కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు ఇంధన రంగానికి సంబంధించి ఇచ్చిన హామీలకు బడ్జెట్‌లో అస్సలు స్థానమే లభించలేదు. రైతులకు సబ్సిడీపై పంపుసెట్లు మంజూరు చేస్తామనే హామీ అమలు గురించి ఎక్కడా కనిపించలేదు.
భవిష్యత్‌లో పెరగనున్న విద్యుత్ డిమాండ్‌ను అందుకోవడం కోసం ఒక్కటంటే ఒక్కటి కూడా కొత్త విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టును ప్రకటించలేదు. ఇక ఇంధన పొదుపు, సంరక్షణ కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. కేవలం కేంద్ర పథకాలైన పీఎం సూర్యఘర్, కుసుమ్ పథకాలకు వచ్చే సబ్సిడీలతోనే సోలార్ రూఫ్ టాప్, సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేస్తామని చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment