aperc
-
AP: షాక్‌ల మీద షాక్!
‘‘రాష్ట్రంలో విద్యుత్ చార్జీల భారం ఎక్కువగా ఉంది.. కూటమి ప్రభుత్వం వస్తే చార్జీల భారం తగ్గిస్తాం.. ఐదేళ్ల పాటు ఒక్క రూపాయి కూడా చార్జీలు పెంచం’’ అని ఎన్నికలకు ముందు ప్రతి సభలో హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి రాగానే మాట మార్చేశారు. ‘‘అబ్బే.. చెప్పినవన్నీ చేయాలంటే ఎలా కుదురుతుంది? చార్జీలు పెంచకపోతే డిస్కంలకు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి? డబ్బులు ఊరకే రావు. ‘సర్దుబాటు’ పేరుతో ఎంత కావాలో అంత ప్రజల నుంచే పిండుకోండి. ఇదేంటని ఎవరైనా అడిగితే గత ప్రభుత్వం వల్లే చార్జీలు పెరిగాయని అబద్ధమైనా సరే గట్టిగా దబాయించి చెప్పండి. ఒకటికి పదిసార్లు మన మీడియాలో కథనాలు రాయండి. అప్పటికీ సర్దుకోకపోతే నేనే ఎలాగోలా టాపిక్ డైవర్ట్ చేస్తాను’’ అని అంతర్గతంగా దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఫలితంగా ప్రజలు కోలుకోలేని విధంగా షాక్‌ల మీద షాక్.సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు కూటమి సర్కారు వరుసగా విద్యుత్ షాక్‌లు ఇస్తోంది. ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో ఇప్పటికే రూ.6,072.86 కోట్ల భారాన్ని ఈ నెల బిల్లు నుంచే వేస్తున్న ప్రభుత్వం, వచ్చే నెల నుంచి ప్రజల మీద మరో రూ.11,826.15 కోట్ల భారం మోపనుంది. ఈ మేరకు 2023–24 సంవత్సరానికి ఇంధన, విద్యుత్ కొనుగోలు సర్దుబాటు చార్జీల (ఎఫ్‌పీపీసీఏ)కు అనుమతి ఇవ్వాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ దక్షిణ, మధ్య, తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ)కి సోమవారం ప్రతిపాదనలు సమర్పించాయి. డిస్కంల ప్రతిపాదనలపై ఎవరికైనా అభ్యంతరాలున్నా, ఏవైనా సూచనలు చేయాలనుకున్నా తమకు నేరుగా గానీ, ఈ మెయిల్ ద్వారా గానీ ఈ నెల 19వ తేదీలోగా తెలియజేయాలని మండలి కోరింది. అనంతరం ఓ వారం రోజుల్లోనే ట్రూ అప్ చార్జీలపై ఏపీఈఆర్సీ నిర్ణయం తీసుకోనుంది. ఆ వెంటనే డిసెంబర్ నెల నుంచే విద్యుత్ బిల్లుల్లో సర్దుబాటు చార్జీలను వేసే అవకాశం ఉంది.గరిష్టంగా యూనిట్‌కు రూ.3 భారం ఈ ఏడాది జూన్ నాటికే 2023–24 సంవత్సరానికి సంబంధించిన సర్దుబాటు చార్జీలు యూనిట్‌కు రూ.0.40 చొప్పున ఇప్పటి వరకు దాదాపు రూ.3,752.55 వేల కోట్లు వసూలు చేశామని డిస్కంలు వెల్లడించాయి. మిగిలిన రూ.8,073.60 కోట్ల చార్జీలను బిల్లుల్లో అదనంగా కలిపేందుకు ఏపీఈఆర్సీ ఆమోదం కోసం డిస్కంలు పంపించాయని తెలిపాయి. అయితే ఈసారి వాస్తవ విద్యుత్ కొనుగోలు ఖర్చు, అనుమతించిన ఖర్చుకు మధ్య వ్యత్యాసాన్ని డిస్కంలు భారీగా చూపించాయి. అది మూడు డిస్కంలలోనూ కనిష్టంగా రూ.1.02 నుంచి గరిష్టంగా రూ.2.50 వరకు ఉంది. దీన్ని బట్టి యూనిట్‌కు ఎంత వసూలు చేసుకోవడానికి ఏపీఈఆర్సీ అనుమతిస్తుందనేది ఈ నెలాఖరులోగా తేలుతుంది. ఈ నెల నుంచి యూనిట్‌పై సగటున పడుతున్న రూ.1.27కి వచ్చే నెల నుంచి పడే చార్జీలను కలుపుకుంటే మొత్తంగా యూనిట్‌కు రూ.3 చొప్పున అదనంగా వినియోగదారులపై భారం పడనుంది. ఈ లెక్కన విద్యుత్ చార్జీలు డబుల్ కానున్నాయని, ఎక్కువ విద్యుత్ వాడే వాళ్లకు అంతకంటే ఎక్కువ భారం కానున్నాయని స్పష్టమవుతోంది. (నవంబర్ నెలలో వాడిన కరెంట్‌కు డిసెంబర్ మొదటి వారంలో బిల్లు వస్తుంది. అప్పుడు రూ.6,072.86 కోట్ల భారం పడుతుంది. డిసెంబర్లో వాడిన కరెంట్‌కు జనవరి మొదటి వారంలో బిల్లు వస్తుంది. అప్పుడు రూ.11,826.15 కోట్ల భారం అదనంగా కలుస్తుంది.) -
జగన్ సర్కారు పూర్తి స్వేచ్ఛనిచ్చింది
‘ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తి స్చేచ్ఛనిచ్చింది. అందువల్లనే గత ఐదేళ్లలో అనేక లక్ష్యాలను విజయవంతంగా చేరుకోగలిగాం. 250 ఆర్డర్లు, 27 నిబంధనలను జారీ చేయగలిగాం’ అని మండలి చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి తెలిపారు. 2019 అక్టోబర్ 30న ఏపీఈఆర్సీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన మంగళవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహకారం, ఏపీఈఆర్సీ విజయాలు, ఎదురైన అవరోధాల గురించి ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ⇒ ఐదేళ్లలో విద్యుత్ పంపిణీ సంస్థల పనితీరును మెరుగుపరచడానికి అనేక చర్యలు తీసుకున్నాం. విద్యుత్ ప్రమాదాలు జరిగినప్పుడు అందులో డిస్కం తప్పిదం ఉన్నా లేకున్నా కూడా బాధితులకు పరిహారం అందేలా నిబంధనలు రూపొందించాం. ⇒ మూడు గ్రామీణ విద్యుత్ సరఫరా సహకార సంస్థ (రెస్కో)ల వల్ల కలిగే నష్టాలను బేరీజు వేసి.. వాటిని డిస్కంల్లో విలీనం చెయ్యాలనే సాహసోపేత ఉత్తర్వులిచ్చాం. ప్రభుత్వం నుంచి సబ్సిడీ చెల్లింపులు ఆలస్యమైతే డిస్కంలు సర్‌ఛార్జీ వసూలు చేసుకునే అవకాశం కల్పించడమనేది దేశంలో మరెక్కడా లేదు. ⇒ వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను శాశ్వతంగా అందించే ఆలోచనలో భాగంగా సెకీ నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి ఆమోదం తెలిపాం. ఎన్ని ఒత్తిళ్లు, విమర్శలు వచ్చినా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా దీనిని ముందుకు తీసుకెళ్లాం. వినియోగదారులపై ఎటువంటి భారం పడకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్నాం. ⇒ వచ్చే ఐదేళ్లు విద్యుత్ సంస్థల బలోపేతానికి, కొత్త సబ్స్టేషన్లు, లైన్ల నిర్మాణానికి జాప్యం లేకుండా అనుమతులిచ్చాం. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలు లక్ష్యాలను చేరలేకపోతే వాటి స్థిర చార్జీలలోనే కోత ఉండేది. పూర్తిస్థాయి ఉత్పత్తి కోసం వాటికి పెనాల్టీలూ వేస్తున్నాం. ప్రతి ఏటా గడువులోగా రిటైల్ సరఫరా ధరల ఉత్తర్వులు విడుదల చేశాం. ⇒ ఓపెన్ యాక్సెస్ వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణకు ఇప్పటివరకు అదనపు సర్‌చార్జీ ప్రతిపాదనలను ఆమోదించలేదు. రైస్ మిల్లులు, పల్వరైజర్ పరిశ్రమలకు 150 హెచ్‌పీ లోడు వరకు ఎల్టీ టారిఫ్ ద్వారా విద్యుత్ వాడుకొనే అవకాశం కల్పించాం. ఖాయిలా పరిశ్రమల పునరుద్ధరణకు అవకాశమిచ్చాం. విద్యుత్ సంస్థల ఉద్యోగుల పెన్షన్ ప్రయోజనాల పరిరక్షణకు పెన్షన్ ట్రస్ట్‌లకు నిర్దేశిత మొత్తాలను నిరీ్ణత సమయంలో ఖచ్చితంగా జమ చేయాలని ఆదేశించాం. ⇒ అవసరం మేరకు బహిరంగ మార్కెట్లో అతి తక్కువ ధరకు దొరికే విద్యుత్‌ను సేకరించేలా చేశాం. తద్వారా 2020–21లో దాదాపు రూ.4,700 కోట్లు ట్రూ డౌన్ చేసి ఆ మొత్తాన్ని చరిత్రలో తొలిసారిగా వినియోగదారులకు బిల్లుల్లో వెనక్కి ఇప్పించాం. మనం రూపొందించిన పునరుద్ధరణీయ ఇంధన విధానం నమూనా నిబంధనలు దేశానికి ఆదర్శమయ్యాయి. వినియోగదారులకు సమాచారంలో పారదర్శకతను పెంచాం. ⇒ గృహ విద్యుత్ వినియోగదారుల మూడు కేటగిరీలని ఒకే గ్రూపు చేయడం ద్వారా బిల్లుల భారం తగ్గించాం. ఆదాయ పన్ను చెల్లింపుదారు అనే నిబంధన తొలగించి ప్రతి రైతును ఉచిత విద్యుత్ కేటగిరీ కిందకు తెచ్చాం. గృహ వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని డిస్కంలు చేసిన సింగల్ పాయింట్ బిల్లింగ్ ప్రతిపాదనలను తిరస్కరించాం. -
బాబు మార్కు ‘షాక్’!
సాక్షి, అమరావతి: జనం భయపడినట్లుగానే జరిగింది. కూటమి ప్రభుత్వం అనుకున్నట్లుగానే చేసింది. ప్రజలపై విద్యుత్ చార్జీల భారం వేయం.. వేయం.. అని చెబుతూనే భారీగా వడ్డిస్తోంది. చార్జీలు పెంచేది లేదని ఎన్నికల ముందు అధికారం కోసం ఇచ్చిన హామీ మేరకు ఈ చార్జీలను ప్రభుత్వమే భరించాలని వినియోగదారులు చేసిన విజ్ఞప్తులను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఇచ్చిన మాట తప్పి ఏకంగా రూ.6,072.86 కోట్ల సర్దు బాటు చార్జీల షాక్ ఇచ్చింది. ప్రతి యూనిట్‌పై గరిష్టంగా రూ.1.58.. 15 నెలల పాటు ప్రజల నుంచి అదనపు చార్జీలు వసూలు చేయనుంది. కూటమి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే ఇంత భారీ స్థాయిలో విద్యుత్ చార్జీలు పెంచడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదిలోనే ఇలా ఉంటే ఇక రానున్న నాలుగున్నరేళ్లు ఎలా ఉంటుందోనని జనం భయపడిపోతున్నారు. చార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని, ప్రజలపై భారం లేకుండా ప్రభుత్వమే భరించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం దిగి రాకపోతే ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి. స్పందించని ప్రభుత్వం ఇంధన, విద్యుత్ కొనుగోలు ఖర్చు సర్దుబాటు (ఎఫ్‌పీపీసీఏ) చార్జీలు రూ.8,113.60 కోట్లు వసూలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి డిస్కంలు ప్రతిపాదించాయి. గృహ విద్యుత్ వినియోగదారుల నుంచి రూ.2,194 కోట్లు, వ్యవసాయ విద్యుత్ సర్విసుల నుంచి రూ.1,901 కోట్లు, పారిశ్రామిక సర్విసుల నుంచి రూ.2,748 కోట్లు, వాణిజ్య సర్విసుల నుంచి రూ.669 కోట్లు, సంస్థల (ఇన్స్టిట్యూషన్స్) నుంచి రూ.547 కోట్లు చొప్పున విద్యుత్ బిల్లుల్లో అదనంగా వసూలు చేసుకుంటామని అడిగాయి. ప్రతి నెల ఒక్కో బిల్లుపైనా యూనిట్‌కు రూ.1.27 చొప్పున వసూలు చేస్తామని తెలిపాయి. ఈ చార్జీల వసూలుకు ఏపీఈఆర్సీ అనుమతి ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వమే 75 శాతం భారం భరించాల్సి ఉంటుందని డిస్కంలు స్పష్టం చేశాయి. డిస్కంల ప్రతిపాదనలపై ఏపీఈఆర్సీ ఈ నెల 18న బహిరంగ విచారణ చేపట్టింది. ప్రభుత్వమే ఈ చార్జీలను భరించాలని, ప్రజలపై వేయడానికి వీల్లేదని ఆ విచారణలో పాల్గొన్న వివిధ వర్గాల ప్రజలు కోరారు. వారం రోజుల పాటు ప్రభుత్వ స్పందన కోసం ఏపీఈఆర్సీ ఎదురు చూసింది. చార్జీలు భరించేందుకు కూటమి సర్కారు నుంచి ఎలాంటి సంకేతాలు రాకపోవడంతో రూ.6,072.86 కోట్ల సర్దుబాటు చార్జీల వసూలుకు అనుమతిస్తూ ఏపీఈఆర్సీ శుక్రవారం తన నిర్ణయాన్ని వెలువరించింది. ఇందులో రైతులు, వివిధ వర్గాల వారికి ఉచితంగా, సబ్సిడీగా ఇచ్చిన విద్యుత్‌పై దాదాపు రూ.1,400 కోట్లు భారం పడనుంది. దానిని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వసూలు చేసుకోవాల్సిందిగా డిస్కంలకు ఏపీఈఆర్సీ సూచించింది. ప్రభుత్వం నుంచి ఆ మేరకు వస్తే మిగిలిన రూ.4,672.86 కోట్లు ప్రజలు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంమీద డిస్కంలు అడిగిన దానిలో రూ.2,042 కోట్లు తక్కువకు అనుమతించామని మండలి తెలిపింది. గతం అంతా షాక్‌ల చరిత్రే » చంద్రబాబు చెప్పేదొకటి.. చేసేది మరొకటి అనేది మరోసారి రుజువైంది. అనవసర విద్యుత్ కొనుగోలు ఒప్పందాల కారణంగా డిస్కంలను అప్పుల పాలు చేసిన చంద్రబాబు పాపాల వల్లే ప్రజలపై చార్జీల భారం పడుతున్నా పట్టించుకోవడం లేదు. ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలను పెంచమని ప్రకటించారు. కానీ ఆ మాట తప్పడానికి ఐదు నెలలు కూడా పట్టలేదు. » చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా విద్యుత్ చార్జీల విషయంలో, విద్యుత్ రంగం విషయంలో ఇలాంటి కుట్రలే చేస్తుంటారు. గతంలో ఏపీఈఆర్సీని తప్పుదోవ పట్టించారు. డిస్కంలు ఇంధన సర్దుబాటు చార్జీలు సమర్పించకుండా అడ్డుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో 2015–16లో 76 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తే రూ.140.10 బిల్లు వచ్చేది. 2018–19కి వచ్చే సరికి ఇదే వినియోగానికి వచ్చిన బిల్లు రూ.197.60. అంటే 41.04 శాతం పెరిగింది. అదే విధంగా 78 యూనిట్లకు 39.57 శాతం, 80 యూనిట్లకు 38.21 శాతం పెంచేశారు. »గృహ విద్యుత్ వినియోగదారుల నుంచి రూ.50 చొప్పున కనీస చార్జీలు వసూలు చేసే విధానం గత టీడీపీ హయాంలో ఉండేది. నెలంతా విద్యుత్ వినియోగించకపోయినా కనీస చార్జీ రూ.50 చెల్లించాల్సి వచ్చేది. సగటు యూనిట్ సేవా వ్యయం కూడా రూ.7.17 వసూలు చేసేది. విద్యుత్ వినియోగాన్ని బట్టి శ్లాబులను మార్చి, అధిక భారం వేసే విధానాన్ని టీడీపీ సర్కారే గతంలో అమలు చేసింది. » అవసరం లేకపోయినా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ)లను అధిక ధరలకు చంద్రబాబు కుదుర్చుకున్నారు. దాదాపు 8 వేల మెగా వాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల విద్యుత్ సంస్థలపై 25 ఏళ్ల పాటు ఏటా అదనంగా రూ.3,500 కోట్ల భారం పడుతోంది. అంతిమంగా అదంతా విద్యుత్ వినియోగదారులపైనే పాతికేళ్లు వేయాల్సి వస్తోంది. -
నమ్మి ఓటేస్తే కరెంట్ షాకులా?
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీల భారం మోపేందుకు రంగం సిద్ధం చేయడంపై ప్రజలు, ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు ) ప్రతిపాదించిన రూ.8,113.60 కోట్ల ఇంధన, విద్యుత్ కొనుగోలు ఖర్చు సర్దుబాటు (ఎఫ్‌పీపీసీఏ) చార్జీల భారంపై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) శుక్రవారం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. కర్నూలులో మండలి ప్రధాన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన బహిరంగ విచారణలో పాల్గొని అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు 12 మంది సాధారణ ప్రజలు, రాజకీయ పార్టీలు, సంస్థల ప్రతినిధులు వివరాలు నమోదు చేసుకున్నారు. తమకు ఓటేసి అధికారంలోకి తెస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని కూటమి నేతలు గాలికి వదిలేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రూ అప్ చార్జీలు వద్దంటూ సీపీఎం నేతలు విద్యుత్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టి ధర్నా నిర్వహించారు. అభ్యంతరాలపై డిస్కమ్‌ల నుంచి ఏపీఈఆర్సీ వివరణ కోరనుంది. సమాధానాలు రాగానే వారం రోజుల్లోగా చార్జీలపై మండలి నిర్ణయం తీసుకుంటుంది.బాబు పాలనంటేనే ’షాక్’లు..టీడీపీ హయాంలో 2015–16లో 76 యూనిట్ల విద్యుత్ వినియోగానికి రూ.140.10 బిల్లు రాగా 2018–19లో రూ.197.60కి పెరిగింది. అంటే 41.04 శాతం పెరిగింది. 78 యూనిట్లకు 39.57 శాతం, 80 యూనిట్లకు 38.21 శాతం పెంచేశారు. గృహ విద్యుత్ వినియోగదారుల నుంచి రూ.50 చొప్పున కనీస చార్జీలు వసూలు చేసే విధానం టీడీపీ హయాంలో అమలైంది. నెలంతా విద్యుత్ వినియోగించకపోయినా కనీస చార్జీ రూ.50 చెల్లించాల్సి వచ్చేది. సగటు యూనిట్ సేవా వ్యయం కూడా రూ.7.17 వసూలు చేశారు. విద్యుత్ వినియోగాన్ని బట్టి శ్లాబులు మార్చి అధిక భారం మోపే విధానాన్ని గతంలో టీడీపీ సర్కారు అమలు చేసింది. అవసరం లేకపోయినా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ)లను నాడు చంద్రబాబు అధిక ధరలకు కుదుర్చుకున్నారు. ఫలితంగా దాదాపు 8 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో విద్యుత్ సంస్థలపై 25 ఏళ్ల పాటు ఏటా అదనంగా రూ.3,500 కోట్ల భారం పడుతోంది. అంతిమంగా అదంతా విద్యుత్ వినియోగదారులపైనే వేస్తున్నారు. అనుమతిస్తే భారం ఇలా..డిస్కమ్‌ల ప్రతిపాదనలకు ఏపీఈఆర్సీ నుంచి ఆమోదం లభిస్తే గృహ విద్యుత్ వినియోగదారులపై రూ.2,194 కోట్లు, వ్యవసాయ విద్యుత్ సర్వీసులపై రూ.1,901 కోట్లు, పారిశ్రామిక సర్వీసులపై రూ.2,748 కోట్లు, వాణిజ్య సర్వీసులపై రూ.669 కోట్లు, ఇన్స్టిట్యూషన్స్పై రూ.547 కోట్లకుపైగా విద్యుత్ బిల్లుల భారం పడనుంది. ప్రతి నెల ఒక్కో బిల్లుపై యూనిట్‌కు రూ.1.27 చొప్పున అదనంగా చార్జీలు వేస్తారు. ఒక వేళ ప్రజలపై భారం మోపేందుకు ఏపీఈఆర్సీ అనుమతించకుంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.8,113.60 కోట్లలో 75 శాతం భరించాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదని, ప్రజలపైనే ఆ భారాన్ని మోపాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.ట్రూ అప్ చార్జీల వడ్డనపై ఏపీఈఆర్సీలో విచారణ సర్దుబాటు పేరుతో రూ.8,114 కోట్ల బాదుడుపై నివేదిక సిద్ధం చేసిన డిస్కమ్‌లు కర్నూలు(సెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు పేరుతో విద్యుత్ చార్జీల వడ్డనపై ఏపీ డిస్కంలు సిద్ధం చేసిన నివేదికపై వచి్చన అభ్యంతరాలపై ఏపీఈఆర్సీ (ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగులేటరీ కమిషన్)లో విచారణ జరిగింది. శుక్రవారం కర్నూలులోని ఏపీఈఆర్సీ కార్యాలయంలో మొదటిసారి ఇంధన సర్దుబాటు చార్జీలపై చైర్మన్ నాగార్జునరెడ్డి అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ అభ్యంతరాలు/సలహాలు స్వీకరించారు. ఇటీవల డిస్కమ్‌లు రూ.8,114 కోట్ల ఇంధన సర్దుబాటు చేయాలని ఏపీఈఆర్సీకి నివేదించాయి. ఈ క్రమంలో వచి్చన అభ్యంతరాలు, సలహాలపై విచారణ జరిగింది. దాదాపు 14 సంస్థలు / మంది అభ్యంతరాలు, సలహాలు ఇచ్చారు. త్వరలోనే ఇంధన సర్దుబాటు చార్జీలపై ఈఆర్సీ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. -
డిస్కంలు చెప్పాయి.. ఈఆర్సీ నిర్ణయించింది
సాక్షి, అమరావతి: ఐదేళ్ల కాలానికి టారిఫ్ నిర్ణయంలో పునరుత్పాదక ఇంధన రంగంలోని పరిశ్రమలకు ఊరట లభించలేదు. విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు చెప్పిన దాని ప్రకారమే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆ టారిఫ్ని నిర్ణయించింది. 2024–25 ఆర్థిక సంవత్సరం నుంచి 2028–29 ఆర్థిక సంవత్సరం వరకు బయోమాస్, పారిశ్రామిక వ్యర్థాలు, బగాస్సే(చెరకు పిప్పి) విద్యుత్ ఉత్పత్తి పరిశ్రమల ఖర్చుల ఆధారంగా ఏపీఈఆర్సీ ధరలను సమీక్షించింది. రాష్ట్రంలో ఇలాంటి పరిశ్రమలు 26 ఉన్నాయి. వీటిలో పారిశ్రామిక వ్యర్థాల నుంచి 40.965 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. బయోమాస్ బేస్డ్ పరిశ్రమల నుంచి 171.25 మెగావాట్లు, బగాస్సే పరిశ్రమల నుంచి 206.95 మెగావాట్లు చొప్పున విద్యుత్ వస్తోంది. వీటికి గతంతో 2019–20 నుంచి 2023–24 వరకు నిర్ణయించిన టారిఫ్ ప్రస్తుతం అమలులో ఉంది. టారిఫ్‌ను నిర్ణయించినప్పుడే వార్షిక ఇంధన ధర 5 శాతం పెరుగుదలతో లెక్కిస్తారు. ఈ లెక్కన 2023–24కి ఇంధన ధరలు బయోమాస్, పారిశ్రామిక వ్యర్థాల యూనిట్‌కు రూ. 5.80, బగాస్సేకి యూనిట్ రూ. 3.82 చొప్పున అమలు చేస్తున్నారు. తాము ప్రతిపాదించిన ధరలను ఆమోదించాలని లేదా 2023–24కి ఆమోదించిన అదే ధరలను కొనసాగించాలని డిస్కంలు మండలిని కోరాయి. పరిశ్రమల నిర్వాహకులు ఇంకా ఏవైనా సూచనలు, సలహాలు, అభ్యంతరాలను వెల్లడించాలనుకుంటే దానికి కూడా కమిషన్ అవకాశం కల్పించింది. కరోనా వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని, దానికి తోడు డీజిల్ ధరలు భారీగా పెరిగినందున ఖర్చులు విపరీతంగా ఉన్నాయని పరిశ్రమల నిర్వాహకులు ఏపీఈఆర్సీకి మొరపెట్టుకున్నారు. తాము కోలుకోవాలంటే యూనిట్ విద్యుత్‌ను కనీసం రూ. 8 నుంచి రూ. 15కు విక్రయించేలా అనుమతించాలని కోరారు. కానీ దానికి డిస్కంలు అంగీకరించలేదు. దీంతో దాదాపుగా డిస్కంలు చేసిన ప్రతిపాదనలకే 2024–29 నియంత్రణ కాలానికి ఏపీఈఆర్సీ అంగీకారం తెలిపింది. -
ఆ లెక్కలూ చెప్పాల్సిందే
సాక్షి, అమరావతి: విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) చేసే కొనుగోళ్ల విషయంలో ఇకపై అత్యంత కఠిన నిబంధనలను అమలు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) స్పష్టం చేసింది. ఇన్నాళ్లూ డిస్కంలు తాము పరికరాలను కొనే ముందు, లేదా ఆ తర్వాత టెండర్ వివరాలను ఏపీఈఆర్సీకి పంపిస్తున్నాయి. కానీ ఆ టెండర్‌తో కొంటున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, వైర్లు, ఇతర సామాగ్రి వంటి ధరలను విడివిడిగా వెల్లడించడం లేదు. ఇకపై ప్రతి పరికరానికి సంబంధించి ధరల జాబితాను మండలికి సమర్పించి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు విద్యుత్ పంపిణీ, సేకరణ, ప్రసార ప్రణాళికలపై ఏపీఈఆర్సీ తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది. కాగా 2024–25 నుంచి 2028–29 (5వ నియంత్రణ కాలం) వరకూ, 2029–30 నుంచి 2033–34 (6వ నియంత్రణ కాలం) వరకూ విద్యుత్ ప్రణాళికలను డిస్కంలు, ఏపీ ట్రాన్స్‌కో ఏపీఈఆర్సీకి సమర్పించాయి. వాటిపై విచారణ జరిపిన మండలి ప్రతిపాదనల్లో చాలావరకు తిరస్కరించింది. కొన్నిటికి మాత్రమే అనుమతినిచ్చింది. మరికొన్నిటిపై మరింత సమాచారం కావాలని అడిగింది. అందులో వ్యవసాయానికి స్మార్ట్ మీటర్ల అంశం ఒకటి. రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ స్కీమ్ (ఆర్డీఎస్ఎస్) కింద స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, ఫీడర్ల విభజన పనులకు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్లు అందిస్తుంది. అలాగే వినియోగదారులకు స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లను ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీఈఆర్సీ ఆమోదం తెలిపింది. అదీగాక ఇందుకు అయ్యే ఖర్చును డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా ప్రభుత్వమే భరిస్తుండటంతో ఈ ప్రాజెక్టుకు ఏపీఈఆర్సీ ఎలాంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేయలేదు. అలాగే జగనన్న కాలనీల విద్యుద్దీకరణకు ఇప్పటికే ఆమోదం తెలిపింది. అయితే, తాను ఆమోదించిన విలువల కంటే డిస్కంలు లెక్కల్లో చూపించిన వ్యయం ఎక్కువ అని గుర్తించిన ఏపీఈఆర్సీ తాజా ఆర్డర్లో గతంలో ఆమోదించిన విలువలకే ఓకే చెప్పింది. అలాగే విద్యుత్ కొనుగోళ్ల అంచనాలపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉన్నందున.. దానికి సంబంధించిన ప్రతిపాదనలన్నిటినీ తిరస్కరించింది. -
మరింత చేరువగా గ్రీన్ ఎనర్జీ
సాక్షి, అమరావతి: పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఏపీఈఆర్సీ కొత్త మార్గదర్శకాలను తీసుకువచ్చింది. సౌర, పవన, జల విద్యుత్ వంటి గ్రీన్ ఎనర్జీని వినియోగదారులకు మరింత చేరువ చేసేందుకు, ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు, విద్యుత్ చట్టంలో మార్పులు చేస్తూ గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్, చార్జీలు, బ్యాంకింగ్ నిబంధనలను ఏపీఈఆర్సీ ‘నియంత్రణ’ పేరుతో రూపొందించింది. గతేడాది డ్రాఫ్ట్ రూపంలో తీసుకువచ్చి, ప్రజాభిప్రాయ సేకరణ తీసుకున్న ఏపీఈఆర్సీ... వీటికి ఆమోదం తెలిపింది. దేశంలో 2070కి కర్భన ఉద్గారాలను నెట్‌జీరో స్థాయికి తీసుకురావాలని, ఇందుకోసం 2030కి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని నెలకొల్పాలన్న కేంద్రం లక్ష్యానికి కూడా ఈ నిబంధనలు దోహదపడతాయని ఏపీఈఆర్సీ పేర్కొంది. రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ఓపెన్ యాక్సెస్ చేయడానికి, ఇంట్రా–స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్‌లు, డిస్కంలకు ఈ ‘నియంత్రణ’ వర్తిస్తుంది.ఇవీ నిబంధనలు... » గ్రీన్ ఎనర్జీ నూతన నిబంధనల ప్రకారం ఓపెన్ యాక్సెస్‌ను పొందడానికి దివాలా తీసిన, డిస్కంలకు రెండు నెలలు కంటే ఎక్కువకాలం బకాయిలు ఉన్న, అనధికారికంగా విద్యుత్ వినియోగం, విద్యుత్ దొంగతనం కేసు పెండింగ్‌లో ఉన్న సంస్థలకు అర్హత లేదు. » అర్హులైన వారికి స్వల్పకాలిక గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్‌ను మంజూరు చేయడానికి (ఏపీఎస్‌ఎల్‌డీసీ) నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది. » దీర్ఘకాలిక, మధ్యకాలిక గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ మంజూరు కోసం ఏపీ ట్రాన్స్‌కో నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్‌కు అన్ని దరఖాస్తులు నేరుగా రాష్ట్ర నోడల్ ఏజెన్సీలకు సింగిల్ విండో ద్వారా వెళతాయి.» సెంట్రల్ నోడల్ ఏజెన్సీ పోర్టల్‌లో గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్‌కు సంబంధించిన మొత్తం çసమాచారం ప్రజలకు అందుబాటులో ఉంటుంది. అన్ని కొత్త గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి సంస్థలు(జనరేటర్ల)కు కనెక్టివిటీ మంజూరు చేస్తారు.» ప్రస్తుతం ఉన్న వినియోగదారులు, ఉత్తత్పి సంస్థలు, ఒప్పందాలు, ప్రభుత్వ విధానం ప్రకారం ఓపెన్ యాక్సెస్‌ను పొందడం కొనసాగించవచ్చు. వారికి సంబంధిత ఒప్పందాల్లో పేర్కొన్న విధంగానే చార్జీలు వర్తిస్తాయి.» గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ కోసం ట్రాన్స్మిషన్ చార్జీలు, వీలింగ్, క్రాస్ సబ్సిడీ సర్‌చార్జీలు, స్టాండ్‌బై చార్జీలు, బ్యాంకింగ్, రియాక్టివ్ ఎనర్జీ చార్జీలను నిబంధనల మేరకు విధిస్తారు.» 2032 డిసెంబర్ లోగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పి, ఓపెన్ యాక్సెస్‌లో వినియోగదారులకు సరఫరా చేసే ఆఫ్‌షోర్ విండ్ ప్రాజెక్ట్‌ల నుంచి జరిగే విద్యుత్ ఉత్పత్తికి అదనపు సర్‌చార్జ్ వర్తించదు. దీర్ఘకాలిక, మధ్యస్థ కాలవ్యవధిలో గ్రీన్ ఎనర్జీ ఓపెన్ యాక్సెస్ కోసం ప్రాసెసింగ్ ఫీజు రూ.లక్ష కాగా, స్వల్పకాలానికి రూ.25 వేలు కడితే సరిపోతుంది. బ్యాంకింగ్ నెలవారీ బిల్లింగ్ సైకిల్ ఆధారంగా ఉండాలి. -
‘సెకీ’ ఒప్పందానికి ‘ఏపీఈఆర్సీ’ గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వ్యవసాయానికి నిరంతరం ఉచిత విద్యుత్‌ను సరఫరా చేయడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ)తో చేసుకున్న త్రైపాక్షిక (ట్రై పార్టీ) ఒప్పందానికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆమోదం తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్ నుంచి 3 వేల మెగావాట్లు, 2025 అక్టోబర్ నుంచి మరో 3 వేల మెగావాట్లు, 2026 అక్టోబర్ నుంచి మరో వెయ్యి మెగావాట్లు చొప్పున సెకీ నుంచి మూడు విడతల్లో మొత్తం 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం, మూడు డిస్కంలు 2021 డిసెంబర్ 1న ఈ ఒప్పందం చేసుకున్నాయి. సోలార్ పవర్ డెవలపర్లు రాజస్థాన్‌లో ఏర్పాటు చేస్తున్న యూనిట్ల నుంచి ఈ విద్యుత్ సేకరణ కోసం లెవలైజ్డ్ టారిఫ్ 25 సంవత్సరాలకు ట్రేడింగ్ మార్జిన్‌తో సహా యూనిట్‌కు రూ.2.49 చొప్పున చెల్లించేందుకు కూడా ఏపీఈఆర్సీ ఆమోదం తెలిపింది. ఈ సేకరణ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. దీంతో రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా కోసం సెకీ ద్వారా సౌర విద్యుత్ కొనుగోలుకు చట్టబద్ధంగా అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయి. ఒప్పందంతో ప్రయోజనాలు ఇలా రాత్రనక, పగలనకా రైతులు పొలాల్లో విద్యుత్ కోసం పడిగాపులు కాస్తూ, ప్రాణాలు పోగొట్టుకున్న చీకటి రోజుల నుంచి విముక్తి కలిగిస్తూ పగటిపూటే నిరంతరాయంగా తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్ అందిస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. వ్యవసాయానికి విద్యుత్‌ను తమ హక్కుగా రైతులు భావించేలా చర్యలు చేపడుతూ, రానున్న 30 ఏళ్లలో అన్నదాతలకు ఎలాంటి విద్యుత్ కష్టాలు లేకుండా చేయడం కోసం సౌర విద్యుత్‌ను సమకూరుస్తోంది. ప్రైవేటు వ్యక్తుల నుంచి కాకుండా, వంద శాతం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, ‘ఏఏఏ’ రేటింగ్ కలిగిన సెకీ నుంచి 7 వేల మెగావాట్లు తీసుకుని 2024 నుండి దాదాపు 19 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు పగటిపూట 9 గంటల పాటు విద్యుత్ అందించాలని సంకల్పించింది. ఇందుకోసం ప్రత్యేక డిస్కమ్ రూరల్ అగ్రికల్చర్ పవర్ లిమిటెడ్ ద్వారా ఈ విద్యుత్తు అందించాలని నిర్ణయించింది. సెకీ నుంచి విద్యుత్ తీసుకోవడం వల్ల 25 సంవత్సరాల పాటు ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ చార్జీల నుంచి మినహాయింపు వస్తోంది. అదే రాష్ట్రంలోని యూనిట్ల నుంచి విద్యుత్తు తీసుకొంటే సెంట్రల్ గ్రిడ్ ఛార్జీలు 25 సంవత్సరాలు చెల్లించాల్సి వచ్చేది. రాష్ట్రంలోనే సౌర ప్రాజెక్టులు కడితే వాటికి విద్యుత్ లైన్లు, అంతర్గతంగా విద్యుత్ ప్రసార వ్యవస్థ బలోపేతానికి అయ్యే ఖర్చు, బయటి రాష్ట్రం నుంచి నేరుగా సౌర విద్యుత్ తీసుకున్నప్పుడు దానికి కావలసిన అంతర్గత వ్యవస్థకు అయ్యే ఖర్చుల మధ్య తేడా ఉంటుంది. ప్రాథమికంగా ఇప్పుడు ఉన్న అంతర్రాష్ట్ర, అంతర్గత రాష్ట్ర విద్యుత్ ప్రసార వ్యవస్థల సామర్ధ్యాన్ని బేరీజు వేసుకుంటే బయటి రాష్ట్రాల నుంచి సౌర విద్యుత్ తీసుకున్నప్పుడే ఖర్చు తక్కువ అవుతుంది. అందుకే తొలుత రాష్ట్రంలోనే సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు పెట్టాలనుకున్నప్పటికీ, ఆ ప్రతిపాదన విరమించుకొని సెకీ ప్రతిపాదనకు మంత్రి మండలి కూడా ఆమోదం తెలిపింది. -
జూన్ నుంచి కర్నూలులోనే ‘ఏపీఈఆర్సీ’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ప్రధాన కార్యాలయం కార్యకలాపాలు జూన్ 1వ తేదీ నుంచి కర్నూలు జిల్లాలో ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంసిద్ధంగా ఉండాలంటూ ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టీస్ సీవీ నాగార్జునరెడ్డి బుధవారం సిబ్బందికి ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్ కేంద్రంగా 1999 మార్చిలో ఏపీఈఆర్సీ ఏర్పడింది. రాష్ట్ర విభజన తరువాత ఏపీఈఆర్సీని అమరావతి ప్రాంతానికి తరలిస్తూ 2014 ఆగస్టులో ఆదేశాలు జారీ అయ్యాయి. అయినా మండలి మాత్రం హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తోంది. ఆ తర్వాత విశాఖలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసి, అక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఏపీఈఆర్సీ ప్రధాన కార్యాలయం కర్నూలులో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఆగస్టు 25న నోటిఫికేషన్ విడుదల చేశారు. అనంతరం అక్కడ భవన నిర్మాణం మొదలైంది. ఈ భవనం జూన్ నెలకల్లా అందుబాటులోకి వస్తుండటంతో ప్రధాన కార్యాలయాన్ని అక్కడికి తరలించాలని నిర్ణయించారు. హైదరాబాద్ నుంచి కర్నూలుకు తరలించేందుకు ఫైళ్లు, ఇతర సామగ్రిని సిద్ధం చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులు నివాసాన్ని కర్నూలుకు మార్చుకోవాలని, వసతి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. అందుకు స్థానికంగా ముగ్గురు డిప్యూటీ ఎలక్ట్రికల్ ఇంజనీర్ స్థాయి అధికారుల సహాయాన్ని తీసుకోవాలని సూచించింది. వారి ఫోన్ నంబర్లను కూడా సిబ్బందికి ఇచి్చంది. మూడు ప్రాంతాల్లోనూ మండలి పని కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉండేలా విశాఖలో ఇప్పటికే ఏపీఈఆర్సీ క్యాంపు కార్యాలయం ఉంది. అంతకు ముందు ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో వార్షిక టారిఫ్ ఆర్డర్ (విద్యుత్ చార్జీల సవరణ)పై ప్రజాభిప్రాయ సేకరణ, ఆర్డర్ విడుదల, బహిరంగ విచారణ వంటివి నిర్వహించేవారు. ఇటీవల 2024–25 ఏడాదికి టారిఫ్ ఆర్డర్‌ను విజయవాడలో ఏపీఈఆర్సీ విడుదల చేసింది. ఈ విధంగా మూడు ప్రాంతాల్లోనూ మండలి విస్తరిస్తోంది. -
విద్యుత్ చార్జీల పెంపుపై విశాఖలో ప్రజాభిప్రాయ సేకరణ
-
కరెంటు చార్జీలు పెరగవు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో విద్యుత్తు వినియోగదారులకు వరుసగా రెండో ఏడాదీ శుభవార్త! 2024–25లో వినియోగదారులపై ఎలాంటి విద్యుత్తు భారం పడకుండా డిస్కమ్‌లు ప్రతిపాదనలు సిద్ధం చేశాయి. రాబడి, వ్యయాలు సమానంగా ఉన్నందున సాధారణ ప్రజలతో పాటు పారిశ్రామిక వర్గాలపై ఎలాంటి భారం లేకుండా పాత టారిఫ్‌లనే కొనసాగిస్తున్నట్లు మూడు డిస్కమ్‌లు తెలిపాయి. సోమవారం విశాఖపట్నంలోని ఏపీ ఈపీడీసీఎల్ కార్యాలయంలో ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, సభ్యులు ఠాకూర్ రామ్‌సింగ్, పీవీఆర్ రెడ్డి నేతృత్వంలో బహిరంగ వర్చువల్ విచారణ మొదలైంది. ప్రజాభిప్రాయ సేకరణలో ఏపీఈఆర్సీ అధికారులతో పాటు ఇంధనశాఖ, ట్రాన్స్‌కో, జెన్కో, ఈపీడీసీఎల్, సీపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విద్యుత్ సంస్థల ప్రతిపాదనలకు సంబంధించి తొలిరోజు 17 మంది అభిప్రాయాలు తెలియచేశారు. కార్యక్రమంలో ఏపీఈఆర్సీ సెక్రటరీ డి.రమణయ్యశెట్టి, విద్యుత్ పంపిణీ సంస్థల డైరెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మన డిస్కమ్‌లకు ‘ఏ’ గ్రేడ్: జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, ఏపీఈఆర్సీ చైర్మన్ వినియోగదారులకు మేలు చేసేలా కమిషన్ పారదర్శకంగా వ్యవహరిస్తోంది. ప్రతి డిస్కమ్‌లో వినియోగదారుల సేవలకు సంబంధించి ప్రత్యేక అధికారులను నియమించాం. దేశవ్యాప్తంగా 2022–23 వినియోగదారుల సేవల్లో ఏడు డిస్కమ్‌లకు ఏ గ్రేడ్ రేటింగ్ రాగా అందులో మూడు ఏపీకి చెందిన డిస్కమ్‌లే కావడం గర్వకారణం. రాష్ట్రంలో దాదాపు 1.8 కోట్ల వినియోగదారులకు సంబంధించి కేవలం 220 ఫిర్యాదులు మాత్రమే పరిశీలనలో ఉన్నాయి. డిస్కమ్‌లకు 50 శాతం పునరుత్పాదక శక్తి సామర్థ్యం ఉండగా అధిక భాగం సౌర, పవన విద్యుత్ ప్లాంట్ల ద్వారా సమకూరుతోంది. కోవిడ్ తర్వాత మార్కెట్ ధరలు అసాధారణంగా పెరిగాయి. కొన్నిసార్లు యూనిట్ రూ.10 సీలింగ్ రేట్‌కు కూడా విద్యుత్ లభ్యత లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. గతేడాది యూనిట్ రూ.16 సీలింగ్ రేటుగా విక్రయించిన సందర్భాలున్నాయి. డిస్కమ్‌లకు చెల్లింపులను హేతుబద్ధం చేస్తూ మూతపడిన పరిశ్రమల పునరుద్ధరణ పాలసీని ఆమోదించాం. ప్రతి అభ్యంతరాన్ని పరిగణలోకి తీసుకుంటూ వినియోగదారులకు పూర్తి పారదర్శంగా సేవలందించేందుకు ఈఆర్సీ నిరంతరం శ్రమిస్తోంది. వినియోగదారులపై భారం లేదు: పృథ్వీతేజ్ ఇమ్మడి, ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ ఈపీడీసీఎల్ పరిధిలో 2017–18లో 18,351 మిలియన్ యూనిట్లు విద్యుత్ అమ్మకాలు జరగగా ప్రస్తుతం 27,864 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. 2017–18లో పంపిణీ నష్టాలు 6.70 శాతం ఉండగా ప్రస్తుతం 5.31 శాతానికి తగ్గాయి. సమగ్ర ఆదాయ ఆవశ్యకత రూ.21,161.86 కోట్లుగా అంచనా వేశాం. గృహ, వాణిజ్య, పరిశ్రమలు, వ్యవసాయ, ఇతర వినియోగదారులపై భారం మోపకుండా ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ఎలక్ట్రిక్ వాహనాలు, చార్జింగ్ స్టేషన్లకు ప్రస్తుతం ఉన్న స్టేషన్ల నిర్వహణ రాయితీని ఎత్తివేయాలని, రైల్వేకు అందిస్తున్న విద్యుత్ చార్జీలపై యూనిట్‌కు రూ.1 చొప్పున పెంచాలని నిర్ణయించాం. గ్రీన్ పవర్ టారిఫ్ ప్రీమియం అన్ని కేటగిరీల వినియోగదారులకు 75 పైసల నుంచి రూపాయికి పెంచేందుకు అనుమతివ్వాలని ప్రతిపాదించాం. దీని ద్వారా రూ.వంద కోట్ల ఆదాయం సమకూరనుంది. మొత్తంగా 2023–24లో ఆమోదించిన టారిఫ్ ధరలనే వచ్చే ఏడాదీ అమలు చేస్తాం. 2024–25లో ఏపీఈపీడీసీఎల్ ఆదాయ అంతరాల అంచనా ► ప్రస్తుత ధరల నుంచి ఆదాయం రూ.17,854.16 కోట్లు ► ప్రతిపాదిత ధరల నుంచి ఆదాయం రూ.100.44 కోట్లు ► ప్రతిపాదిత ఫుల్ కాస్ట్ రికవరీ నుంచి ఆదాయం– రూ.3207.27 కోట్లు ► మొత్తం ఆదాయం – రూ.21,161.86 కోట్లు ► సమగ్ర అంచనా వ్యయం– రూ.21,161.86 కోట్లు ► ప్రస్తుత ధరల వద్ద లోటు సున్నా. పాత టారిఫ్‌లే: కె.సంతోషరావు, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ ఎస్పీడీసీఎల్ పరిధిలో పంపిణీ నష్టాలను 26.84 శాతం నుంచి గతేడాది నవంబర్ నాటికి 8.21 శాతం తగ్గించాం. ప్రభుత్వం అందిస్తున్న టారిఫ్ సబ్సిడీ 2004–05లో రూ.334 కోట్లు నుంచి 2023–24లో రూ.5195.98 కోట్లకు పెరిగింది. నవరత్నాల పథకంలో భాగంగా వ్యవసాయ, ఆక్వా రైతులు, బడుగు బలహీనవర్గాలకు చెందిన 19,26,467 మంది వినియోగదారులకు రూ.4,605.31 కోట్లను రాయితీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ప్రస్తుతం ఉన్న రిటైల్ టారిఫ్ షెడ్యూల్‌ని 2024–25లోనూ కొనసాగిస్తాం. రెండు మూడు స్వల్ప మార్పులున్నా అవి గృహ, వాణిజ్య, పారిశ్రామిక, ఇతర వినియోగదారులపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం లేదు. 2024–25 ఏపీఎస్పీడీసీఎల్ ఆదాయ అంతరాల అంచనా ► ప్రస్తుత ధరల నుంచి ఆదాయం – రూ.15,175.75 కోట్లు ► ప్రతిపాదిత ధరల నుంచి ఆదాయం– రూ.7521.03 కోట్లు ► క్రాస్ సబ్సిడీ సర్‌చార్జ్ నుంచి రాబడి – రూ.142.46 కోట్లు ► ఆర్ఈసీ నుంచి ఆదాయం– రూ.20 కోట్లు ► మొత్తం ఆదాయం – రూ.22,859.24 కోట్లు ► సమగ్ర ఆదాయ ఆవశ్యకత – రూ.22859.24 కోట్లు ► ప్రస్తుత ధరల వద్ద లోటు, మిగులు– సున్నా భారం లేకుండా ప్రతిపాదనలు: కె.సంతోషరావు, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం డిస్కమ్ పరిధిలో కొత్తగా రూ.172 కోట్లతో 33/11 కేవీ సబ్స్టేషన్లు 54 వరకూ నిర్మాణ పనులు చేపట్టగా 43 సబ్స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి. హెచ్‌వీడీఎస్ పథకం ద్వారా డిస్కమ్ పరిధిలోని మూడు జిల్లాల్లో రూ.1696.59 కోట్లతో విద్యుత్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నాం. గృహ, వాణిజ్య, పరిశ్రమలు, వ్యవసాయ, ఇతర వినియోగదారులపై భారం లేకుండా ప్రతిపాదనలు రూపొందించాం. 2024–25 ఏపీసీపీడీసీఎల్ ఆదాయ అంతరాల అంచనా ప్రస్తుత ధరల నుంచి ఆదాయం – రూ.9090.61 కోట్లు టారిఫ్ కాని ఆదాయం – రూన.392.52 కోట్లు క్రాస్ సబ్సిడీ సర్‌చార్జ్ నుంచి రాబడి – రూ.21.53 కోట్లు ప్రతిపాదిత టారిఫ్ ద్వారా ఆదాయం అంచనా– రూ.50.73 కోట్లు ఫుల్‌కాస్ట్ రికవరీ టారిఫ్ నుంచి ఆదాయం– రూ.2996.53 కోట్లు ప్రస్తుత టారిఫ్ వద్ద రెవిన్యూ లోటు– రూ. –3047.26 కోట్లు సమగ్ర ఆదాయ ఆవశ్యకత – రూ.12,551.92 కోట్లు ప్రస్తుత ధరల వద్ద లోటు, మిగులు– సున్నా ► రూ.15,729 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు: కేవీఎన్ చక్రధర్‌బాబు, ఏపీ జెన్కో ఎండీ, ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ మూడు డిస్కమ్‌ల పరిధిలో ఏపీ ట్రాన్స్‌కో నాలుగో నియంత్రణ కాలంలో మంచి విజయాలను నమోదు చేసింది. 2018–19లో 3.10 శాతం సరఫరా నష్టాలుండగా 2023–24 నాటికి 2.75 శాతానికి తగ్గింది. వచ్చే ఐదేళ్లలో ట్రాన్స్మిషన్ సిస్టమ్ లభ్యత 99.70 శాతంగా నిర్దేశించుకున్నాం. ఈ ఐదేళ్ల కాలంలో ఉత్తమ ట్రాన్స్మిషన్ యుటిలిటీ అవార్డు, ఫాల్కన్ మీడియా, ఎనర్జియా ఫౌండేషన్ నేషనల్ అవార్డు 2023 ద్వారా టాప్ స్టేట్ యుటిలిటీ అవార్డు సొంతం చేసుకున్నాం. రాబోయే ఐదేళ్లలో మూడు డిస్కమ్‌ల పరిధిలో 400 కేవీ సబ్స్టేషన్లు 7, 220 కేవీ సబ్స్టేషన్లు 23, 132 కేవీ సబ్స్టేషన్లు 41 నిర్మించాలని నిర్ణయించాం. దశలవారీగా ట్రాన్స్మిషన్ నష్టాలను తగ్గించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం. రానున్న ఐదేళ్లకు గాను రూ.15,729.4 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు తయారు చేశాం. -
‘థర్మల్’ వెలుగులు
సాక్షి, అమరావతి: దేశంలో కర్బన ఉద్గారాలను 2070 నాటికి సున్నా స్థాయికి తీసుకురావాలనే లక్ష్యంలో భాగంగా రానున్న కాలంలో పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచుకుని.. థర్మల్ విద్యుత్‌ను తగ్గించుకోవాలని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కొన్ని నెలల క్రితం అన్ని రాష్ట్రాలకూ ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ జెన్కో) థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో రిజర్వు షట్ డౌన్ (ఉత్పత్తి తగ్గింపు)పై విధివిధానాలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) కూడా ప్రకటించింది. పూర్తిగా మూసేయాల్సిన అవసరం లేదని, గ్రిడ్‌కు ప్రమాదం వాటిల్లే పరిస్థితి వస్తే అప్పుడు థర్మల్ యూనిట్లు షట్‌డౌన్ చేయవచ్చని ఏపీ ఈఆర్సీ స్పష్టం చేసింది. వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా అకస్మాత్తుగా విద్యుత్ డిమాండ్ పడిపోయినప్పుడు కూడా ఉత్పత్తి తగ్గించవచ్చని పేర్కొంది. తక్కువ ధరకు విద్యుత్ అందించే ఉత్పత్తి సంస్థలకు మొదట ప్రాధాన్యం ఇచ్చేలా కొన్ని యూనిట్లను రిజర్వు షట్ డౌన్ చేసే వెసులుబాటు కల్పించింది. దీంతో రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ సామర్థ్యాన్ని అత్యవసరంగా తగ్గించాల్సిన ఆవçశ్యకత రాలేదు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఇబ్రహీంపట్నంలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్)లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల సూపర్ క్రిటికల్ థర్మల్ యూనిట్ ఈ నెల 20న వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించింది. 2024లో 17 థర్మల్ ప్లాంట్లు భవిష్యత్‌లో పెరుగనున్న విద్యుత్ డిమాండ్‌ను తట్టుకోవాలంటే పునరుత్పాదక ఇంధనంతో పాటు శిలాజ ఇంధన ఉత్పత్తిపైనా దృష్టి సారించాల్సిందేనని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా గుర్తించాయి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఒకడుగు ముందే ఉంది. ఇప్పటికే సోలార్, విండ్, హైడల్ కలిపి ఉండే పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లకు శ్రీకారం చుట్టింది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌లో రూ.9.57 లక్షల కోట్ల విలువైన ఇంధన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇంధన రంగంలో ఏపీ చర్యలను ఇప్పటికే అనేక పర్యాయాలు ప్రశంసించిన కేంద్రం రాష్ట్రం బాటలోనే నిర్ణయాలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా భారీగా బొగ్గు ఆధారిత ప్లాంట్ల నిర్మాణం చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. 2024లో దేశంలో రోజువారీ విద్యుత్ డిమాండ్ 256 గిగావాట్లకంటే ఎక్కువ ఉంటుందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) నివేదిక అంచనా వేసింది. 2031–32కి ఇది 366.39 గిగావాట్లకు పెరుగుతుందని చెప్పింది. 2041–42కి 574.68 గిగావాట్లకు పెరగొచ్చనే అంచనాతో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంపు అనివార్యమైంది. దీంతో 2024లో 17 గిగావాట్ల సామర్థ్యం గల థర్మల్ ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రారంభించాలని, తర్వాత మరో 33 గిగావాట్ల ప్లాంట్ల నిర్మాణం చేపట్టాలని ప్రణాళిక రూపొందించింది. ఇలా దాదాపు రూ.7.28 లక్షల కోట్ల పెట్టుబడితో 91 థర్మల్ ప్లాంట్లు స్థాపించాలని యోచిస్తున్నట్టు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలోనే ఆదర్శంగా ఏపీ ఏపీ గ్రిడ్ డిమాండ్ గతేడాది రోజుకు 190 మిలియన్ యూనిట్ల నుంచి 200 మిలియన్ యూనిట్లు ఉండగా.. ఈ ఏడాది 220 నుంచి 245 మిలియన్ యూనిట్లు రికార్డయ్యింది. అయినప్పటికీ విద్యుత్ కొరత లేకుండా సరఫరా చేయడంలో థర్మల్ కేంద్రాలు కీలక భూమిక పోషించాయి. ఎన్టీటీపీఎస్ ఆపరేషన్, మెయింటెనెన్స్ యూనిట్ల లభ్యత శాతం 2022–23 ఆర్థిక సంవత్సరంలో 69.90 శాతం ఉంటే.. ఈ ఏడాదిలో 75.83 శాతానికి పెరిగింది. అలాగే గతేడాది ఎన్టీపీఎస్ స్టేజ్–4 యూనిట్ హీట్ రేట్ 2,517 కిలో వాట్ అవర్ నుంచి 2,436 తగ్గింది. అదేవిధంగా 2022–23లో ఎంవీఆర్ ఆర్టీపీపీ స్టేషన్ యూనిట్ల లభ్యత 67.85 శాతం నుంచి 75.68 శాతానికి మెరుగుపడింది. అంతేకాకుండా ఈ ఆర్థిక సంవత్సరంలో దేశంలోనే అత్యుత్తమ థర్మల్ ప్లాంట్‌గా ఆర్టీపీపీ గుర్తింపు పొందింది. ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీ జెన్కో) తన అనుబంధ సంస్థ ఆంధ్రప్రదేశ్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ పీడీసీఎల్)తో కలిసి థర్మల్ విద్యుత్ కేంద్రాలు నిర్వహిస్తోంది. వీటిలో సామర్థ్యాన్ని మించి దాదాపు 10 మెగావాట్ల అధిక విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. రాష్ట్ర గ్రిడ్ అవసరాలను సాధ్యమైనంత ఎక్కువగా తీర్చాలనే లక్ష్యంతో ఏపీ జెన్కో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతూ వస్తోంది. అందులో భాగంగానే కృష్ణపఛిట్నంలోని దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఈ ఏడాది మార్చి 10న 800 మెగావాట్ల యూనిట్ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైంది. తాజాగా ఎన్టీటీపీఎస్లో 8వ యూనిట్ సీవోడీతో జెన్కో థర్మల్ విద్యుత్ ఉత్పాదన సామర్థ్యం 5,810 మెగావాట్ల నుంచి 6,610 మెగావాట్లకు పెరిగింది. -
Fact Check: కరెంటుపై ‘కట్టు’ కథ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు అన్ని విధాలుగా మేలు చేస్తూ సంక్షేమం, అభివృద్ధి సమ్మిళితంగా పరిపాలన అందిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురద జల్లడం, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా ఈనాడు మరో తప్పుడు కథనాన్ని అచ్చేసింది. ఇంధన సర్దుబాటు చార్జీ అంటే వినియోగదారులకు సంబంధం లేని ఖర్చు అన్నట్లు.., అయినా రూ.7,200 కోట్ల ట్రూ అప్ చార్జీలను వసూలు చేసేందుకు డిస్కంలు సిద్ధమైపోయినట్లు కుట్రకు తెరలేపింది. యూనిట్‌కు మరో రూ.1.10 పైసలు ట్రూ అప్ చార్జీ అదనంగా పెరగనుందంటూ గురువారం ఓ ఊహాజనిత కథనాన్ని అడ్డగోలుగా అచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఇంకా ఆమోదమే తెలపని నివేదికల ఆధారంగా వినియోగదారులను భయపెట్టేందుకు ప్రయత్నించింది. ఇలాంటి అబద్దాలను ప్రజలు నమ్మరని మర్చిపోయింది. రామోజీ రాతల్లో రాయని వాస్తవాలను ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల సీఎండీలు ఐ.పృధ్వీతేజ్, జె.పద్మాజనార్దనరెడ్డి, కె.సంతోషరావు ‘సాక్షి’కి వెల్లడించారు. వారు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ► కేంద్ర ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ విద్యుత్ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా 2021–22 నుంచి విద్యుత్ కొనుగోలు వ్యయం సర్దుబాటు త్వరితగతిన జరగడానికి అప్పటివరకు అమలులో ఉన్న వార్షిక ట్రూ అప్ చార్జీల స్థానంలో త్రైమాసిక సర్దుబాటు చార్జీలు అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారమే రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి కూడా నిబంధనలను రూపొందించింది. ► ట్రూ అప్ చార్జీలు, సర్‌చార్జీలు పరిమిత కాలానికి విధిస్తారు. శాశ్వతంగా రెగ్యులర్ చార్జీల మాదిరిగా బిల్లులో కలపరు. విద్యుత్ కొనుగోలు కాకుండా డిస్కంల నిర్వహణకు జరిగిన వాస్తవ వ్యయానికి, అనుమతించిన వ్యయానికి మధ్య వ్యత్యాసాన్ని ట్రూ అప్ చార్జీల రూపంలో ఏపీఈఆర్సీ నిర్ణయించిన ప్రకారమే విధిస్తున్నారు. ► 2021–22 సంవత్సరానికి ప్రతి త్రైమాసికానికి డిస్కంలు రూ.3,336.7 కోట్లకు నివేదిక సమర్పిస్తే కమిషన్ వాటిపై సమగ్ర బహిరంగ విచారణ, సమీక్ష జరిపి రూ.3,080 కోట్లకు అనుమతినిచ్చింది. ఈ చార్జీలు 2022 ఏప్రిల్ నుంచి ఏడాది పాటు వసూలు చేసుకోవచ్చని చెప్పింది. 2014–15 నుంచి 2018–19 వరకు దాదాపు రూ.7,200 కోట్లు అదనపు వ్యయం జరిగిందని డిస్కంలు నివేదికలు పంపించాయి. అందులో నెట్వర్క్ ట్రూ అప్ చార్జీలు దాదాపు రూ.3,976 కోట్లుగా ఏపీఈఆర్సీ నిర్ధారించింది. ఇందులో ఏపీఎస్పీడీసీఎల్ భాగం రూ.2,135 కోట్లు, సీపీడీసీఎల్ భాగం రూ.1,232 కోట్లు, ఈపీడీసీఎల్ భాగం రూ.609 కోట్లు. కాగా ఉచిత వ్యవసాయ విద్యుత్ వినియోగం నిమిత్తం ఈ ట్రూ అప్ భారం రూ.1,066.54 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీగా భరిస్తోంది. ► ప్రస్తుత 2023–24 ఆర్థిక సంవత్సరం జూన్ నుంచి నెల వారీ విద్యుత్ కొనుగోలు చార్జీల సవరింపును డిస్కంలు అమలు చేస్తున్నాయి. దీని ప్రకారం ఒక నెల సర్దుబాటు చార్జీ ఆ తరువాత రెండో నెలలో అమలులోకి వస్తుంది. ఆ విధంగా ఈ ఏడాది ఆగస్టు నెల ఇంధన, విద్యుత్ కొనుగోలు సర్దుబాటు చార్జీ అక్టోబర్ బిల్లులో అంటే ప్రస్తుత నెల బిల్లులో వసూలు చేస్తున్నారు. ► నెలవారీ అదనపు కొనుగోలు వ్యయం, విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగిపోవడం, మార్కెట్ ధరలు తారస్థాయికి చేరడం, థర్మల్ కేంద్రాలలో 20 నుంచి 30 శాతం వరకూ విదేశీ బొగ్గు వాడటం, తగినంత జల విద్యుత్ ఉత్పత్తి లేకపోవటం వలన యూనిట్ దాదాపు రూ.1 వరకు పెరిగింది. అయినా కమిషన్ ఆదేశాల మేరకు డిస్కంలు 40 పైసలే వసూలు చేస్తున్నాయి. ► 2022–23 ఆర్థిక సంవత్సరానికి ట్రూ అప్ కింద డిస్కంలు సమర్పించిన ప్రతిపాదనల్లో ఎంత వసూలుకు అనుమతించాలనేది బహిరంగ విచారణ అనంతరం ఏపీఈఆర్సీ నిర్ణయిస్తుంది. మండలి నిర్ణయించిన ప్రకారమే డిస్కంలు వసూలు చేస్తాయి. డిస్కంలను నష్టాల్లోకి నెట్టిన టీడీపీ ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలు ఒక ఆర్థిక సంవత్సరం ఆదాయ, అవసరాల నివేదికలను అంతకు ముందు సంవత్సరం సెప్టెంబర్ నెల నాటికి ఉన్న పరిస్థితుల ఆధారంగా తయారుచేస్తాయి. అప్పుడు వంద శాతం ఖచ్చితత్వంతో విద్యుత్ కొనుగోలు వ్యయం అంచనా వేయడం సాధ్య పడదు. ఆర్థిక సంవత్సరం జరుగుతున్నప్పుడు విద్యుత్ కొనుగోలు ఖర్చులో హెచ్చు తగ్గులు ఉంటాయి. అవి సర్దుబాటు చార్జీల ద్వారా వసూలు చేసుకునే వెసులుబాటు డిస్కంలకు ఉంటుంది. కానీ 2014–15 నుంచి 2018–19 మధ్య ఐదేళ్లలో చెల్లించాల్సిన సబ్సిడీలను చెల్లించకుండా అప్పటి టీడీపీ ప్రభుత్వం విద్యుత్ పంపిణీ సంస్థలను నష్టాల సుడిగుండంలోకి నెట్టేసింది. 2014–19 మధ్య పెరిగిన విద్యుత్ కొనుగోలు, పంపిణీ వ్యయాలను కూడా ఏపీఈఆర్సీకి సమర్పించలేదు. కానీ ప్రస్తుత ప్రభుత్వం అలా చేయడంలేదు. సబ్సిడీలను పక్కాగా చెల్లించడమే కాకుండా, అదనంగా నిధులు విడుదల చేస్తూ డిస్కంలను ఆదుకునే ప్రయత్నం చేస్తోంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో కోవిడ్ వల్ల విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉండి, మార్కెట్లో విద్యుత్ కొనుగోలు ధరలు కనిష్టానికి చేరుకున్నాయి. దానివల్ల ఆదా అయిన దాదాపు రూ.4,800 కోట్లను 2022–23 టారిఫ్‌లో డిస్కంలు తగ్గించాయి. అంటే ఆ మేరకు వినియోగదారులపై చార్జీల భారం పడలేదు. ఇలా ఖర్చులు తగ్గినప్పుడు వినియోగదారులకు ప్రభుత్వం చొరవతో విద్యుత్ సంస్థలు ప్రయోజనం చేకూరుస్తున్నాయి. -
విద్యుత్ వినియోగానికి పరిమితులు లేవు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పవర్ హాలిడే లేదని, పరిశ్రమలకు విద్యుత్ సరఫరాపై ఎలాంటి పరిమితులు అమలు చేయడం లేదని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు సోమవారం ప్రకటించాయి. విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా పరిస్థితి మెరుగుపడినందున పరిశ్రమలకు పరిమితులు ఎత్తివేయాలని నిర్ణయించినట్లు తెలిపాయి. రాష్ట్రంలో ఆదివారం అన్ని రంగాలకు ఎలాంటి కోతలు, పరిమితులు లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసినట్లు వివరించాయి. ఆదివారం రాష్ట్రంలో మొత్తం 206.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా సరఫరాలో ఎలాంటి అంతరాయాలుగానీ, లోడ్ షెడ్డింగ్‌గానీ లేదు. సెప్టెంబర్ 1న రాష్ట్రంలో నెలకొన్న గ్రిడ్ డిమాండ్–సరఫరా పరిస్థితులను బట్టి పారిశ్రామిక రంగానికి కొద్దిగా విద్యుత్ సరఫరా తగ్గించి, ప్రాధాన్యతా రంగాలైన గృహ, వ్యవసాయ రంగాలకు అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేశాయి. విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు పరిశ్రమలకు కొంతమేరకు సరఫరా తగ్గించి వ్యవసాయ, గృహ వినియోగదారులకు పూర్తిస్థాయిలో సరఫరా చేస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి విద్యుత్ పంపిణీ సంస్థలు అభ్యర్థన పంపించాయి. ఆ అభ్యర్థన మేరకు ఈనెల 5 నుంచి రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి స్వల్పంగా విద్యుత్ పరిమితులు విధించవచ్చని కమిషన్ అనుమతించింది. తగ్గిన డిమాండ్‌తో పరిశ్రమలకు ఊరట రాష్ట్రంలో ప్రస్తుతం అల్పపీడనం కారణంగా పడుతున్న వర్షాల దృష్ట్యా గ్రిడ్ డిమాండ్ కొంత మేర తగ్గింది. గత రెండు రోజులుగా ఎటువంటి విద్యుత్ కొరత లేదు. విద్యుత్ సౌధలో సోమవారం ట్రాన్స్‌కో సీఎండీ, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్.. ట్రాన్స్‌కో, జెన్కో, ఏపీపీసీసీ అధికారులతో రాబోయే రెండు వారాలపాటు విద్యుత్ డిమాండ్, సరఫరా పరిస్థితులపై సమగ్రంగా సమీక్షించారు. ప్రస్తుతం లోడ్ కొద్దిగా తగ్గి సరఫరా పరిస్థితి మెరుగుపడినందువల్ల పారిశ్రామిక వినియోగదారులకు అధికారిక లోడ్ షెడ్డింగ్ విధించే అవసరం కలగదని ఈ సమీక్షలో అభిప్రాయానికి వచ్చారు. దీంతో విద్యుత్ పంపిణీ సంస్థలు పారిశ్రామిక రంగానికి విద్యుత్ వాడకంపై పరిమితి అమలు నిర్ణయాన్ని రద్దు చేసుకున్నాయి. మెరుగుపడిన సరఫరా పరిస్థితి కారణంగా.. కమిషన్ ఇచ్చిన పారిశ్రామిక విద్యుత్ వినియోగంలో పరిమితి–నియంత్రణ ఉత్తర్వులను అమలు చేయడం లేదు. ఈ విషయాన్ని కమిషన్‌కు నివేదించాలని పంపిణీ సంస్థలు నిర్ణయించాయి. రోజుకి 40 మిలియన్ యూనిట్లు కొంటున్నాం వినియోగదారుల సౌకర్యార్థం సెప్టెంబర్ 15 వరకు స్వల్పకాలిక మార్కెట్ నుంచి యూనిట్‌కు రూ.9.10 వెచ్చించి రోజుకి దాదాపు 40 మిలియన్ యూనిట్లు కొంటున్నాం. సరఫరా పరిస్థితి అదుపు తప్పకుండా చూసేందుకు అధికారులందరూ అప్రమత్తంగా ఉన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా గృహ, వ్యవసాయ, వాణిజ్య–పారిశ్రావిుక రంగాలకు సరఫరా అంతరాయం లేకుండా చేయడానికి శాయశక్తులా కృషి చేస్తున్నాం. రాష్ట్రంలో ఏవిధమైన లోడ్ షెడ్డింగ్‌గానీ, విద్యుత్ వాడకంలో పరిమితులుగానీ లేవని తెలియజేస్తున్నాం. – కె.విజయానంద్, ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి. -
విద్యుత్ వాహనాలదే భవిష్యత్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ వాహనాల(ఈవీ) వినియోగం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఏపీలో 22 వేల విద్యుత్ వాహనాలుండగా.. 2034 నాటికి ఆ సంఖ్య 10.56 లక్షలకు చేరుకోనుందని రాష్ట్ర విద్యుత్ ప్రణాళికలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) వెల్లడించింది. 2024–25లో 52,334 టూ వీలర్, 6,951 త్రీ వీలర్, 9,318 ఫోర్ వీలర్, 239 గూడ్స్, 133 విద్యుత్ బస్సులు రోడ్లెక్కుతాయని పేర్కొంది. అంటే మొత్తం వాహనాల సంఖ్య 68,975కు పెరుగుతుంది. 2034 నాటికి 10,56,617 విద్యుత్ వాహనాలను ప్రజలు వినియోగిస్తారని వెల్లడించింది. ఈవీల సంఖ్యతో పాటు వాటి చార్జింగ్కు వాడే విద్యుత్ వినియోగం కూడా భారీగా పెరగనుంది. 2022లో 16 మిలియన్ యూనిట్లుగా ఉన్న వినియోగం.. 2034 నాటికి 677 మిలియన్ యూనిట్లకు చేరుతుందని ఏపీఈఆర్సీ పేర్కొంది. ‘ఈవీలకు’ ప్రభుత్వ ప్రోత్సాహం.. జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యుత్ వాహనాలకు ప్రాధాన్యత ఇస్తోంది. డౌన్ పేమెంట్ లేకుండా నేరుగా వాయిదా పద్ధతుల్లో ఉద్యోగులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈవీలు కొనుగోలుచేసిన వారికి రాయితీలు కూడా వస్తాయని స్పష్టం చేసింది. ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు 9 శాతం వడ్డీ రేటుతో బ్యాంకులు రుణాలిచ్చేలా చర్యలు తీసుకుంది. రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ స్థలాలు, ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు తదితర చోట్ల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు 4 వేల ప్రాంతాలను ఇప్పటికే గుర్తించింది. తక్కువ సమయంలో ఎక్కువ చార్జింగ్ అయ్యేలా వీటిని అందుబాటులోకి తెస్తోంది. -
సోలార్ పవర్ ఉత్పత్తికి కొత్త నిబంధనలు
సాక్షి, అమరావతి: పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడంలో భాగంగా సోలార్ రూఫ్‌టాప్ సిస్టంను మరింతగా విస్తరించేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) పలు కొత్త నిబంధనలు రూపొందించింది. వాటితో సమగ్ర గ్రిడ్ ఇంటరాక్టివ్ సోలార్ రూఫ్‌టాప్ ఫోటోవోల్టాయిక్ సిస్టమ్ రెగ్యులేషన్–2023ను ప్రతిపాదించింది. సోలార్ రూఫ్‌టాప్ ఫోటోవోల్టాయిక్ ప్లాంట్లు, డిస్కంలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా, అందరికీ ఆమోదయోగ్యంగా ఈ నిబంధనలను రూపొందించినట్లు ఏపీఈఆర్సీ తెలిపింది. రాష్ట్రంలోని డిస్కంల పరిధిలో ఇన్స్టాల్ చేసిన, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ లేని అన్ని గ్రిడ్–ఇంటరాక్టివ్ సోలార్ రూఫ్‌టాప్ ఫోటోవోల్టాయిక్ సిస్టమ్‌లకు ఈ నిబంధనలు వర్తిస్తాయని వెల్లడించింది. ఇవీ నిబంధనలు ♦ సోలార్ రూఫ్‌టాప్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకునేవారికి డిస్కంలు నెట్ మీటరింగ్ సదుపాయాన్ని కల్పించాలి. ♦ గృహవిద్యుత్ వినియోగదారులు ఏర్పాటుచేసే రూఫ్‌టాప్ సిస్టమ్ ప్రాజెక్టు నుంచి 25 ఏళ్ల పాటు, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల నుంచి 12 ఏళ్ల పాటు విద్యుత్ తీసుకునేలా డిస్కంలు ఒప్పందం చేసుకుంటాయి. ♦ ఇంటరాక్టివ్ రూఫ్‌టాప్ సిస్టమ్‌ను ఇన్స్టాల్ చేయడానికి వినియోగదారుకు అర్హత ఉంది. ♦ సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసినవారే దాన్ని సురక్షితంగా చూసుకోవాలి. ఆపరేషన్, నిర్వహణ బాధ్యత వహించాలి. ♦ ప్రమాదంగానీ, పంపిణీ వ్యవస్థకు ఏదైనా నష్టంగానీ వాటిల్లినప్పుడు తమ నెట్వర్క్ నుంచి సోలార్ నెట్‌వర్క్‌ను డిస్కనెక్ట్ చేసే హక్కు డిస్కంలకు ఉంటుంది. వాణిజ్య ఒప్పందం ద్వారా రూఫ్‌టాప్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తే ఆ ఒప్పందం కాపీని డిస్కంలకు ఇవ్వాలి. ♦ అన్ని లిమిటెడ్ కంపెనీలు, ప్రభుత్వసంస్థలు, వ్యక్తులు, సంఘాలు, వినియోగదారులు సోలార్ రూఫ్‌టాప్ సిస్టమ్ ఏర్పాటుకు అర్హులే. ఎవరు ఎక్కడైనా పెట్టుకుని విద్యుత్‌ను వాడుకోవచ్చు, విక్రయించవచ్చు. -
గ్రీన్ ఎనర్జీకి స్టార్ రేటింగ్
సాక్షి, అమరావతి: పునరుత్పాదక విద్యుత్ విని యోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా కేంద్రం నిర్దేశించిన లక్ష్యాలను సాధించే వినియోగ దారు లకు ‘గ్రీన్ స్టార్స్’ ఇవ్వనున్నారు. పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు బాధ్యత నిబంధనలు 2022 కు మొదటి సవరణను(రెగ్యులేషన్ 6 ఆఫ్ 2023) ను ఏపీఈఆర్సీ ప్రతిపాదించింది. గ్రీన్ ఎనర్జీ కోసం వార్షిక ప్రాతి పదికన గ్రీన్ స్టార్స్ రేటింగ్ సర్టిఫికెట్లను ఇవ్వాలని సూచించింది. దీని ప్రకారం ఏటా పునరు త్పాదక విద్యుత్‌ను 100% వినియోగిస్తే 5 స్టార్స్, 75% వాడితే 4 స్టార్స్, 50% కొంటే 3 గ్రీన్ స్టార్స్ లభించనున్నాయి. నెల మొత్తం వినియోగం ఆధారంగా అటువంటి ఆకుపచ్చ నక్షత్రాలు వారి నెలవారీ బిల్లులలో కూడా సూచిస్తారు. ప్రతినెలా డిజిటల్ సర్టిఫికెట్లను జారీ చేస్తారు. దీనిపై అభిప్రాయాలను వెల్లడించాల్సింగా డిస్కంలను కమిషన్ కోరింది. విద్యుత్ చట్టం, 2003 ప్రకారం..2024–25 ఆర్థిక సంవత్సరంలో పునరుత్పాదక విద్యుత్‌ను కొనుగోలు చేయాలనుకునే వినియో గదారులు ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే తేదీకి 3 నెలల ముందు డిస్కంలకు తమ అభ్యర్థ నలను సమర్పించాలని ఏపీఈఆర్సీ చెప్పింది. -
కర్నూలుకు ‘ఏపీఈఆర్సీ’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) కార్యకలాపాలు ఇకపై కర్నూలు జిల్లా నుంచి జరగనున్నాయి. ఈ మేరకు ఏపీఈఆర్సీ ప్రధాన కార్యాలయం కర్నూలులో ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. విద్యుత్ చట్టం 2003 సెక్షన్ 82(3), కేంద్ర చట్టం నెం 36 (2003) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.8లో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీని ప్రకారం కర్నూలులో ఏపీఈఆర్సీ ప్రధాన కార్యాలయం ఏర్పాటు ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ కేంద్రంగా 1999 మార్చిలో ఏపీఈఆర్సీ ఏర్పడింది. రాష్ట్ర విభజన తరువాత అమరావతి ప్రాంతానికి తరలిస్తూ 2014 ఆగస్టులో ఆదేశాలు వెలువడ్డా హైదరాబాద్ కేంద్రంగానే పని చేస్తోంది. కొన్నేళ్లుగా వార్షిక టారిఫ్ ఆర్డర్(విద్యుత్ చార్జీల సవరణ)పై ప్రజాభిప్రాయ సేకరణ, ఆర్డర్ విడుదల లాంటి కార్యకలాపాలను విశాఖపట్నం నుంచి నిర్వహిస్తోంది. తాజా ఆదేశాలతో ఏపీఈఆర్సీ కర్నూలులో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఏపీఈఆర్సీకి చైర్మన్‌తో పాటు ఇద్దరు సభ్యులు ఉంటారు. డైరెక్టర్ హోదాలో కమిషన్ సెక్రటరీ, జాయింట్ డైరెక్టర్, ఐదుగురు డిప్యూటీ డైరెక్టర్లు, లీగల్ కన్సల్టెంట్, ఐటీ కన్సల్టెంట్, కార్యాలయ సిబ్బంది ఉంటారు. ‘ఏపీఈఆర్సీ’ ఏం చేస్తుందంటే? విద్యుత్ చట్టం సెక్షన్ 86 ద్వారా కమిషన్‌కు పలు విధులను నిర్దేశించారు. విద్యుత్ ప్రసారం, పంపిణీ, రిటైల్ సరఫరా కార్యకలాపాలు, నిర్వహణను మెరుగుపరిచి, విద్యుత్ చార్జీలను నిర్ణయించడం లాంటి కీలక బాధ్యతలను మండలి నిర్వర్తిస్తుంది. విద్యుత్తు అంతర్రాష్ట్ర ప్రసారం, పంపిణీ, రిటైల్ సరఫరాలో పోటీ మార్కెట్ల అభివృద్ధికి అవసరమైన సాంకేతిక, సంస్థాగత మార్పులను తేవడం లాంటివి చేపడుతుంది. పంపిణీ, సరఫరా కోసం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, సేకరణ ప్రక్రియను నియంత్రిస్తుంది. ట్రాన్స్మిషన్ లైసెన్సులు, డిస్ట్రిబ్యూషన్ లైసెన్సులు జారీ చేస్తుంది. పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించేందుకు మొత్తం విద్యుత్ వినియోగంలో ఎంత శాతం ఉండాలో నిర్ణయిస్తుంది. డిస్కంలు, ఉత్పాదక సంస్థల మధ్య వివాదాలపై విచారణ జరిపి పరిష్కరిస్తుంది. వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించేలా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం లాంటివి కమిషన్ ప్రధాన విధులుగా నిర్దేశించారు. -
విద్యుత్ భారం లేనట్లే.. పెరగని గృహ వినియోగ ఛార్జీలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వినియోగదారులపై ఈసారి ఎలాంటి విద్యుత్ భారం పడలేదు. ఎనర్జీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ ఛార్జీలు మినహా ఎలాంటి ఛార్జీలు పెంచలేదని ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి వెల్లడించారు. ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారం 2023–24 ఆర్థిక సంవత్సరానికి గానూ ఏపీఈఆర్సీ నిర్ణయించిన ఆదాయ అంతరం మొత్తంలో రూ.10,135 కోట్లను సబ్సిడీ రూపంలో డిస్కంలకు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని.. ఇది చాలా సంతోషకరమన్నారు. నగరంలోని ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఏపీఈఆర్సీ సభ్యులు ఠాకుర్ రామ్‌సింగ్, ఎ.రాజగోపాల్‌రెడ్డిలతో కలిసి విద్యుత్ టారిఫ్ చార్జీలను నాగార్జునరెడ్డి శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టారిఫ్ క్రమబద్ధీకరణకు సబ్సిడీ.. ప్రభుత్వం రాయితీ కల్పిస్తున్న రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ కొనసాగింపుతో పాటు ఎస్సీ, ఎస్టీ, నాయీ బ్రాహ్మణులకు, ఆక్వా రైతుల వినియోగదారులతో పాటు గృహ వినియోగదారులకు టారిఫ్‌ను క్రమబద్ధీకరించడానికి ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ గృహ వినియోగదారులకు సబ్సిడీని ఇచ్చిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి గానూ విద్యుత్ పంపిణీ సంస్థలు రూ.52,590.70 కోట్ల మొత్తంతో ఆదాయ అవసరాలను ఏపీఈఆర్‌సీకీ సమర్పించాయని.. అందులో రూ.49,267.36 కోట్లను ఏపీఈఆర్సీ ఆమోదం తెలిపిందన్నారు. విద్యుత్ అమ్మకాలు, కొనుగోలు అవసరాలు, విద్యుత్ కొనుగోలు ఖర్చులు విద్యుత్ పంపిణీ సంస్థల అంచనాల కంటే తక్కువగా వుండడంతో ఏపీఈఆర్సీ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. చేనేత పరిశ్రమ, పిండిమిల్లులకు ఊరట ఇక పవర్లూమ్ వినియోగదారులకు కేవీఏహెచ్ (కిలోవోల్ట్ యాంపియర్ అవర్స్) బిల్లింగ్ మినహాయింపు ఇచ్చినట్లు నాగార్జునరెడ్డి చెప్పారు. చేనేత కార్మిక వర్గాలు, పిండి మిల్లుల విద్యుత్ వినియోగదారుల అభ్యర్థనల మేరకు 10 హెచ్‌పీ వరకు కేవీఏహెచ్ బిల్లింగ్‌ను మినహాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే, గతేడాదిలో ఒక్కసారే వున్న ఆఫ్–సీజన్ ఎంపికను ఈ ఏడాదికి రెండుసార్లుగా మార్చామన్నారు. ఇప్పటివరకు ఎనర్జీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్‌లో హెచ్‌టీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ డిమాండ్ చార్జీలను వసూలుచేయడం లేదన్నారు. ఈ ఏడాదిలో రూ.475 చొప్పున చెల్లించాల్సి వుంటుందన్నారు. సోలార్ రైతులకు సమస్యలొస్తే.. ఉచిత విద్యుత్ సోలార్ పంపుసెట్లను వాడుతున్న రైతులకు సోలార్ విద్యుత్ వినియోగంలో సమస్యలు ఎదురైతే ప్రభుత్వ విధానం ప్రకారం విద్యుత్ పంపిణీ సంస్థలు వారికి ఉచిత విద్యుత్‌ను పంపిణీ చేయాలని ఆదేశించినట్లు నాగార్జునరెడ్డి చెప్పారు. అంతేకాక.. సోలార్ రూఫ్‌టాప్ నెట్ మీటరింగ్ మార్గదర్శకాలను డిస్కమ్‌లు ఖచ్చితంగా పాటించాలన్నారు. విద్యుత్ ఆదా అంశానికి సంబంధించి గృహ వినియోగదారులకు ఎల్ఈడీ, ట్యూబ్‌లైట్లు, బీఎల్డీసీ (బ్రష్‌లెస్ డైరెక్ట్ కరెంట్ మోటార్) సీలింగ్ ఫ్యాన్లు, సూపర్ ఎఫీషియెంట్ ఎయిర్ కండిషనర్లు వంటి ఇంధన ఉపకరణాల విక్రయాల పైలట్ ప్రాజెక్టును ఇప్పటికే ఆమోదించినట్లు తెలిపారు. ఉచిత విద్యుత్‌లో అలసత్వం వహిస్తే చర్యలు రైతులకు విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయడంలో అలసత్వం వహిస్తే డిస్కమ్ అధికారులపై చర్యలు తప్పవని నాగార్జునరెడ్డి హెచ్చరించారు. వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరాకు సంబంధించి విద్యుత్ సరఫరా నాణ్యత, వినియోగదారుల సంతృప్తిని సమీక్షించేందుకు జిల్లా కమిటీల నివేదికలు, మినిట్స్‌ను విద్యుత్ పంపిణీ సంస్థలు తమ వెబ్సైట్లో పొందుపరచడంతో పాటు వివరాలను ఏపీఈఆరీ్సకి సమర్పించాలని ఆదేశించామన్నారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రభుత్వ పరిధిలోని అంశం కాదని.. అది చట్టపరిధిలోని అంశమని ఆయన స్పష్టంచేశారు. -
విద్యుత్ పీపీఏల టారిఫ్: ఇక ఇదే రేటు
సాక్షి, అమరావతి: పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించి 10,785.51 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సామర్ధ్యం రాష్ట్రానికి ఉంది. ఈ మొత్తంలో పవన విద్యుత్ స్థాపిత సామర్థ్యం 4,096.65 మెగావాట్లు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకి 15 మిలియన్ యూనిట్ల నుంచి 20 మిలియన్ యూనిట్ల మధ్య పవన విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. భవిష్యత్తులో ఇది మరింత పెరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో దీర్ఘకాల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల (పీపీఏ)తో ఆర్థికంగా కుదేలవుతున్న విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు ఊరట కలిగిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) పవన విద్యుత్ ధరలను నిర్ణయించింది. యూనిట్ రూ.2.64గా నిర్దేశించింది. యూనిట్‌కు రూ.3.43 ఇవ్వాలని విండ్ పవర్ జనరేటర్లు చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. ఇరవై ఏళ్ల తరువాత మీ ఇష్టం విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి పవన విద్యుత్‌ను తీసుకుంటున్న డిస్కంలు మొదటి పది సంవత్సరాలకు యూనిట్‌కు రూ.3.50 చొప్పున చెల్లించాలని గతంలోనే ఏపీఈఆర్సీ ఆదేశాలిచ్చింది. అయితే 11 ఏళ్లు దాటిన తరువాత 20 ఏళ్ల వరకు యూనిట్‌కు రూ.3.43, లేదా అంతకంటే ఎక్కువ టారిఫ్ ఇవ్వాలని పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఏపీఈఆర్సీని కోరాయి. డిస్కంలు మాత్రం మొదటి పదేళ్లకే ఏపీఈఆర్సీ టారిఫ్ ఇచ్చిందని, దానికి జనరేటర్లు కూడా అంగీకారం తెలిపారని, ఆ తరువాత పదేళ్లకు టారిఫ్‌ను మండలి నిర్ణయించాల్సి ఉందని తేల్చి చెప్పాయి. దీనిపై స్పందించిన ఏపీఈఆర్సీ.. పవన విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి మొదటి పదేళ్లు యూనిట్‌కు రూ.3.50గా నిర్ణయించామని తెలిపింది. కానీ ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినందున ఆ ధరలే ఇవ్వమనడం కుదరదని తేల్చి చెప్పింది. 11 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు పవన విద్యుత్ టారిఫ్ యూనిట్‌కు రూ.2.64 గా నిర్థారించింది. ఇరవై ఏళ్లు దాటిన తరువాత పీపీఏలను రద్దు చేసుకునేందుకు డిస్కంలకు అవకాశం కల్పించింది. ఒక వేళ పీపీఏలను కొనసాగిస్తే విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ సంస్థల పరస్పర అంగీకారంతో టారిఫ్‌ను నిర్ణయించుకోవచ్చని, దానిని కమిషన్‌కు నివేదించి ఆమోదం పొందాలని సూచించింది. పవన విద్యుత్‌కు అనుకూలంగా రాష్ట్రం కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తికి ప్రోత్సాహాన్నిస్తోంది. అదే సమయంలో డిస్కంలు ఆర్ధికంగా నష్టపోకుండా కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గతేడాది దేశవ్యాప్తంగా పవన విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం 8 శాతం పెరిగితే రాష్ట్రంలో 9.8 శాతం పెరిగింది. అంటే జాతీయ స్థాయి వృద్ధికంటే 1.8 శాతం ఎక్కువ నమోదు చేసుకుని మొదటి పది రాష్ట్రాల్లో ఒకటిగా (ఆరో స్థానంలో) ఏపీ నిలిచింది. రాష్ట్రంలో పవన విద్యుత్‌కు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటీయెరాలజీ (పూణె) పరిశోధకులు వెల్లడించారు. ‘కపుల్డ్ మోడల్ ఇంటర్–కంపారిజన్ ప్రాజెక్ట్ (సీఎంఐపీ) ప్రయోగాలలో సముద్ర తీర ప్రాంతాల్లో ముఖ్యంగా ఏపీలో గాలి సామర్ధ్యం పెరుగుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో గతేడాది డిసెంబర్ నాటికి (నాలుగో త్రైమాసికంలో) దేశవ్యాప్తంగా 229 గిగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులు పెరగగా, మన రాష్ట్రంలో 40.9 మెగావాట్ల కొత్త ప్రాజెక్టులు వచ్చాయి. -
ఏపీఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ.. మీరేమంటారు?
సాక్షి, అమరావతి: విద్యుత్ చార్జీల (టారిఫ్) సవరణపై ఈనెల 19వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ప్రజాభిప్రాయం సేకరించనుంది. ఈ నెల 19, 20, 21 తేదీల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బహిరంగ విచారణ చేపట్టనుంది. సామాన్యులపై ఎటువంటి విద్యుత్ చార్జీల భారం వేయకుండా విద్యుత్ చార్జీలను సవరించేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) 2023–24 ఆర్థిక సంవత్సరానికి రిటైల్ సప్లై బిజినెస్ (ఆర్ఎస్బీ) అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్ (ఏఆర్ఆర్)ను గతేడాది నవంబర్ 30న ఏపీఈఆర్సీకి సమర్పించాయి. వీటిపై ఈసారి కూడా గతేడాది లాగానే విశాఖపట్నంలోని ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బహిరంగ విచారణ నిర్వహించనున్నారు. మండలి చైర్మన్ జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, కార్యదర్శి, సభ్యులు, రాష్ట్ర ఇంధనశాఖ, డిస్కంల అధికారులు ఈ విచారణలో పాల్గొననున్నారు. జిల్లాల్లో ప్రత్యక్ష ప్రసారం ఈ నెల 19వ తేదీ నుంచి మూడు రోజులు ఉదయం గం.10.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మధ్యాహ్నం రెండుగంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ప్రజలు అన్ని డిస్కంల టారిఫ్ ఫైలింగ్‌కు సంబంధించిన సూచనలు, అభ్యంతరాలు, అభిప్రాయాలను మండలికి తెలపవచ్చు. అన్ని జిల్లాల్లోని విద్యుత్ ఎస్ఈ, ఈఈ కార్యాలయాల్లో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాట్లు చేయనున్నారు. ప్రజలు తమ సమీపంలోని ఆయా కార్యాలయాలకు వెళ్లి తమ అభిప్రాయాలు చెప్పవచ్చు. ముందు నమోదు చేసుకున్న వారి నుంచి, తరువాత నమోదు చేసుకోని వారి నుంచి అభిప్రాయాలు తీసుకుంటారు. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ప్రజలంతా వీక్షించేందుకు వీలుగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని డిస్కంలను ఏపీఈఆర్సీ ఆదేశించింది. -
వచ్చే ఏడాది విద్యుత్ చార్జీలు పెరగవు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు 2023–24 ఆర్థిక సంవత్సరానికి చేసిన వార్షిక ఆదాయ అవసరాలు, రిటైల్ సరఫరా ధరల ప్రతిపాదనల్లో గృహ విద్యుత్ వినియోగదారులకు, వాణిజ్య అవసరాలకు, సాధారణ పరిశ్రమల రంగానికి, స్థానిక సంస్థలకు, ప్రభుత్వ, ప్రైవేటు నీటిపారుదల ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ చార్జీల పెంపుదల లేదని రాష్ట్ర ఇంధన శాఖ స్పష్టంచేసింది. ‘సాక్షి’ ప్రతినిధికి గురువారం ఇంధన శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి డిస్కంలు చేసిన టారిఫ్ ప్రతిపాదనల సమగ్ర వివరాలను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి గతనెల 30న సమర్పించాయి. వాటి ప్రతులు ఏపీఈఆర్సీ, పంపిణీ సంస్థల వెబ్సైట్లలో ఉన్నాయి. నివేదిక ప్రతులు డిస్కంల ప్రధాన కార్యాలయంలోను, సర్కిల్ కార్యాలయాల్లోనూ అందుబాటులో ఉంచారు. ప్రభుత్వ సబ్సిడీలు, రాయితీల్లో ఆదాయం వచ్చే ఆర్థిక సంవత్సరానికి సరఫరా సేవా ఖర్చు నిర్దేశిత యూనిట్ ఖర్చు రూ.6.98 కన్నా రూ.0.70æ పెరుగుతుందని అంచనా వేసినప్పటికీ ఆ భారాన్ని ఏ వర్గంపైనా వేయడంలేదు. జనం నెత్తిన రూ.13,487.54 కోట్లు భారం పడుతోందని పచ్చ పత్రికలు చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. అది పంపిణీ సంస్థల వార్షిక ఆదాయ ఆవశ్యకతకు, ప్రస్తుతం టారిఫ్, ఇతర వనరుల ద్వారా వచ్చే ఆదాయానికి మధ్య వుండే వ్యత్యాసం మాత్రమే. ఇదంతా ధరలను పెంచడం ద్వారా వినియోగదారులపై మోపడం జరగదు. డిస్కంల ప్రతిపాదనలపై ఏపీఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించి, ప్రజాభిప్రాయం తీసుకుని, దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుంది. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ సంక్షేమ పథకాల్లో భాగంగా ఇచ్చే విద్యుత్ సబ్సిడీ, ఇతర రాయతీల ద్వారా ఈ ఆదాయ అంతరాన్ని విద్యుత్ సంస్థలు పూడ్చుకుంటాయి. చార్జీల వసూలు ద్వారా నష్టాల భర్తీ జరగదు రాష్ట్ర ప్రభుత్వం వివిధ వర్గాలకు అంటే.. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, ఎస్సీ, ఎస్టీ గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం, ఆక్వా రంగం.. తదితరులకు అందించే విద్యుత్ రాయితీల మొత్తం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.11,123 కోట్లుగా నిర్ధారించారు. అయితే, ఏపీఈఆర్సీకి సమర్పించిన ప్రతిపాదనల్లో వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేటగిరి వారీగా, శ్లాబుల వారీగా ప్రస్తుతం అమలులో వున్న ధరలనే ప్రతిపాదిస్తూ (ఇప్పటికే రాయితీ పొందుతున్న ఎనర్జి ఇంటెన్సివ్ పరిశ్రమలకు మినహా) నివేదిక ఇచ్చారు. అంతేగానీ, నష్టాలను చార్జీల వసూలుతో భర్తీ చేసుకుంటామని ఎక్కడా ప్రతిపాదించలేదు. వినియోగదారులపై విద్యుత్ చార్జీల పెంపుదల ప్రతిపాదన చాలా గోప్యంగా ఉంచారన్నది కూడా పూర్తిగా అవాస్తవం. డిస్కంల వారీగా సేవా ఖర్చు ఇక డిస్కంల కొనుగోలు వ్యయంపై వేర్వేరు గణాంకాలు సమర్పించాయనడం సరైంది కాదు. పంపిణీ సంస్థ సేవా ఖర్చు (కాస్ట్ అఫ్ సర్వీస్)లో వివిధ భాగాలు అంటే.. విద్యుత్ కొనుగోలు వ్యయం, ప్రసార, పంపిణీ నష్టాలు, నెట్వర్క్ నిర్వహణ ఖర్చులు, ఉద్యోగుల జీతభత్యాలు, మరమ్మతు ఖర్చులు మొదలైనవి ఒక్కో డిస్కంలో ఒక్కో విధంగా ఉంటాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మూడు డిస్కంలకు విద్యుత్ కొనుగోలు వ్యయం, మొత్తం సేవా ఖర్చు–కాస్ట్ అఫ్ సర్వీస్ ప్రతీ యూనిట్‌కు ఇలా వున్నాయి.. (రూ.లలో) -
ప్రజలపై పైసా భారం లేకుండా స్మార్ట్ మీటర్లు
సాక్షి, అమరావతి: ప్రజలపై పైసా భారం పడకుండా, పూర్తి పారదర్శకంగా స్మార్ట్ మీటర్ల టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకు విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు రంగం సిద్ధం చేశాయి. రాష్ట్రంలోని గృహాలకు, వ్యవసాయ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని ఇంధన శాఖ సంకల్పించింది. బోర్లకు మీటర్లు అమర్చడం వల్ల డిస్కంల సమర్థత పెంచవచ్చని, విద్యుత్ చౌర్యాన్ని అరికట్టవచ్చని, రైతులకు బాధ్యత పెంచవచ్చనే ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేయనుంది. ఈ వివరాలతో టెండర్ డాక్యుమెంట్లను అక్టోబర్ 21న విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు న్యాయ సమీక్షకు పంపించాయి. వాటిపై ప్రజలు, వినియోగదారులు సూచనలు, సలహాలు, అభ్యంతరాలను వ్యక్తం చేసేందుకు ఇచ్చిన గడువు మంగళవారంతో ముగుస్తుంది. డాక్యుమెంట్ల పరిశీలన పూర్తికాగానే రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి డిస్కంలు దరఖాస్తు చేయనున్నాయి. ఏపీఈఆర్సీ తుది నిర్ణయం తరువాత మీటర్ల ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుందని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. అది అవాస్తవం మీటరుకు రూ. 6 వేలు, నిర్వహణకు రూ.29వేలు చొప్పున మొత్తం రూ.35 వేలను డిస్కంలు ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అది పూర్తిగా అవాస్తవమని డిస్కంలు స్పష్టం చేశాయి. నిజానికి టెండర్లు కోట్ చేసిన రేటు ప్రకారం ఒక నెలకు ఒక్కో మీటరుకు రూ. 255 చొప్పున అన్ని నిర్వహణ బాధ్యతలు, దొంగతనం జరిగిన, మీటర్లు కాలిపోయిన టెండర్ బిడ్ చేసేవారే మీటర్లు మార్చే విధంగా డాక్యుమెంట్ పొందుపరిచారు. దీని ప్రకారం ఐదేళ్లకు రూ. 15,300 మాత్రమే ఖర్చుఅవుతోంది. వ్యవసాయ విద్యుత్ మీటర్లకు డీఓఎల్ స్టార్టర్లు వాడటం వల్ల 4 నుంచి 5 రెట్లు ఎక్కువ విద్యుత్ డ్రా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీటరు సామర్థ్యం దానికి తగ్గట్టుగా ఉండాలి. వ్యవసాయ క్షేత్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ సరిగ్గా ఉండదు. అందువల్ల దానికి తగ్గట్టు కమ్యూనికేషన్ వ్యవస్థను టెండర్స్ బిడ్ చేసే వారే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. మీటర్లతో ప్రయోజనం స్మార్ట్ మీటర్లు వస్తే విద్యుత్ వృథా, చౌర్యాన్ని అరికట్టడం సాధ్యమవుతుంది. సరఫరాలో లోపాలుంటే డిస్కంలను ప్రశ్నించే హక్కు వినియోగదారులకు లభిస్తుంది. పంపిణీ వ్యవస్థలో లోపాలను సకాలంలో గుర్తించడం వల్ల విద్యుత్ అంతరాయాలను వెంటనే పరిష్కరించే వీలుంటుంది. స్మార్ట్ మీటర్లు ‘టూ వే కమ్యూనికేషన్’ను సపోర్ట్ చేస్తాయి. అంటే వినియోగదారుల మొబైల్‌కు అనుసంధానమై ఉంటాయి. విద్యుత్ పంపిణీ సంస్థల నుంచి విద్యుత్ ధరలు, బిల్లు గడువు వంటి సందేశాలను ఎప్పటికప్పుడు వినియోగదారుల మొబైల్ ఫోన్లకు పంపుతాయి. – కె.సంతోషరావు, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్ -
సహజ వెలుగులను ఇలా కొనండి
సాక్షి, అమరావతి: సౌర, పవన, జలవిద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని పెంచడంలో భాగంగా పునరుత్పాదక ఇంధన కొనుగోలు బాధ్యత నిబంధనలు–2022ను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం గెజిట్ విడుదల చేసింది. ఈ ఏడాది నుంచి 2026–27 వరకు విద్యుత్ సంస్థలు వినియోగించే విద్యుత్‌లో ఎంతమేర పునరుత్పాదక విద్యుత్ ఉండాలనేది ఈ నిబంధనల్లో సూచించింది. గెజిట్ విడుదలైన నాటినుంచే నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపింది. దీనిప్రకారం సహజ విద్యుత్‌ను వినియోగించని డిస్కంలు ఎనర్జీ సర్టిఫికెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. -
ఏపీఈఆర్సీకి మరిన్ని అధికారాలు.. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అధికారాలను మరింత విస్తృతం చేస్తూ కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రైవేటు డిస్కంలకు మార్గం సుగమం చేస్తూ మరో గెజిట్ ఇచ్చింది. వాస్తవానికి ఈ రెండు ప్రతిపాదనలను కేంద్రం విద్యుత్ చట్టం సవరణ బిల్లులో ప్రతిపాదించింది. అయితే, ఆ బిల్లు ఇప్పట్లో వచ్చే పరిస్థితులు కనిపించకపోవడంతో గెజిట్ రూపంలో వీటిని తెచ్చింది. విద్యుత్ చట్టం–2003లోని సెక్షన్ 176లో అదనంగా రెండు నిబంధనలు చేరుస్తూ నియమావళిని సవరించింది. ఈ నెల 21 నుంచే ఈ నిబంధనలు అమలులోకి వస్తాయని కేంద్రం వెల్లడించింది. ఒక చైర్మన్, ఇద్దరు సభ్యులు గల ఏపీఈఆర్సీకి ప్రస్తుతం విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ఏడాదికోసారి ఆదాయ, వ్యయాల నివేదిక (ఏఆర్ఆర్)లను సమర్పిస్తున్నాయి. ఆ నివేదికలపై బహిరంగ విచారణ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి మరుసటి ఏడాది విద్యుత్ చార్జీల (టారిఫ్) పెంపును మండలి నిర్ణయిస్తుంటుంది. డిస్కంలు మధ్యంతరంగా సమర్పించే ఇంధన సర్దుబాటు (ట్రూ అప్) చార్జీలపై అవసరానికి అనుగుణంగా అనుమతులు జారీ చేస్తుంటుంది. విద్యుత్ సంస్థలు, ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరిస్తుంటుంది. కేంద్రం ఇచ్చిన తాజా గెజిట్ ప్రకారం విద్యుత్ కొనుగోలు, పంపిణీ వివరాలు, ఆదాయ వ్యయాలు, రాయితీల గణాంకాలు వంటి నివేదికలను ప్రతి డిస్కం మూడు నెలలకోసారి ఏపీఈఆర్సీకి సమర్పించాలి. వీటిని విద్యుత్ నియంత్రణ మండలి క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ధారించుకున్న తరువాత నెల రోజుల్లోగా కేంద్రానికి పంపించాలి. అలాగే ఇప్పుడు చేస్తున్నట్లుగానే విద్యుత్ చార్జీల సవరణ ఆదేశాలు కూడా సకాలంలోనే చేయాలి. ఇందుకోసం డిస్కంలు సమరి్పంచే లెక్కలు వాస్తవమో కాదో తేల్చాల్సిన బాధ్యత మండలిపై ఉంటుంది. దీంతో ఏపీఈఆర్సీ మరింత అప్రమత్తంగా, కఠినంగానూ వ్యవహరించాల్సి ఉంటుందని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.