సాక్షి, అమరావతి: ఇంధన సామర్థ్యం, పొదుపు చర్యలపై ప్రజలు, ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ సంస్థలకు పెద్దఎత్తున అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ దృష్ట్యా అందరూ ఇంధన పరిరక్షణ వారోత్సవాలలో భాగస్వాములు కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంధన సంరక్షక మిషన్ (ఏపీఎస్‌ఈసీఎం) చైర్మన్ సమీర్‌శర్మ కోరారు. రాష్ట్రంలో ఈ నెల 14 నుంచి మొదలయ్యే ఇంధన పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా అందించనున్న స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ (సెక) 2021పై ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్, ఇతర అధికారులతో ఆయన ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు.
పెరుగుతున్న ఇంధన డిమాండ్‌ను అందుకోవడానికి, ఇంధన భద్రత, ఆర్థికాభివృద్ధి సాధించేందుకు, ఇంధనంపై వ్యయాన్ని తగ్గించేందుకు ఇంధన సామర్థ్య చర్యలు దోహదపడతాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇంధన పరిరక్షణ అవార్డుల కార్యక్రమంలో ఎక్కువ మంది పాల్గొనేలా సహకరించాల్సిందిగా అన్ని ప్రభుత్వ శాఖలకు ఇప్పటికే విజ్ఞప్తి చేసినట్లు ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ సీఎస్‌కు వివరించారు. వివిధ రంగాల్లో ఇంధన సామర్థ్య కార్యక్రమాలు అమలు చేయడం ద్వారా ఏటా 15 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేసే అవకాశముందని పేర్కొన్నారు. ‘సెక’ పోటీలో ఎక్కువ మంది పాల్గొనేందుకు వీలు కల్పిస్తూ దరఖాస్తు గడువును ఈ నెల 8వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు ఏపీఎస్‌ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి తెలిపారు.
కేటగిరీల వారీగా అవార్డులకు అర్హతలు ఇలా..
పరిశ్రమలు, భవన నిర్మాణం, మునిసిపల్ రంగానికి సంబంధించిన వివిధ సంస్థల మధ్య నిర్విహిస్తున్న సెక–2021 అవార్డుల పోటీకి సంబంధించిన అర్హత ప్రమాణాలను ఏపీఎస్‌ఈసీఎం ఆదివారం ప్రకటించింది. పారిశ్రామిక రంగం కింద, మొత్తం వార్షిక ఇంధన వినియోగం 3000 టీన్ ఆఫ్ ఆయిల్ ఈక్వలెంట్ (టీఓఈ) లేదా అంతకంటే ఎక్కువ కలిగిన సిమెంట్ పరిశ్రమలు, 1500 టీఓఈ లేదా అంతకంటే ఎక్కువ మొత్తం వార్షిక ఇంధన వినియోగం కలిగిన టెక్స్‌టైల్ పరిశ్రమలు, 1000 కేవీఏ, అంతకంటే ఎక్కువ డిమాండ్ ఉన్న ఎంఎస్‌ఎంఈ సంస్థలు ఈ అవార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
భవనాల విభాగం కింద, వాణిజ్య భవనాలు, హోటళ్లు, ఆస్పత్రులు, షాపింగ్ మాల్స్, ప్లాజాలు, యూనివర్సిటీలు, 100 కిలోవాట్, 120 కిలోవాట్ లేదా అంతకంటే ఎక్కువ కాంట్రాక్ట్ డిమాండ్ ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలు, 50 కిలోవాట్ కంటే ఎక్కువ లోడ్ ఉన్న విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్ కళాశాలలు దరఖాస్తుకు అర్హులు. మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, మురుగు నీటి పంపింగ్ బోర్డులు, తాగునీటి సరఫరా బోర్డులు కూడా పోటీలో పాల్గొనవచ్చు. దరఖాస్తు వివరాలు ఏపీఎస్‌ఈసీఎం, డిస్కంల వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉన్నాయి. పూరించిన దరఖాస్తును seca.apsecm.gmail.com ద్వారా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు సమర్పించాలి.
Comments
Please login to add a commentAdd a comment