
వచ్చే ఏడాదీ ప్రస్తుత చార్జీలే ఉంచాలని డిస్కంల నిర్ణయం
వారంలోగా ఈఆర్సీకి ఏఆర్‌ఆర్, టారిఫ్ ప్రతిపాదనలు
చార్జీల భారం తప్పాలంటే సర్కారు సబ్సిడీ నిధులు పెంచాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే ఏడాది కూడా విద్యుత్ చార్జీలు పెంచవద్దని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు సూత్రప్రాయంగా నిర్ణయించాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో కొత్త విద్యుత్ టారిఫ్ అమల్లోకి రావాల్సి ఉండగా, ప్రస్తుత చార్జీలనే కొనసాగించేందుకు అనుమతి కోరుతూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ)కి ప్రతిపాదనలు పంపాలని డిస్కంలు నిర్ణయించినట్టు తెలిసింది.
వారం రోజుల్లో ఈఆర్సీకి 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్‌ఆర్)ను సమర్పించేందుకు కసరత్తు చేస్తున్నాయి. నిబంధనల ప్రకారం ఏటా నవంబర్ 30లోగా ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఏఆర్‌ఆర్ నివేదిక, టారిఫ్ ప్రతిపాదనలను డిస్కంలు ఈఆర్సీకి పంపాలి.
కానీ, ప్రజాపాలన విజయోత్సవాల నేపథ్యంలో ఈ సారి ఆలస్యమైంది. సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నుంచి అనుమతి వచ్చిన వెంటనే ఈఆర్సీకి ప్రతిపాదనలు సమర్పించనున్నట్టు తెలిసింది. ఈ అంశంపై సీఎం, డిప్యూటీ సీఎం త్వరలో సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది.
ప్రభుత్వ సబ్సిడీ నిధులు పెంచితేనే..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024–25లోని చివరి 5 నెలల్లో రూ.1,200 కోట్ల విద్యుత్ చార్జీల పెంపునకు గతంలో డిస్కంలు అనుమతి కోరగా, రూ.30 కోట్ల చార్జీల పెంపునకు మాత్రమే ఈఆర్సీ అనుమతిచ్చిన విషయం తెలిసిందే. డిస్కంల ఆర్థికలోటును భర్తీ చేయడానికి విద్యుత్ సబ్సిడీ నిధులను రూ.11,499 కోట్లకు పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించడంతో చార్జీల పెంపు నుంచి ఉపశమనం లభించింది.
డిస్కంలు కోరినట్టు 5 నెలల కాలానికి రూ.1,200 కోట్ల చార్జీల పెంపునకు ఈఆర్సీ అనుమతిచ్చి ఉంటే.. వచ్చే ఏడాది (2025–26)లో ప్రజలపై రూ.4 వేల కోట్లకుపైగా అదనపు భారం పడి ఉండేది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాదీ చార్జీల పెంపు భారం నుంచి ప్రజలకు ఉపశమనం
కలి్పంచాలంటే ప్రభుత్వం భారీగా సబ్సిడీలను పెంచక తప్పదని అధికారవర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment