nagulapalli srikanth
-
ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై పరువు నష్టం కేసు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ సరఫరాపై దురుద్దేశపూర్వకంగా అసత్య కథనాలు ప్రచురిస్తూ ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి తెలుగు దినపత్రికలపై పరువు నష్టం కేసు వేస్తున్నట్లు ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ శాఖ కార్యదర్శిగా పలుమార్లు విలేకరుల సమావేశాలు, పత్రికా ప్రకటనల ద్వారా రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవని తెలియజేస్తున్నప్పటికీ, ప్రజల్లో గందరగోళం సృష్టించడంతోపాటు ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేలా వార్తలు ప్రచురిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులందరికీ 24 గంటలపాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామని చెప్పారు. రైతులందరికీ 9 గంటలపాటు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. అయినా, కల్పిత వార్తలు ప్రచురించడం పట్ల విస్మయం వ్యక్తంచేశారు. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచురించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని శ్రీకాంత్ హెచ్చరించారు. (చదవండి: అంగన్వాడీలను గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబుది) -
‘అపోహలు సృష్టిస్తున్నారు.. వారిపై పరువు నష్టం కేసు వేస్తాం’
అమరావతి: విద్యుత్ సరఫరాపై తప్పుడు ప్రచారం చేస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతిపై పరువు నష్టం కేసు వేస్తామని ఏపీ ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ స్పష్టం చేశారు. ఏపీలో విద్యుత్ కోతలు లేవని చెప్పినా, ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని, ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసే విధంగా వార్తలు ప్రచురిస్తున్నారన్నారు. అలాంటి వారిపై ప్రభుత్వం చట్టపరంగా చర్యలు తీసుకుంటుందన్నారు. ఏపీలో 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామని, రైతులకు 9 గంటలపాటు ఉచిత విద్యుత్ ఇస్తున్నా కల్పిత వార్తలు రాస్తున్నారని, తప్పుడు వార్తలు ప్రచురించే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
పుష్కలంగా విద్యుత్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ పుష్కలంగా అందుబాటులో ఉందని, మూడు రోజులుగా ఎటువంటి విద్యుత్ కోతలు లేవని ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ స్పష్టం చేశారు. వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. శనివారం ఆయన ఏపీ జెన్కో ఎండీ బి.శ్రీధర్‌తో కలిసి సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌ను రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల వ్యవసాయ సర్వీసులకు 6,663 ఫీడర్ల ద్వారా అందిస్తున్నామని చెప్పారు. సాంకేతిక కారణాల వల్ల ఎక్కడైనా కొద్ది సేపు అంతరాయం ఏర్పడితే ఆ సమయాన్ని అదే రోజు సర్ధుబాటు చేసి విద్యుత్ సరఫరా చేస్తున్నామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, 2021 ఆర్థిక సంవత్సరంలో రూ.9,717 కోట్లు సబ్సిడీ రూపంలో విడుదల చేసిందన్నారు. ఏడాదిలోగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ మీటర్లు బిగిస్తామని, తొలుత శ్రీకాకుళంలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఆయన ఇంకా ఏమన్నారంటే.. కోతలు లేకుండా చూస్తున్నాం ► పరిశ్రమలకు, గృహ, వాణిజ్య అవసరాలకు ఎటువంటి అవాంతరాలు లేకుండా చవక ధరలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. 2020లో 4,36,837 అంతరాయాలుంటే 2021లో వాటిని 2,02,496కు తగ్గించాం. ► రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ వినియోగం 204 మిలియన్ యూనిట్లుగా ఉంది. గతేడాది ఇదే సమయంలో 198 యూనిట్లు ఉండింది. ప్రస్తుత డిమాండ్‌లో 170 మిలియన్ యూనిట్ల వరకు ఏపీజెన్కో, కేంద్ర విద్యుత్ సంస్థలైన ఎన్టీపీసీ, నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్, న్యుక్లియర్ పవర్ ప్లాంట్స్, ప్రైవేటు పవర్ ప్లాంట్లతో ఉన్న దీర్ఘకాలిక ఒప్పందాల ద్వారా వస్తోంది. ► మిగతా 34 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను బహిరంగ మార్కెట్ నుంచి రోజు, వారం, నెల వారీ బిడ్డింగ్‌ల ద్వారా తీసుకుంటున్నాం. ఈ మూడు మాసాల్లో మాత్రమే అదనపు డిమాండ్ ఉంటుంది. దీనికోసం దీర్ఘకాలిక ఒప్పందాలు అవసరం లేదు. ► 700 నుండి 2000 మెగావాట్ల వరకు ప్రతి పావుగంటకు మార్కెట్లో ఆక్షన్ ద్వారా అన్ని రాష్ట్రాలతో పాటు మనం కూడా పాల్గొని నిర్ధారణ అయిన రేట్ల ప్రకారం కొనుగోలు చేస్తున్నాం. విద్యుత్ వినియోగించే సమయాలను బట్టి రేట్లలో మార్పులు ఉంటాయి. అన్ని జాగ్రత్తలు తీసుకుని రైతుల పంపు సెట్లకు, గృహ, పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం. ► విద్యుత్ కొనుగోలు చెల్లింపులకు సంబంధించి గత ఏడాది నుంచి కేంద్రం నిబంధనలను కఠిన తరం చేసినందున అడ్వాన్సుగా చెల్సించాల్సి వస్తోంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండేళ్ల నుండి పెద్ద ఎత్తున నిధులను విద్యుత్ అవసరాలకు కేటాయిస్తోంది. ఎన్టీపీసీ విషయంలో లెటర్ ఆఫ్ క్రెడిట్ సమస్య ఉత్పన్నమైతే రాష్ట్ర ప్రభుత్వం, ఆర్థిక శాఖ ఆ సమస్యను పరిష్కరించాయి. ► ఈ సమావేశంలో రాష్ట్ర ఇంధన సంరక్షణ మిషన్ సీఈఓ ఎ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. బొగ్గు సమస్య లేదు ఏపీ జెన్కోకు సంబంధించి విజయవాడ, కృష్ణపట్నం, రాయసీమలో మూడు థర్మల్ పవర్ ప్లాంట్లు ఉన్నాయి. వీటి ద్వారా సుమారు 5,010 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఇందులోని మొత్తం 15 యూనిట్లు ఫంక్షనింగ్‌లో ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు 80 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఇందుకోసం రోజుకు 60 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు వినియోగించాల్సి ఉంటుంది. బొగ్గు సమస్య రాకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. – బి.శ్రీధర్, ఏపీ జెన్కో ఎండీ -
జెన్కోకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీజెన్కో)ను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోందని ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ చెప్పారు. సాంకేతిక కారణాల వల్ల ఉద్యోగులకు ఈ నెల జీతాల చెల్లింపు ఆలస్యం అయినప్పటికీ మంగళవారం అందరికీ చెల్లించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యుత్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చెల్లింపుల వివరాలను ఆయన ‘సాక్షి’కి వివరించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పుడిలా.. 2019–20 ఆర్థిక ఏడాదిలో ప్రభుత్వ విభాగాల విద్యుత్ బిల్లులు, వివిధ వర్గాలకు ఇవ్వాల్సిన సబ్సిడీ కలిపి మొత్తం రూ.12,388.93 కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.16,849.27 కోట్లు అందాయి. 2020–21లో రూ.15,299.67 కోట్లు రావాల్సి ఉండగా రూ.12,989.81 కోట్లు ఇచ్చింది. 2021–22లో జనవరి నాటికి రూ.12,632.78 కోట్లు చెల్లించాల్సి ఉండగా, రూ.11,947.76 కోట్లు జమచేసింది. అప్పుడలా.. గత ప్రభుత్వ హయాంలో 2014–15లో రూ.4,099.60 కోట్లు కట్టాల్సి వస్తే రూ.3,953.52 కోట్లు, 2015–16లో రూ.5,302.54 కోట్లకు రూ.4589.96 కోట్లు ఇచ్చారు. 2016–17 నుంచి చెల్లింపులు తగ్గిస్తూ వచ్చారు. ఆ ఆర్థిక సంవత్సరంలో రూ.6,176 కోట్లకుగాను రూ.4,022.57 కోట్లు, 2017–18లో రూ.6,578.81 కోట్లకుగాను రూ.4,141.96 కోట్లు, 2018–19లో రూ.9,641 కోట్లకుగాను రూ.3,458.85 కోట్లు ఇచ్చారు. దీంతో పాత బకాయిలే చాలావరకు మిగిలిపోయాయి. వాటిని కూడా ప్రస్తుత ప్రభుత్వం చెల్లిస్తోంది. జెన్కో నుంచి రోజుకు 57 మిలియన్ యూనిట్లు ఏపీ జెన్కో నుంచి రాష్ట్రానికి 2014–15లో 16,285.4 మిలియన్ యూనిట్లు (ఎంయూ), 2015–16లో 22,044.4 ఎంయూల విద్యుత్ వినియోగించారు. 2016–17లో 24,728.8 ఎంయూ, 2017–18లో 20,562 ఎంయూ, 2018–19లో 22,362.2 ఎంయూ, 2019–20లో 22,470 మిలియన్ యూనిట్లు, 2020–21లో 16,430 ఎంయూ, 2021–22 జనవరి నాటికి 17,539.4 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను జెన్కో నుంచి తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్ అవసరాల్లో రోజుకి సగటున 57.3 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఏపీజెన్కో అందిస్తోంది. -
ప్రభుత్వ సహకారంతో నష్టాలను అధిగమిస్తున్నాం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం 2021–22లో విద్యుత్ పంపిణీ సంస్థలకు వివిధ రకాల సబ్సిడీల కింద రూ.9,717 కోట్లు విడుదల చేసిందని ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ తెలిపారు. ఏపీ సీపీడీసీఎల్ అమలు చేస్తున్న వివిధ నూతన ప్రాజెక్టులు, ప్రగతిపై టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఆదివారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర విద్యుత్ సంస్థల బలోపేతానికి సీఎం వైఎస్ జగన్, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంపూర్ణ సహకారం అందిస్తున్నారని తెలిపారు. అలాగే నష్టాలను తగ్గించడంలో డిస్కంలు మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయని అభినందించారు. వినియోగదారులకు మరింత నాణ్యమైన సేవలందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. సీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మజనార్దనరెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే అత్యుత్తమ డిస్కంలలో ఒకటిగా నిలిచే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. పవర్ ఫర్ ఆల్ పథకం కింద రూ.517 కోట్ల అంచనా వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. స్కాడా కింద విజయవాడ, గుంటూరులలో సబ్స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. విజయవాడ, గుంటూరు నగరాల్లో 16 ఇండోర్ సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. విజయవాడలో కంటైనర్ సబ్‌స్టేషన్ నిర్మాణాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామని తెలిపారు. అగ్రికల్చర్ డీబీటీ పథకం కింద స్మార్ట్ ఎనర్జీ మీటర్ల ఏర్పాటుకు టెండర్లు పూర్తయ్యాయన్నారు. 5వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలకు 3 ఫేజ్ విద్యుత్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. -
విద్యుత్ ఉద్యోగులకు ‘పీఆర్సీ’ ఏర్పాటు
సాక్షి, అమరావతి: విద్యుత్ సంస్థల ఉద్యోగుల కోసం వేతన సవరణ సంఘాన్ని(పీఆర్సీ) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ మన్మోహన్‌సింగ్‌కు ఈ బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర విద్యుత్ బోర్డు(ఏపీఎస్ఈబీ) కింద నియమితులై ఆంధ్రప్రదేశ్ దక్షిణ, మధ్య, తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు, ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్‌కోలలో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలు, అలవెన్సులు, ఇతర ప్రయోజనాలను సవరించేందుకు గానూ అధ్యయనం చేసి తగిన సిఫార్సులు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ బుధవారం ఉత్తర్వులిచ్చారు. కమిషన్ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి 2 నెలల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
విద్యుత్ కొనుగోళ్లలో రూ.4,925 కోట్లు ఆదా
సాక్షి, అమరావతి: బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేయడం ద్వారా రాష్ట్ర విద్యుత్ సంస్థలు 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.4,925 కోట్లను ఆదా చేశాయని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ తెలిపారు. విద్యుత్ సౌధలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలుకు ఏపీఈఆర్సీ రూ.31,346 కోట్ల వ్యయానికి అనుమతి ఇవ్వగా మన డిస్కంలు రూ.26,421 కోట్లను మాత్రమే ఖర్చు చేశాయని చెప్పారు. ఆదా అయిన రూ.4,925 కోట్లలో రూ.3,373 కోట్లను వినియోగదారులకు బదిలీ చేసేందుకు వీలుగా ట్రూ డౌన్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీ ఈఆర్సీ) నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయడం వల్ల్ల దాదాపు 18.50 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతోందని తెలిపారు. ఉచిత విద్యుత్ పథకానికి ప్రభుత్వం రూ.7,714.21 కోట్ల సబ్సిడీ అందించడంతోపాటు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈసీఐ) నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను 2024 నుంచి దశలవారీగా కొనుగోలు చేయాలని భావిస్తోందని చెప్పారు. దేశంలోనే తొలి సాంకేతికత విద్యుత్ డిమాండ్‌ను ఒకరోజు ముందుగానే అంచనా వేసేందుకు ‘డే ఎ హెడ్ ఎలక్ట్రిసిటీ ఫోర్ కాస్టింగ్ మోడల్’ను మన విద్యుత్ సంస్థలు రూపొందించాయని శ్రీకాంత్ తెలిపారు. ఆర్టి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో పనిచేసే ఈ వ్యవస్థ దేశంలోనే మొదటిదని, దీనివల్ల విద్యుత్ సరఫరా, గ్రిడ్ నిర్వహణ వంటి అంశాల్లో కచ్చితమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. విద్యుత్ పంపిణీ నష్టాలు గత ఏడాది 7.50 శాతం ఉండగా, 2021–22లో ఇప్పటివరకు 5 శాతానికి తగ్గాయని చెప్పారు. సాంకేతిక, వాణిజ్య (ఏటీ అండ్ సీ) నష్టాలు 2020–21లో 16.36 శాతం ఉండగా.. 2021–22 నవంబర్ నాటికి 11 శాతానికి తగ్గించగలిగామన్నారు. కాగా, విద్యుత్ సౌధలో బుధవారం 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఏపీ ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్లు ఐ.పృధ్వీతేజ్, బి.మల్లారెడ్డి, ట్రాన్స్‌కో, జెన్కో డైరెక్టర్లు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
విద్యుత్ ఉద్యోగులూ.. ఆందోళనొద్దు
సాక్షి, అమరావతి: ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంలలో ఉద్యోగుల జీతాలు తగ్గనున్నాయనే ప్రచారాన్ని విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు కొట్టిపడేశారు. విద్యుత్ ఉద్యోగులకు పే రివిజన్ కమిటీ(పీఆర్సీ) వేశాక జీతాలు తగ్గిస్తారనేది కేవలం అపోహ మాత్రమేనని వారు స్పష్టం చేశారు. ట్రాన్స్‌కో సీఎండీ నాగులపల్లి శ్రీకాంత్, జెన్కో ఎండీ శ్రీథర్, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మాజనార్దనరెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్.హరనాథరావు, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావులతో పాటు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి బుధవారం సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం వివరాలను సీఎండీలు, జేఏసీ నేతలు ‘సాక్షి’కి వివరించారు. పీఆర్సీ వచ్చే వరకూ ఇవే జీతాలు.. విద్యుత్ సంస్థల్లో ఉద్యోగులు అనవసర భయాలతో వీఆర్ఎస్ తీసుకోవాల్సిన అవసరం లేదని సీఎండీలు తెలిపారు. పీఆర్సీ వచ్చే వరకూ ఇవే జీతాలు కొనసాగుతాయని, ఆ కమిటీ అధ్యయనం తర్వాత తన నివేదికను ప్రభుత్వానికి ఇస్తుందని, ఆపై ప్రభుత్వ నిర్ణయం మేరకు జీతాలుంటాయని వారు వెల్లడించారు. అలాగే కొత్తగా తీసుకొస్తున్న సర్వీస్ రెగ్యులేషన్స్ వల్ల కూడా జీతాలు తగ్గుతాయనే అనుమానాలున్నాయని, అది పూర్తిగా అవాస్తవమన్నారు. రెగ్యులేషన్స్ ఎప్పుడు అమల్లోకొస్తే ఆ రోజు నుంచి నియమితులైన ఉద్యోగులకే ఆ నిబంధనలు వర్తిస్తాయని, అవి రావడానికి ముందు ఉన్న ఉద్యోగులెవరికీ వాటి వల్ల ఎలాంటి ఇబ్బందులుండవన్నారు. సెక్షన్ 79సీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లయి యాక్ట్ 1948 ప్రకా>రం 1967లో రెగ్యులేషన్స్ రూపొందించారని, ఆపై దాని స్థానంలో ఎలక్ట్రిసిటీ యాక్ట్ 2003 వచ్చిందన్నారు. దీనివల్ల పాతది వాడుకునేందుకు వీల్లేదని, ఒక బోర్డు రెగ్యులేషన్లను మరో బోర్డు మార్చేందుకూ అవకాశం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో కొత్తగా రెగ్యులేషన్స్ రూపొందిస్తున్నారని వివరించారు. కేసులను ఎత్తివేస్తామన్నారు.. ఉద్యోగుల సంక్షేమమే తమకు తొలి ప్రాధాన్యమని బాలినేని, సజ్జల స్పష్టం చేసినట్టు ఏపీ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) చైర్మన్ చంద్రశేఖర్ తెలిపారు. ఉద్యోగ సంఘాల నేతలపై ఉన్న దాదాపు 32 కేసులను తక్షణమే ఎత్తివేస్తామని వారు హామీ ఇచ్చినట్టు వెల్లడించారు. డీఏ, ఇతర అంశాలపై చర్చించేందుకు వారంలో మరోసారి సమావేశం నిర్వహిస్తామన్నారని చంద్రశేఖర్ వివరించారు. మీటర్ రీడర్లకు పీస్ రేటు(విద్యుత్ బిల్లులపై ఇచ్చే కమీషన్)ను త్వరలో పెంచేందుకు చర్యలు చేపడతామని బాలినేని, సజ్జల హామీ ఇచ్చినట్టు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్ల రాష్ట్ర కార్యాచరణ కమిటీ(జేఏసీ) గౌరవాధ్యక్షుడు బాలకాశి, యూనియన్ నేతలు తెలిపారు. సచివాలయంలో వారిని కలిసి తమ సమస్యలను విన్నవించగా సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. మూడు కంపెనీల సీఎండీలు చర్చించి రేటుపై నిర్ణయం తీసుకోవాలని బాలినేని, సజ్జల ఆదేశించినట్టు జేఏసీ నేతలు చెప్పారు. డిస్కంల పరిధిలో ఉన్న దాదాపు 4,600 మంది రీడర్లకు డిస్కం పరిధిలోనే ఇతర ఉపాధి అవకాశాలు కల్పించే అంశాన్ని కూడా పరిశీలించాల్సిందిగా సీఎండీలకు వారు సూచించినట్టు వివరించారు. -
15వేల మి.యూ. విద్యుత్ ఆదా లక్ష్యం
సాక్షి, అమరావతి: భవిష్యత్‌లో 15 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను రాష్ట్రంలో ఆదా చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ఇంధన శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లు, విద్యుత్ శాఖ సమన్వయంతో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. స్టార్ రేటెడ్ ఎలక్ట్రికల్ ఉపకరణాలను ఇళ్లలో ఉపయోగించడంవల్ల సగటున 40 శాతం విద్యుత్ ఆదా అవుతుందని, విద్యుత్ బిల్లులూ తగ్గుతాయి కాబట్టి వాటిని ఉపయోగించాలని ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ రాష్ట్ర ప్రజలకు సూచించారు. కృష్ణాజిల్లా కలెక్టర్ జె. నివాస్‌తో కలిసి విజయవాడలో మంగళవారం ఆయన జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాలను ప్రారంభించారు. ఏపీఎస్ఈసీఎం, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఎస్పీడీసీఎల్) ఆధ్వర్యంలో విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలతో ర్యాలీ నిర్వహించారు. ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ. చంద్రశేఖరరెడ్డి, ఏపీ ట్రాన్స్‌కో విజిలెన్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ బి. మల్లారెడ్డి, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె పద్మజనార్ధనరెడ్డి, విజయవాడ ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శివప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. -
పేదలపై విద్యుత్ చార్జీల భారం వేయం
సాక్షి, అమరావతి: పేద ప్రజలపై ఎటువంటి భారం లేకుండా, విద్యుత్ చార్జీలను స్వల్పంగా పెంచేందుకు అవకాశం కల్పించాలని రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ)ని కోరాయి. 2022–23 ఆర్థిక సంవత్సరానికి అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్ (ఎఆర్ఆర్), రిటైల్ సప్లై బిజినెస్ (ఆర్ఎస్బీ)ను సోమవారం ఏపీఈఆర్సీకి సమర్పించాయి. ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ సమక్షంలో తూర్పు, దక్షిణ, మధ్య ప్రాంతాల విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్)ల సీఎండీలు కె.సంతోషరావు, హెచ్. హరనాధరావు, జె.పద్మాజనార్ధనరెడ్డిలు ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి, సభ్యులు పి.రాజగోపాలరెడ్డి, ఠాకూర్ రామసింగ్లకు సమగ్ర ఆదాయ ఆవశ్యకత (ఏఆర్ఆర్) నివేదికలను అందజేశారు. ప్రస్తుతం ఉన్న శ్లాబుల్లో ఈ సారి మార్పులు చేశారు. ఇకపై గృహ విద్యుత్ 0–30 యూనిట్ల లోపు వినియోగానికి యూనిట్‌కు రూ.1.45 పైసలు వసూలు చేయాలని డిస్కంలు ప్రతిపాదించాయి. 31–75 వరకు రూ.2.80 పైసలు, 0–100 వరకు రూ.4, 101–200 వరకు రూ.5, 201–300 వరకు రూ.7, 300 యూనిట్ల పైన రూ.7.50 పైసలు చొప్పున వసూలుకు అనుమతి కోరారు. ప్రస్తుతం 301–400 యూనిట్లు వినియోగిస్తే రూ.7.95 పైసలు, 401 నుంచి 500 వరకూ రూ.8.50 పైసలు, ఆ పైన రూ.9.95 పైసలు చొప్పున చార్జీలు విధిస్తున్నారు. తాజా ప్రతిపాదనల్లో ఇవి కొంతవరకూ తగ్గించడం ఊరట కలిగిస్తోంది. అదే విధంగా వాణిజ్య విద్యుత్ టారిఫ్‌లను కూడా తగ్గించాలని ప్రతిపాదించారు. 0–50 యూనిట్లు వాడే వారికి యూనిట్ రూ.6.90 పైసల నుంచి రూ.5.40 పైసలకు తగ్గించారు. హైటెన్షన్ విద్యుత్ సర్వీసులకు 11 కెవీ, 33 కేవీ, ఈహెచ్‌టీల టారిఫ్‌లలో మార్పు లేదు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కొనసాగిస్తామన్నారు. హార్స్ పవర్ పెరిగే కొద్దీ విధించే చార్జీలను పెంచాలని అడగలేదు. పరిశ్రమలకు విధించే టారిఫ్‌లపైనా మార్పు లేదు. ఇలా అన్ని వర్గాల వారిపైనా భారం లేకుండా నామమాత్రంగా చార్జీలను పెంచేందుకు అనుమతించాలని డిస్కంలు విజ్ఞప్తి చేశాయి. సరాసరి విద్యుత్ సరఫరా వ్యయం రూ.6.58 పైసలుగా తేల్చాయి. కొత్త టారిఫ్‌ల ప్రకారం విద్యుత్ చార్జీలను వచ్చే ఏడాది ఆగస్టు 1 నుంచి అమలులోకి తేవాలనుకుంటున్నట్లు డిస్కంలు మండలికి తెలిపాయి. 2022–23 ఆర్ధిక సంవత్సరానికి వివిధ మార్గాల ద్వారా 74,815 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను కొనాల్సి ఉంటుందని డిస్కంలు అంచనా వేశాయి. 2021–22 ఆర్థిక సంవత్సరంలో డిస్కంల ఆదాయం రూ.40,962.4 కోట్లు ఉంటే ఖర్చు రూ.41,220.99 కోట్లు ఉంది. రూ.258.59 కోట్ల వ్యత్యాసం ఉంది. 2022–23లో మొత్తం ఖర్చులు రూ.45,398.58 కోట్లుగా అంచనా వేయగా లోటు వచ్చే అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తోందని చెబుతూ నికర ఆర్థిక లోటును 0 గా చూపించాయి. అయితే 2014 నుంచి ఈ ఏడాది మార్చి 31 నాటికి డిస్కంలు రూ.28,599 కోట్ల నష్టాల్లో ఉన్నాయని తెలిపాయి. ఇవి కాకుండా రూ.37,465 కోట్ల అప్పులున్నట్లు వెల్లడించాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2021–22లో ఇప్పటి వరకూ రూ.13,560 కోట్ల రుణాలు తీసుకున్నట్లు వివరించాయి. విద్యుత్ కొనుగోలు, సరఫరా ఖర్చులు గడిచిన ఏడేళ్లలో రూ.25,595 కోట్లకు చేరాయని తెలిపారు. గత ఆగస్టులో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) నివేదిక ప్రకారం 100 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగంపై దేశంలోనే అత్యంత తక్కువ చార్జీ ఏపీలో ఉందనే విషయాన్ని గుర్తు చేశాయి. మిగిలితే వినియోగదారులకు ఇస్తున్నాం 2014–15 నుంచి 2018–19 వరకూ ఆమోదించిన ట్రూఅప్ చార్జీలను ఏపీఈఆర్సీ నిలిపివేసింది. తిరిగి వాటి వసూలుకు అనుమతించాలని డిస్కంలు కోరాయి. చార్జీలు వసూలు చేయడమే కాకుండా మిగిలితే తిరిగి వినియోగదారులకు ఇస్తున్నామని, ఈ విధంగా 2022లో ట్రూ డౌన్ రూ.3,373 కోట్లుగా ఇప్పటికే నిర్ధారించామని తెలిపారు. విద్యుత్ కొనుగోలు ఖర్చుల ట్రూ డౌన్ రూ.4,761 కోట్లు, ఆదాయ లోటు రూ.3,685 కోట్లు, అదనపు ఖర్చు రూ.183 కోట్లు, 2021కి అదనపు ఆదాయ లోటు ట్రూ అప్ రూ.2,480 కోట్లు చొప్పున లెక్క గట్టాయి. ఈ అంశాలన్నింటిపైనా ఏపీఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ (పబ్లిక్ హియరింగ్) నిర్వహించి, తగిన నిర్ణయాన్ని వెలువరిస్తుంది. -
ఇంధన పొదుపుతో ఖర్చుల అదుపు
సాక్షి, అమరావతి: ఇంధన సామర్థ్యం, పొదుపు చర్యలపై ప్రజలు, ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ సంస్థలకు పెద్దఎత్తున అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ దృష్ట్యా అందరూ ఇంధన పరిరక్షణ వారోత్సవాలలో భాగస్వాములు కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంధన సంరక్షక మిషన్ (ఏపీఎస్ఈసీఎం) చైర్మన్ సమీర్‌శర్మ కోరారు. రాష్ట్రంలో ఈ నెల 14 నుంచి మొదలయ్యే ఇంధన పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా అందించనున్న స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ (సెక) 2021పై ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్, ఇతర అధికారులతో ఆయన ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. పెరుగుతున్న ఇంధన డిమాండ్‌ను అందుకోవడానికి, ఇంధన భద్రత, ఆర్థికాభివృద్ధి సాధించేందుకు, ఇంధనంపై వ్యయాన్ని తగ్గించేందుకు ఇంధన సామర్థ్య చర్యలు దోహదపడతాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇంధన పరిరక్షణ అవార్డుల కార్యక్రమంలో ఎక్కువ మంది పాల్గొనేలా సహకరించాల్సిందిగా అన్ని ప్రభుత్వ శాఖలకు ఇప్పటికే విజ్ఞప్తి చేసినట్లు ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ సీఎస్‌కు వివరించారు. వివిధ రంగాల్లో ఇంధన సామర్థ్య కార్యక్రమాలు అమలు చేయడం ద్వారా ఏటా 15 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేసే అవకాశముందని పేర్కొన్నారు. ‘సెక’ పోటీలో ఎక్కువ మంది పాల్గొనేందుకు వీలు కల్పిస్తూ దరఖాస్తు గడువును ఈ నెల 8వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి తెలిపారు. కేటగిరీల వారీగా అవార్డులకు అర్హతలు ఇలా.. పరిశ్రమలు, భవన నిర్మాణం, మునిసిపల్ రంగానికి సంబంధించిన వివిధ సంస్థల మధ్య నిర్విహిస్తున్న సెక–2021 అవార్డుల పోటీకి సంబంధించిన అర్హత ప్రమాణాలను ఏపీఎస్ఈసీఎం ఆదివారం ప్రకటించింది. పారిశ్రామిక రంగం కింద, మొత్తం వార్షిక ఇంధన వినియోగం 3000 టీన్ ఆఫ్ ఆయిల్ ఈక్వలెంట్ (టీఓఈ) లేదా అంతకంటే ఎక్కువ కలిగిన సిమెంట్ పరిశ్రమలు, 1500 టీఓఈ లేదా అంతకంటే ఎక్కువ మొత్తం వార్షిక ఇంధన వినియోగం కలిగిన టెక్స్టైల్ పరిశ్రమలు, 1000 కేవీఏ, అంతకంటే ఎక్కువ డిమాండ్ ఉన్న ఎంఎస్ఎంఈ సంస్థలు ఈ అవార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చు. భవనాల విభాగం కింద, వాణిజ్య భవనాలు, హోటళ్లు, ఆస్పత్రులు, షాపింగ్ మాల్స్, ప్లాజాలు, యూనివర్సిటీలు, 100 కిలోవాట్, 120 కిలోవాట్ లేదా అంతకంటే ఎక్కువ కాంట్రాక్ట్ డిమాండ్ ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలు, 50 కిలోవాట్ కంటే ఎక్కువ లోడ్ ఉన్న విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్ కళాశాలలు దరఖాస్తుకు అర్హులు. మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, మురుగు నీటి పంపింగ్ బోర్డులు, తాగునీటి సరఫరా బోర్డులు కూడా పోటీలో పాల్గొనవచ్చు. దరఖాస్తు వివరాలు ఏపీఎస్ఈసీఎం, డిస్కంల వెబ్సైట్లలో అందుబాటులో ఉన్నాయి. పూరించిన దరఖాస్తును seca.apsecm.gmail.com ద్వారా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు సమర్పించాలి. -
విద్యుత్ రేట్లు ఎప్పుడూ ఒకేలా ఉండవు
-
Andhra Pradesh: ఖజానాకు ఆదా..ఉచితానికి భరోసా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వ్యవసాయానికి పగటిపూటే 9 గంటలపాటు ఉచిత విద్యుత్‌ను వచ్చే 25 ఏళ్లపాటు నిరాటంకంగా అందించేందుకే కేంద్ర ప్రభుత్వం సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో ఒప్పందం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ తెలిపారు. ఆదివారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా దీర్ఘకాలం నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని, ఇది రైతులకు పూర్తి భరోసానిస్తుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం కొనుగోలు చేస్తున్న ధర కంటే తక్కువకే కొంటున్నందున ఏడాదికి రూ.2,400 కోట్లు ఆదా అవుతుందని తెలిపారు. ఇవాక్యులేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యయం మరో రూ.2,260 కోట్లు కూడా ఆదా అవుతాయని వెల్లడించారు. సెకీతో విద్యుత్ ఒప్పందం రాష్ట్రానికి ప్రయోజనకరమని అంశాలవారీగా వివరించారు... యూనిట్‌కు రూ.1.87 ఆదా.. 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను కలుపుకొని వ్యవసాయానికి పగటి పూట 9 గంటలు నిరాటంకంగా నాణ్యమైన విద్యుత్ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. ప్రస్తుతం వ్యవసాయానికి అందించే విద్యుత్‌ను యూనిట్ సగటున రూ.4.36 చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు ఉచితంగా అందిస్తోంది. సెకీతో ఒప్పందం వల్ల ఈ విద్యుత్ యూనిట్ రూ.2.49కే వస్తుంది. ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ద్వారా పిలిచిన టెండర్లలో కనీస బిడ్ యూనిట్‌కు రూ.2.49కు కోట్ చేశారు. తద్వారా యూనిట్‌కు దాదాపు రూ.1.87 ఆదా అవుతుంది. ఆ ప్రకారం ఏడాదికి రూ.2,400 కోట్ల వరకూ ప్రజాధనాన్ని ఆదా చేయొచ్చు. మనకు మరింత చౌకగా.. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ చట్టం ప్రకారమే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆప్ ఇండియా (సెకీ) యూనిట్ రూ.2.49 చొప్పున ప్రతిపాదించగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. తమిళనాడు ప్రభుత్వం సెప్టెంబర్ లోనే సెకీ నుంచి యూనిట్ రూ.2.61చొప్పున సోలార్ విద్యుత్‌ను కొనుగోలు చేసింది. ఏపీ ప్రభుత్వం అంతకంటే తక్కువకే రూ.2.49కే సెకీ సంస్థ నుంచి కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకోనుంది. 2014 నుంచి ఆంధ్రప్రదేశ్ చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలలో ప్రస్తుతం సెకీ ప్రతిపాదించిందే అతి తక్కువ ధర. అలాగే ఐఎస్టీఎస్ ఛార్జీల నుంచి కేంద్రం మినహాయింపు ఇచ్చింది. కేంద్ర చట్టాల ప్రకారమే.. డిస్కంలపై పడే నెట్ వర్క్ ఛార్జీల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నాం కాబట్టి కేంద్ర విద్యుత్ చట్టాన్ని అనుసరించాల్సి ఉంటుంది. విద్యుత్ కొనుగోళ్లపై ముందుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తరువాతే విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్(ఈఆర్సీ) కు ప్రతిపాదిస్తుంది. ఈఆర్సీ ఆమోదించిన తరువాతే సెకీతో ఒప్పందం కుదుర్చుకుంటుంది. 2014 నుంచి పీపీఏ ఒప్పందాలలో భాగంగా చేంజ్ ఆఫ్ లా ప్రకారం విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు మీద పన్నులు పెరిగినా, తగ్గినా కొనుగోలుదారుడే (ప్రభుత్వం, డిస్కంలు) భరిస్తాయి. కేంద్ర విద్యుత్ చట్టంలో దీన్నొక నిబంధనంగా నోటిఫై చేశారు. ప్రస్తుతం దేశంలో అన్ని టెండర్లలో ఈ నిబంధన అమల్లో ఉంది. దీన్ని మార్చడానికి అవకాశం లేదు. లైన్ల ఖర్చుండదు.. ఇతర అవసరాలకు భూములు సెకీ నుంచి సౌర విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల ఇవాక్యులేషన్ లైన్ల ఖర్చు భారం ఉండదు. రాష్ట్రంలో ఏర్పాటు చేసే ప్లాంట్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలంటే ప్రభుత్వం రూ.2,260 కోట్లు ఖర్చు పెట్టి ఇవాక్యులేషన్ లైన్లు నిర్మించాల్సి ఉంటుంది. సెకీతో ఒప్పందంతో ఆమేరకు భారీగా ప్రజాధనం ఆదా అవుతుంది. రాష్ట్రంలో ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే జీఎస్టీ ఆదాయాన్ని పరిగణలోకి తీసుకున్నాసరే అది ఒకసారికే పరిమితమవుతుంది. కానీ కేంద్ర గ్రిడ్‌కు ఛార్జీలు 25 ఏళ్లపాటు కట్టాల్సి ఉంటుంది. దాంతో రాష్ట్రం చాలా ఆర్థిక భారాన్ని భరించాల్సి వస్తుంది. మరోవైపు సెకీ విద్యుత్ వల్ల మనం భూములు ఇవ్వాల్సిన అవసరం లేదు. అవసరమైతే వేరే ప్రాజెక్టుల కోసం ఈ భూమి ఉపయోగించుకోవచ్చు. తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ కంటే రాజస్థాన్‌లో సూర్యుడు ఎక్కవ సేపు ప్రకాశిస్తాడు. మన రాష్ట్రంలో కంటే అక్కడ గంటన్నర సేపు అధికంగా సూర్యరశ్మి ఉండటంతో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. అందువల్ల డిమాండ్ అధికంగా ఉండే పీక్ అవర్స్‌లో సెకీ విద్యుత్ బాగా ఉపయోగపడుతుంది. అదే ఎక్సే్చజీ నుంచి కొనుగోలు చేస్తే పీక్ అవర్‌లో కరెంట్ ధరలు అధికంగా ఉంటాయి. ఐదేళ్లలో అస్తవ్యస్థం గత సర్కారు హయాంలో డిస్కంలపై తీవ్ర ఒత్తిడి తెచ్చి 25 ఏళ్లకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) చేసుకోవడంతో 2014– 2019 మధ్య రాష్ట్ర విద్యుత్ రంగం పూర్తిగా దివాళా తీసింది. కొనుగోలు నష్టాలు కొండలా పేరుకుపోయాయి. అప్పులు గుదిబండల్లా మారాయి. చౌక విద్యుత్తు కొనుగోళ్లకు ప్రాధాన్యమివ్వకుండా దీర్ఘకాలిక ఒప్పందాలపై గత సర్కారు మొగ్గు చూపడంతో డిస్కమ్‌లు నష్టాల భారంతో దివాళా స్థితికి చేరుకున్నాయి. నోట్: ‘సెకీ’ 2017 డిసెంబర్లో నిర్వహించిన వేలంలో ధరలు, గత సర్కారు కొన్న ధరల్లో వ్యత్యాసం వివరాలు ఇవీ. చదవండి: 'పల్లె..' ఇవేం నీతిమాలిన పనులు?.. ఆడియో వైరల్ -
‘సెకీ’ విద్యుత్ లాభమే
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) ఏర్పాటుచేసే 9 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) కుదుర్చుకోవడం లాభదాయకమేనని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ స్పష్టం చేశారు. ‘సెకీ నుంచి విద్యుత్ కొంటే నష్టమే’ శీర్షికతో ఈనాడు ప్రచురించిన కథనంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రాజెక్టు ఏర్పాటుకు ఇచ్చే నిధులు మౌలిక సదుపాయాలు కల్పించే నిమిత్తం పార్క్ డెవలపర్‌కు చెల్లించేవేనని, బిడ్డింగ్ ధరలో ఈ అంశం కూడా ఉంటుందన్నారు. అలాగే.. జీఎస్టీ పన్నును విద్యుత్ ఉత్పత్తి ధరలో భాగంగా పరిగణించకూడదన్నారు. ‘సెకీ’ నుంచి విద్యుత్ తీసుకోవడంవల్ల ప్రస్తుతం రాష్ట్రంలో అందుబాటులో ఉన్న భూమి కూడా భవిష్యత్తులో ఇతర ప్రాజెక్టులు చేపట్టడానికి పనికొస్తుందని ఆయన పేర్కొన్నారు. యూనిట్ రూ.2.49 పైసలకు తీసుకుంటే 3% అంతర్రాష్ట్ర విద్యుత్ ప్రసార నష్టాలు 7.5 పైసలు మాత్రమే వస్తుందని.. 27 పైసలు కాదని శ్రీకాంత్ తెలిపారు. అంతేకాక.. రాష్ట్రంలో సౌర ప్రాజెక్టులు చేపట్టినప్పుడు వాటికి కావలసిన విద్యుత్ లైన్లు, అంతర్గతంగా విద్యుత్ ప్రసార వ్యవస్థ బలోపేతానికి అయ్యే ఖర్చు.. బయటి రాష్ట్రం నుంచి నేరుగా సౌర విద్యుత్ తీసుకున్నప్పుడు అంతర్గత వ్యవస్థకు అయ్యే ఖర్చుల మధ్య కూడా తేడా ఉంటుందని వివరించారు. ప్రాథమికంగా ఇప్పుడున్న అంతర్రాష్ట్ర, అంతర్గత రాష్ట్ర విద్యుత్ ప్రసార వ్యవస్థల సామర్థ్యాన్ని బేరీజు వేసుకుంటే.. బయటి రాష్ట్రాల నుంచి సౌర విద్యుత్ తీసుకున్నప్పుడే ఖర్చు తక్కువవుతుందని శ్రీకాంత్ స్పష్టంచేశారు. యూనిట్‌కు రూ.1.87 పైసల ఆదా ప్రస్తుతం రూ.4.36 పైసల చొప్పున ఒక యూనిట్ విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నామని.. అయితే, ‘సెకీ’ నుండి దీర్ఘకాలిక ఒప్పందం ద్వారా అదే ఒక యూనిట్ విద్యుత్‌ను 2.49 పైసలకు కొనుగోలు చేయడంవల్ల యూనిట్‌కు రూ.1.87 పైసల వరకు ఆదా అవుతుందని శ్రీకాంత్ తెలిపారు. ఈ లెక్కన ఏటా దాదాపు రూ 3,060 కోట్లు ఆదా అవుతుందని ఆయన వివరించారు. ఉచిత వ్యవసాయ విద్యుత్ కోసమే.. ఇక సీఎం వైఎస్ జగన్ సత్సంకల్పంతో రానున్న 25 ఏళ్లకు రాష్ట్రంలోని రైతుల ఉచిత వ్యవసాయ విద్యుత్ అవసరాల కోసమే ‘సెకీ’ నుంచి విద్యుత్ తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఒక సుస్థిరమైన, ప్రత్యేక ఫీడర్లు కల్గిన, అదనపు లోడ్ గుర్తించే సామర్థ్యమున్న మీటర్లతో ఒక స్వతంత్ర విద్యుత్ వ్యవస్థను తీర్చిదిద్దే క్రమంలో భాగంగా ఈ తక్కువ ధర సౌర విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అమలులో వున్న సౌర పీపీఏల సగటు యూనిట్ ధర దాదాపు రూ.4.50 ఉందన్నారు. ఈ నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్‌కి ఎన్టీపీసీ సరఫరా చేస్తున్న సౌర విద్యుత్ ధర యూనిట్ రూ.2.79 పైసల (ట్రేడింగ్–మార్జిన్ కలిపి) కన్నా ‘సెకీ’ ప్రతిపాదించిన యూనిట్ రూ.2.49పై. (ట్రేడింగ్–మార్జిన్ కలిపి) ధర తక్కువని శ్రీకాంత్ స్పష్టంచేశారు. కాబట్టి.. అనవసరంగా లేనిపోని అభూత కల్పనలతో అవాస్తవాలను ప్రచారం చేయవద్దని ఆయన హితవు పలికారు. -
Andhra Pradesh: ఫుల్‌గా ‘పవర్’
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా బొగ్గు కొరత నేపథ్యంలో రాష్ట్రానికి కావాల్సిన విద్యుత్‌ను సమీకరించుకోవాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. రాష్ట్రంలో కరెంట్ పరిస్థితులతో పాటు బొగ్గు సరఫరా, విద్యుత్ కొరత రాకుండా అమలు చేస్తున్న అత్యవసర ప్రణాళికలు, దీర్ఘకాలిక వ్యూహాలపై సీఎం సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, జెన్కో ఎండీ శ్రీధర్ సహా పలువురు అధికారులతో దీనికి హాజరయ్యారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా చూడాలని సీఎం ఆదేశించారు. సింగరేణి సహా కోల్ ఇండియా తదితర సంస్థలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని సూచించారు. బొగ్గు తెప్పించేందుకు సరుకు రవాణా ఓడల వినియోగం లాంటి ప్రత్యామ్నాయాలపై కూడా ఆలోచన చేయాలని, దీనివల్ల రవాణా ఖర్చులు కలసి వస్తాయన్నారు. అవసరమైతే షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో మాట్లాడాలని సూచించారు. దీనికోసం సంబంధిత కేంద్ర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకోవాలన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలే లక్ష్యంగా.. తాత్కాలిక చర్యలతో పాటు దీర్ఘకాలిక విద్యుదుత్పత్తి వ్యూహాలపైనా దృష్టి సారించాలని సీఎం జగన్ ఆదేశించారు. 6,300 మెగావాట్ల రివర్స్ పంపింగ్ విద్యుదుత్పత్తి ప్రాజెక్టు నిర్మాణంపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టి వేగంగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని, ఇలాంటి ప్రాజెక్టుల వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయని సీఎం పేర్కొన్నారు. సీలేరులో ప్రతిపాదిత 1,350 మెగావాట్ల రివర్స్ పంపింగ్ ప్రాజెక్టుపైనా దృష్టిపెట్టాలన్నారు. ఈ ప్రాజెక్టులు సాకారమయ్యేలా వెంటనే చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. నాన్ పీక్ అవర్స్‌లో నీటిని వెనక్కి పంపేందుకు (రివర్స్ పంపింగ్) సౌర విద్యుత్ వాడుకుని అనంతరం ఆ నీటినే వినియోగించి విద్యుదుత్పత్తి చేసే ప్రతిపాదిత ప్రాజెక్టు తొలిదశలో 6,300 మెగావాట్ల ఉత్పత్తికి డీపీఆర్‌లు ఇప్పటికే తయారయ్యాయి. సోలార్‌తో రివర్స్ పంపింగ్‌కు యూనిట్ రూ.2.49 దాకా ఖర్చు కానుంది. అనంతరం డిమాండ్, అవసరాన్ని బట్టి పీక్ అవర్స్‌లో అదే నీటితో జలవిద్యుదుత్పత్తి చేస్తారు. దీనికి రూ.3 వరకు వ్యయం అవుతుంది. దీన్ని పీకింగ్ ప్లాంట్ అని వ్యవహరిస్తారు. పీక్ అవర్స్‌లో డిమాండ్ అధికంగా ఉండటంతో విద్యుత్తు కొనుగోలుకు యూనిట్‌కు రూ.10 నుంచి రూ.12 వరకు వెచ్చించాల్సి వస్తోంది. అలాంటి పరిస్థితి లేకుండా రివర్స్ పంపింగ్ వల్ల అవసరాన్ని బట్టి చౌకగా విద్యుదుత్పత్తి చేసుకునే వెసులుబాటు లభిస్తుంది. అవాంతరాలు లేకుండా సరఫరా రాష్ట్రంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా నిరంతరం విద్యుత్తు సరఫరా చేస్తున్నామని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను బేరీజు వేసుకుంటూ తగిన చర్యలతో ముందుకు వెళ్తున్నామని వివరించారు. మహానది కోల్ ఫీల్డ్స్ నుంచి 2 ర్యాక్‌ల బొగ్గు అదనంగా వచ్చిందని, రాష్ట్రంలో జెన్కో ఆధ్వర్యంలో థర్మల్ విద్యుదుత్పత్తిని 50 మిలియన్ యూనిట్ల నుంచి 69 మిలియన్ యూనిట్లకు పెంచామని అధికారులు తెలిపారు. పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్ నుంచి 170 మెగావాట్ల విద్యుత్ కూడా అందుబాటులోకి వస్తోందని చెప్పారు. -
ఇంధన పొదుపుపై కసరత్తు
సాక్షి, అమరావతి: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)ల్లో భారీ స్థాయిలో ఇంధన పొదుపునకు అవకాశం ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ భావిస్తోంది. ఇంధన సామర్థ్య చర్యలను ప్రోత్సహించడం, అత్యాధునిక ఇంధన సామర్థ్య సాంకేతికతలను ప్రవేశపెట్టడం ద్వారా పెద్దఎత్తున ఇంధనాన్ని ఆదా చేయడానికి అవకాశం ఉందని నమ్ముతోంది. ఈ దృష్ట్యా ఇంధన ఆడిట్ నిర్వహించేలా ఎంఎస్ఎంఈ యజమానులను ప్రోత్సహించాలని రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులను ఆదేశించింది. రూ.1,200 కోట్ల విలువైన విద్యుత్ ఆదా పరిశ్రమల్లో ఇంధన వినియోగం ఏటా 17,000 మిలియన్ యూనిట్లు ఉండగా..ఇందులో ఎంఎస్ఎంఈలు 5,000 మిలియన్ యూనిట్లు వినియోగించుకుంటున్నాయి. కనీసం 10 శాతం పొదుపు చేస్తే 500 మిలియన్ యూనిట్లు ఆదా అయినట్టే. ఎంఎస్ఎంఈల్లో పూర్తిస్థాయిలో ఇంధన సామర్థ్య చర్యలు చేపడితే దాదాపు 2,000 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను పొదుపు చేయవచ్చని, ఇది రూ.1,200 కోట్లకు సమానమని పరిశ్రమల శాఖ అంచనా వేస్తోంది. రాష్ట్రానికి బీఈఈ ఆడిటర్లు భారీ పరిశ్రమలు, ఎంఎస్ఎంఈల్లో ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ఎనర్జీ ఆడిట్ (ఐజీఈఏ) నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన సామర్థ్య అభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్కో) సేవలను వినియోగించుకోవాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ సంచాలకులు, జిల్లాల్లోని జనరల్ మేనేజర్లను తాజాగా ఆదేశించారు. ఈ క్రమంలోనే ఎంఎస్ఎంఈల్లో ఇంధన ఆడిట్ నిర్వహించేందుకు సాంకేతిక సాయం అందించడంతో పాటు గుర్తింపు పొందిన ఇంధన ఆడిటర్లను రాష్ట్రానికి పంపేందుకు బీఈఈ (బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫీషియెన్సీ) అంగీకరించింది. ది ఎనర్జీ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్ (టీఈఆర్ఐ) సమర్పించిన ఇంధన ఆడిట్ నివేదిక ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఫిషరీస్ క్లస్టర్లో 43 ఎంఎస్ఎంఈలు 455 మిలియన్ యూనిట్లు వినియోగిస్తున్నాయి. వీటి విద్యుత్ బిల్లు రూ.296 కోట్లు వస్తోంది. పైలట్ ప్రాజెక్టు కింద ఏపీఎస్ఈసీఎం రెండు ఫిషరీస్ ఎంఎస్ఎంఈలు ఆనంద ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, కదెర్ ఎక్స్‌పోర్ట్స్ సంస్థల్లో ఇంధన ఆడిట్ చేసింది. రూ.1.37 కోట్ల పెట్టుబడితో 1.45 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను పొదుపు చేయవచ్చని, 1,306 టన్నుల కార్బన్ డయాౖఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించవచ్చని ఈ ఆడిట్ లో తేల్చింది. పరిశ్రమల శాఖ మద్దతు హర్షణీయం టీఈఆర్ఐ సంస్థ ద్వారా రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ ఇప్పటికే ఇంధన ఆడిట్ నిర్వహించి ఫిషరీస్ విభాగంలో ఇంధన పొదుపునకు భారీగా అవకాశాలు ఉన్నట్టు గుర్తించింది. ఇంధన సామర్థ్య కార్యక్రమాల అమలులో పరిశ్రమల శాఖ సంపూర్ణ మద్దతు ఇస్తుండటం హర్షించదగ్గ విషయం. – నాగులాపల్లి శ్రీకాంత్, కార్యదర్శి, ఇంధన శాఖ బీఈఈ సంస్థలతోనే ఆడిట్ పరిశ్రమల్లో ఇంధన పొదుపు తద్వారా ఆర్థిక పొదుపు అవకాశాలను గుర్తించేందుకు ఇంధన శాఖకు చెందిన ఏపీ సీడ్కో ఐజీఈఏ (ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ఎనర్జీ ఆడిట్ ) కార్యక్రమాన్ని చేపడతాయి. ఐజీఈఏను బీఈఈకి చెందిన ఇంధన ఆడిట్ సంస్థలే నిర్వహించనున్నాయి. ఐజీఈఏ ఖర్చు పరిశ్రమను బట్టి ఉంటుంది. – కరికాల వలవన్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పరిశ్రమల శాఖ ఆడిట్ తో అనేక ప్రయోజనాలు ఆడిట్ తో అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇంధన ఖర్చును, ఉత్పత్తి ఖర్చును, విదేశీ ఇంధన వనరులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చు. పర్యావరణం దెబ్బతినకుండా, కాలుష్యం పెరగకుండా చూసుకోవచ్చు. గ్రీన్ హౌస్ వాయువుల ప్రభావాన్ని తగ్గించడంతో పాటు పోటీతత్వం, ఇంధన సరఫరాను మెరుగుపర్చుకోవచ్చు. –జేవీఎన్ సుబ్రహ్మణ్యం, కమిషనర్, పరిశ్రమల శాఖ -
బొగ్గు.. భగ్గు!
సాక్షి, అమరావతి, సాక్షి, హైదరాబాద్: ఎడతెరిపి లేని వర్షాలు.. ఉత్పత్తి, సరఫరాలో అంతరాయాలు, కరోనా నుంచి కోలుకుని పరిశ్రమల్లో వినియోగం పెరగడం, వ్యవసాయ సీజన్ కావడం, విదేశీ బొగ్గు ధరలు ఎగబాకడంతో కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోని బొగ్గుకు దేశవ్యాప్తంగా తీవ్ర కొరత ఏర్పడింది. కొరత కారణంగా పలు రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలోని విద్యుదుత్పత్తి కేంద్రాల్లోనూ బొగ్గు నిల్వలు నిండుకున్నాయి. థర్మల్ కేంద్రాల్లో బొగ్గు సంక్షోభంతో సోమవారం నాటికి దేశంలోని దాదాపు 13 రాష్ట్రాల్లో విద్యుత్ లోటు ఏర్పడింది. ఫలితంగా విద్యుత్ కోతలు అనివార్యమవుతున్నాయి. అంతర్జాతీయ, దేశీయ విపణిలో బొగ్గు కొరత తీరే వరకు మరికొన్ని రోజుల పాటు కోతలు కొనసాగే అవకా>శాలున్నాయి. జాతీయ స్థాయిలో గ్రిడ్ నిర్వహణను నియంత్రించే ‘పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్’(పోసోకో) నివేదికలను విశ్లేషిస్తే వారం పది రోజులుగా పంజాబ్, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, హర్యాణా, బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో కోతలు తీవ్ర స్థాయిలో పెరిగిపోయాయి. బిహార్, ఝార్ఖండ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం రోజుకు 8 – 7 గంటలకు మించి విద్యుత్ సరఫరా ఉండడం లేదని జాతీయ మీడియా పేర్కొంటోంది. దక్షిణాదిన కేరళలో విద్యుత్ కొరత గణనీయంగా ఉండగా కర్ణాటక, ఏపీలో స్వల్పంగా కొరత నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా.. ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనడంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. చైనా లాంటి దేశాలు కూడా బొగ్గు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. విద్యుత్ కోతలతో చైనాలోని పరిశ్రమలు అల్లాడుతున్నాయి. మన దేశంలోనూ విద్యుత్తు డిమాండ్ గణనీయంగా పెరిగింది. మరోవైపు గత ఏడాది కాలంలో విదేశీ బొగ్గు ధరలు దాదాపు రెట్టింపు కావడంతో బొగ్గు దిగుమతులపై ఆధారపడ్డ థర్మల్ ప్లాంట్లపై ఆర్థిక భారం పెరిగిపోయింది. దీంతో దేశీయ కోల్ ఇండియా, సింగరేణి బొగ్గుకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. వీటి నుంచి సరఫరాను క్రమంగా పెంచడం ద్వారా సంక్షోభాన్ని అధిగమిస్తామని కేంద్రం పేర్కొంటోంది. రోజూ 80 – 110 ఎంయూల కొరత దేశంలో ఈ ఏడాది తలెత్తిన కొరతలో ప్రస్తుత అక్టోబర్ నెల తొలి వారం రోజుల్లోనే ఏకంగా 11.2 శాతం కొరత నమోదు కావడం గమనార్హం. గతేడాది అక్టోబర్ తొలి వారంలో తలెత్తిన కొరతతో పోల్చితే ఇప్పుడు ఈ నెల తొలివారంలో 21 రెట్లు పెరిగినట్లు కేంద్ర గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత వారం రోజులుగా దేశంలో సగటున రోజుకు 3,880 మిలియన్ యూనిట్ల (ఎంయూ) వినియోగం ఉండగా 80 – 110 ఎంయూల వరకు కొరత నెలకొంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ఆథారిటీ(సీఈఏ) తాజా నివేదిక ప్రకారం దేశంలోని 1,65,066 మెగావాట్ల స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన 135 థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో సగటున కేవలం నాలుగు రోజులకు సరిపడే బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. సాధారణంగా విద్యుత్ ప్లాంట్లలో 15 – 30 రోజుల ఉత్పత్తికి సరిపడా బొగ్గు నిల్వలు ఉండాల్సినా 115 విద్యుత్ కేంద్రాల్లో ఆరు రోజులకు సరిపడే నిల్వలు మాత్రమే ఉన్నాయి. బొగ్గు కొరత నేపథ్యంలో పలు రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు స్థాపిత సామర్థ్యం కన్నా తక్కువ సామర్థ్యంతో విద్యుదుత్పత్తి చేస్తున్నాయి. రాష్ట్రంలో ఇదీ పరిస్థితి.. ఏపీలో 8,075 మెగావాట్ల ఉత్పత్తి కోసం సౌర, పవన విద్యుత్ వనరుల మీద ఆధారపడాల్సి వస్తోంది. అయితే వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వీటి నుంచి పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి జరగటం లేదు. రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ కెపాసిటీ 5,010 మెగావాట్లు కాగా వీటికి అవసరమైన బొగ్గు సమకూర్చేందుకు కోల్ ఇండియా, సింగరేణి సంస్థలతో పాటు విదేశాల నుంచి దిగుమతులే ఆధారం. జెన్కో బొగ్గు ప్లాంట్లకు రోజుకు ఇంచుమించు 70,000 టన్నుల బొగ్గు అవసరం కాగా సెప్టెంబరు చివరిలో 24,000 టన్నులు మాత్రమే అందుబాటులో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేయడంతో ప్రస్తుతం రోజుకు 40,000 టన్నులకు పెరిగింది. దొరకని గ్యాస్ రాష్ట్రంలో గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 908 మెగావాట్లు ఉన్నప్పటికీ కేవలం 100 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేయటానికి మాత్రమే గ్యాస్ అందుబాటులో ఉంది. గ్యాస్ ప్లాంట్ల నుంచి పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి చేయటానికి గ్యాస్ లభ్యత లేదు. రాష్ట్రంలోని డిస్కంలలో 63,070 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉండగా బొగ్గు, జల, పవన విద్యుత్, సౌర విద్యుత్ అన్ని కలిపి 50 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే లభ్యం అవుతోంది. బొగ్గు సంక్షోభం లేకుంటే.. రాష్ట్రంలో 20130 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉండగా 1600 మెగావాట్లు కృష్ణపట్నం నుంచి, 600 మెగావాట్లు ఆర్టీపీపీ నుంచి, 1,040 మెగావాట్లు హెచ్‌ఎన్‌పీసీఎల్ నుంచి, 400 మెగావాట్లు కేఎస్కే నుంచి, 7,000 మెగావాట్లు సౌర పవన ఇతర విద్యుత్ వనరుల నుంచి లభ్యమవుతోంది. బొగ్గు సంక్షోభం లేకుంటే ఈ విద్యుత్ ఉత్పత్తి వనరులు రాష్ట్ర అవసరాలను తీర్చగలుగుతాయి. నిజానికి రాష్ట్రంలో 2018 అక్టోబర్‌లో కూడా బొగ్గు కొరత సంక్షోభం ఏర్పడింది. అప్పుడు రాష్ట్రంలో కొన్ని చోట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో డిస్కంలు బయట నుంచి ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేశాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో జెన్కో కేంద్రాల చర వ్యయం కంటే తక్కువ ధరకు విద్యుత్ అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించడం కోసం మార్కెట్ వేలం నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు. గ్రామాల్లో పీక్ అవర్స్‌లో మాత్రమే ‘రాష్ట్రంలో ప్రస్తుతం నగరాలు, పట్టణాల్లో విద్యుత్ కోతలు విధించడం లేదు. నిర్వహణ కోసం మాత్రమే అక్కడక్కడా సరఫరా ఆపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పీక్ అవర్స్‌లో కొంత వరకూ పవర్ కట్స్ ఉంటున్నాయి. అది కూడా సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్య ఒకటి రెండు గంటలు మాత్రమే’ – నాగులపల్లి శ్రీకాంత్, ఇంధన శాఖ కార్యదర్శి తెలంగాణాలో పరిస్థితి భిన్నం తెలంగాణలో సహజసిద్ధంగా బొగ్గు గనులు ఉండటం వల్ల అక్కడ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లకు నిరంతరాయంగా బొగ్గు సరఫరా జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం తమ విద్యుత్ ఉత్పత్తి సంస్థలకే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందువల్ల సింగరేణి గనుల నుంచి ఏపీ జెన్కో థర్మల్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా జరగటం లేదు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు తీవ్ర బొగ్గు కొరత ఎదుర్కొంటున్నప్పటికీ తెలంగాణలో మాత్రమే 5 నుంచి 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండటానికి ఇదే కారణం. -
విద్యుత్‌ను పొదుపుగా వాడండి
సాక్షి, అమరావతి: దేశంలో బొగ్గు సంక్షోభం నెలకొన్న కారణంగా మన రాష్ట్రంపైన కూడా ఆ ప్రభావం తీవ్రంగా ఉండే ప్రమాదముందని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ తెలిపారు. ఈ విపత్కర పరిస్థితిలో విద్యుత్ సంస్థలకు సహకరించాల్సిందిగా వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రతి వినియోగదారుడు విద్యుత్ పొదుపుపై శ్రద్ధ తీసుకోవాలని కోరారు. పీక్ అవర్స్‌గా పిలుచుకునే ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, రాత్రి 6 గంటల నుంచి 10 గంటల వరకు ఏసీల వంటి పరికరాల వాడకం తగ్గించుకోవాలన్నారు. ఈ మేరకు విజయవాడలో శనివారం శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. కేంద్రం సహకారమందించాలి.. బొగ్గు కొరత సంక్షోభాన్ని అధిగమించేందుకు తగిన సహకారం అందించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం జగన్ ఇప్పటికే లేఖ రాశారు. ఆ లేఖలో రాష్ట్రంలో 2,300 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లు పనిచేయడం లేదని తెలిపారు. వాటికి ఓఎన్జీసీ, రిలయెన్స్ నుంచి గ్యాస్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రాన్ని సీఎం కోరారు. అలాగే బొగ్గు కొనుగోలు ధరలు, విద్యుత్ మార్కెట్ ధరలు విపరీతంగా పెరిగినందున రాష్ట్ర విద్యుత్ సంస్థలు బొగ్గు కొనుగోలు చేయడానికి రుణాలు మంజూరు చేసేలా బ్యాంకులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. పడిపోయిన జెన్కో ఉత్పత్తి.. కోవిడ్ తర్వాత విద్యుత్ వినియోగం 2019తో పోలిస్తే 2021లో దేశవ్యాప్తంగా 18 శాతం, ఏపీలో 20 శాతం పెరిగింది. ఒకవేళ కోవిడ్ లేకపోతే జరిగే వినియోగం కంటే ఇది 8 శాతం ఎక్కువ. రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకి వినియోగిస్తున్న 190 మిలియన్ యూనిట్లలో 80 మి.యూనిట్ల విద్యుత్ ఏపీ జెన్కో ద్వారా అందుతోంది. ప్రస్తుతం జెన్కో ఉత్పత్తి 50 శాతం (40 మి.యూ)కి పడిపోయింది. కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి రోజుకు 40 మి.యూ విద్యుత్ ఉత్పత్తి అవ్వాల్సి ఉండగా అందులో 75 శాతం (30 మి.యూ) మించి ఉత్పత్తి అవ్వట్లేదు. జల విద్యుత్ ఉత్పత్తి 25 మిలియన్ యూనిట్ల వరకే చేయగలం. రోజుకి 15 మి.యూ సౌర విద్యుత్ వస్తోంది. 30 మి.యూ పవన విద్యుత్ ఉత్పత్తి అవ్వాల్సి ఉండగా.. కేవలం 5 నుంచి 10 మి.యూనిట్లకే పరిమితమవుతోంది. బహిరంగ మార్కెట్లో ధరలు పెరిగాయి.. రాష్ట్రంలో 40 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేస్తుండగా ఈ నెల 8 నుంచి యూనిట్ సగటు ధర రూ.15కు పెరిగింది. ఇండోనేషియా నుంచి సరఫరా అయ్యే బొగ్గు ఏప్రిల్‌లో టన్ను 86.68 డాలర్లుండగా ఇప్పుడు 162 డాలర్లు అయ్యింది. మనరాష్ట్రంలో ఉన్న 5 వేల మెగావాట్ల థర్మల్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. జెన్కో ప్లాంట్లకి రోజుకు 70,000 టన్నుల బొగ్గు అవసరం. గత నెలలో 24,000 టన్నులు మాత్రమే బొగ్గు అందుబాటులో ఉంది. కేంద్రాన్ని కోరాక అది ప్రస్తుతం రోజుకు 40,000 టన్నులకు చేరింది. 20 బొగ్గు ర్యాక్స్ కేటాయించాలని విజ్ఞప్తి చేశాం.. బొగ్గు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏటా అక్టోబర్ నుంచి జనవరి వరకు రాబోయే వేసవి కోసం నిల్వలు పెంచుతాయి. ఈ నేపథ్యంలో 2022 కోసం రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు 20 బొగ్గు ర్యాక్స్ కేటాయించాల్సిందిగా కేంద్రానికి విజ్ఞప్తి చేశాం. అలాగే దేశంలో విద్యుత్ ఉత్పత్తి ఒప్పందాలు, బొగ్గు సరఫరా ఒప్పందాలు లేని కారణంగా విద్యుత్ ఉత్పత్తి నిలిపేసిన కొన్ని ప్లాంట్లలో వెంటనే తాత్కాలికంగా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని అభ్యర్థించాం. విద్యుత్ సంస్థలను ఆదుకోవడానికి గత రెండేళ్లలో ప్రభుత్వం చేయగలిగినంత సహాయం చేసింది. దాదాపు రూ.34,340 కోట్ల ఆర్థిక సహాయం చేసి ఆదుకుంది. కృష్ణపట్నం విద్యుత్ ప్లాంటుకే రూ.9,165 కోట్లు చెల్లించింది. మార్చి 2019 నాటికి రూ.27,239 కోట్లు ఉన్న విద్యుత్ సంస్థల మొత్తం నష్టాన్ని మార్చి 2021 నాటికి రూ.27,552 కోట్ల వద్దనే నిలువరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ నాటికి చెల్లించాల్సిన విద్యుత్ సబ్సిడీని ప్రభుత్వం చెల్లించేసింది. బొగ్గు కొరత సంక్షోభం ప్రభావం విద్యుత్ రంగంపై తాత్కాలికమేనని భావిస్తున్నాం. అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరా చేయడానికి విద్యుత్ పంపిణీ సంస్థలు కృషి చేస్తాయి. -
దేశవ్యాప్తంగా బొగ్గు కొరత: నాగులపల్లి శ్రీకాంత్
సాక్షి, విజయవాడ: దేశవ్యాప్తంగా బొగ్గు కొరత ఉందని ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశంలోని 135 విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరత ఉందన్నారు. ఏపీ జెన్కోకు రావాల్సిన బొగ్గు ఇంకా రాలేదని తెలిపారు. 190 మిలియన్ యూనిట్ల వరకు విద్యుత్ అవసరం అవుతోందన్నారు.(చదవండి: సంక్షేమాన్ని అడ్డుకోవడానికే టీడీపీ కేసులు: మంత్రి బొత్స) కోల్ ప్లాంట్లకు బకాయిలు లేకుండా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోందన్నారు. సోలార్ విండ్ ప్లాంట్లను ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. బొగ్గు ఆధారిత ప్లాంట్లకు ప్రాధాన్యత తగ్గిస్తూ వస్తున్నామన్నారు. అంతర్జాతీయంగా బొగ్గు రేట్లు పెరిగాయన్నారు. డిమాండ్ ఎక్కవ కావడం వల్లే సమస్యలు పెరుగుతున్నాయని శ్రీకాంత్ అన్నారు. చదవండి: తనయుడి కోసం డిక్షనరీ రాసిన కలెక్టర్ -
విద్యుత్ కొనుగోళ్లలో రూ.126 కోట్లు ఆదా
సాక్షి, అమరావతి: ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం గత రెండేళ్లుగా అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలు సత్ఫలితాలనిస్తున్నాయని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ తెలిపారు. 2021–22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో చేసిన విద్యుత్ కొనుగోళ్లలో డిస్కంలు రూ.126.15 కోట్లు ఆదా చేశాయన్నారు. ఈ పొదుపు ప్రయోజనాలను తిరిగి వినియోగదారుల కోసమే ఉపయోగించాలని ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు భావిస్తున్నాయని తెలిపారు. బాపూజీ జయంతి సందర్భంగా శనివారం విద్యుత్ సౌధలోని గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ ఏపీఎస్పీడీసీఎల్ 6,013 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఏపీఈఆర్సీ నిర్ణయించిన ధర కంటే 15 పైసలు తక్కువకే కొనుగోలు చేసిందన్నారు. తద్వారా రూ.89.23 కోట్లు ఆదా అయ్యిందని తెలిపారు. ఏపీíసీపీడీసీఎల్ రూ.33.25 కోట్లు, ఏపీఈపీడీసీఎల్ రూ.3.67 కోట్లు ఆదా చేశాయన్నారు. ఏపీ ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ కె.వెంకటేశ్వరరావు, గ్రిడ్ ట్రాన్స్మిషన్ డైరెక్టర్ కె.ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. -
సర్దుబాటు చార్జీలు శాశ్వతం కాదు
సాక్షి, అమరావతి: సర్దుబాటు చార్జీలు శాశ్వత ప్రాతిపదికగా విద్యుత్ బిల్లులలో విధించరని ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ తెలిపారు. ట్రూ అప్ చార్జీలనేవి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) నిర్ధేశించిన కాలానికి మాత్రమే బిల్లులలో ప్రత్యేకంగా వేస్తారని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత నిర్దేశిత సర్దుబాటు చార్జీలు ఏపీఈఆర్సీ ఉత్తర్వుల ప్రకారం 2022 మార్చి నెల వరకు మాత్రమే వసూలు చేస్తారని, ఈ ఎనిమిది నెలల తర్వాత ఉండవని శ్రీకాంత్ వెల్లడించారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే.. ► ఇంధన – విద్యుత్ సేకరణ వ్యయ సర్దుబాటు చార్జీ (త్రైమాసిక సర్దుబాటు చార్జీ) ప్రతి త్రైమాసికానికి వేర్వేరుగా మదింపు చేస్తారు. క్రిందటి త్రైమాసికంలో వేసిన చార్జీ మరుసటి త్రైమాసికానికి కలపరు. ► త్రైమాసికం–1లో అదనపు ఖర్చు రూ.100 కోట్లు అయ్యి, విద్యుత్ వినియోగం 12,000 మిలియన్ యూనిట్లు ఉంటే, సర్దుబాటు చార్జీ యూనిట్‌కు 8 పైసలు అవుతుంది. తర్వాతి త్రైమాసికంలో అదనపు వ్యయం రూ.200 కోట్లు ఉంటే అదే వినియోగానికి సర్దుబాటు చార్జీ యూనిట్‌కు 16 పైసలు అవుతుంది. ఈ లెక్కన మొదటి త్రైమాసికం చార్జీ 8 పైసలు కలుపుకుని 24 పైసలు అవ్వదు. ► విద్యుత్ సంస్థలకు మూడు నెలలకొకసారి సర్దుబాటు చేసే వెసులుబాటు 2012 వరకు (త్రైమాసిక ఇంధన సర్ చార్జీ నియమావళి) అమలులో ఉండేది. ఆ తర్వాత వార్షిక విద్యుత్ కొనుగోలు వ్యయం సర్దుబాటు నియమావళి అందుబాటులోకి వచ్చింది. ► విద్యుత్ పంపిణీ సంస్థలు 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటైల్ సరఫరా కోసం చేసిన వాస్తవ అదనపు ఖర్చులకు రూ.2,500 కోట్లు సర్దుబాటు చేసుకునేందుకు అనుమతించాల్సిందిగా గతేడాది డిసెంబర్లోనే ప్రతిపాదనలను సమర్పించారు. ఆ సంవత్సరాలకు ఇప్పుడు కొత్తగా ఎలాంటి ప్రతిపాదన పంపలేదు. ► 2019–20లో సర్దుబాటు ప్రతిపాదనలకు 2019 ఫిబ్రవరిలో, విద్యుత్ కేంద్రాల వారీగా అంచనా వేసిన ఇంధన (బొగ్గు, గ్యాస్) చార్జీలు పెరిగిపోవటమే ప్రాథమిక కారణం. ఈ వ్యయం పెరుగుదల 2019–20 ఆర్థిక సంవత్సరానికి ఏపీ జెన్కో థర్మల్ కేంద్రాలకు దాదాపు రూ.0.77/యూనిట్, కృష్ణపట్నంకు రూ 0.46/యూనిట్, కేంద్ర ప్రభుత్వ విద్యుత్ కేంద్రాలకు రూ.0.84/యూనిట్, స్వతంత్ర విద్యుత్ కేంద్రాలకు రూ .0.69/యూనిట్, గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలకు రూ. 0.56/యూనిట్ గా ఉంది. -
విద్యుత్ రంగం బలోపేతం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ రంగ సమగ్రాభివృద్ధి కోసం త్వరలో సామర్థ్య నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ తెలిపారు. ట్రాన్స్‌కో విజిలెన్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ (జేఎండీ) కె.వెంకటేశ్వరరావు, డిస్కంల సీఎండీలు జె.పద్మజనార్దనరెడ్డి (ఏపీసీపీడీసీఎల్), హెచ్.హరనాథరావు (ఏపీఎస్పీడీసీఎల్), కె.సంతోషరావు (ఏపీఈపీడీసీఎల్), ట్రాన్స్‌కో డైరెక్టర్లు కె.ప్రవీణ్‌కుమార్, కె.ముత్తు పాండియన్, ఇతర అధికారులతో ఆదివారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ఇంధన పర్యవేక్షక మిషన్ సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి వెల్లడించిన ఈ సమావేశం వివరాలు ఇలా ఉన్నాయి. ► చౌక విద్యుత్ ఆలోచనను అమలు చేయడం, సరికొత్త రికార్డులను నెలకొల్పడం ద్వారా దేశ వ్యాప్తంగా మన విద్యుత్ రంగానికి ప్రత్యేక గుర్తింపు లభించింది. రాష్ట్ర విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ► ఈ క్రమంలో సామర్థ్యం పెంపు, సరఫరా, పంపిణీ నెట్వర్క్ బలోపేతం చేయడం, వినియోగదారులే ఆధారంగా కార్యక్రమాలను చేపట్టడంపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని ప్రభుత్వం సూచించింది. ► 2019–20లో 3 లక్షలు ఉన్న అంతరాయాలను 2020–21 నాటికి 1.77 లక్షలకు తగ్గించింది. 2019–20లో యూనిట్‌కు రూ.7.23గా ఉన్న సగటు సర్వీసు వ్యయాన్ని 2020–21 నాటికి రూ.7.18కి తగ్గించగలిగింది. ► విద్యుత్ సంస్థలు 2019–21 మధ్య విద్యుత్ కొనుగోళ్ల కోసం విద్యుదుత్పత్తి సంస్థలకు రూ.64,007 కోట్లు చెల్లించాయి. మార్చి 31, 2019 నాటికి విద్యుత్ సబ్సిడీ బకాయిలు రూ.13,388 కోట్లు ఉండగా ప్రభుత్వం రూ.11,442 కోట్లు ఇచ్చింది. 2019–21 సంవత్సరాల్లో విద్యుత్ సబ్సిడీ, ఇతర చార్జీల కింద మరో రూ.16,724 కోట్లు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు రూ.28,166 కోట్లు విడుదల చేసింది. ► 30 ఏళ్లపాటు పగటి పూట వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను అందించేందుకు 10 వేల మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ కేంద్రాలను నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. ► విద్యుత్ సంస్థలు కార్యనిర్వహణ, ఆర్థిక సుస్థిరత సాధిస్తేనే వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ను అందించగలుగుతాం. డిస్కంల ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో రూ.3,669 కోట్ల ట్రూ అఫ్ చార్జీలను వసూలు చేసుకునేందుకు ఏపీఈఆర్సీ అనుమతించింది. -
విద్యుత్ పంపిణీ సంస్థలకు.. టీడీపీ ఒక్క రూపాయీ ఇవ్వలేదు
సాక్షి, అమరావతి: ట్రూ–అప్ సర్దుబాటు కోసం 2014 నుండి 2019 మధ్య ఒక్క రూపాయి కూడా విద్యుత్ పంపిణీ సంస్థలకి నాటి తెలుగుదేశం ప్రభుత్వం విడుదల చేయలేదని రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ మంగళవారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు. విద్యుత్ పంపిణీ సంస్థలు ఒక్క ఏడాదిలోనే రూ.6,000 కోట్లు అదనంగా వసూలుచేస్తున్నాయని వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తూ.. అవి పూర్తిగా అవాస్తవమన్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ ఒకటి నుండి విద్యుత్ వాడకపోయినా కట్టవలసి వచ్చే నెలవారీ కనీస చార్జీలు రద్దుచేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అలాగే, 2014 నుండి 2019 వరకూ ట్రూ–అప్ నివేదికలు దాఖలు చేయవద్దని అప్పటి టీడీపీ ప్రభుత్వం విధాన నిర్ణయమేదీ తీసుకోలేదని, అంతేకాక.. ఇందుకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు కూడా జారీచేయలేదని శ్రీకాంత్ వెల్లడించారు. ఇక ప్రభుత్వ విద్యుత్ పంపిణీ సంస్థలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని, అందువల్లే ఈ సర్దుబాటు చార్జీలు వసూలుచేయడానికి అనుమతించాలని కమిషన్ నిర్ణయించిందని విద్యుత్ నియంత్రణ మండలి తన ఉత్తర్వుల్లో పేర్కొంది. 2019 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) రూ.12,539 కోట్లు నష్టంలోనూ, ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ రూ.7,745 కోట్ల నష్టంలోనూ ఉన్నాయని తెలిపింది. మరోవైపు.. 2014లో రాష్ట్ర విభజన జరిగిన నాటికి రూ.12,500 కోట్లు వున్న కొనుగోలు బకాయిలు, నిర్వహణ వ్యయ రుణాలు 2019 ఏప్రిల్ 1 నాటికి రూ.32,000 కోట్లకు చేరుకున్నాయి. -
‘సర్దుబాటు’ పాపం గత సర్కారుదే
సాక్షి, అమరావతి: గత సర్కారు హయాంలో విద్యుత్ పంపిణీ సంస్థల బాగోగులను పట్టించుకోకపోవడం వల్ల వాటిపై అదనపు ఖర్చుల భారం భారీగా పెరిగింది. ఐదేళ్లలో విద్యుత్ రంగం అప్పులు రెట్టింపై రూ.31,648 కోట్ల నుంచి రూ.62,463 కోట్లకి ఎగబాకాయి. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో పొదుపు చర్యలు, విద్యుత్తు కొనుగోళ్లలో ఆదా ద్వారా ఖర్చులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. అయితే గత సర్కారు నిర్వాకాల కారణంగా జరిగిన అప్పుల నుంచి బయటపడేందుకు ‘సర్దుబాటు’ చేసుకోక తప్పని పరిస్థితి డిస్కంలకు ఏర్పడింది. కానీ అవి నివేదించిన వ్యయంలో దాదాపు సగానికి మాత్రమే అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆమోదం తెలిపింది. ప్రజలపై పెనుభారం పడరాదని.. 2014 ఏప్రిల్ 1 నుంచి 2019 మార్చి 31 మధ్య కాలానికి విద్యుత్ పంపిణీ వ్యవస్థ నిర్వహణ, ఆదాయ అవసరాలను వాస్తవ ఖర్చుల ఆధారంగా సర్దుబాటు చేయాల్సి ఉన్నా గత ప్రభుత్వం చేయలేదు. దీంతో రూ.7,224 కోట్లను అదనపు వ్యయంగా నిర్ధారించాలని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్), ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్)లు ఏపీఈఆర్సీని కోరాయి. నిజానికి ఇదేమీ వాటి వాస్తవ ఖర్చు కాదు. రెండు డిస్కంల వాస్తవ ఖర్చు రూ.25,952 కోట్లుగా ఉన్నప్పటికీ అవి రూ.7,224 కోట్లు మాత్రమే అడిగాయి. అయితే అంత మొత్తాన్ని అనుమతిస్తే ప్రజలపై ఒకేసారి భారం పడుతుందనే ఉద్దేశంతో ఏపీఈఆర్సీ అందులో సగం మొత్తాన్ని తిరస్కరించింది. పీఆర్సీ, వడ్డీలు, ఇతర ఖర్చులు.. డిస్కంల వినతిపై కొద్ది నెలలుగా ఏపీఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది. ఆడిట్ పద్దుల ఆధారంగా డిస్కంలు కోరిన దానిలో దాదాపు సగం అంటే రూ.3,669 కోట్లు వసూలుకు మాత్రమే ఉత్తర్వులు ఇచ్చింది. నిజానికి ఈ మొత్తంలో రూ.3,100 కోట్లు పే రివిజన్ కమిషన్(పీఆర్సీ) వల్ల అదనపు ఖర్చులు కాగా వడ్డీలు, ఇతర ఖర్చులు కలిపి మరో రూ.569 కోట్లు ఉన్నాయి. ఈ మొత్తం అదనపు వ్యయాన్ని సెప్టెంబర్ విద్యుత్ బిల్లు నుంచి ప్రారంభించి ఎనిమిది నెలల పాటు ఏపీఈపీడీసీఎల్‌లో యూనిట్‌కు 45 పైసలు, ఏపీఎస్పీడీసీఎల్లో యూనిట్‌కు రూ.1.27 చొప్పున ట్రూఅప్ పేరిట సర్దుబాటు చేయనున్నారు. 2019 ఏప్రిల్ 1 తరువాత కనెక్షన్ తీసుకున్న వినియోగదారులకు ట్రూ అప్ వర్తించదు ఐదేళ్లలో సర్దుబాటు చేయకపోవడంతో... ‘సర్దుబాటు వ్యయం అనేది ఏటా జరగాలి. ఎప్పటికప్పుడు జరిగితే ప్రజలపై పడే భారం చాలా తక్కువ. కానీ 2014 నుంచి 2019 వరకూ అలా జరగకపోవడంతో డిస్కంల అప్పులు భారీగా పెరిగిపోయాయి. ఇప్పటికైనా సర్దుబాటు చేయకపోతే వాటి మనుగడ కష్టమవుతుంది. ఇందులో వ్యవసాయ ఉచిత విద్యుత్ వినియోగదారులపై ఎటువంటి భారం పడకుండా రూ.913 కోట్ల అదనపు సర్దుబాటు వ్యయాన్ని అప్పటి సబ్సిడీ విధానాల ప్రకారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది’ – నాగులపల్లి శ్రీకాంత్, ఇంధనశాఖ కార్యదర్శి అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా ► 2014 నుంచి 2019 వరకూ విద్యుత్ పంపిణీ సంస్థల నష్టాలు రూ.4,110 కోట్ల నుంచి రూ.27,240 కోట్లకు చేరాయి. ప్రస్తుతం రూ.27,551 కోట్లుగా ఉన్నాయి. అంటే రెండున్నరేళ్లలో కేవలం రూ.311 కోట్లు మాత్రమే పెరిగాయి. ► 2014 నుంచి 2019 వరకూ విద్యుత్ పంపిణీ సంస్థల వార్షిక సరఫరా ఖర్చు రూ.24,211 కోట్ల నుంచి రూ.46,404 కోట్లకు చేరుకుంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇది తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం రూ.39,324 కోట్లుగా ఉంది. ► 2014 నుంచి 2019 వరకూ విద్యుత్ రంగం అప్పులు రూ.31,648 కోట్ల నుంచి రెట్టింపై రూ.62,463 కోట్లకి పెరిగాయి. -
ఇంధన ఆదా రూ. 2,350 కోట్లు!
సాక్షి, అమరావతి: ఇంధనాన్ని సమర్థవంతంగా వినియోగించడం, పొదుపు చేయడంలో ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన పనితీరును ప్రదర్శించింది. పారిశ్రామిక రంగంలో అమలు చేస్తున్న పాట్ (పెర్ఫార్మ్, అచీవ్, ట్రేడ్) పథకంలో భాగంగా సైకిల్–2లో 3,430 మిలియన్ యూనిట్ల విద్యుత్‌కు సమానమైన (0.295 మిలియన్ టన్స్ ఆఫ్ ఆయిల్ ఈక్వలెంట్ – ఏంటీవోఈ) ఇంధనాన్ని ఆదా చేసింది. దీని విలువ సుమారు రూ.2,350 కోట్లు ఉంటుంది. 1.38 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదలను తగ్గించగలిగింది. కేంద్ర విద్యుత్ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) ఈ వివరాలను అధికారికంగా ప్రకటించింది. పాట్ మొదటి దశతో పోల్చితే మన రాష్ట్రం పాట్ సైకిల్–2లో 40 శాతం ఎక్కువ ఇంధనాన్ని ఆదా చేసినట్లు బీఈఈ తెలిపింది. మొదటి దశలో ఏపీ 0.205 ఎంటీవోఈ ఇంధనాన్ని పొదుపు చేసింది. పారిశ్రామిక ఇంధన వినియోగంలో ఆధునిక విధానాలను అవలంబించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఈ ఘనత సాధించిందని బీఈఈ ప్రశంసించింది. ఈ మేరకు నిర్వహించిన వెబినార్‌లో ఇంధన పొదుపు సర్టిఫికెట్లను కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి అలోక్‌కుమార్ విడుదల చేసినట్లు రాష్ట్ర ఇంధన పర్యవేక్షణ మిషన్ సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి సోమవారం తెలిపారు. ఇంధన సామర్థ్య సాంకేతికతను అభివృద్ధి చేసి విస్తృతంగా వినియోగంలోకి తెస్తే భారీ పరిశ్రమలే కాకుండా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కూడా ప్రయోజనం పొందుతాయని వెబినార్‌లో అలోక్‌కుమార్ అన్నారు. బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్ బాక్రే మాట్లాడుతూ.. పాట్ అమలుకు రాష్ట్రాలకు సహకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్ర పరిశ్రమల శాఖతో కలిసి ప్రత్యేక పాట్ సెల్ ద్వారా పథకాన్ని పకడ్బందీగా అమలు చేసిన ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌ను ఈ సందర్భంగా అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంధన సామర్థ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని శ్రీకాంత్ వివరించారు. దీనివల్ల రాష్ట్రంలో ప్రతి కుటుంబం ప్రయోజనం పొందుతోందన్నారు. దేశవ్యాప్తంగా 542 పరిశ్రమల ఎంపిక దేశవ్యాప్తంగా పరిశ్రమల రంగంలో 11 సెక్టార్లకు సంబంధించిన 542 పరిశ్రమలను పాట్ సైకిల్–2లో ఎంపిక చేశారు. వాటిలో 349 పరిశ్రమలు ఇంధన పొదుపు లక్ష్యాలను సాధించాయి. వీటికి 57.38 లక్షల ఎనర్జీ సేవింగ్ సర్టిఫికెట్లను అందజేశారు. లక్ష్యాలు చేరుకోని 193 పరిశ్రమలు 36.67 లక్షల సర్టిఫికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంది. దేశవ్యాప్తంగా పాట్ సైకిల్–1లో 8.8 ఏంటీవోఈ ఇంధనం ఆదా చేయగా.. పాట్ సైకిల్–2లో 14.08 ఏంటీవోఈ ఆదా అయ్యింది.ఆయా పరిశ్రమలు పవర్ ఎక్సే్ఛంజీల్లో సర్టిఫికెట్లను విక్రయించడం ద్వారా లాభాలు ఆర్జించవచ్చు. పాట్ సైకిల్–2 ట్రేడింగ్ సెప్టెంబర్ చివరి నాటికి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.