‘పవర్‌’ఫుల్‌.. పొదుపు | Unprecedented progress in the field of electricity Within a year | Sakshi
Sakshi News home page

‘పవర్‌’ఫుల్‌.. పొదుపు

Published Mon, Jun 15 2020 3:18 AM | Last Updated on Mon, Jun 15 2020 3:18 AM

Unprecedented progress in the field of electricity Within a year - Sakshi

సాక్షి, అమరావతి: విద్యుత్తును ఆదా చేస్తే పొదుపు చేసినట్లే... మరి వృథా ఖర్చులను నియంత్రిస్తే ప్రజలపై భారాన్ని కూడా నివారించినట్లే! విద్యుత్తుశాఖ ఇదే సూత్రాన్ని పాటించి ఏడాదిలో ప్రజలపై రూ.4,783.23 కోట్ల మేర భారం పడకుండా చేయగలిగింది. తద్వారా బిల్లుల భారాన్ని తప్పించింది. రాష్ట్ర విద్యుత్‌ రంగం స్వీయ నియంత్రణతో ఏడాదిలోనే అద్వితీయ పురోగతి సాధించింది. విద్యుత్తు సంస్థల నిర్వహణ వ్యయంలో కొనుగోళ్లే అత్యంత కీలకం. గత సర్కారు అవసరానికి మించి ఖరీదైన ప్రైవేట్‌ విద్యుత్‌ను తీసుకోవడంతో డిస్కమ్‌లు అప్పుల్లో కూరుకుపోయాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చౌక విద్యుత్‌ను అన్వేషించడంతోపాటు దుబారాకు ఏమాత్రం తావివ్వడం లేదు.  

► 2018–19లో రాష్ట్ర విద్యుత్‌ సంస్థల మొత్తం వ్యయం రూ.48,110.79 కోట్లు కాగా 2019–20లో దీన్ని రూ.43,327.56 కోట్లకు తగ్గించడం ద్వారా ప్రభుత్వం రూ.4,783.23 కోట్లను ఆదా చేసింది.  గత సర్కారు చేసిన అప్పులకు ఈ ఏడాది కాలంలో అత్యధిక వడ్డీలు కట్టాల్సి వచ్చింది. లేదంటే ఆదా మరింత ఎక్కువగా ఉండేది.  
► గత సర్కార్‌ అడ్డగోలుగా ప్రైవేట్‌ విద్యుత్‌ కొనుగోలు చేయగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పూర్తిగా నియంత్రించింది. 2018–19లో రూ.39,262.81 కోట్లున్న విద్యుత్‌ కొనుగోలు వ్యయాన్ని 2019–20లో రూ. 34,775.46 కోట్లకు కుదించారు. 2018–19లో వాస్తవానికి 7,629 మిలియన్‌ యూనిట్ల మిగులు విద్యుత్‌ ఉంది. కానీ గత సర్కార్‌ ప్రైవేట్‌ సంస్థలకు మేలు చేసేందుకు 6,952 మిలియన్‌ యూనిట్లు అనవసరంగా కొనుగోలు చేసింది.  
► టీడీపీ హయాంలో సౌర విద్యుత్‌ మార్కెట్లో యూనిట్‌ రూ.2.44కే లభిస్తున్నా యూనిట్‌ రూ. 8.09 చొప్పున కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది. ఫలితంగా 2019 డిసెంబర్‌ 31 నాటికి డిస్కమ్‌లకు రూ. 29 వేల కోట్ల మేర నష్టాలు వచ్చాయి. పవన విద్యుత్‌లోనూ ఇదే తంతు.  
► గతంలో సగటున యూనిట్‌ రూ.7 చొప్పున బహిరంగ మార్కెట్లో విద్యుత్‌ కొనుగోలు చేయగా ఈ ఏడాది యూనిట్‌ రూ.1.63 నుంచి రూ.2.80కి మించనివ్వలేదు. 
దీనివల్ల రూ.700 కోట్లు ఆదా అయ్యాయి.

అండగా ప్రభుత్వం  
► ప్రజాధనాన్ని ఆదా చేసిన విద్యుత్‌ సంస్థలకు ప్రభుత్వం అండగా నిలిచింది. 2019–20లో రూ. 17,904 కోట్లు అందించింది. 2019 డిసెంబర్‌ 31 వరకూ డిస్కమ్‌లకు ఉన్న రూ.13,391 కోట్ల సబ్సిడీలో రూ.8,655 కోట్లు విడుదల చేసింది. 2019–20లో మరో రూ.9,249 కోట్లు విడుదల చేసింది. 
► గత సర్కారు ఉత్పత్తిదారులకు బకాయిపడిన రూ.34,384 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. 2019–20లో బిల్లుల చెల్లింపు కోసం రూ. 20,384 కోట్లు విడుదల చేసింది. 
► మెట్రిక్‌ టన్ను బొగ్గు గతంలో రూ.1,824 ఉండగా ఏపీ జెన్‌కోలో బొగ్గు రవాణాకు రివర్స్‌ టెండరింగ్‌ చేపట్టడం వల్ల ఇప్పుడు రూ.1,027కే అందుతోంది. కృష్ణపట్నంలో రూ.1,010కే వస్తోంది. 

విద్యుత్‌ రంగం పునరుజ్జీవం
రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాత్మక చర్యలు చేపట్టడం వల్ల ఏడాది కాలంగా విద్యుత్‌ రంగం పునరుజ్జీవం దిశగా పయనిస్తోందని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి తెలిపారు. ఈమేరకు ప్రభుత్వానికి అందించనున్న నివేదికను ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఏ.చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు. విద్యుత్‌ కొనుగోళ్లలో అనవసర వ్యయాన్ని అరికట్టామని, చౌక విద్యుత్‌తో ప్రజలపై భారం పడకుండా నియంత్రించామని వివరించారు. 

► రాష్ట్ర విద్యుత్‌ రంగం స్వీయ నియంత్రణతో ఏడాదిలోనే అద్వితీయ పురోగతి సాధించింది.  
► గత సర్కారు అవసరానికి మించి ఖరీదైన ప్రైవేట్‌ విద్యుత్‌ను తీసుకోవడంతో డిస్కమ్‌లు అప్పుల్లో కూరుకుపోయాయి.  
► ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం దుబారాకు ఏమాత్రం తావివ్వడం లేదు. దీంతో ఈ ఏడాదిలో ప్రజలపై రూ.4,783.23 కోట్ల మేర భారం పడకుండా చేయగలిగింది. తద్వారా బిల్లుల భారాన్ని తప్పించింది. 
► గతంలో యూనిట్‌ రూ.7 చొప్పున బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ కొనుగోలు చేసేవారు. ఈ ఏడాది యూనిట్‌ రూ.1.63 నుంచి రూ.2.80కి మించనివ్వలేదు.  
► దీని వల్ల దాదాపు రూ.700 కోట్లు ఆదా అయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement