2021–22 రిటైల్ సరఫరా ధరలను విడుదల చేస్తున్న చైర్మస్ జస్టిస్ నాగార్జునరెడ్డి,చిత్రంలో సభ్యులు ఠాకూర్ రామ్‌సింగ్, రాజ్‌గోపాల్ రెడ్డి
సాక్షి, విశాఖపట్నం: విద్యుత్ చార్జీల భారం సామాన్య ప్రజలపై పడకుండా.. వినియోగదారుల ఆకాంక్షలు, పంపిణీ సంస్థల ఆర్థిక అవసరాల్ని సమన్వయం చేస్తూ 2021–22 రిటైల్ సరఫరా ధరల్ని ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీ ఈఆర్‌సీ) బుధవారం విడుదల చేసింది. ఇకపై కనీస చార్జీల భారం గృహ వినియోగదారులపై పడకుండా, రైతులకు ఉచిత విద్యుత్ రాయితీలను ప్రభుత్వమే భరిస్తూ, కుల వృత్తులకు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని కొనసాగిస్తూ రూపొందించిన కొత్త టారిఫ్ నేటి నుంచి అమల్లోకి రానుందని ఏపీఈఆర్‌సీ చైర్మన్ జస్టిస్ నాగార్జునరెడ్డి ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక వరుసగా రెండోసారి ప్రజలపై భారం మోపకుండా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యుత్తు టారిఫ్‌లను విడుదల చేసింది. కోవిడ్–19 కారణంగా విద్యుత్ పంపిణీ సంస్థలు తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పటికీ సామాన్యులపై భారం మోపకుండా టారిఫ్‌లను ప్రకటించి మరోసారి ప్రజా ప్రభుత్వమని నిరూపించుకుంది.
రూ.4,307.38 కోట్లు అదనపు భారం పడకుండా...
గృహ వినియోగదారులపై ఒక్క రూపాయి కూడా భారం లేకుండా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి 2021–22 కొత్త టారిఫ్‌ని ప్రకటించింది. విశాఖలోని ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో కమిషన్ ఛైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, సభ్యులు ఠాకూర్ రామసింగ్, పి.రాజగోపాల్ కొత్త టారిఫ్‌ని విడుదల చేశారు. టారిఫ్ వివరాల్ని జస్టిస్ నాగార్జునరెడ్డి మీడియాకు వివరించారు. ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్‌పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ రూ.11,741.18 కోట్ల లోటులో ఉన్నట్లు ఏపీఈఆర్‌సీకీ నివేదించాయన్నారు. దీన్ని క్షుణ్నంగా పరిశీలించిన అనంతరం నికరలోటు రూ.7433.80 కోట్లుగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. దీనివల్ల వినియోగదారులు, ప్రభుత్వంపై రూ.4,307.38 కోట్లు అదనపు భారం పడకుండా నివారించినట్లు వివరించారు. 2021–22 ఆదాయ అంతరాన్ని నిర్ధారించే సమయంలో 2014–15, 2016–17, 2018–19 వరకూ నిర్ణయించిన రూ.3,013 కోట్ల ట్రూఅప్, గత ఆర్థిక సంవత్సర ట్రూడౌన్ సర్దుబాటు కింద రూ.3,373 కోట్లని కూడా పరిగణలోకి తీసుకొని నికరలోటుని నిర్ణయించామని తెలిపారు. సమావేశంలో ఏపీఈపీడీసీఎల్ సీఎండీ నాగలక్ష్మీ సెల్వరాజన్, ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ హెచ్.హరనాథరావు, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జే.పద్మజనార్థనరెడ్డి, ఏపీఈపీడీసీఎల్ డైరెక్టర్లు కే.రాజబాపయ్య, బి.రమేష్‌ప్రసాద్‌తో పాటు మూడు విద్యుత్ పంపిణీ సంస్థల డైరెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.
అన్ని వర్గాల భారాన్ని మోస్తున్న ప్రభుత్వం
కొత్త టారిఫ్‌లకు సంబంధించి రాయితీలు, ప్రోత్సాహకాలు, గృహ వినియోగదారులతో పాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, రైతులు, పౌల్ట్రీ వర్గాల భారాన్ని ప్రభుత్వమే మోసేందుకు అంగీకరించింది. వ్యవసాయ ఉచిత విద్యుత్‌కు సంబంధించి 2021–22లో రూ.7,297.08 కోట్ల ఆర్థిక భారం ప్రభుత్వం భరించనుంది. కార్పొరేటేతర రైతులు, చెరకు క్రషింగ్, గ్రామీణ మొక్కల పెంపక కేంద్రాలు, దోభీ ఘాట్లు ఉచిత విద్యుత్ పొందేందుకు అర్హమైనవని ఏపీఈఆర్‌సీ సూచించింది.
ఉచిత విద్యుత్ వర్గాలన్నీ సెక్షన్–65లోకి..
ఈసారి తొలిసారిగా ఉచిత విద్యుత్ వర్గాలన్నీ సెక్షన్–65 కింద ప్రత్యక్ష రాయితీ పొందేలా ఒకే గొడుగు కిందకు తెచ్చారు. వివిధ వర్గాలకు రాయితీలు, ఉచిత విద్యుత్ కారణంగా ప్రభుత్వంపై రూ.1657.56 కోట్ల భారం పడుతోంది. దీన్ని భరించేందుకు ముఖ్యమంత్రి జగన్ అంగీకరించారు. హరిజన, గిరిజన నివాస సముదాయాలు, తండాల్లో నివసించే గృహ వినియోగదారులకు నెలకు రూ.200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ సరఫరా చేస్తారు. రజక సంఘం నడుపుతున్న బీపీఎల్ లాండ్రీలకు నెలకు 150 యూనిట్లు ఉచితం. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న అత్యంత వెనుకబడిన వర్గాలకు (ఎంబీసీ), స్వర్ణకారులు, చేనేత కార్మికులకు నెలకు 100 యూనిట్ల వరకు, నాయీ బ్రాహ్మణులకు 150 యూనిట్లు ఉచిత విద్యుత్ అందించనున్నారు. మరోవైపు యూనిఫాం ధరలతో ప్రభుత్వంపై రూ.136.72 కోట్ల భారం పడనుంది. రాష్ట్రవ్యాప్తంగా మూడు పంపిణీ సంస్థల పరిధిలోనూ ఏకరీతి ధరలు అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. దీనివల్ల ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని గృహ వినియోగదారులకు రాయితీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ రాయితీల భారం రూ.136.72 కోట్లు ఉంటుంది. ఈ నేపథ్యంలో వివిధ వర్గాలకు ఉచిత విద్యుత్, రాయితీలు అందించడం ద్వారా ప్రభుత్వంపై ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.9,091.36 కోట్ల భారం పడనుంది.
ఆక్వా సాగుదారుల మోముల్లో వెలుగులు..
చేపల, రొయ్యల చెరువుల వినియోగదారులకు గతంలో క్రాస్‌సబ్సిడీ యూనిట్ రాయితీ ధర రూ.3.85 ఉండగా ఇప్పుడు దాన్ని రూ.2.35కి తగ్గించారు. అంటే యూనిట్‌పై రూ.1.50 వరకూ తగ్గింది. ఆక్వా హేచరీస్, చేపలు, రొయ్యల దాణా కేంద్రాలు, కోడి పిల్లల తయారీ, కోళ్ల దాణా తయారీ కేంద్రాల్ని ఇండస్ట్రీస్ జనరల్ కేటగిరిలో విలీనం చేయాలన్న విద్యుత్ పంపిణీ సంస్థల అభ్యర్థనని ఏపీఈఆర్‌సీ అంగీకరించింది. ఇప్పటి వరకూ వీరంతా ఇండస్ట్రీస్ కేటగిరీలో బిల్లులు చెల్లించేవారు. ఇకపై వారంతా టీఓడీ పీక్, ఆఫ్–పీక్ ధరలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. స్వతంత్ర ఎల్‌టీ కనెక్షన్లు కలిగి, జీఎస్‌టీ నుంచి మినహాయింపు ఉన్న చేపలు, రొయ్యల చెరువులు, కోళ్ల పెంపకం, పాడి క్షేత్రాలు, సొంత దాణా తయారీ కేంద్రాలకు చెందిన వారంతా ఇకపై యూనిట్‌కు రూ.5.25, కిలోవాట్‌కు రూ.75 మాత్రమే చెల్లించేలా కొత్త టారిఫ్ అమల్లోకి వచ్చింది. ఇండస్ట్రీస్ (జనరల్) కేటగిరీలోని హెచ్‌టీ వినియోగదారులకు లోడ్ కారక ప్రోత్సాహక పథకాన్ని ఉపసంహరించుకోవాలన్న డిస్కమ్‌ల ప్రతిపాదనకు ఏపీఈఆర్‌సీ అంగీకారం తెలిపింది.
గృహ వినియోగదారులపై భారం లేకుండా...
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వరుసగా రెండోసారి గృహ వినియోదారులపై ఎలాంటి విద్యుత్ చార్జీల భారం మోపకుండా టారిఫ్‌లను విడుదల చేసింది. ఇప్పటివరకూ కనీస ఛార్జీలుగా రూ.50 నుంచి రూ.150 వరకు వసూలు చేసేవారు. ఇకపై ఈ భారం ఉండదు. కనీస ధరలకు బదులుగా కిలోవాట్‌కు రూ.10 వసూలు చేయనున్నారు. ఉదాహరణకు ఒక ఎల్‌టీ వినియోగదారుడు మూడు నెలల పాటు ఇంట్లో లేకపోయినా నెలకు కనీసం రూ.50 చొప్పున రూ.150 బిల్లు కట్టాల్సి వచ్చేది. ఇకపై నెలకు రూ.10 చొప్పున రూ.30 చెల్లిస్తే సరిపోతుంది. సగటు యూనిట్ సేవా వ్యయం రూ.7.17 నుంచి రూ.6.37కి తగ్గించారు. అపార్ట్‌మెంట్లులో ఒకే పాయింట్ వద్ద అధిక వోల్టేజీ (హెచ్‌టీ) కనెక్షన్ల కింద ధరలు వసూలు చేయాలన్న పంపిణీ సంస్థల ప్రతిపాదనల్ని ఏపీఈఆర్‌సీ తిరస్కరించింది. అపార్ట్‌మెంట్లలో ఎక్కువగా నివసించే మధ్యతరగతి కుటుంబాలపై భారాన్ని నివారించేందుకు డిస్కమ్‌ల ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు కమిషన్ ప్రకటించింది. ఇక ఫంక్షన్ హాళ్లలో గతంలో నెలకు కిలోవాట్‌కు రూ.100 చెల్లించాల్సి ఉండేది. ఇకపై యూనిట్ల కింద చెల్లించుకునే వెసులుబాటు కల్పించారు. ప్రస్తుతం ఆఫ్–పీక్ టీవోడీ(టైమ్ ఆఫ్‌డే) సమయం ఉదయం 6 నుంచి 10 గంటల వరకూ ఉండగా దీన్ని ఉదయం రూ.8 గంటల వరకూ మార్చాలన్న ప్రతిపాదనని తిరస్కరించారు. 2 గంటలు తగ్గిస్తే గృహ వినియోగదారులకు నష్టం వాటిల్లే అవకాశాలున్నందున డిస్కమ్‌ల ప్రతిపాదనని ఏపీఈఆర్‌సీ తోసిపుచ్చింది.
విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేలా..
పర్యావరణ పరిరక్షణకు ఏపీఈఆర్‌సీ పెద్దపీట వేసింది. విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు రాయితీలతో ప్రోత్సహిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల యూనిట్ విద్యుత్ ధరని ఒక్క పైసా కూడా పెంచకుండా ఈ ఏడాదీ రూ.6.70గానే కొనసాగిస్తోంది. వినియోగదారులకు సేవలందించే చార్జింగ్ కేంద్రాల నుంచి 90 శాతం మాత్రమే డిస్కమ్‌లు తీసుకోవాలని, మిగిలిన 10 శాతం చార్జింగ్ కేంద్రాల నిర్వహణకు విడిచిపెట్టాలని సూచించింది. పునరుత్పాదక విద్యుత్‌ని ప్రోత్సహించేలా కూడా రాయితీలు ప్రకటించింది. పవన, సౌర విద్యుత్‌కు పీపీఏ బదులుగా తాత్కాలిక టారిఫ్ వర్తింపజేశారు. ఇంధన పరిరక్షణ, ఇంధన సామర్థ్య చర్యల్ని ప్రోత్సహించేందుకు ఏపీ రాష్ట్ర విద్యుత్ సమర్థత అభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఈఈడీసీవో)కు నిధులు మంజూరు చేశారు. పునరుత్పాదక విద్యుత్ వ్యవస్థ మొత్తం ఎపీఎస్‌పీడీసీఎల్ పరిధిలోనే ఉండటంతో మిగిలిన సంస్థలపై ఆ లోటు తొలగించేందుకు సరికొత్త నిర్ణయాన్ని అమలు చేస్తోంది. పునరుత్పాదక విద్యుత్ ధ్రువీకరణ పత్రాలు(ఆర్‌ఈసీ) రూపంలో వినియోగదారులపై భారం పడకుండా మిగులు విద్యుత్‌ని ఏపీఈపీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ నుంచి యూనిట్ రూ.2.43 / రూ.2.44 చొప్పున కొనుగోలు చేసేలా ఆదేశాలు జారీ చేసింది.
150 హెచ్‌పీ వరకూ ఎల్‌టీ రైస్ మిల్లులే...
గత సంవత్సరం టారిఫ్‌లో రైస్ మిల్లులు, పల్వరైజర్లకు టారిఫ్‌లలో వెసులుబాటు కల్పించారు. 100 హార్స్ పవర్ వరకు ఎల్‌టీ వినియోగదారులుగా, అంతకు మించితే హెచ్‌టీ వినియోగదారులుగా పరిగణిస్తారు. అయితే దీన్ని మార్చాలని వినతులు వెల్లువెత్తడంతో 100 హెచ్‌పీ బదులు 150 హెచ్‌పీ వరకూ ఎల్‌టీ ధరలు, 150 హెచ్‌పీ దాటితే హెచ్‌టీ కింద పరిగణించాలని నిర్ణయించారు. అయితే ఇది పూర్తి ఆప్షనల్ విధానంగా నిర్థరించారు. 2020 జూన్ 30లోపు మార్చుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే చాలా మంది మిల్లర్లు కరోనా కారణంగా మార్చుకోలేకపోయామని చెప్పడంతో ఈ గడువుని ఈ ఏడాది జూన్ 30 వరకూ పొడిగించినట్లు ఏపీఈఆర్‌సీ ప్రకటించింది. ఒకసారి మార్పు చేసుకున్నాక తిరిగి మళ్లీ మార్చుకునే అవకాశం లేదని స్పష్టం చేసింది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే మిల్లులు సర్వీస్ శాంక్షన్ చేసే సమయంలోనే ఆప్షన్లు తెలియజేయాలని సూచించింది.
కొనుగోలు, అమ్మకానికి స్పెషల్ సెల్...
రియల్ టైమ్ మార్కెట్‌లో విద్యుత్ కొనుగోలు, అమ్మకానికి సంబంధించి ప్రతి డిస్కమ్‌లో స్పెషల్ సెల్ ఏర్పాటు చేయాలని ఏపీఈఆర్‌సీ ఆదేశించింది. మార్కెట్ ధరల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ 24 గంటలూ పర్యవేక్షించేలా సెల్ పనిచేయాలని సూచించింది. దీనిద్వారా జాతీయ స్థాయిలో తక్కువ ధరకు విద్యుత్ అమ్మకానికి వచ్చినప్పుడు కొనుగోలు చేసేలా, ఎక్కువ ధరకు విద్యుత్ విక్రయించేలా అవకాశాలు మెరుగుపడి డిస్కమ్‌లు లాభాల బాట పట్టే అవకాశాలున్నాయి.
రెస్కోలు.. డిస్కమ్‌ల పరిధిలోకి
ఇకపై గ్రామీణ విద్యుత్ సహకార సంఘాల(రెస్కోలు)ను సంబంధిత విద్యుత్ పంపిణీ సంస్థలు ఆధీనంలోకి తీసుకోవాలని విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశించింది. విద్యుత్ పంపిణీ లైసెన్సులు, మినహాయింపుల విషయంలో రెస్కోలు విఫలమవ్వడంతో వినియోగదారులు ఇబ్బందుల పడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషన్ ఛైర్మన్ జస్టిస్ నాగార్జునరెడ్డి తెలిపారు. రాయచోటి, కదిరి రెస్కోలని ఆయా డిస్కమ్‌లు విలీనం చేసుకున్నాయని, అనకాపల్లి, కుప్పం రెస్కోలు కూడా తాత్కాలికంగా డిస్కమ్‌లు ఆధీనంలోకి రానున్నాయని వెల్లడించారు.
బిల్లుల వెనుక రాయితీ వివరాలు
– జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, ఏపీఈఆర్‌సీ చైర్మన్
‘సగటు వినియోగదారులపై రూపాయి భారం లేకుండా కొత్త టారిఫ్ తయారు చేశాం. విద్యుత్ పంపిణీ సంస్థలపై భారం పడకుండా, వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కోకుండా విద్యుత్తు టారిఫ్‌లు రూపొందించడం కత్తిమీద సామే అయినా విజయవంతంగా పూర్తి చేశాం. ప్రభుత్వం వేల కోట్ల రూపాయిల రాయితీలు అందిస్తోంది. అన్ని వర్గాల వినియోగదారుల విద్యుత్ బిల్లుల వెనకవైపు ప్రతి యూనిట్ సేవా వ్యయం(కాస్ట్ ఆఫ్ సర్వీస్), క్రాస్ రాయితీ, ప్రభుత్వ రాయితీ మొదలైన వివరాల్ని పొందుపరచాలని డిస్కమ్‌లకు సూచించాం. తొలిసారిగా వర్చువల్ విధానంలో బహిరంగ విచారణ చేపట్టాం. ఆత్మకూరు లాంటి వెనుకబడిన ప్రాంతాల ప్రజలు కూడా ఈ విచారణలో పాల్గొనడం విశేషం. బహిరంగ విచారణ అనంతరం అన్ని అభ్యంతరాల్ని నిశితంగా పరిశీలించి టారిఫ్‌లు తయారు చేశాం’
– ప్రకటనల హోర్డింగ్స్‌కు రూ.12.25, ఫంక్షన్ హాల్స్‌కు రూ.12.25, విద్యుత్ వాహనాలకు రూ.6.70 చొప్పున యూనిట్‌కు ఛార్జ్ పడనుంది.
– పరిశ్రమలకు 75 కేవీ వరకు రూ.6.70, సీజనల్ పరిశ్రమలకు(75 కేవీ) రూ.7.45గా నిర్ణయించారు.
– వీధి దీపాలు, సుజల స్రవంతి, సీపీడబ్ల్యూస్, పీడబ్ల్యూఎస్‌కు రూ.7 చొప్పున వసూలు చేస్తారు.
ఏపీలోనే చీప్
– కోవిడ్ వెంటాడినా సామాన్యులకు తాకని షాక్
సాక్షి, అమరావతి: కరోనా కారణంగా విద్యుత్ సంస్థల ఆర్థిక పురోగతి దెబ్బతిన్నా పేదలపై ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పడనివ్వలేదు. ఏపీఈఆర్‌సీ ప్రకటించిన విద్యుత్ టారిఫ్‌ను పరిశీలిస్తే ఇది స్పష్టంగా తెలుస్తుంది. 21 రాష్ట్రాలతో పోలిస్తే నెలకు 50 యూనిట్ల వరకూ వాడే పేద వర్గాలకు ఏపీలోనే భారీ సబ్సిడీతో విద్యుత్ (యూనిట్ రూ. 1.45కు) అందుతుండటం గమనార్హం. అదే బిహార్‌లో యూనిట్ రూ. 6.15 వరకు విద్యుత్ టారిఫ్ ఉంది. 200 యూనిట్లు వాడే వినియోగదారులకు కూడా ఏపీలో ఇప్పటికీ యూనిట్ రూ. 3.60కే విద్యుత్ అందుతోంది. ఇదే శ్లాబులో మహారాష్ట్ర యూనిట్ రూ.8.33 చొప్పున వసూలు చేస్తోంది. మరోవైపు ఏపీలో పాత స్టాటిక్ విధానాన్ని ఎత్తివేసి డైనమిక్ విధానం బిల్లింగ్ అమలులోకి తెచ్చారు. దీనివల్ల వినియోగం ఉన్నప్పుడు మాత్రమే శ్లాబులు మారే అవకాశం ఉంటుంది. సంవత్సరం పొడవున ఎక్కువ టారిఫ్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వానికి ఎన్ని కష్టాలున్నా పేదలకు విద్యుత్ భారం కారాదన్న విధానానికి అనుగుణంగానే ఏపీఈఆర్‌సీ కసరత్తు చేసి సత్ఫలితాలు సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment