సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) బుధవారం 2021–22కి విద్యుత్ టారిఫ్‌ను ప్రకటించనుంది. ఈ మేరకు విశాఖపట్నంలోని తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు టారిఫ్ ఆర్డర్‌ను వెల్లడిస్తామని కమిషన్ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి తెలిపారు. దీంతో ఏప్రిల్ 1 నుంచి ఏడాది పాటు కొత్త విద్యుత్ ఛార్జీలు అమల్లో ఉంటాయి. వాస్తవానికి.. వారం క్రితమే తిరుపతిలో టారిఫ్ ఆర్డర్ ఇవ్వాలని భావించినా తిరుపతి ఉప ఎన్నికల షెడ్యూల్ రావడంతో వాయిదా వేశారు. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి తీసుకుని విశాఖ కేంద్రంగా టారిఫ్ ఆర్డర్ ఇవ్వాలని కమిషన్ వర్గాలు నిర్ణయించాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక ఇది రెండో టారిఫ్ ఆర్డర్.
డిస్కమ్‌లు (విద్యుత్ పంపిణీ సంస్థలు) తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ గతేడాది ప్రభుత్వం ప్రజలపై ఎలాంటి భారం వేయలేదు. వ్యవసాయ విద్యుత్‌కు మునుపెన్నడూ లేని విధంగా రూ.9 వేల కోట్ల సబ్సిడీ ఇచ్చి ఆదుకుంది. చరిత్రలో తొలిసారిగా గృహవిద్యుత్ వినియోగదారులకు రూ.1,700 కోట్ల సబ్సిడీని ప్రకటించింది. ఆర్థిక లోటులో సింహభాగం ప్రభుత్వమే భరించడంతో ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడలేదు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి రూ.44,030.08 కోట్ల రెవెన్యూ అవసరమని ఏపీ డిస్కమ్‌లు గతేడాది నవంబర్‌లో ఏపీఈఆర్‌సీకి ప్రతిపాదనలు పంపాయి.
ప్రస్తుతం టారిఫ్ రూపంలో రూ.30,769.13 కోట్లు రెవెన్యూ వస్తోందని, రూ.13,260.95 కోట్లు ఆర్థిక లోటు ఉండే వీలుందని పేర్కొన్నాయి. 2020–21 ఆర్థిక సంవత్సరంలో కరోనాతో డిస్కమ్‌లు తీవ్ర స్థాయిలో నష్టపోయాయి. లాక్‌డౌన్ వల్ల రూ.11,524.08 కోట్ల మేర ఆర్థిక వనరులు తగ్గాయి. డిస్కమ్‌ల ప్రతిపాదనలపై ఏపీఈఆర్‌సీ రాష్ట్రవ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ప్రజలు, వివిధ సంఘాల నిపుణుల అభిప్రాయాలను క్రోడీకరించి, ప్రభుత్వ సబ్సిడీని పరిగణనలోనికి తీసుకుని 2021–22కి టారిఫ్ ఆర్డర్ ఇవ్వనుంది. ఈసారి కూడా పేదలు, మధ్యతరగతి వర్గాలకు ఎలాంటి విద్యుత్ షాక్ ఉండబోదని కమిషన్ వర్గాలు తెలిపాయి.
Andhra Pradesh: నేడు విద్యుత్ టారిఫ్ ప్రకటన
Published Wed, Mar 31 2021 3:15 AM | Last Updated on Wed, Mar 31 2021 9:41 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment