డిస్కంలు సమర్పించిన ఏఆర్‌ఆర్ నివేదికలతో ఏపీఈఆర్‌సీ చైర్మన్ జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, సభ్యులు పి.రాజగోపాలరెడ్డి, ఠాకూర్ రామసింగ్. చిత్రంలో ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావు
సాక్షి, అమరావతి: పేద ప్రజలపై ఎటువంటి భారం లేకుండా, విద్యుత్ చార్జీలను స్వల్పంగా పెంచేందుకు అవకాశం కల్పించాలని రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ)ని కోరాయి. 2022–23 ఆర్థిక సంవత్సరానికి అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్‌మెంట్ (ఎఆర్‌ఆర్), రిటైల్ సప్లై బిజినెస్ (ఆర్‌ఎస్‌బీ)ను సోమవారం ఏపీఈఆర్‌సీకి సమర్పించాయి. ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ సమక్షంలో తూర్పు, దక్షిణ, మధ్య ప్రాంతాల విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్)ల సీఎండీలు కె.సంతోషరావు, హెచ్. హరనాధరావు, జె.పద్మాజనార్ధనరెడ్డిలు ఏపీఈఆర్‌సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, సభ్యులు పి.రాజగోపాలరెడ్డి, ఠాకూర్ రామసింగ్‌లకు సమగ్ర ఆదాయ ఆవశ్యకత (ఏఆర్‌ఆర్) నివేదికలను అందజేశారు.
ప్రస్తుతం ఉన్న శ్లాబుల్లో ఈ సారి మార్పులు చేశారు. ఇకపై గృహ విద్యుత్ 0–30 యూనిట్ల లోపు వినియోగానికి యూనిట్‌కు రూ.1.45 పైసలు వసూలు చేయాలని డిస్కంలు ప్రతిపాదించాయి. 31–75 వరకు రూ.2.80 పైసలు, 0–100 వరకు రూ.4, 101–200 వరకు రూ.5, 201–300 వరకు రూ.7, 300 యూనిట్ల పైన రూ.7.50 పైసలు చొప్పున వసూలుకు అనుమతి కోరారు. ప్రస్తుతం 301–400 యూనిట్లు వినియోగిస్తే రూ.7.95 పైసలు, 401 నుంచి 500 వరకూ రూ.8.50 పైసలు, ఆ పైన రూ.9.95 పైసలు చొప్పున చార్జీలు విధిస్తున్నారు.
తాజా ప్రతిపాదనల్లో ఇవి కొంతవరకూ తగ్గించడం ఊరట కలిగిస్తోంది. అదే విధంగా వాణిజ్య విద్యుత్ టారిఫ్‌లను కూడా తగ్గించాలని ప్రతిపాదించారు. 0–50 యూనిట్లు వాడే వారికి యూనిట్ రూ.6.90 పైసల నుంచి రూ.5.40 పైసలకు తగ్గించారు. హైటెన్షన్ విద్యుత్ సర్వీసులకు 11 కెవీ, 33 కేవీ, ఈహెచ్‌టీల టారిఫ్‌లలో మార్పు లేదు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కొనసాగిస్తామన్నారు. హార్స్ పవర్ పెరిగే కొద్దీ విధించే చార్జీలను పెంచాలని అడగలేదు. పరిశ్రమలకు విధించే టారిఫ్‌లపైనా మార్పు లేదు. ఇలా అన్ని వర్గాల వారిపైనా భారం లేకుండా నామమాత్రంగా చార్జీలను పెంచేందుకు అనుమతించాలని డిస్కంలు విజ్ఞప్తి చేశాయి. సరాసరి విద్యుత్ సరఫరా వ్యయం రూ.6.58 పైసలుగా తేల్చాయి. కొత్త టారిఫ్‌ల ప్రకారం విద్యుత్ చార్జీలను వచ్చే ఏడాది ఆగస్టు 1 నుంచి అమలులోకి తేవాలనుకుంటున్నట్లు డిస్కంలు మండలికి తెలిపాయి.
2022–23 ఆర్ధిక సంవత్సరానికి వివిధ మార్గాల ద్వారా 74,815 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కొనాల్సి ఉంటుందని డిస్కంలు అంచనా వేశాయి. 2021–22 ఆర్థిక సంవత్సరంలో డిస్కంల ఆదాయం రూ.40,962.4 కోట్లు ఉంటే ఖర్చు రూ.41,220.99 కోట్లు ఉంది. రూ.258.59 కోట్ల వ్యత్యాసం ఉంది. 2022–23లో మొత్తం ఖర్చులు రూ.45,398.58 కోట్లుగా అంచనా వేయగా లోటు వచ్చే అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తోందని చెబుతూ నికర ఆర్థిక లోటును 0 గా చూపించాయి. అయితే 2014 నుంచి ఈ ఏడాది మార్చి 31 నాటికి డిస్కంలు రూ.28,599 కోట్ల నష్టాల్లో ఉన్నాయని తెలిపాయి. ఇవి కాకుండా రూ.37,465 కోట్ల అప్పులున్నట్లు వెల్లడించాయి.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2021–22లో ఇప్పటి వరకూ రూ.13,560 కోట్ల రుణాలు తీసుకున్నట్లు వివరించాయి. విద్యుత్ కొనుగోలు, సరఫరా ఖర్చులు గడిచిన ఏడేళ్లలో రూ.25,595 కోట్లకు చేరాయని తెలిపారు. గత ఆగస్టులో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్‌ఈసీ) నివేదిక ప్రకారం 100 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగంపై దేశంలోనే అత్యంత తక్కువ చార్జీ ఏపీలో ఉందనే విషయాన్ని గుర్తు చేశాయి.
మిగిలితే వినియోగదారులకు ఇస్తున్నాం
2014–15 నుంచి 2018–19 వరకూ ఆమోదించిన ట్రూఅప్ చార్జీలను ఏపీఈఆర్‌సీ నిలిపివేసింది. తిరిగి వాటి వసూలుకు అనుమతించాలని డిస్కంలు కోరాయి. చార్జీలు వసూలు చేయడమే కాకుండా మిగిలితే తిరిగి వినియోగదారులకు ఇస్తున్నామని, ఈ విధంగా 2022లో ట్రూ డౌన్ రూ.3,373 కోట్లుగా ఇప్పటికే నిర్ధారించామని తెలిపారు. విద్యుత్ కొనుగోలు ఖర్చుల ట్రూ డౌన్ రూ.4,761 కోట్లు, ఆదాయ లోటు రూ.3,685 కోట్లు, అదనపు ఖర్చు రూ.183 కోట్లు, 2021కి అదనపు ఆదాయ లోటు ట్రూ అప్ రూ.2,480 కోట్లు చొప్పున లెక్క గట్టాయి. ఈ అంశాలన్నింటిపైనా ఏపీఈఆర్‌సీ ప్రజాభిప్రాయ సేకరణ (పబ్లిక్ హియరింగ్) నిర్వహించి, తగిన నిర్ణయాన్ని వెలువరిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment