AP: షాక్‌ల మీద షాక్‌! | Chandrababu Govt Shock To AP People With Electricity Charges Hike | Sakshi
Sakshi News home page

AP: షాక్‌ల మీద షాక్‌!

Published Tue, Nov 5 2024 4:01 AM | Last Updated on Tue, Nov 5 2024 10:06 AM

Chandrababu Govt Shock To AP People With Electricity Charges Hike

రాష్ట్ర ప్రజలపై మరోసారి విద్యుత్‌ చార్జీల పిడుగు

ఏకంగా రూ.11,826.15 కోట్ల ట్రూ అప్‌ చార్జీల భారం

ఇంధన సర్దుబాటుకు విద్యుత్‌ పంపిణీ సంస్థల ప్రతిపాదనలు

ఈ నెల 19లోగా అభ్యంతరాలు తెలపాలన్న ‘ఏపీఈఆర్‌సీ’

ఫలితంగా ప్రజల నడ్డి విరిగేలా మోత మోగించనున్న సర్కారు

ఇప్పటికే ఈ నెల బిల్లు నుంచి రూ.6,072.86 కోట్ల వడ్డన

అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే మొత్తంగా రూ.17,899.01 కోట్ల బాదుడు.. ఒక్కో యూనిట్‌పై సగటున రూ.3 అదనం

ఈ లెక్కన డబుల్, త్రిబుల్‌ కానున్న విద్యుత్‌ చార్జీలు

‘‘రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీల భారం ఎక్కువగా ఉంది.. కూటమి ప్రభుత్వం వస్తే చార్జీల భారం తగ్గిస్తాం.. ఐదేళ్ల పాటు ఒక్క రూపాయి కూడా చార్జీలు పెంచం’’ అని ఎన్నికలకు ముందు ప్రతి సభలో హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి రాగానే మాట మార్చేశారు. 

‘‘అబ్బే.. చెప్పినవన్నీ చేయాలంటే ఎలా కుదురుతుంది? చార్జీలు పెంచకపోతే డిస్కంలకు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి? డబ్బులు ఊరకే రావు. ‘సర్దు­బాటు’ పేరుతో ఎంత కావాలో అంత ప్రజల నుంచే పిండుకోండి. ఇదేంటని ఎవరైనా అడిగితే గత ప్రభుత్వం వల్లే చార్జీలు పెరిగా­యని అబద్ధమైనా సరే గట్టిగా దబాయించి చెప్పండి. ఒకటికి పదిసార్లు మన మీడియాలో కథనాలు రాయండి. అప్పటికీ సర్దుకోకపోతే నేనే ఎలాగోలా టాపిక్‌ డైవర్ట్‌ చేస్తాను’’ అని అంతర్గతంగా దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఫలితంగా ప్రజలు కోలుకోలేని విధంగా షాక్‌ల మీద షాక్‌.

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు కూటమి సర్కారు వరుసగా విద్యుత్‌ షాక్‌లు ఇస్తోంది. ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో ఇప్పటికే రూ.6,072.86 కోట్ల భారాన్ని ఈ నెల బిల్లు నుంచే వేస్తున్న ప్రభుత్వం, వచ్చే నెల నుంచి ప్రజల మీద మరో రూ.11,826.15 కోట్ల భారం మోపనుంది. ఈ మేరకు 2023–24 సంవత్సరానికి ఇంధన, విద్యుత్‌ కొనుగోలు సర్దుబాటు చార్జీల (ఎఫ్‌పీపీసీఏ)కు అనుమతి ఇవ్వాల్సిందిగా ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ, మధ్య, తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ)కి సోమవారం ప్రతిపాదనలు సమర్పించాయి. 

డిస్కంల ప్రతిపాదనలపై ఎవరికైనా అభ్యంతరాలున్నా, ఏవైనా సూచనలు చేయాలనుకున్నా తమకు నేరుగా గానీ, ఈ మెయిల్‌ ద్వారా గానీ ఈ నెల 19వ తేదీలోగా తెలియజేయాలని మండలి కోరింది. అనంతరం ఓ వారం రోజుల్లోనే ట్రూ అప్‌ చార్జీలపై ఏపీఈఆర్‌సీ నిర్ణయం తీసుకోనుంది. ఆ వెంటనే డిసెంబర్‌ నెల నుంచే విద్యుత్‌ బిల్లుల్లో సర్దుబాటు చార్జీలను వేసే అవకాశం ఉంది.


గరిష్టంగా యూనిట్‌కు రూ.3 భారం 
ఈ ఏడాది జూన్‌ నాటికే 2023–24 సంవత్సరానికి సంబంధించిన సర్దుబాటు చార్జీలు యూనిట్‌కు రూ.0.40 చొప్పున ఇప్పటి వరకు దాదాపు రూ.3,752.55 వేల కోట్లు వసూలు చేశామని డిస్కంలు వెల్లడించాయి. మిగిలిన రూ.8,073.60 కోట్ల చార్జీలను బిల్లుల్లో అదనంగా కలిపేందుకు ఏపీఈఆర్‌సీ ఆమోదం కోసం డిస్కంలు పంపించాయని తెలిపాయి. అయితే ఈసారి వాస్తవ విద్యుత్‌ కొనుగోలు ఖర్చు, అనుమతించిన ఖర్చుకు మధ్య వ్యత్యాసాన్ని డిస్కంలు భారీగా చూపించాయి. 

అది మూడు డిస్కంలలోనూ కనిష్టంగా రూ.1.02 నుంచి గరిష్టంగా రూ.2.50 వరకు ఉంది. దీన్ని బట్టి యూనిట్‌కు ఎంత వసూలు చేసుకోవడానికి ఏపీఈఆర్‌సీ అనుమతిస్తుందనేది ఈ నెలాఖరులోగా తేలుతుంది. ఈ నెల నుంచి యూనిట్‌పై సగటున పడుతున్న రూ.1.27కి వచ్చే నెల నుంచి పడే చార్జీలను కలుపుకుంటే మొత్తంగా యూనిట్‌కు రూ.3 చొప్పున అదనంగా వినియోగదారులపై భారం పడనుంది. 

ఈ లెక్కన విద్యుత్‌ చార్జీలు డబుల్‌ కానున్నాయని, ఎక్కువ విద్యుత్‌ వాడే వాళ్లకు అంతకంటే ఎక్కువ భారం కానున్నాయని స్పష్టమవుతోంది. (నవంబర్‌ నెలలో వాడిన కరెంట్‌కు డిసెంబర్‌ మొదటి వారంలో బిల్లు వస్తుంది. అప్పుడు రూ.6,072.86 కోట్ల భారం పడుతుంది. డిసెంబర్‌లో వాడిన కరెంట్‌కు జనవరి మొదటి వారంలో బిల్లు వస్తుంది. అప్పుడు రూ.11,826.15 కోట్ల భారం అదనంగా కలుస్తుంది.) 

ఏపీ ప్రజలకు షాక్‌ల మీద షాక్‌!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement