Free agricultural power connections
-
వేగం పెంచండి: పెద్దిరెడ్డి రామచంద్రారరెడ్డి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉచిత వ్యవసాయ విద్యుత్ కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు కనెక్షన్లనివ్వడంలో వేగం మరింత పెంచాలని రాష్ట్ర ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయన శుక్రవారం విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో విద్యుత్‌శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హతే ప్రాతిపదికగా రైతులకు ఉచిత వ్యవసాయ కనెక్షన్లు ఇవ్వాలన్న సీఎం వైఎస్ జగన్ నిర్ణయానికి అనుగుణంగా అధి కారులు పనిచేయాలని సూచించారు. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న అన్ని దరఖాస్తులను ఈ నెలాఖరు నాటికి పరిష్కరించాలని ఆదేశించారు. సబ్స్టేషన్ల నిర్మాణం మూడునెలల్లో పూర్తికావాలన్నారు. ఇకపై వ్యక్తులకు, సంస్థలకు సబ్స్టేషన్ల సంఖ్యను కూడా పరిమితం చేస్తూ టెండర్లను పిలవాలని, దీనివల్ల ఎక్కువమంది కాంట్రాక్టులు పొందుతారని, పనులు వేగంగా జరుగుతాయని చెప్పారు. విద్యుత్ తీగలు, కరెంటు స్తంభాలు, కండక్టర్లు వంటి పరికరాల భద్రతా ప్రమాణాలను పరిశీలించేందుకు నిర్వహించమన్న పోల్ టు పోల్ సర్వేపై నివేదిక ఇవ్వాలని కోరారు. ప్రజలకు హాని జరిగే పరిస్థితులు పునరావృతం కాకుండా డిస్కంల సీఎండీలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. ప్రతి కొనుగోలుకు ఇకపై ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కమర్షియల్, ఇండస్ట్రియల్ కనెక్షన్లకు సంబంధించి బకాయిల వసూలుకు చర్యలు తీసుకోవాలన్నారు. కొన్నిచోట్ల కోర్టు వ్యాజ్యాల వల్ల కరెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిపై న్యాయపోరాటం చేసి బకాయిలను వసూలు చేయాలని చెప్పారు. హైవాల్యూ కేసుల్లో అవసరమైతే సీనియర్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, డిప్యూటీ సెక్రటరీ కుమార్‌రెడ్డి, డిస్కంల సీఎండీలు కె.సంతోషరావు, జె.పద్మాజనార్దనరెడ్డి పాల్గొన్నారు. -
ఉచిత విద్యుత్‌కు నిధులు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం కింద నగదు బదిలీ అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద వ్యవసాయ విద్యుత్ సరఫరాకు సంబంధించి సెప్టెంబర్ నెలకయ్యే రూ.6.05 కోట్లు మంజూరు చేస్తూ పాలనాపరమైన అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. శుభారంభం: కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణలు తీసుకురాగా.. ఉచిత వ్యవసాయ విద్యుత్ సబ్సిడీని నేరుగా రైతు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైతుపై ఏమాత్రం భారం పడకుండా ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. రైతు ఖాతాల్లో ప్రభుత్వ సొమ్ము చేరిన తర్వాతే దాన్ని విద్యుత్ సంస్థకు పంపుతామని స్పష్టం చేసింది. పక్కా లెక్క: ఉచిత వ్యవసాయ విద్యుత్‌కు గత ప్రభుత్వం ఏటా రూ.4 వేల కోట్లు మాత్రమే సబ్సిడీగా ఇచ్చేది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2020–21లో వ్యవసాయ విద్యుత్ సబ్సిడీకి రూ.8,353.70 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో విద్యుత్ లోడ్, కనెక్షన్లను బట్టి నగదు బదిలీకి అయ్యే వ్యయాన్ని తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ లెక్కగట్టింది. ఆ జిల్లాలో మొత్తం 25,971 వ్యవసాయ పంపుసెట్లు ఉండగా.. వీటి వినియోగ సామర్థ్యం 1,02,963 హార్స్పవర్ (హెచ్‌పీ). ఏపీఈఆర్సీ నిర్ణయించిన ప్రకారం ఒక్కో యూనిట్ ధర రూ.6.58. ఈ లెక్కన సెప్టెంబర్ నెలలో విద్యుత్ సబ్సిడీ రూ.6.05 కోట్లు ఉంటుందని ఈపీడీసీఎల్ లెక్కగట్టింది. ఈ మొత్తం రైతు ఖాతాల్లోకే వెళుతుంది. -
పది వేల మెగావాట్ల సోలార్ పరుగు
సాక్షి, అమరావతి: ఉచిత వ్యవసాయ విద్యుత్ కోసం చేపట్టిన 10వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ పురోగతిలో ఉంది. దీనిపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు బుధవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి నివేదిక ఇవ్వనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం ఏటా డిస్కమ్‌లకు రూ.10 వేల కోట్ల సబ్సిడీ ఇస్తోంది. నాలుగేళ్ల సబ్సిడీ మొత్తాన్ని సౌర విద్యుత్ కోసం వినియోగిస్తే 25 ఏళ్ల పాటు రైతులకు పగటి పూటే 9 గంటల ఉచిత విద్యుత్ అందించవచ్చని భావించింది. దీంతో నాలుగేళ్ల తర్వాత ప్రభుత్వంపై సబ్సిడీ భారం తగ్గుతుంది. ఇప్పటికే సౌర విద్యుత్ ప్లాంట్ల కోసం ప్రభుత్వం 50 వేల ఎకరాలను గుర్తించింది. ఇందులో చాలా వరకు ప్రభుత్వ భూమే ఉంది. 200, 400 కేవీ సబ్ స్టేషన్లు, లైన్లకు దగ్గరగా సోలార్ పార్కులు అభివృద్ధి చేస్తున్నారు. వ్యవసాయానికి రోజుకు 33 మిలియన్ యూనిట్లు రాష్ట్రంలో ప్రస్తుతం 18.37 లక్షల వ్యవసాయ పంపుసెట్లున్నాయి. ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన 9 గంటల పగటిపూట విద్యుత్ పథకం ప్రకారం రోజుకు 33 మిలియన్ యూనిట్ల కరెంట్ అవసరం. పగటిపూటే వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ డిమాండ్ కూడా ఉంటోంది. ఈ కారణంగా వ్యవసాయ విద్యుత్‌కు కోత పెట్టడం అనివార్యమవుతోంది. వేసవిలో డిమాండ్ ఇంకా ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఉచిత విద్యుత్ కోసమే ప్రత్యేకంగా సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. పది వేల మెగావాట్ల సౌర విద్యుత్ పార్కుల నుంచి రోజుకు 40 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి ఉంటుందని అధికారులు అంచనా వేశారు. వ్యవసాయానికి రోజుకు 33 మిలియన్ యూనిట్లు వాడుకున్నా.. ఇంకా 7 మిలియన్ల యూనిట్లు గ్రిడ్‌కు అనుసంధానం చేయొచ్చు. పైగా నిర్మాణ వ్యయం తక్కువగా ఉండటం వల్ల యూనిట్ రూ.2.50 లోపే ఉంటుందని భావిస్తున్నారు. వ్యవసాయ విద్యుత్‌కు డిమాండ్ పెరగడంతో గతంలో మార్కెట్లో యూనిట్ రూ.6 పెట్టి కొనుగోలు చేసేవారు. ఈ ఖర్చంతా డిస్కమ్‌లపైనే పడింది. గత ప్రభుత్వం డిస్కమ్‌లకు ఇవ్వాల్సిన సబ్సిడీ మాత్రమే ఇచ్చింది. గత ఐదేళ్లుగా ఇది ఏటా రూ.4 వేల కోట్లు మించలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ ఒక్క సంవత్సరమే రూ.10 వేల కోట్ల వరకు ఇచ్చింది. ఈ సబ్సిడీ మొత్తాన్ని నాలుగేళ్లకు లెక్కగడితే రూ.40 వేల కోట్లు అవుతుంది. ఇంత మొత్తాన్ని ఒకేసారి వెచ్చిస్తే 25 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్‌కు ఢోకా లేకుండా చౌకగా విద్యుత్ అందించే వీలుంది. డీపీఆర్‌లు సిద్ధం: నాగులాపల్లి శ్రీకాంత్, ఇంధన శాఖ కార్యదర్శి సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై సమగ్ర నివేదిక (డీపీఆర్)లను ఇప్పటికే సిద్ధం చేశాం. లాభనష్టాలపై సీఎంతో చర్చిస్తాం. అవసరమైన రుణాలు కూడా అతి తక్కువ రేటుకే లభించే వీలుంది. వ్యవసాయానికి పగటి విద్యుత్‌లో కోతలు రాకుండా సౌర విద్యుత్ ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నాం. -
రైతుల పడిగాపులు
వ్యవసాయానికి సక్రమంగా అందని విద్యుత్ - పైరును కాపాడుకునేందుకు పొలాల వద్దే నిరీక్షణ - తొమ్మిది గంటల కరెంట్ సరఫరాలో సర్కారు విఫలం - జనరేటర్ల సాయంతో సేద్యానికి ప్రయత్నాలు చిలకలూరిపేటరూరల్ : వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్ అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాభావ పరిస్థితుల్లో పైరును బతికించుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. ఏ సమయంలో విద్యుత్ ఇస్తారో తెలియక పొలాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. వ్యవసాయానికి తొమ్మిది గంటల పాటు నిరంతర విద్యుత్ అందిస్తానని హామీ ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి రాగానే ఆ హామీని అమలు చేయటంలో పూర్తిగా విఫలమయ్యారని రైతులు ధ్వజమెత్తుతున్నారు. విద్యుత్ సరఫరా లేక బోరు నీరు లభిస్తున్న ప్రాంతాల్లో సైతం పైర్లు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి సాగుచేసిన పొలాలను వదులుకోలేని రైతులు జనరేటర్లు ఏర్పాటు చేసుకుని పైరును బతికించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కారణంగా సాగు వ్యయం పెరుగుతోందని వాపోతున్నారు. మండలంలో మొత్తం 513 ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. మిట్టపాలెంలో ఒకటి, పసుమర్రులో 15, తాతపూడిలో 16, గొట్టిపాడులో ఒకటి, కావూరులో 34, కొత్తపాలెంలో ఐదు, మద్దిరాలలో 14, పోతవరంలో ఆరు, రామచంద్రాపురంలో 37, బొప్పూడిలో 45, గోపాళంవారిపాలెంలో 43, కట్టుబడివారిపాలెంలో ఆరు, రాజాపేటలో 23, యడవల్లిలో 34, గంగన్న పాలెంలో ఎనిమిది, కమ్మవారిపాలెంలో 10, గోవిందపురంలో 14, మురికిపూడిలో 128, వేలూరులో ఏడు ఉన్నాయి. ఇవికాక మరో 35 ఫీజు చెల్లించే కనెక్షన్లు ఉన్నాయి. ఖరీఫ్ ప్రారంభ మై మూడు నెలలు గడిచినా నేటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు. మండలంలో కూరగాయలతోపాటు బొప్పాయి పంటలను కూడా సాగుచేస్తున్నారు. బోర్లు ఆధారంగా పొలాలకు నీటిని అందించాలని ప్రయత్నిస్తున్న రైతులకు నిరాశే మిగులుతోంది. వ్యవసాయ విద్యుత్ సరఫరాలో ప్రభుత్వం విఫలం కావటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి మొలకెత్తిన మొక్కలను బతికించుకునేందుకు రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేళా పాళా లేని కోతలు .... వ్యవసాయానికి అందించే ఉచిత విద్యుత్ ఎప్పు డు ఇస్తారో తెలియక రైతులు పొలాల వద్దే నిరీక్షిస్తున్నారు. ఉచితంగా ఏడు గంటలు అందాల్సిన విద్యుత్ రోజుకు కేవలం రెండు గంటలు మాత్రమే వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం విద్యుత్ సరఫరా వేళలు తెలిపే అధికారులు కూడా లేరనివాపోతున్నారు.మండలంలో పసుమర్రు, కావూరు, మద్దిరా ల, బొప్పూడి గ్రామాల్లో నాలుగు విద్యుత్ సబ్స్టేషన్లు ఉన్నా ప్రయోజనం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.