సాక్షి, అమరావతి: విద్యుత్ చార్జీల(టారిఫ్)పై ఈ నెల 24వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీ ఈఆర్‌సీ) ప్రజాభిప్రాయాన్ని బహిరంగ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సేకరించనుంది. ఈ నెల 24, 25, 27 తేదీల్లో విశాఖలోని ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఏపీ ఈఆర్‌సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో ఈ సదస్సులు నిర్వహించనున్నారు. సదస్సుల్లో ఏపీఈఆర్‌సీ సభ్యులు ఠాకూర్ రాంసింగ్, పి.రాజగోపాల్‌తో పాటు రాష్ట్ర ఇంధన శాఖ, మూడు డిస్కంల అధికారులు పాల్గొంటారు.
2022–23 సంవత్సరానికి ‘ఏఆర్‌ఆర్’ సమర్పణ
తక్కువ విద్యుత్ వినియోగించే వారిపై విద్యుత్ చార్జీల భారాన్ని తగ్గించే విధంగా చార్జీలను సవరించేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు 2022–23 ఆర్థిక సంవత్సర రిటైల్ సప్లై బిజినెస్ (ఆర్‌ఎస్‌బీ), అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్‌మెంట్ (ఏఆర్‌ఆర్)ను గత ఏడాది డిసెంబర్ 13న ఏపీ ఈఆర్‌సీకి సమర్పించాయి. ప్రస్తుతం ఉన్న శ్లాబుల్లో మార్పులను చేయాల్సిన అవసరాన్ని ఇందులో వివరించాయి. వివిధ మార్గాల ద్వారా 2022–23 ఆర్థిక సంవత్సరానికి 74,815 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి ఉందని వెల్లడించాయి.
మొత్తం ఖర్చులు రూ.45,398.58 కోట్లుగా అంచనా వేశాయి. పరిశ్రమలకు నాన్ పీక్ అవర్స్‌లో టైం ఆఫ్ ది డే (టీఓడీ) పేరుతో యూనిట్‌కు 50 పైసల చొప్పున రాయితీ ఇచ్చేందుకు డిస్కంలు ప్రతిపాదించాయి. అవసరమైతే ఇదే విధానాన్ని గృహ విద్యుత్ వినియోగదారులకు కూడా వర్తింపజేస్తామని తెలిపాయి. కాగా, ఏపీ ఈఆర్‌సీ నిలిపివేసిన 2014–2019 ట్రూ అప్ చార్జీలను తిరిగి వసూలు చేసుకునేందుకు అనుమతించాల్సిందిగా డిస్కంలు విజ్ఞప్తి చేశాయి.
కరోనా కారణంగా..
కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్, ఈపీడీసీఎల్‌కు సంబంధించిన బహిరంగ విచారణలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విశాఖ నుంచే జరుపనున్నారు. ప్రతిరోజు ఉదయం 10.30 నుంచి ఒంటిగంట వరకు, మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఎవరైనా తమ అభిప్రాయాలను విద్యుత్ నియంత్రణ మండలికి తెలియజేయవచ్చు. ప్రజాభిప్రాయ సేకరణలో ప్రతిరోజు అన్ని డిస్కంల టారిఫ్ ఫైలింగ్‌కు సంబంధించిన సూచనలు, అభ్యంతరాలు, అభిప్రాయాలను నియంత్రణ మండలి స్వీకరిస్తుంది.
విశాఖ వెళ్లక్కర్లేదు
ఏపీఈఆర్‌సీకి విద్యుత్ చార్జీలపై అభిప్రాయాలు చెప్పదలుచుకున్న వారు విశాఖ వెళ్లాల్సిన అవసరం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లోని సమీప విద్యుత్ ఆపరేషన్ సర్కిల్ (ఎస్‌ఈ ఆఫీస్), డివిజన్ కార్యాలయం (డీఈ ఆఫీస్) ద్వారా పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభిప్రాయాలు చెప్పవచ్చు. ప్రతిరోజు ముందుగానే నమోదు చేసుకున్న వారి నుంచి అభ్యంతరాలు విన్న తరువాత, నమోదు చేసుకోని వారు మాట్లాడేందుకు ఏపీ ఈఆర్‌సీ అనుమతిస్తుంది. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ప్రజలంతా వీక్షించేందుకు వీలుగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ఈపీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావు ‘సాక్షి’కి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment