సరఫరా వ్యయం యూనిట్‌కు రూ.7.75.. రాబడి రూ.5.82 మాత్రమే
వచ్చే సంవత్సరానికి విద్యుత్ చార్జీలపై విద్యుత్ పంపిణీ సంస్థల ప్రతిపాదన
సాక్షి, అమరావతి: వచ్చే (2025–26) ఆర్థిక సంవత్సరానికి ఆదాయం, రాబడికి మధ్య వ్యత్యాసం రూ.14,683.24 కోట్లుగా డిస్కంలు అంచనా వేశాయి. ఈ మేరకు ఆదాయ, అవసరాలు (ఏఆర్‌ఆర్), ప్రతిపాదిత టారిఫ్ (ఎఫ్‌పీటీ) నివేదికలను అంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు గత నెల 30న ఏపీఈఆర్‌సీకి సమర్పించాయి. ఆ ప్రతిపాదనలను ఏపీఈఆర్‌సీ తన వెబ్‌సైట్‌లో శుక్రవారం ప్రజలకు అందుబాటులో ఉంచింది.
డిస్కంలు పేర్కొన్న లెక్కల ప్రకారం.. వచ్చే ఏడాది మొత్తం రూ.58,868.52 కోట్ల వ్యయం అయితే, టారిఫ్ యేతర ఆదాయ మొత్తాలను కలుపుకుని విద్యుత్ విక్రయం ద్వారా రూ.44,185.28 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశాయి. ఫలితంగా రూ.14,683.24 కోట్ల లోటు ఉంటుందని డిస్కంలు అంచనా వేశాయి. అదేవిధంగా 75,926.22 మిలియన్ యూనిట్ల విద్యుత్ విక్రయం జరుగుతుందని, ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024–25 (73,053.78 మిలియన్ యూనిట్లు) కంటే 3.93 శాతం ఎక్కువని డిస్కంలు నివేదికలో చెప్పాయి.
ఉచిత వ్యవసాయ విద్యుత్ వినియోగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 11,299.49 మిలియన్ యూనిట్ల కంటే 14.4 శాతం ఎక్కువగా 12,927 మిలియన్ యూనిట్ల వరకు ఉంటుందని అంచనా వేశాయి. ప్రస్తుత టారిఫ్ ప్రకారం డిస్కంల ఆదాయ అంతరాన్ని తీర్చడానికి వచ్చే ఏడాది మొత్తం రూ.14,683.24 కోట్ల సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆమోదించబడిన సబ్సిడీ (రూ.13,769.85 కోట్లు) కంటే ఇది 6.6 శాతం పెరిగింది.
విద్యుత్ కొనుగోలు వ్యయం యూనిట్‌కు రూ.4.80 అవుతుందని నివేదికలో పొందుపరిచాయి. ట్రాన్స్‌మిషన్ డిస్ట్రిబ్యూషన్ నష్టాలు 10.03 శాతంగా ప్రతిపాదించాయి. విద్యుత్ సరఫరా సగటు వ్యయం యూనిట్ కు రూ.7.75 పేర్కొనగా.. రాబడి మాత్రం యూనిట్‌కు రూ.5.82 ఉంటుందని డిస్కంలు భావిస్తున్నాయి. డిస్కంలు ఇచ్చిన ఈ ప్రతిపాదనలపై ఏపీఈఆర్‌సీ బహిరంగ విచారణ నిర్వహించి టారిఫ్ ప్రకటిస్తుంది. కొత్త టారిఫ్ ప్రకారం విద్యుత్ చార్జీలు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment