
సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం కింద నగదు బదిలీ అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద వ్యవసాయ విద్యుత్ సరఫరాకు సంబంధించి సెప్టెంబర్ నెలకయ్యే రూ.6.05 కోట్లు మంజూరు చేస్తూ పాలనాపరమైన అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
శుభారంభం: కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలు తీసుకురాగా.. ఉచిత వ్యవసాయ విద్యుత్ సబ్సిడీని నేరుగా రైతు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైతుపై ఏమాత్రం భారం పడకుండా ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. రైతు ఖాతాల్లో ప్రభుత్వ సొమ్ము చేరిన తర్వాతే దాన్ని విద్యుత్ సంస్థకు పంపుతామని స్పష్టం చేసింది.
పక్కా లెక్క: ఉచిత వ్యవసాయ విద్యుత్‌కు గత ప్రభుత్వం ఏటా రూ.4 వేల కోట్లు మాత్రమే సబ్సిడీగా ఇచ్చేది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2020–21లో వ్యవసాయ విద్యుత్ సబ్సిడీకి రూ.8,353.70 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో విద్యుత్ లోడ్, కనెక్షన్లను బట్టి నగదు బదిలీకి అయ్యే వ్యయాన్ని తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ లెక్కగట్టింది. ఆ జిల్లాలో మొత్తం 25,971 వ్యవసాయ పంపుసెట్లు ఉండగా.. వీటి వినియోగ సామర్థ్యం 1,02,963 హార్స్‌పవర్ (హెచ్‌పీ). ఏపీఈఆర్‌సీ నిర్ణయించిన ప్రకారం ఒక్కో యూనిట్ ధర రూ.6.58. ఈ లెక్కన సెప్టెంబర్ నెలలో విద్యుత్ సబ్సిడీ రూ.6.05 కోట్లు ఉంటుందని ఈపీడీసీఎల్ లెక్కగట్టింది. ఈ మొత్తం రైతు ఖాతాల్లోకే వెళుతుంది.