
కొవ్వొత్తుల ర్యాలీలో సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో పొన్నం, జూపల్లి, విజయశాంతి, పొంగులేటి, అసదుద్దీన్ ఒవైసీ, అజహరుద్దీన్, దామోదర రాజనర్సింహ, వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్ తదితరులు
పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌లో కలపండి.. సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
బంగ్లాదేశ్‌ను ఏర్పాటు చేసిన ఇందిరా గాందీని ఆదర్శంగా తీసుకొని దాడులు చేయండి
ఉగ్రమూకలకు గట్టి జవాబు ఇవ్వండి.. మేమంతా మీ వెంటే ఉంటాం
ప్రధాని మోదీని ఉద్దేశించి సీఎం రేవంత్
పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో కొవ్వొత్తుల ర్యాలీ
మృతులకు నివాళి.. పాక్‌కు వ్యతిరేకంగా నినాదాలు
పాల్గొన్న మంత్రులు, మహేశ్‌గౌడ్, అసదుద్దీన్, అజహరుద్దీన్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: ‘మోదీజీ.. పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)ను భారత్‌లో కలపండి. 1967, 1971లో ఇలాంటి దాడులు జరిగినప్పుడు నాటి ప్రధాని ఇందిరా గాంధీ దీటైన జవాబు ఇచ్చారు. పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేసి బంగ్లాదేశ్‌ను ఏర్పాటు చేశారు. ప్రధానిగా మీరు ఇప్పుడు తీసుకొనే ఎలాంటి నిర్ణయానికైనా మా సంపూర్ణ మద్దతు ఉంటుంది’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రవాదులు పర్యాటకులను హతమార్చడాన్ని నిరసిస్తూ శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని పీపుల్స్‌ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీకి సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగ్రమూకలకు గట్టి జవాబు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు.
కఠినంగా వ్యవహరించాలి..
‘పహల్గాంలో భారతీయ పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండాలంటే కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. రాజకీయాలకు అతీతంగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాదంపై భారత ప్రభుత్వం చేపట్టే ప్రతి చర్యకూ మద్దతు పలికేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. 140 కోట్ల మంది భారతీయులంతా ఏకమై తీవ్రవాదాన్ని అంతమొందించి దేశ సార్వబౌమత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రధానిని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.
‘ఉగ్రదాడుల్లో మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సానుభూతి తెలుపుతున్నాం. ఆ కుటుంబాలకు అందరం అండగా నిలబడి మనోస్థైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నాం’అని రేవంత్ అన్నారు. ఇందిరాగాంధీ ఒక్క దెబ్బతో పాకిస్తాన్‌ను పాకిస్తాన్, బంగ్లాదేశ్ అని రెండు ముక్కలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ సందర్భంలో ఇందిరాగాంధీని వాజ్‌పేయ్ దుర్గామాతతో పోల్చారని పేర్కొన్నారు. ‘మోదీజీ.. మీరు దుర్గామాత భక్తులు. ఇందిరను ఆదర్శంగా తీసుకొని ఉగ్రవాదులపై దాడులు నిర్వహించాలని కోరారు.
కొవ్వొత్తుల ప్రదర్శన...
పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, మాజీ ఎంపీలు అజహరుద్దీన్, సల్మాన్ ఖుర్షీద్, ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, కాలే యాదయ్య, రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు విజయశాంతి, సలహాదారులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఉగ్ర దాడిలో మరణించిన వారి ఆత్మ శాంతించాలని ప్రారి్థంచారు. భారత్ సమ్మిట్–2025 అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడానికి హైదరాబాద్ విచ్చేసిన ప్రతినిధులు సైతం ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న వారంతా పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జాతీయ జెండాలు పట్టుకొని భారత్ మాతాకి జై అంటూ ముందుకు సాగారు.