కూటమి ప్రభుత్వంలో 4 నెలలకే విద్యుత్ బిల్లుల మోత
జనం మీద రూ.6072.86 కోట్ల చార్జీల భారం
ప్రతి యూనిట్‌పై గరిష్టంగా రూ.1.58 అదనం.. నవంబర్ నుంచి 15 నెలల పాటు వసూలు
డిస్కంల ప్రతిపాదనలను ఆమోదించిన ‘ఏపీఈఆర్‌సీ’
వినియోగదారుల విజ్ఞప్తులను పట్టించుకోని ప్రభుత్వం
గతంలో విద్యుత్ వాడకపోయినా కనీస చార్జీలంటూ రూ.50 వసూలు
స్లాబులను మార్చి అధిక భారం మోపిన చరిత్రా బాబుదే
విద్యుత్ కొనుగోలు అడ్డగోలు ఒప్పందాలతో మోయలేని భారం
సాక్షి, అమరావతి: జనం భయపడినట్లుగానే జరిగింది. కూటమి ప్రభుత్వం అనుకున్నట్లుగానే చేసింది. ప్రజలపై విద్యుత్ చార్జీల భారం వేయం.. వేయం.. అని చెబుతూనే భారీగా వడ్డిస్తోంది. చార్జీలు పెంచేది లేదని ఎన్నికల ముందు అధికారం కోసం ఇచ్చిన హామీ మేరకు ఈ చార్జీలను ప్రభుత్వమే భరించాలని వినియోగదారులు చేసిన విజ్ఞప్తులను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఇచ్చిన మాట తప్పి ఏకంగా రూ.6,072.86 కోట్ల సర్దు బాటు చార్జీల షాక్ ఇచ్చింది.
ప్రతి యూనిట్‌పై గరిష్టంగా రూ.1.58.. 15 నెలల పాటు ప్రజల నుంచి అదనపు చార్జీలు వసూలు చేయనుంది. కూటమి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే ఇంత భారీ స్థాయిలో విద్యుత్ చార్జీలు పెంచడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదిలోనే ఇలా ఉంటే ఇక రానున్న నాలుగున్నరేళ్లు ఎలా ఉంటుందోనని జనం భయపడిపోతున్నారు.
చార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని, ప్రజలపై భారం లేకుండా ప్రభుత్వమే భరించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం దిగి రాకపోతే ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి.
స్పందించని ప్రభుత్వం
ఇంధన, విద్యుత్ కొనుగోలు ఖర్చు సర్దుబాటు (ఎఫ్‌పీపీసీఏ) చార్జీలు రూ.8,113.60 కోట్లు వసూలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి డిస్కంలు ప్రతిపాదించాయి. గృహ విద్యుత్ వినియోగదారుల నుంచి రూ.2,194 కోట్లు, వ్యవసాయ విద్యుత్ సర్విసుల నుంచి రూ.1,901 కోట్లు, పారిశ్రామిక సర్విసుల నుంచి రూ.2,748 కోట్లు, వాణిజ్య సర్విసుల నుంచి రూ.669 కోట్లు, సంస్థల (ఇన్‌స్టిట్యూషన్స్) నుంచి రూ.547 కోట్లు చొప్పున విద్యుత్ బిల్లుల్లో అదనంగా వసూలు చేసుకుంటామని అడిగాయి.
ప్రతి నెల ఒక్కో బిల్లుపైనా యూనిట్‌కు రూ.1.27 చొప్పున వసూలు చేస్తామని తెలిపాయి. ఈ చార్జీల వసూలుకు ఏపీఈఆర్‌సీ అనుమతి ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వమే 75 శాతం భారం భరించాల్సి ఉంటుందని డిస్కంలు స్పష్టం చేశాయి. డిస్కంల ప్రతిపాదనలపై ఏపీఈఆర్‌సీ ఈ నెల 18న బహిరంగ విచారణ చేపట్టింది. ప్రభుత్వమే ఈ చార్జీలను భరించాలని, ప్రజలపై వేయడానికి వీల్లేదని ఆ విచారణలో పాల్గొన్న వివిధ వర్గాల ప్రజలు కోరారు.
వారం రోజుల పాటు ప్రభుత్వ స్పందన కోసం ఏపీఈఆర్‌సీ ఎదురు చూసింది. చార్జీలు భరించేందుకు కూటమి సర్కారు నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో రూ.6,072.86 కోట్ల సర్దుబాటు చార్జీల వసూలుకు అనుమతిస్తూ ఏపీఈఆర్‌సీ శుక్రవారం తన నిర్ణయాన్ని వెలువరించింది. ఇందులో రైతులు, వివిధ వర్గాల వారికి ఉచితంగా, సబ్సిడీగా ఇచ్చిన విద్యుత్‌పై దాదాపు రూ.1,400 కోట్లు భారం పడనుంది.
దానిని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వసూలు చేసుకోవాల్సిందిగా డిస్కంలకు ఏపీఈఆర్‌సీ సూచించింది. ప్రభుత్వం నుంచి ఆ మేరకు వస్తే మిగిలిన రూ.4,672.86 కోట్లు ప్రజలు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంమీద డిస్కంలు అడిగిన దానిలో రూ.2,042 కోట్లు తక్కువకు అనుమతించామని మండలి తెలిపింది.
గతం అంతా షాక్‌ల చరిత్రే
» చంద్రబాబు చెప్పేదొకటి.. చేసేది మరొకటి అనేది మరోసారి రుజువైంది. అనవసర విద్యుత్ కొనుగోలు ఒప్పందాల కారణంగా డిస్కంలను అప్పుల పాలు చేసిన చంద్రబాబు పాపాల వల్లే ప్రజలపై చార్జీల భారం పడుతున్నా పట్టించుకోవడం లేదు. ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలను పెంచమని ప్రకటించారు. కానీ ఆ మాట తప్పడానికి ఐదు నెలలు కూడా పట్టలేదు.
» చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా విద్యుత్ చార్జీల విషయంలో, విద్యుత్ రంగం విషయంలో ఇలాంటి కుట్రలే చేస్తుంటారు. గతంలో ఏపీఈఆర్‌సీని తప్పుదోవ పట్టించారు. డిస్కంలు ఇంధన సర్దుబాటు చార్జీలు సమర్పించకుండా అడ్డుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో 2015–16లో 76 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తే రూ.140.10 బిల్లు వచ్చేది. 2018–19కి వచ్చే సరికి ఇదే వినియోగానికి వచ్చిన బిల్లు రూ.197.60. అంటే 41.04 శాతం పెరిగింది. అదే విధంగా 78 యూనిట్లకు 39.57 శాతం, 80 యూనిట్లకు 38.21 శాతం పెంచేశారు.
»గృహ విద్యుత్ వినియోగదారుల నుంచి రూ.50 చొప్పున కనీస చార్జీలు వసూలు చేసే విధానం గత టీడీపీ హయాంలో ఉండేది. నెలంతా విద్యుత్ వినియోగించకపోయినా కనీస చార్జీ రూ.50 చెల్లించాల్సి వచ్చేది. సగటు యూనిట్ సేవా వ్యయం కూడా రూ.7.17 వసూలు చేసేది. విద్యుత్ వినియోగాన్ని బట్టి శ్లాబులను మార్చి, అధిక భారం వేసే విధానాన్ని టీడీపీ సర్కారే గతంలో అమలు చేసింది.
» అవసరం లేకపోయినా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ)లను అధిక ధరలకు చంద్రబాబు కుదుర్చుకున్నారు. దాదాపు 8 వేల మెగా వాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల విద్యుత్ సంస్థలపై 25 ఏళ్ల పాటు ఏటా అదనంగా రూ.3,500 కోట్ల భారం పడుతోంది. అంతిమంగా అదంతా విద్యుత్ వినియోగదారులపైనే పాతికేళ్లు వేయాల్సి వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment