జనతంత్రం
‘‘చేపా చేపా ఎందుకు ఎండలేదు? గడ్డిమోపు అడ్డమొచ్చింది. మోపూ మోపూ ఎందుకు అడ్డమొచ్చావ్? ఆవు మేయలేదు’’. ఈ చేప సాకుల కథ తెలుగు వారందరికీ సుపరిచితమే. ఏడు మాసాల కింద ఏపీలో ఏర్పడిన కిచిడీ సర్కార్ పరిపాలనకూ, ఈ సాకుల కథకూ కొంత సాపత్యం కుదురుతుంది. ఒకపక్క జనానికి షాకుల మీద షాకులిస్తూనే మరోపక్క తన వైఫల్యాలకు సాకుల మీద సాకులు వెతుకుతున్న తీరు న భూతో న భవిష్యతి! పరిపాలన చేతగానితనం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.
శాంతి భద్రతల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మేలు. రూల్ ఆఫ్ లా స్థానాన్ని రూళ్లకర్ర పెత్తనం ఆక్రమిం
చింది. విద్యారంగం గుండెల మీద విధ్వంసపు గునపాలు దిగు తున్నాయి. ప్రజా వైద్యరంగాన్ని ప్రైవేట్ బేహారుల జేబులో పెట్టబోతున్నారు. సాగునీటి గేట్ల తాళాలు కంట్రాక్టర్ల చేతుల్లో పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ అప్పులు చింపిన విస్తరిలా తయారైంది. ఇదీ కిచిడీ సర్కార్ ఏడు మాసాల సప్తపది.
ప్రభుత్వ వైఫల్యాలు బట్టబయలైన ప్రతి సందర్భంలో దాన్నుంచి జనం దృష్టిని మళ్లించడం కోసం గోబెల్స్ ప్రచారాలను చేపట్టడం నిత్యకృత్యంగా మారిపోయింది. అవినీతికీ, అసమర్థతకూ ఏపీ కిచిడీ సర్కార్‌ను కేరాఫ్ అడ్రస్ అనుకోవచ్చు. కొద్దిపాటి సమీక్షా ప్రణాళికలతో నివారించగలిగిన విజయవాడ వరద ముంపును ముందుచూపు లేక పెను ప్రమాదంగా మార్చారు.
సాకును మాత్రం పాత ప్రభుత్వం మీదకు నెట్టేందుకు శతవిధాల ప్రయత్నించారు. తిరుపతిలో జరిగిన తాజా విషాదంలోనూ అధినేతది అదే ధోరణి. కనీస ముందస్తు సమీక్షలు చేయకపోవడం, ఏర్పాట్లు లేకపోవడం, వ్యూహ రాహిత్యం, సమన్వయ లోపం, పోలీసు యంత్రాంగం మొత్తం ముఖ్యమంత్రి సేవలోనే తరించడం... ఈ దుర్ఘటనకు ప్రధాన కారణాలు.
తమది రియల్‌టైమ్ గవర్నెన్సనీ, ఎక్కడేమి జరుగుతున్నదో ఎప్పటికప్పుడు తన కంప్యూటర్ దుర్భిణి ద్వారా తెలిసిపోతుందనీ చంద్రబాబు చెప్పుకుంటారు. లక్షలాదిమంది తరలివచ్చే వైకుంఠ ద్వార దర్శన కార్యక్రమానికి ఏర్పాట్లు సరిగ్గా జరగ లేదని ఎందుకు కనిపెట్టలేకపోయారో మరి! తీరా దుర్ఘటన జరిగిన తర్వాత సాకు వెతుక్కోవడానికి ఆయనకు జగన్ సర్కారే కనిపించింది. కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఎదురులేని రోజుల్లో ఎక్కడ ఏ దుర్ఘటన జరిగినా, ప్రభుత్వ వైఫల్యం బయటపడ్డా వెంటనే ‘విదేశీ హస్తం’ మీదకు నెట్టేసేవారు. ఇప్పుడు చంద్ర బాబుకు జగన్ సర్కార్‌లో ఆ విదేశీ హస్తం కనిపిస్తున్నది.
వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్లను తిరుమలకు బదులుగా తిరుపతిలోనే అందజేసే కార్యక్రమాన్ని వైసీపీ సర్కార్ ప్రారంభించిందనీ, అందువల్లనే తొక్కిసలాట జరిగిందనేది ఆయన ఉవాచ. తిరుపతిలోనే టిక్కెట్లివ్వడమనేది పనికిమాలిన కార్య క్రమం అయితే, దివ్యదృష్టీ – దూరదృష్టీ... రెండూ కలిగిన చంద్రబాబు సర్కార్ ఎందుకు దాన్ని రద్దు చేయలేదనేది సహ జంగా ఉద్భవించే ప్రశ్న. రద్దు చేయకపోగా, గతంలో ఎన్నడూ లేనివిధంగా అస్మదీయ పత్రికల్లో భారీ ప్రకటనలు గుప్పించి భక్తకోటిని ఎందుకు ఆహ్వానించినట్టు? పైగా మూడు రోజుల టిక్కెట్లు ఒకేసారి ఇస్తామని ఏపీతోపాటు పొరుగు రాష్ట్రాల్లో కూడా ఎందుకు దండోరా వేయించినట్టు?
వైసీపీ ప్రభుత్వం ఉన్న రోజుల్లోనే తిరుమలలోని ఒక కేంద్రంతోపాటు తిరుపతిలో తొమ్మిది సెంటర్లు ఏర్పాటు చేసి, వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్లు అందజేసిన మాట వాస్తవం. కానీ అప్పుడెటువంటి తొక్కిసలాటలూ, దుర్ఘటనలూ జరగ లేదు. సాఫీగా జరిగిపోయింది. ఎందుకని? వైకుంఠ ద్వార దర్శనం సదవకాశాన్ని స్థానిక ప్రజలను దృష్టిలో ఉంచుకొని పది రోజులపాటు ఏర్పాటు చేశారు. తిరుపతికి వెలుపల ఎక్కడా ఎటువంటి ప్రకటనలూ ఇవ్వలేదు. స్థానికులు తీసుకోగా మిగిలితేనే ఇతర ప్రాంత ప్రజలు అడిగితే ఇచ్చే ఏర్పాట్లను చేశారు. ఇతర ప్రాంతాల వారికి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుని వచ్చే సౌకర్యం ఉండేది.
ఈసారి రాష్ట్రంతో పాటు వెలుపల కూడా ‘రండహో’ అంటూ దండోరా వేయించిన పెద్దమనుషులు... చేయాల్సిన ఏర్పాట్లను మాత్రం గాలికొదిలేశారు. ఎనిమిది కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి. ఎనిమిదో తేదీ మధ్యాహ్నానికే లక్షల సంఖ్యలో భక్తులు కౌంటర్ల దగ్గరకు చేరుకున్నారు. వాళ్లకు ఏ రకమైన వసతులూ కల్పించలేదు. మంచినీళ్లిచ్చే దిక్కు కూడా లేదు. ఎని మిది కేంద్రాలకు గాను బైరాగిపట్టెడ, శ్రీనివాసం, రామచంద్ర పుష్కరిణి, విష్ణు నివాసం అనే నాలుగు కేంద్రాల దగ్గర భక్తుల సంఖ్య పెరిగిపోయి తొక్కిసలాట జరిగింది. బైరాగిపట్టెడ పరిస్థితి మరీ ఘోరం.
అంతకంతకూ భక్తుల సంఖ్య పెరగడంతో కౌంటర్‌కు ఎదురుగా ఉన్న పార్కులోకి వారిని మళ్లించి తాళాలు వేశారు. అన్నపానీయాలు లేకుండా, కనీస వసతులు లేకుండా దాదాపు పది గంటలు ఉగ్గబట్టుకొని ఉండాల్సి వచ్చింది. మహిళలూ,వృద్ధుల పరిస్థితి వర్ణనాతీతం. శత్రు దేశాల ప్రజల్ని, సైనికుల్ని నిర్బంధించడానికి నాజీలు ఏర్పాటుచేసిన కాన్సంట్రేషన్ క్యాంపులకు ఈ పార్కు జైలు భిన్నమైనదేమీ కాదు. ఇన్ని లక్షల మందిని నిర్బంధ శిబిరాల్లో కుక్కి మానవ హక్కులను హరించి నందుకు టీటీడీ అధికారులే కాదు ప్రభుత్వ పెద్దలు కూడా శిక్షార్హులే!
ప్రజలను గంటల తరబడి నిర్బంధంగా అన్న పానీయాలకూ, కనీస అవసరాలకూ దూరం చేయడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుంది. ఇటువంటి నిర్బంధ శిబిరాల గేట్లను హఠాత్తుగా తెరిచినప్పుడు తొక్కిసలాటలు జరుగుతాయని, ప్రమాదాలు జరుగుతాయని ఊహించడానికి ‘డీప్ టెక్’ పరి జ్ఞానం అవసరం లేదు కదా! కామన్‌సెన్స్ చాలు. ప్రజల ప్రాణా లకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని తెలిసి కూడా ఎటువంటి ప్రకటనలూ చేయకుండా, అప్రమత్తం చేయకుండా అకస్మాత్తు చర్య ద్వారా తొక్కిసలాటకు దారితీయడం కూడా మానవ హక్కుల ఉల్లంఘనే!
ఈ నేరానికి పెద్ద తలలే బాధ్యత వహించవలసి ఉంటుంది. మొక్కుబడిగా ఎవరో ఇద్దర్ని సస్పెండ్ చేసి, మరో ముగ్గుర్ని బదిలీ చేసి చేతులు దులిపేసుకుంటే సరిపోతుందా? అందు లోనూ వివక్ష. ఘటనకు సంబంధించి ప్రత్యక్షంగా బాధ్యత లేని వారిపై చర్యలు తీసుకొని, కీలక బాధ్యుల్ని వదిలేశారన్న విమ ర్శలు వెంటనే వెలువడ్డాయి. కీలక బాధ్యులు ప్రభుత్వ పెద్దలకు బాగా కావలసినవారు. వెంటనే తరుణోపాయాన్ని ఆలోచించిన చంద్రబాబు బంతిని పవన్ కల్యాణ్ కోర్టులోకి నెట్టారు. అధినేత మనసెరిగిన పవన్ ఓ గంభీరమైన సూచన చేశారు.
జరిగిన ఘటన విషాదకరమైనదనీ, తనకు బాధ్యత లేకపోయినా క్షమాపణలు చెబుతున్నాననీ, అలాగే టీటీడీ చైర్మన్, ఈవో, తిరుమల జేఈవోలు కూడా క్షమాపణలు చెప్పాలనీ సూచించారు. అంటే ఇంత తీవ్రమైన నేరానికి క్షమాపణలు చెబితే సరిపోతుందన్న సూచన. బారా ఖూన్ మాఫ్! వారిపైన ఎటువంటి చర్యలూ లేకుండా క్షమాపణలతో సరిపెడతారన్నమాట!
వారి శిరస్సుల మీద పవన్ కల్యాణ్ చేత మంత్ర జలం చల్లించి పాప ప్రక్షాళనం చేయించారనుకోవాలి. ఈ ఘటనతో ఏ సంబంధం లేని, కేవలం అడ్మినిస్ట్రేషన్ పనులకు మాత్రమే పరిమితమయ్యే తిరుపతి జేఈవో ఎందుకు బదిలీ అయ్యారో, ప్రధాన బాధ్యత తీసుకోవలసిన తిరుమల జేఈవో, ఈవో, టీటీడీ ఛైర్మన్‌లకు పాప విమో చనం ఎందుకు లభించిందో ఆ దేవదేవుడికే తెలియాలి.
పాప విమోచనం దొరికిన ముగ్గురిలో కూడా ఇద్దరు మాత్రమే ప్రభుత్వాధినేతకు కావలసిన వారట! ఈవో శ్యామల రావుపై మాత్రం కత్తి వేలాడుతున్నదనీ, త్వరలోనే ఆయనను తప్పించడం ఖాయమనీ సమాచారం. ఇప్పుడే చర్య తీసుకుంటే తమకు కావలసిన వారిపై కూడా తీసుకోవలసి ఉంటుంది.
కనుక కొంతకాలం తర్వాత ఆయనకు స్థానచలనం తప్పదంటున్నారు. తిరుపతి లడ్డూలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందనీ, దీనికి జగన్ సర్కారే బాధ్యత వహించాలనీ ఆమధ్య చంద్ర బాబు ఒక ప్రహసనాన్ని నడిపిన సంగతి తెలిసిందే. ఆ నాట కాన్ని రక్తి కట్టించడంలో ఈవో శ్యామలరావు విఫలమయ్యారనీ, ఫలితంగానే నాటకం రసాభాసగా మారిందనే అభిప్రాయం అధినేతకు ఉన్నదట!
గత సెప్టెంబర్ మాసంలో విజయవాడ వరదల సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం దారుణ వైఫల్యం దరిమిలా ప్రజల దృష్టిని మళ్లించేందుకు తిరుపతి లడ్డుకు ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందనీ, ఇందుకు జగన్ పాలనలోనే బీజం పడిందనే ప్రచారాన్ని కిచిడీ సర్కార్‌తోపాటు యెల్లో మీడియా కూడా పెద్ద ఎత్తున చేపట్టిన సంగతి తెలిసిందే. చివరకు అదంతా బోగస్ ప్రచారంగా తేలడానికి రెండు మాసాలు కూడా పట్టలేదు.
జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తిరు మల దేవస్థానం ప్రతిష్ఠ జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా ఇనుమడించింది. టీటీడీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వందలాది దేవాలయాల నిర్మాణం జరిగింది. స్వల్పకాలంలో ఇన్ని ఆలయాల నిర్మాణాన్ని ఇంకెవరి హయాంలోనూ టీటీడీ చేపట్టలేదు. హిందువులకు పవిత్రమైన గోమాత సంరక్షణ కోసం వందల సంఖ్యలో గోశాలల నిర్మాణం కూడా జరిగింది. శ్రీ వేంకటేశ్వరస్వామి వారి కల్యాణోత్సవాలు దేశదేశాల్లో వైభవంగా జరిగాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద జాబితానే ఉన్నది.
తిరుమలను అపవిత్రం చేస్తున్నారనే ప్రచారాన్ని ఈ కిచిడీ గ్యాంగ్ ఆ రోజుల్లోనే ప్రారంభించింది. కానీ, ఎవరూ దాన్ని విశ్వసించలేదు. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత లడ్డూ కల్తీ పేరుతో మరోసారి బురద చల్లాలని ప్రయత్నించి భంగ పడ్డారు. ఇప్పుడు తమ బాధ్యతా రాహిత్యానికి ఆరుగురు భక్తులు బలైతే... దాన్ని వైసీపీ ప్రభుత్వానికి చుట్టేందుకు చంద్రబాబు ప్రయత్నించడం, ప్రజల విజ్ఞతపై ఆయనకున్న చిన్న చూపుకు నిదర్శనం.
అధికారంలోకి వచ్చిన ఏడు మాసాల్లో ఆయన ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయలేదు. పైగా అన్ని రంగాల్లో వైఫల్యం! వాటినుంచి దృష్టి మళ్లించేందుకు నెలకోసారైనా ఒక పెద్ద డైవర్షన్ స్కీమ్‌ను రంగంలోకి దించుతున్నారు. ఇప్పటివరకు ఏడు మాసాల్లో ఎండబెట్టిన ఏడు డైవర్షన్ చేపల్లో ఒక్కటీ ఎండలేదు. చీమ కుట్టడంతోనే చేపల కథ ముగుస్తుంది. ఈ డైవర్షన్ చేపల కథ ముగింపు కూడా అలాగే ఉండనుంది.
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
Comments
Please login to add a commentAdd a comment