
సాక్షి, అమరావతి: విద్యుత్ చార్జీల (టారిఫ్) సవరణపై ఈనెల 19వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ప్రజాభిప్రాయం సేకరించనుంది. ఈ నెల 19, 20, 21 తేదీల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బహిరంగ విచారణ చేపట్టనుంది. సామాన్యులపై ఎటువంటి విద్యుత్ చార్జీల భారం వేయకుండా విద్యుత్ చార్జీలను సవరించేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) 2023–24 ఆర్థిక సంవత్సరానికి రిటైల్ సప్‌లై బిజినెస్ (ఆర్‌ఎస్‌బీ) అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్‌మెంట్ (ఏఆర్‌ఆర్)ను గతేడాది నవంబర్ 30న ఏపీఈఆర్‌సీకి సమర్పించాయి.
వీటిపై ఈసారి కూడా గతేడాది లాగానే విశాఖపట్నంలోని ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బహిరంగ విచారణ నిర్వహించనున్నారు. మండలి చైర్మన్ జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, కార్యదర్శి, సభ్యులు, రాష్ట్ర ఇంధనశాఖ, డిస్కంల అధికారులు ఈ విచారణలో పాల్గొననున్నారు.
జిల్లాల్లో ప్రత్యక్ష ప్రసారం
ఈ నెల 19వ తేదీ నుంచి మూడు రోజులు ఉదయం గం.10.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మధ్యాహ్నం రెండుగంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ప్రజలు అన్ని డిస్కంల టారిఫ్ ఫైలింగ్‌కు సంబంధించిన సూచనలు, అభ్యంతరాలు, అభిప్రాయాలను మండలికి తెలపవచ్చు. అన్ని జిల్లాల్లోని విద్యుత్ ఎస్‌ఈ, ఈఈ కార్యాలయాల్లో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాట్లు చేయనున్నారు.
ప్రజలు తమ సమీపంలోని ఆయా కార్యాలయాలకు వెళ్లి తమ అభిప్రాయాలు చెప్పవచ్చు. ముందు నమోదు చేసుకున్న వారి నుంచి, తరువాత నమోదు చేసుకోని వారి నుంచి అభిప్రాయాలు తీసుకుంటారు. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ప్రజలంతా వీక్షించేందుకు వీలుగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని డిస్కంలను ఏపీఈఆర్‌సీ ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment