electricity companies
-
‘విద్యుత్’కమిషన్ దూకుడు!
సాక్షి, హైదరాబాద్: ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపేలా రాష్ట్ర విద్యుత్ సంస్థలు దాఖలు చేసిన 9 వేర్వేరు పిటిషన్లపై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) సోమవారం నుంచి వరుసగా ఐదు రోజుల పాటు బహిరంగ విచారణలు నిర్వహించనుంది. మండలి చైర్మన్ టి.శ్రీరంగారావు, సభ్యులు ఎండీ మనోహర్ రాజు, బండారు కృష్ణయ్యల ఐదేళ్ల పదవీకాలం ఈ నెల 29తో ముగియనుండగా, ఈలోపే ఆయా పిటిషన్లపై ఈఆర్సీ కీలక నిర్ణయాలను తీసుకోనుంది. నిర్దేశిత గడువుకి చాలా ఆలస్యంగా విద్యుత్ సంస్థలు పిటిషన్లు చేయడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. నిబంధనల ప్రకారం గతేడాది నవంబర్‌లోపే విద్యుత్ సంస్థలు పిటిషన్లు దాఖలు చేయాల్సి ఉండగా, గత నెలలో దాఖలు చేశాయి.ఒకేసారి పెద్ద సంఖ్యలో దాఖలైన పిటిషన్లను చదివి రాతపూర్వకంగా అభ్యంతరాలను సమర్పించడానికి సమయం సరిపోదని, గడువు పొడిగించాలని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫ్యాప్సీ)తో పాటు విద్యుత్ రంగ నిపుణులు ఎం.వేణుగోపాల్ రావు తదితరులు చేసిన విజ్ఞప్తులను ఈఆర్సీ తోసిపుచ్చింది. సోమవారం నుంచి ఈ నెల 25 వరకు వరుసగా ఐదు రోజుల పాటు హైదరాబాద్, నిజామాబాద్, సిరిసిల్లలో బహిరంగ విచారణలు నిర్వహించనుంది. ఆ తర్వాత 4 రోజుల పదవీకాలం మిగిలి ఉండగా కీలక ఉత్తర్వులు జారీ చేయనుంది. అయితే గడువులోగానే విద్యుత్ రంగ నిపుణులు, పారిశ్రామికవేత్తలు, రైతు సంఘాలు, సాధారణ వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున రాతపూర్వక అభ్యంతరాలు ఈఆర్సీకి అందాయి. కాగా ఈఆర్సీ తీసుకోనున్న కీలక నిర్ణయాలు ఇలా ఉన్నాయి.. జెన్కో ట్రూఅప్ చార్జీల భారం రూ.963 కోట్లు తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.963.18 కోట్ల ట్రూఅప్ చార్జీల పిటిషన్‌తో పాటు 2024–29 మధ్యకాలానికి సంబంధించిన మల్టీ ఇయర్ టారిఫ్ (ఎంవైటీ) పిటిషన్‌ను గత నెల 21న దాఖలు చేసింది. వీటిపై సోమవారం ఈఆర్సీ బహిరంగ విచారణ జరపనుంది. జీటీఎస్ కాలనీలోని విద్యుత్ నియంత్రణ్ భవన్లో ఉదయం 10.30 గంటలకు ఇది ప్రారంభం కానుంది. ఈఆర్సీ ఆమోదించిన విద్యుత్ ధరలు/చార్జీలతో పోల్చితే వాస్తవ ఆదాయంలో వ్యత్యాసాన్ని ట్రూఅప్ చార్జీల రూపంలో విద్యుత్ సంస్థలు సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది.ఒక వేళ ఆదాయ లోటు ఉంటే భర్తీ చేసుకోవడానికి ఎంత మేరకు ట్రూఅప్ చార్జీలను వసూలు చేయాలో ఈఆర్సీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. జెన్కో విద్యుత్ కేంద్రాల నుంచి రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు విద్యుత్ కొనుగోలు చేసి తమ వినియోగదారులకు సరఫరా చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జెన్కో ప్రతిపాదించిన రూ.963.18 కోట్ల ట్రూఅప్ చార్జీలను డిస్కంల నుంచి వసూలు చేసుకోవడానికి జెన్కో అనుమతి కోరింది. విద్యుత్ చార్జీలను పెంచడం ద్వారా ఈ ట్రూప్ చార్జీల భారాన్ని డిస్కంలు విద్యుత్ వినియోగదారులపై మోపుతాయి. ఐదేళ్లలో రూ.16,346 కోట్ల ఆదాయ అవసరాలు తెలంగాణ విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్‌కో) దాఖలు చేసిన 2024–29 మధ్యకాలానికి సంబంధించిన రెండు ఎంవైటీ పిటిషన్లపై మంగళవారం ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించనుంది. వచ్చే ఐదేళ్లలో మొత్తం రూ.16,346.1 కోట్ల ఆదాయ అవసరాలున్నట్టు ట్రాన్స్‌కో అంచనా వేసింది. ఇక సిరిసిల్ల జిల్లాకు విద్యుత్ సరఫరా చేసే కోఆపరేటివ్ ఎలక్రి్టక్ సప్లై లిమిటెడ్ (సెస్) పరిధిలో రూ.5 కోట్ల విద్యుత్ చార్జీల పెంపునకు ప్రతిపాదిస్తూ దాఖలు చేసిన ఏఆర్ఆర్ 2024–25, 2024–29 ఎంవైటీ పటిషన్‌పై ఈ నెల 25న సిరిసిల్లలో విచారణ జరగనుంది. నవంబర్ 1 నుంచి పెరగనున్న చార్జీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25)లో రాష్ట్రంలో రూ.1,200 కోట్ల మేర విద్యుత్ చార్జీల పెంపునకు అనుమతి కోరుతూ దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు (టీజీఎస్పీడీసీఎల్/టీజీఎనీ్పడీసీఎల్) దాఖలు చేసిన రెండు వేర్వేరు ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్) పిటిషన్లతో పాటు 2024–29 మధ్యకాలానికి సంబంధించిన మరో రెండు ఎంవైటీ పిటిషన్లపై బుధవారం హైదరాబాద్‌లో, గురువారం నిజామాబాద్‌లో ఈఆర్సీ బహిరంగ విచారణ నిర్వహించనుంది. రాష్ట్రంలో హైటెన్షన్ (హెచ్‌టీ) కేటగిరీ విద్యుత్ చార్జీల పెంపు, లోటెన్షన్ (ఎల్టీ) కేటగిరీలో కూడా నెలకు 300 యూనిట్లకుపైగా వినియోగించే వారికి ఫిక్స్డ్ చార్జీ (డిమాండ్ చార్జీ)ల పెంపును డిస్కంలు ప్రతిపాదించాయి. హెచ్‌టీ కేటగిరీకి చార్జీల పెంపుతో రూ.700 కోట్లు, ఫిక్స్డ్ చార్జీల పెంపుతో రూ.100 కోట్లు కలిపి రూ.800 కోట్లు భారం పడనుంది. మరో రూ.400 కోట్లను ఎల్టీ వినియోగదారుల నుంచి ఫిక్స్డ్ చార్జీల పెంపు ద్వారా రాబట్టుకుంటామని డిస్కంలు ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. నవంబర్ 1 నుంచి చార్జీల పెంపు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. -
భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: వేసవి తీవ్రత అప్పుడే పెరుగుతుండడంతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగిపోయింది. బోరుబావుల కింద వేసిన యాసంగి పంటలను రక్షించుకోవడానికి విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. ఫిబ్రవరి నెలలో తొలిసారిగా గరిష్ట విద్యుత్ డిమాండ్ 15వేల మెగావాట్లను దాటింది. ఈ నెల 23న రాష్ట్రంలో 15,031 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ నమోదైంది. గతేడాది సరిగ్గా ఇదే రోజు 14,526 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ మాత్రమే నమోదైంది. గతేడాది మార్చి 30న రాష్ట్రంలో అత్యధికంగా 15497 మెగావాట్ల గరిష్ట విదుŠయ్త్ నమోదు కాగా, ఈ ఏడాది మార్చి చివరి నాటికి 16,500 మెగావాట్లకు మించనుందని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు అంచనా వేస్తున్నాయి. ఈ మేరకు విద్యుత్ సరఫరా చేసేందుకు రాష్ట్ర ఇంధన శాఖ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. 1,200 మెగావాట్ల విద్యుత్ బ్యాంకింగ్‌కు ఏర్పాట్లు 1,600మెగావాట్ల రామగుండం ఎన్టీపీసీ థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో 800 మెగావాట్ల నుంచి ఇప్పటికే వాణిజ్యపరమైన ఉత్పత్తి ప్రారంభం కాగా, 800 మెగావాట్ల రెండో ప్లాంట్ నుంచి ఉత్పత్తిని ప్రారంభించడానికి సర్వంసిద్ధం చేశారు. పొరుగు రాష్ట్రాలతో 1200 మెగావాట్ల విద్యుత్ బ్యాంకింగ్‌కు సైతం ఏర్పాట్లు చేశారు. దీని ద్వారా రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉన్నప్పుడు ఆ రాష్ట్రాలకు విద్యుత్ ఇచ్చి మన రాష్ట్రంలో లోటు ఉన్నప్పుడు తీసుకోవడానికి అవకాశం ఉండనుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది జనవరిలో 6.9 శాతం, ఫిబ్రవరి నెలలో 4.6 శాతం విద్యుత్ వినియోగం పెరిగింది. గతేడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో సగటున రోజువారీ విద్యుత్ వినియోగం 242.95 మిలియన్ యూనిట్లు కాగా, ఈ ఏడాది ఇదే కాలంలో 256.74 మిలియన్ యూనిట్లకు చేరింది. సాగునీరు లేక పెరగనున్న విద్యుత్ అవసరాలు కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నిల్వలు అడుగంటిపోవడంతో కాల్వల కింద ఆయకట్టు సాగుకు నీళ్లు లేవు. మరమ్మతుల్లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సైతం ఖాళీ చేయాల్సి వచ్చింది. దీంతో రాష్ట్రంలో బోరుబావుల కింద విద్యుత్ వినియోగం మరింత పెరగనుందని అంచనా వేస్తున్నారు. గరిష్ట విద్యుత్ డిమాండ్ మార్చి చివరిలోగా 16500–17000 మెగావాట్ల మధ్య నమోదు కావచ్చని భావిస్తున్నారు. దక్షిణ డిస్కంల పరిధిలోనూ పెరిగిన వినియోగం దక్షిణ తెలంగాణలోని ఐదు ఉమ్మడి జిల్లాలకు విద్యుత్ సరఫరా చేసే దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) పరిధిలో గతేడాదితో పోల్చితే ఈ ఏడాది జనవరిలో 6.67 శాతం, ఫిబ్రవరిలో 6.24 శాతం విద్యుత్ వినియోగం పెరిగింది. సంస్థ పరిధిలో ఫిబ్రవరి 2023లో గరిష్ట విద్యుత్ డిమాండ్ 9043 మెగావాట్లు నమోదు కాగా, 2024 ఫిబ్రవరి 23న 9253 మెగావాట్లకు పెరిగింది. గతేడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో సగటున 158.71 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరగగా, ఈ ఏడాది ఇదే కాలంలో 169.36 మిలియన్ యూనిట్లకు పెరిగింది. గ్రేటర్లో డిమాండ్ పైపైకి.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది జనవరిలో 9.47 శాతం, ఫిబ్రవరిలో 12.27శాతం విద్యుత్ వినియోగం పెరిగింది. ఫిబ్రవరి 2023లో గరిష్ట విద్యుత్ డిమాండ్ 2,930 మెగావాట్లుగా నమోదు కాగా, 2024 ఫిబ్రవరి 23న 3,174 మెగావాట్లుగా నమోదయ్యింది. నగరంలో గతేడాది జనవరి, ఫిబ్రవరిలో సగటు విద్యుత్ వినియోగం 51.69 మిలియన్ యూనిట్లు ఉండగా, ఈ ఏడాది జనవరిలో 57.34 మిలియన్ యూనిట్లు, ఫిబ్రవరిలో 65 మిలియన్ యూనిట్లకు పెరిగింది. -
ప్రభుత్వం చెల్లించకుంటే.. ప్రజల నుంచి వసూలు చేయాల్సిందే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా విద్యుత్ సబ్సిడీని చెల్లించని పక్షంలో విద్యుత్ చట్టంలోని సెక్షన్ 65 ప్రకారం వినియోగదారుల నుంచి సబ్సిడీ లేని విద్యుత్ చార్జీలు (టారిఫ్) వసూలు చేయాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. సబ్సిడీ రహిత టారిఫ్‌ను వర్తింపజేయాల్సిందిగా రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు ఆదేశాలు జారీ చేయాలని ఆయా రాష్ట్రాల విద్యుత్ నియంత్రణ మండళ్లకు (ఈఆర్సీలకు) సూచించింది. విద్యుత్ చార్జీలు పెంచి వసూలు చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు విద్యుత్ సబ్సిడీల విధానంలో కీలక మార్పులను అమల్లోకి తెస్తూ గత జూలై 26న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ తాజాగా దానిని బహిర్గతం చేసింది. విద్యుత్ నిబంధనలకు రెండో సవరణ–2023 పేరుతో ఈ నిబంధనలు అమల్లోకి వచ్చా యి. ఇకపై కేంద్రం ప్రకటించే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఆధారంగా ప్రభు త్వం చెల్లించాల్సిన విద్యుత్ సబ్సిడీలను డిస్కంలు లెక్కించాలని కేంద్రం స్పష్టం చేసింది. ఎంత సబ్సిడీ చెల్లించకపోతే అంత మోత.. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం సబ్సిడీతో పోల్చితే వాస్తవంగా చెల్లిస్తున్న సబ్సిడీ తక్కువగా ఉంటుండటంతో డిస్కంలు భారీ ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడిన సబ్సిడీ మేరకు విద్యుత్ చార్జీలను పెంచి వినియోగ దారుల నుంచి వసూలు చేయాల్సిందేనని కేంద్రం ఆదేశించింది. ఉదాహరణకు గృహ వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసేందుకు యూనిట్‌కు రూ.8 చార్జీ ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం ఇందులో రూ.4 సబ్సిడీ ఇచ్చేందుకు హామీ ఇచ్చింది. అయితే ప్రభుత్వం యూనిట్‌కు రూ.2 మాత్రమే సబ్సిడీగా చెల్లిస్తోంది. దీంతో వినియోగదారులు చెల్లించే రూ.4కు లోటు సబ్సిడీ రూ.2 కలిపి మొత్తం రూ.6కు చార్జీ పెంచుకోవాల్సిందిగా కేంద్రం సూచించింది. ఒకవేళ ప్రభుత్వం సబ్సిడీ పూర్తిగా చెల్లించని పక్షంలో రూ.8 వసూలు చేసుకోవాలని ఆదేశించింది. ఇకపై సబ్సిడీల వివరాలతో త్రైమాసిక నివేదికలు కేంద్రం ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు పూర్తి స్థాయిలో విద్యుత్ సబ్సిడీలను ఎప్పటికప్పుడు ముందస్తుగా డిస్కంలకు చెల్లించకతప్పని పరిస్థితి నెలకొంది. కాగా కేటగిరీల వారీగా వినియోగదారులు వాడిన విద్యుత్‌కు సంబంధించి ప్రభుత్వం నుంచి రావాల్సిన విద్యుత్ సబ్సిడీలను కచ్చితంగా లెక్కించడానికి కొత్త విధానాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చింది. కేటగిరీల వారీగా ఓ త్రైమాసికంలో సబ్సిడీ వినియోగదారులు ఎన్ని యూనిట్ల విద్యుత్ వాడారు? ప్రతి యూనిట్ విద్యుత్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీ ఎంత? రాష్ట్ర ప్రభుత్వం వాస్తవంగా చెల్లించిన సబ్సిడీ ఎంత? ఇంకా రావాల్సిన సబ్సిడీ బకాయిలు/లోటు ఎంత? తదితర వివరాలతో రాష్ట్రాల ఈఆర్సీలు త్రైమాసిక నివేదికను విడుదల చేయాల్సి ఉంటుంది. ప్రతి త్రైమాసికం ముగిసిన తర్వాత 30 రోజుల్లోగా ఈఆర్సీకి డిస్కంలు ఈ మేరకు వివరాలతో ఓ నివేదికను సమర్పిస్తాయి. ఈ ప్రతిపాదనలను పరిశీలించి అవసరమైన సవరణలతో 30 రోజుల్లోగా ఈఆర్సీ తుది త్రైమాసిక నివేదికను ప్రకటిస్తుంది. నిబంధనల మేరకు విద్యుత్ సబ్సిడీ అకౌంటింగ్ జరగలేదని, సబ్సిడీల కోసం ప్రభుత్వానికి బిల్లులు పంపించలేదని తేలితే డిస్కంలోని సంబంధిత అధికారిపై చర్యలు తీసుకోవాలని ఈఆర్సీలను కేంద్రం ఆదేశించింది. -
గరిష్టానికి విద్యుత్ డిమాండ్
న్యూఢిల్లీ: దేశంలో విద్యుత్‌కు డిమాండ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఆర్థిక కార్యకలాపాలు బలంగా సాగుతుండడం, తయారీ రంగానికి కేంద్రం పెద్ద ఎత్తున మద్దతునిస్తూ ఉండడం, ప్రజల ఖర్చు చేసే ఆదాయంలో పెరుగుదల కలసి విద్యుత్ వినియోగాన్ని ఏటేటా ఆల్‌టైమ్ గరిష్టానికి తీసుకెళుతున్నాయి. దీంతో డిమాండ్‌ను చేరుకునేందుకు విద్యుత్ తయారీ సంస్థలు (పవర్ ప్లాంట్లు), బొగ్గు గనుల కంపెనీలు పూర్తి స్థాయిలో పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది జవవరిలో విద్యుత్ వినియోగం, క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చినప్పుడు 13.5 బిలియన్ కిలోవాటర్ హవర్గా ఉంది. ఇది 12 శాతం వృద్ధికి సమానం. గ్రిడ్ ఇండియా నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ గణాంకాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. జనవరిలో గరిష్ట డిమాండ్ 211 గిగావాట్లుగా నమోదైంది. 2021 జనవరి నెలతో పోలిస్తే 10 శాతం ఎక్కువ. థర్మల్ ప్లాంట్లు 16 బిలియన్ కిలోవాటర్ హవర్ మేర ఉత్పత్తిని అదనంగా చేశాయి. ఇది క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 18 శాతం అధికం కావడం గమనించాలి. ఏటేటా పెరుగుదల.. దేశంలో విద్యుత్‌కు డిమాండ్ ఉష్ణోగ్రతల ఆధారితం కాకుండా, నిర్మాణాత్మకంగానే పెరుగుతూ వస్తోంది. 2022 సంవత్సరం విద్యుత్‌కు డిమాండ్ 6 శాతానికి పైన పెరిగింది. కానీ, గడిచిన దశాబ్ద కాలంలో వార్షికంగా విద్యుత్ సగటు పెరుగుదల 4%గానే ఉండడం గమనించాలి. దేశంలో వ్యాపార కార్యకలాపాలు వేగంగా పెరుగుతున్నట్టు ‘పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్’ సర్వే గణాంకాలు తెలియజేస్తున్నాయి. తయారీలో 55.4గా ఉంటే సేవల పీఎంఐ 57.2గా జనవరి నెలకు నమోదయ్యాయి. కంపెనీలకు సమస్యలు దేశీయంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు సరిపడా బొగ్గును సరఫరా చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. కోల్ ఇండియా ఒక్కటే 90% అవసరా లు తీరుస్తున్న విషయం తెలిసిందే. గతేడాది 12% అధికంగా బొగ్గు సరఫరా జరిగింది. కానీ, విద్యుదుత్పత్తి సంస్థల వాస్తవ అవసరాల కంటే ఇది తక్కువ కావడం గమనించాలి. అందుకే 10% వరకు విదేశీ బొగ్గును దిగుమతి చేసి వాడుకోవాలంటూ కేంద్రం సూచనలు సైతం చేసింది. రైల్వే శాఖ ఫిబ్రవరిలో రోజువారీగా 271 గూడ్స్ రైళ్లను బొగ్గు సరఫరా కోసం నడిపించింది. కానీ, వాస్తవ లక్ష్యమైన రోజు వారీ 313 రైళ్ల కంటే తక్కువేనని తెలుస్తోంది. ముఖ్యంగా ప్లాంట్లకు కావాల్సినంత బొగ్గును సరఫరా చేయడంలో రైల్వే వైపు నుంచి కొరత ఉంది. ప్రస్తుతం కంపెనీల వద్ద 12 రోజుల విద్యుత్ తయా రీ అవసరాలకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి. గతేడాది ఇదే కాలంలో 9 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి. 2021లో 15 రోజులు, 20 20లో 28 రోజులు, 2019లో 18 రోజులతో పోలిస్తే బొగ్గు నిల్వలు తక్కువ రోజులకే ఉన్నట్టు తెలుస్తోంది. సరఫరా పెంచేందుకు చర్యలు.. బొగ్గు సరఫరా పెంచేందుకు గాను విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలంటూ జెన్కోలను కేంద్ర ప్రభుత్వం కోరింది. దేశీ బొగ్గుతో కలిపి తయారీకి వినియోగించుకోవాలని సూచించింది. దిగుమతి చేసుకునే బొగ్గుతో నడిచే ప్రైవేటు సంస్థలను సైతం గరిష్ట స్థాయిలో విద్యుత్ తయారీ చేయాలని ఆదేశించింది. పునరుత్పాదక విద్యుత్ తయారీని పెంచేందుకు కేంద్రం తీసుకున్న చర్యలు కొంత వరకు ఉపశమనం కల్పించాయి. కానీ, బొగ్గు ఆధారిత సామర్థ్యంతో పోలిస్తే పునరుత్పాదక తయారీ సామర్థ్యం చాలా తక్కువగానే ఉంది. దీంతో ఇప్పటికీ థర్మల్ ప్లాంట్లపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. ఫిబ్రవరిలో నమోదైన మొత్తం సరఫరాలో బొగ్గు ఆధారిత విద్యుత్ 76 శాతం స్థాయిలో ఉంది. ఈ ఏడాది జనవరి నెలలో పునరుత్పాదక ప్రాజెక్టుల ద్వారా విద్యుత్ తయారీ 15 శాతం పెరిగింది. విండ్ ద్వారా 50 శాతం పెరగ్గా, సోలార్ ద్వారా 37 శాతం పెరుగుదల ఉంది. మధ్యకాలానికి పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని, దాంతో బొగ్గుపై ఆధారపడడం తగ్గుతుందని కేంద్రం భావిస్తోంది. -
గల్లీకో కరెంట్ కంపెనీ!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సంస్కరణల అమల్లో కేంద్రం దూకుడు పెంచింది. విద్యుత్ పంపిణీ రంగం ప్రైవేటీకరణలో భాగంగా గల్లీకో కరెంట్ పంపిణీ కంపెనీ (డిస్కం) ఏర్పాటుకు వీలు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంత చిన్న ప్రాంతమైనా సరే.. విద్యుత్ సరఫరా కోసం ఉండాల్సిన కనీస ప్రాంతం (మినిమమ్ ఏరియా ఆఫ్ సప్లై)గా ప్రకటించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కట్టబెట్టింది. ఆ చిన్న ప్రాంతం పరిధిలో ఒకటి మించి విద్యుత్ పంపిణీ కంపెనీల ఏర్పాటుకు అనుమతిస్తూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండళ్లు (ఈఆర్సీలు) లైసెన్స్ జారీ చేయడానికి వీలుకలగనుంది. ఈ మేరకు ‘డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ లైసెన్స్ సవరణ నిబంధనలు–2022’ను కేంద్ర విద్యుత్ శాఖ తాజాగా అమల్లోకి తెచ్చింది. ‘ఏదైనా చిన్న ప్రాంతం’ నిబంధనతో.. ఇటీవల ప్రకటించిన నిబంధనల ప్రకారం.. మున్సిపాలిటీ/ మున్సిపల్ కార్పొరేషన్/ రెవెన్యూ జిల్లాను కనీస ప్రాంతంగా పరిగణిస్తూ డిస్కంల ఏర్పాటుకు లైసెన్స్‌లు జారీ చేయాల్సి ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం.. ఒక మున్సిపల్ కార్పొరేషన్/ పక్కపక్కనే ఉన్న మూడు రెవెన్యూ జిల్లాలు/ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసినా ఏదైనా చిన్న ప్రాంతంలో ఒకటికి మించి డిస్కంల ఏర్పాటుకు లైసెన్స్‌లు జారీ చేసుకోవచ్చు. ఇందులో ‘ఏదైనా చిన్న ప్రాంతం’ అనే వెసులుబాటు కారణంగా కనీస ప్రాంతం విషయంలో పరిమితిని దాదాపుగా ఎత్తివేసినట్టు అయిందని విద్యుత్ రంగ నిపుణులు చెప్తున్నారు. ‘విద్యుత్ బిల్లు’ అమల్లో భాగమే! ఒక ప్రాంతంలో విద్యుత్ సరఫరా కోసం ఎన్ని డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ముందుకొచ్చినా.. రాష్ట్రాల ఈఆర్సీలు వాటికి తప్పనిసరిగా లైసెన్సులు జారీ చేయాలని ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన విద్యుత్ చట్ట సవరణ ముసాయిదా బిల్లు–2022లో కేంద్రం ప్రతిపాదించింది. ఇక డిస్కంలకు విద్యుత్ పంపిణీ కోసం సొంత ట్రాన్స్మిషన్ (విద్యుత్ స్తంభాలు, లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు వంటివి) వ్యవస్థ ఉండాలన్న నిబంధననూ తొలగిస్తున్నట్టు ఆ బిల్లులో పేర్కొంది. తాజాగా కనీస ప్రాంత పరిధిపై పరిమితిని ఎత్తివేసింది. ఇది ‘విద్యుత్ చట్ట సవరణ బిల్లు’ను పరోక్షంగా అమల్లోకి తెచ్చినట్టేనని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రైవేటుకు పూర్తిగా లైన్ క్లియర్! ప్రస్తుతం రాష్ట్రంలో ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్/టీఎస్ఎస్పీడీసీఎల్)లు ఉన్నాయి. రెండూ ప్రభుత్వ రంగ సంస్థలే. తమ ప్రాంతాల పరిధిలో విద్యుత్ పంపిణీ వ్యవస్థలను స్వయంగా అభివృద్ధి చేసుకున్నాయి. కొత్త నిబంధనల కారణంగా ప్రైవేటు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు తెరపైకి రానున్నాయి. బాగా లాభాలు వచ్చే పట్టణ, పారిశ్రామిక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కోసం అవి పోటీపడే అవకాశం ఉంది. ఇన్నాళ్లూ విద్యుత్ సరఫరా చేస్తున్న ప్రభుత్వ సంస్థలకు ఇబ్బంది ఎదురవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. -
విద్యుత్ ఉద్యోగుల ‘పీఆర్సీ’ గడువు పెంపు
సాక్షి, అమరావతి: విద్యుత్ సంస్థల ఉద్యోగుల జీతభత్యాలు, అలవెన్సులు, ఇతర ప్రయోజనాలపై అధ్యయనం చేసేందుకు ఏర్పడ్డ పే రివిజన్ కమిషన్(పీఆర్సీ) ఈ నెల 30 వరకూ వినతులు స్వీకరిస్తుంది. ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీసీపీడీసీఎల్) సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఆపరేషన్స్) సర్కిల్ కార్యాలయంలో ఫిబ్రవరి 15 నుంచి వినతులు స్వీకరించడం మొదలెట్టిన పీఆర్సీ.. తొలుత ఫిబ్రవరి నెలాఖరు వరకూ షెడ్యూల్ ఇవ్వగా, అనంతరం ఈ నెల 13 వరకూ గడువు పొడిగించుకుంటూ వచ్చింది. అయినప్పటికీ ఇంకా వినతులు తీసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించి ఈ నెలాఖరు వరకూ అవకాశం కల్పిస్తున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఏపీ ట్రాన్స్ కో, ఏపీ జెన్ కో, మూడు డిస్కంల ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, వివిధ యూనియన్ల నుంచి మంగళవారం నుంచి శుక్రవారం వరకూ రోజూ ఉదయం 11 గంటలకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు నేరుగా స్వీకరిస్తారు. అయితే స్వయంగా వెళ్లి వినతులిచ్చే అవకాశం లేనివారి కోసం ఈ–మెయిల్ prc2022 powerutilities@gmail.com, వాట్సప్ నంబర్ 8500676988 సదుపాయాలను కూడా ఈసారి పీఆర్సీ అందుబాటులోకి తెచ్చింది. -
233 మిలియన్ యూనిట్లకు చేరిన విద్యుత్ డిమాండ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగిందని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మజనార్థనరెడ్డి చెప్పారు. ఈ నెల ప్రారంభంలో విద్యుత్ వినియోగం రోజుకు 207 మిలియన్ యూనిట్లుండగా.. ప్రస్తుతం 233 మిలియన్ యూనిట్లకు చేరిందని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. టన్ను బొగ్గు ధర రూ.40 వేలకు పైగా ఉండటంతో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి ఆశించినంతగా లేదని చెప్పారు. బహిరంగ మార్కెట్ నుంచి పీక్ అవర్స్‌లో విద్యుత్ కొనుగోలు చేయడానికి యూనిట్‌కు రూ.20 ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. దీనివల్ల.. ట్రూ అప్ చార్జీల రూపంలో వినియోగదారులపై అదనపు భారం పడటమే కాకుండా విద్యుత్ సంస్థలకూ కష్టంగా మారుతుందన్నారు. వేసవి డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని గృహ, పరిశ్రమలు, మాల్స్, వాణిజ్య భవనాల వినియోగదారులు విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని కోరారు. ఉ.6 నుంచి 9 వరకు, సా.6 నుంచి 10 వరకు వినియోగాన్ని తగ్గించుకోవాలని, పరిశ్రమల్లో పని వేళలను పీక్ అవర్స్‌లో కాకుండా మిగతా సమయాలకు సర్దుబాటు చేసుకోవాలని విజ్ఙప్తి చేశారు. -
కరెంట్ బకాయిలపై బాధ్యత తీసుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు చెల్లించాల్సిన రూ.6 వేల కోట్లకుపైగా విద్యుత్ బకాయిలను వెంటనే చెల్లించేలా చొరవ తీసుకోవాలని వైఎస్సార్ సీపీ ఎంపీల బృందం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. విభజన నష్టాలతోపాటు కోవిడ్ కారణంగా రాబడి కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి బకాయిల వసూలు అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం కేంద్రం ఆదేశాల మేరకు తెలంగాణకు విద్యుత్తు సరఫరా చేసినందున బకాయిలు చెల్లించేలా బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మన్నవరంలో విద్యుత్ ఉపకరణాల తయారీ జోన్ నెలకొల్పాలని కోరారు. పన్నుల వాటాలో మినహాయించైనా.. ఏపీ జెన్కోకు తెలంగాణ డిస్కమ్‌లు చెల్లించాల్సిన రూ.6,111 కోట్ల బకాయిలను వెంటనే ఇప్పించి నష్టాల్లో ఉన్న విద్యుత్ సంస్థలను ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ ఎంపీల బృందం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ను కోరింది. పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభా పక్షనేత పీవీ మిధున్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీల బృందం బుధవారం ఆర్కే సింగ్‌ను కలుసుకుని పలు అంశాలతో వినతిపత్రాన్ని సమర్పించింది. ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన విద్యుత్ బకాయిల్లో తీవ్ర జాప్యం జరుగుతుండటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర విభజన అనంతరం కేంద్రం ఆదేశాల మేరకు ఏపీ జెన్కో 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకు తెలంగాణ డిస్కమ్‌లకు విద్యుత్ సరఫరా చేసినట్లు గుర్తు చేశారు. ఈ బకాయిలను తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకూ చెల్లించలేదని తెలిపారు. కేంద్ర విద్యుత్ శాఖ అధికారులతో గతేడాది నవంబర్ 8న తెలుగు రాష్ట్రాల అధికారుల చర్చల సందర్భంగా సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాలని సూచించినా ఇంతవరకు కొలిక్కి రాలేదని తెలిపారు. తెలంగాణ వాటాగా కేంద్రం విడుదల చేసే పన్నుల ఆదాయం నుంచైనా మినహాయించి ఆంధ్రప్రదేశ్‌కు బకాయిలను చెల్లించాలని విజయసాయిరెడ్డి కోరారు. వినతిపత్రంలో ఇతర అంశాలు.. ► చిత్తూరు జిల్లా మన్నవరంలో ఎన్బీపీపీఎల్ ప్లాంట్ కోసం కేవలం 5 ఎకరాలను మాత్రమే వినియోగిస్తోంది. వృథాగా ఉన్న మిగిలిన 748 ఎకరాలను ఎన్టీపీసీ – ఏపీఐఐసీ జాయింట్ వెంచర్‌తో పవర్ ఎక్విప్మెంట్ తయారీ కోసం మాన్యుఫాక్చరింగ్ జోన్‌గా మార్చాలి. ► కరువు నివారణకు రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 27 ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టింది. రూ.12,500 కోట్ల మేర ఆర్థిక సాయం అందించేందుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఎస్పీవీ కింద ప్రతిపాదించిన అన్ని ప్రాజెక్టులను ఒకే ప్రాజెక్టుగా పరిగణించి రుణ సదుపాయం కల్పించాలి. ఆక్వా రైతులకు బీమా కేంద్ర మత్స్యశాఖ మంత్రికి వైఎస్సార్సీపీ ఎంపీల వినతి పెద్దఎత్తున విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తున్న ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు ఆక్వా రైతులకు బీమా పాలసీ అమలు చేయాలని వైఎస్సార్ సీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆక్వా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తోందని, కేంద్రం మద్దతిస్తే మెరుగైన తోడ్పాటు అందించవచ్చని నివేదించారు. ఆక్వా ఉత్పత్తులను ప్రోత్సహించి అభివృద్ధి చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుభరోసా కేంద్రాల ద్వారా ఆక్వా ల్యాబ్స్ ఏర్పాటు చేశారని తెలిపారు. సీడ్, ఫీడ్ అందజేయడంతోపాటు మెరుగైన గిట్టుబాటు ధర కల్పిస్తున్నట్లు వివరించారు. వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఎంపీల బృందం బుధవారం ఢిల్లీలో కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలాను కలుసుకుని ఈమేరకు పది అంశాలపై వినతిపత్రాన్ని అందజే సింది. ఎంపీలు మోపిదేవి వెంకటరమణరావు, గురుమూర్తి, బెల్లాన చంద్రశేఖర్, వంగా గీత వీరిలో ఉన్నారు. దేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని చేపట్టిందని తెలిపారు. విజయనగరం జిల్లా చింతపల్లి, విశాఖపట్నం జిల్లా భీమిలి, రాజయ్యపేటల్లో రూ.75 కోట్లతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన కింద కేంద్రం అనుమతించిందన్నారు. నెల్లూరు జిల్లా తడ, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో చేపల వేటకు వెళుతున్న మత్స్యకారులు పలు సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. తరచూ ఘర్షణలు చోటు చేసుకోవడం, పరస్పరం కేసులు నమోదు కావడంతో శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు తెలిపారు. దీన్ని శాశ్వతంగా పరిష్కరించేందుకు పులికాట్ సరస్సులో ఇసుకమేట డ్రెడ్జింగ్‌కు రూ.45 కోట్లతో ప్రతిపాదనలు పంపామన్నారు. నిధులు వెంటనే విడుదల చేయాలని కోరగా కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. వినతిపత్రంలో ఇతర ముఖ్యాంశాలివీ.. ► సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్వా కల్చర్ అథారిటీ ప్రాంతీయ కార్యాలయానికి కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో భూమి కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ► ఆక్వా రంగం ఆర్జించే విదేశీ మారక ద్రవ్యంలో రూ.15,600 కోట్ల వాటా ఏపీదే. ► ఆక్వా రంగానికి పవర్ టారిఫ్ తోడ్పాటు ఇవ్వాలి. ► రూ.40 కోట్లతో విశాఖ జిల్లా బండారుపల్లిలో ఆక్వా క్వారంటైన్ సెంటర్‌కు సవరించిన అంచనాలతో కేంద్రం గ్రాంటు మంజూరు చేయాలి. ► విశాఖలో నౌకాదళ విన్యాసాల సమయంలో జీవనోపాధికి ఇబ్బంది పడుతున్న మత్స్యకారులకు రూ.10 వేలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలి. ► బుడగట్లపాలెం, చింతపల్లి, ముక్కాం గ్రామాల్లో జెట్టీలు ఏర్పాటు చేయాలి. -
ప్రభుత్వ సహకారంతో నష్టాలను అధిగమిస్తున్నాం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం 2021–22లో విద్యుత్ పంపిణీ సంస్థలకు వివిధ రకాల సబ్సిడీల కింద రూ.9,717 కోట్లు విడుదల చేసిందని ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ తెలిపారు. ఏపీ సీపీడీసీఎల్ అమలు చేస్తున్న వివిధ నూతన ప్రాజెక్టులు, ప్రగతిపై టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఆదివారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర విద్యుత్ సంస్థల బలోపేతానికి సీఎం వైఎస్ జగన్, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంపూర్ణ సహకారం అందిస్తున్నారని తెలిపారు. అలాగే నష్టాలను తగ్గించడంలో డిస్కంలు మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయని అభినందించారు. వినియోగదారులకు మరింత నాణ్యమైన సేవలందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. సీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మజనార్దనరెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే అత్యుత్తమ డిస్కంలలో ఒకటిగా నిలిచే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. పవర్ ఫర్ ఆల్ పథకం కింద రూ.517 కోట్ల అంచనా వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. స్కాడా కింద విజయవాడ, గుంటూరులలో సబ్స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. విజయవాడ, గుంటూరు నగరాల్లో 16 ఇండోర్ సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. విజయవాడలో కంటైనర్ సబ్‌స్టేషన్ నిర్మాణాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామని తెలిపారు. అగ్రికల్చర్ డీబీటీ పథకం కింద స్మార్ట్ ఎనర్జీ మీటర్ల ఏర్పాటుకు టెండర్లు పూర్తయ్యాయన్నారు. 5వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలకు 3 ఫేజ్ విద్యుత్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. -
పీఆర్సీపై దుష్ప్రచారాలు నమ్మొద్దు
సాక్షి, అమరావతి: పీఆర్సీపై కొన్ని పత్రికలు, సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని విద్యుత్ ఉద్యోగులకు ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పద్మజనార్దనరెడ్డి సూచించారు. విద్యుత్ ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర సదుపాయాలపై పే రివిజన్ కమిటీ(పీఆర్సీ) అందరితో చర్చించిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని.. ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాత విద్యుత్ సంస్థలు ఆ నివేదికను ఆమోదిస్తాయని ఆయన తెలిపారు. ఈ మేరకు సోమవారం పద్మజనార్దనరెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తగిన నిర్ణయాలు తీసుకుంటుందని పేర్కొన్నారు. కరోనా సమయంలో సంస్థ ఉద్యోగుల వైద్య బిల్లుల కోసం ప్రభుత్వం సకాలంలో రూ.3.02 కోట్లు చెల్లించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. విద్యుత్ సంస్థలకు సబ్సిడీ బకాయిలు ఎప్పటికప్పుడు విడుదల చేసే విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారని వివరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఇప్పటివరకు రూ.25 వేల కోట్లకు పైగా సబ్సిడీ బకాయిలు విడుదల చేసిందని తెలిపారు. ఇటీవల ప్రతిపాదించిన సర్వీసు నిబంధనలు కొత్తగా చేరిన వారికే వర్తిస్తాయని పేర్కొన్నారు. ఇప్పటికే భర్తీ చేసిన ఎనర్జీ అసిస్టెంట్(జేఎల్ఎం గ్రేడ్–2) పోస్టులను నూతన రెగ్యులేషన్స్ ద్వారా గతేడాది అక్టోబర్ రెండో తేదీ నుంచి రెగ్యులరైజ్ చేయాల్సి ఉంటుందన్నారు. ఎవరికైనా సర్వీసు సమస్యలు, అనుమానాలుంటే సంబంధిత విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలను సంప్రదించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందించడంపై ఉద్యోగులు దృష్టి సారించాలని.. ఉద్యోగుల సంక్షేమాన్ని ప్రభుత్వం చూసుకుంటుందని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పద్మజనార్దనరెడ్డి తెలిపారు. -
అసత్య కథనాలతో దుష్ప్రచారం: ఆదా.. కానరాదా?
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోళ్లపై కొన్ని పత్రికలు వాస్తవాలను వక్రీకరిస్తూ అసత్య కథనాలు ప్రచురించడాన్ని ఇంధనశాఖ తీవ్రంగా తప్పుబట్టింది. పీపీఏలున్న విద్యుత్ సంస్థలు కరెంట్ సరఫరాలో కోత పెట్టినప్పటికీ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేసి నెల రోజుల్లో రూ.22.7 కోట్లు లాభం చేకూర్చామని స్పష్టం చేసింది. వాస్తవాలు ఇలా ఉండగా డిస్కమ్‌లకు రూ.48 కోట్లు నష్టం వాటిల్లిందంటూ వాస్తవ విరుద్ధ కథనాలు ప్రచురించారని ఇంధనశాఖ పేర్కొంది. విద్యుత్ కొనుగోళ్లను కట్టడి చేయడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉందని, దీన్ని నీతి అయోగ్ కూడా ప్రశంసించిందని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి గుర్తు చేశారు. ఏపీఈఆర్సీ నిరంతర పర్యవేక్షణ.. నిజానికి విద్యుత్ కొనుగోళ్లపై గత రెండేళ్లుగా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మరీ ముఖ్యంగా చౌక విద్యుత్‌నే సాధ్యమైనంత వరకూ కొనుగోలు చేస్తోంది. దీనికోసం ప్రత్యేక యంత్రాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ మొత్తం వ్యవహారాన్ని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) నిరంతరం పర్యవేక్షిస్తోంది. గతేడాది డిసెంబర్ 17 నుంచి జనవరి 15వ తేదీ వరకూ జరిగిన విద్యుత్ కొనుగోళ్ల వివరాలను ఇటీవల ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి విశ్లేషించింది. బొగ్గు కొరత, కోవిడ్, ఇతర కారణాలు.. ఈ నెల రోజుల వ్యవధిలో ఏపీ విద్యుత్ సంస్థలు 894.1 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేశాయి. రాష్ట్ర డిస్కమ్‌లు కొన్ని చౌకగా విద్యుత్ అందించే ఉత్పత్తి కేంద్రాలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కలిగి ఉన్నాయి. ఈ ప్రకారం వీటి ద్వారా డిసెంబర్ 17 నుంచి జనవరి 15 వరకూ 3,289.3 మిలియన్ యూనిట్ల విద్యుత్ యూనిట్ రూ.3.13 చొప్పున డిస్కమ్‌లకు అందాలి. అయితే ఆయా కేంద్రాల్లో బొగ్గు కొరత, కోవిడ్ ప్రభావం, ఇతర కారణాల వల్ల ముందు రోజు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం 2,470.79 మిలియన్ యూనిట్లే విద్యుత్ ఇస్తామని ఉత్పత్తి సంస్థలు తెలిపాయి. కానీ వాస్తవంగా విద్యుత్ అందించే రోజుకు రీ షెడ్యూల్ చేసుకుని చివరకు 2,253.27 ఎంయూలే ఇచ్చాయి. 818.5 ఎంయూల విద్యుత్‌ను అందించలేకపోయాయి. లేని విద్యుత్ ఎలా కొంటారు? పీపీఏల ప్రకారం 818.5 ఎంయూల కొరత ఏర్పడటంతో పీపీఏలున్న ఇతర ఉత్పత్తిదారుల నుంచి అదనంగా విద్యుత్ తీసుకోవాలి. అయితే వాటి దగ్గర ఆ సమయంలో విద్యుత్ ధర యూనిట్ రూ. 3.68 ఉంది. కానీ మార్కెట్లో విద్యుత్ ధర యూనిట్ రూ. 3.38 చొప్పున మాత్రమే ఉంది. అంటే ప్రతీ యూనిట్‌కు సంస్థ 30 పైసల చొప్పున, మొత్తం రూ. 24.6 కోట్లు ఆదా చేసింది. ఇందులో గ్రిడ్ బ్యాలన్స్ కోసం రూ.1.9 కోట్లు తీసివేసినా... రూ.22.7 కోట్లు ఈ నెలలోనే విద్యుత్ కొనుగోళ్లలో ఆదా అయింది. కానీ ఒక వర్గం మీడియా మాత్రం పీపీఏ సంస్థల నుంచే ఈ విద్యుత్ కొంటే నష్టం రాదని అసత్యాలు ప్రచారం చేసింది. అసలు వాళ్ల దగ్గర విద్యుత్ లేనప్పుడు ఎలా కొనుగోలు చేస్తామని విద్యుత్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. దేశానికి ఆదర్శంగా ఏపీ.. – శ్రీకాంత్ నాగులాపల్లి (ఇంధనశాఖ కార్యదర్శి) ఒప్పందం చేసుకున్న సంస్థలు విద్యుత్ ఇవ్వకపోతే మార్కెట్లో విద్యుత్ కొనక తప్పదు. లేకపోతే రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఏర్పడతాయి. కొనే విద్యుత్‌ను పీపీఏ సంస్థల నుంచే తీసుకోవాలనే వాదన సత్యదూరం. అసలు తమ దగ్గర విద్యుత్ లేదని వారే ప్రకటించినప్పుడు ఇక తక్కువ ధరకు వాళ్లు ఎలా ఇస్తారు? విద్యుత్ కొనగోళ్లను దారికి తేవడంలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలిచింది. నష్టమని మేం చెప్పలేదే? – జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి, ఏపీఈఆర్సీ ఛైర్మన్ విద్యుత్ కొనుగోళ్లు మరింత పారదర్శంగా ఉండాలని కమిషన్ కోరుకుంటోంది. ఇందులో భాగంగానే వాస్తవాలు తెలుసుకునేందుకు డిస్కమ్‌ల నుంచి వివరణ కోరాం. అంతేతప్ప మార్కెట్ నుంచి విద్యుత్ కొనడం వల్ల డిస్కమ్‌లకు నష్టం వచ్చిందని మేం ఎక్కడా చెప్పలేదు. డిస్కమ్‌లు పంపే వివరాలను కమిషన్ పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవడం ఆనవాయితీగా జరిగే వ్యవహారం. -
AP Genco: ‘జెన్కో’కు జవసత్వాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజావసరాలకు సంబంధించిన అంశాల్లో గత ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు పెద్దపీట వేస్తే.. ప్రస్తుత సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలకే అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ జెన్కోకు ఊతమిస్తోంది. 2021–22లో సింహభాగం విద్యుత్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థల నుంచే కొనుగోలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర సంస్థ ఏపీ జెన్కోను మరింత బలోపేతం చేయాలని నిర్ధేశించింది. ఈ దిశగానే ఏపీ విద్యుత్ సంస్థలు ఇటీవల రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి నివేదికలను సమర్పించాయి. చౌక విద్యుత్ తీసుకోవడంతోపాటు కొన్నేళ్లుగా చిక్కి శల్యమైన ఏపీ జెన్కోకు ఊపిరి పోయాలని నిర్ణయించాయి. చరిత్రను తిరగరాస్తూ.. 2019 వరకూ ఏపీ జెన్కోలో విద్యుత్ ఉత్పత్తి ఏటా సగానికి సగం తగ్గింది. కొన్ని ప్రైవేట్ సంస్థల జేబులు నింపేందుకు జెన్కో ఉత్పత్తిని ఉద్దేశపూర్వకంగా తగ్గించారనే విమర్శలున్నాయి. ఈ చరిత్రను తిరగరాస్తూ.. 2021–22 సంవత్సరంలో జెన్కో, కేంద్ర విద్యుత్‌కే రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఈ ఏడాది రాష్ట్రంలో 68,368.43 మిలియన్ యూనిట్ల (ఎం.యూల) విద్యుత్ డిమాండ్‌ను అంచనా వేసింది. ఈ నేపథ్యంలో 71,380.95 మిలియన్ యూనిట్ల విద్యుత్ అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది. అనుకోని పరిస్థితులు వస్తే అధిగమించేందుకు మిగులు విద్యుత్‌నూ సిద్ధంగా ఉంచేలా ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రానికి అవసరమైన విద్యుత్‌లో ఏపీ జెన్కోకు చెందిన బొగ్గు ఆధారిత థర్మల్ ప్లాంట్ల నుంచి 36,475.56 ఎంయూలు, జల విద్యుత్ ప్లాంట్ల నుంచి 2,796.91 ఎంయూలు తీసుకోవాలని నిర్ణయించింది. ఏపీ జెన్కో వాటా ఉన్న అంతర్ రాష్ట్ర జల విద్యుత్ ప్లాంట్ల నుంచి మరో 415.77 ఎంయూలు తీసుకునేందుకు ఆమోదం తెలిపింది. మొత్తంగా ఏపీ జెన్కో నుంచి 2021–22లో 39,688.24 ఎంయూలు విద్యుత్ తీసుకోబోతోంది. దీంతోపాటు 13,495.85 ఎంయూలను కేంద్రం నుంచి తీసుకుంటుంది. అంటే.. కేంద్ర, రాష్ట్ర విద్యుత్ కలిపి 53,184.09 ఎంయూలు ఉంటుంది. ఇక ప్రైవేట్ విద్యుత్ వాటాను కేవలం 16,196.86 ఎంయూలకు పరిమితం చేశారు. ఇది కూడా గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల వల్ల విధిలేని పరిస్థితుల్లో తీసుకోవాల్సి వస్తోంది. ప్రైవేటు విద్యుత్‌కు దీటుగా.. రూపొందించిన ప్రణాళికలో ఏ నెలలోనూ విద్యుత్ సరఫరాకు ఢోకా ఉండదని ఇంధన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్ చెప్పారు. -
Andhra Pradesh: రూ. 2,342.45 కోట్లు ఆదా
సాక్షి, అమరావతి: గత సర్కారు హయాంలో అప్పుల పాలై దివాలా దశకు చేరిన విద్యుత్ సంస్థలు ఇప్పుడు పొదుపు చర్యలు పాటించడం ద్వారా ప్రజాధనాన్ని కాపాడుతున్నాయి. విద్యుత్ కొనుగోళ్లలో గత రెండేళ్లలో ఏకంగా రూ.2,342.45 కోట్లు ఆదా చేసి దేశంలోనే రికార్డు సృష్టించాయి. ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని కేంద్రం సైతం ప్రశంసించింది. పూర్తి పారదర్శకంగా, చౌక విద్యుత్ కొనుగోళ్లకే ప్రాధాన్యం ఇవ్వడం వల్లే దీన్ని సాధించినట్లు ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి వెల్లడించారు. సరికొత్త మైలురాయిని చేరుకోవడంపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. యూనిట్ రూ.3.12కే కొనుగోలు ఇంధనశాఖలో విద్యుత్ కొనుగోళ్లు అత్యంత కీలకం. పైసా తేడా వచ్చినా భారం రూ.కోట్లల్లో ఉంటుంది. గత సర్కారు దీన్ని గుర్తించకపోవడం వల్లే డిస్కమ్‌లు నష్టాల బాట పట్టాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) మొట్టికాయలేసింది. ఈ తరహా పొరపాట్లు జరగకూడదన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. గత రెండేళ్లుగా చౌక విద్యుత్ కొనుగోళ్లపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. దీని ద్వారా రూ.2,342.45 కోట్లు ఆదా అయింది. 2019–20లో 3,393 మిలియన్ యూనిట్లు, 2020–21లో 8,890 మిలియన్ యూనిట్ల విద్యుత్తును బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేశారు. సరఫరా చార్జీలు కలిపి సగటున యూనిట్ రూ.3.12 చొప్పున వెచ్చించారు. నిజానికి ఈ విద్యుత్ కొనడానికి యూనిట్‌కు రూ.4.55 వరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతించినా అంతకన్నా తక్కువకే విద్యుత్ సంస్థలు కొనుగోలు చేయడం గమనార్హం. మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీతో.. చౌక విద్యుత్ కొనుగోలుకు ఏపీ ట్రాన్స్‌కో, గ్రిడ్ నిర్వహణ విభాగం దేశంలోనే తొలిసారిగా మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) టెక్నాలజీని అందిపుచ్చుకుంది. గతంలో 24 గంటల ముందు కొనాల్సిన విద్యుత్‌కు ఆర్డర్లు ఇచ్చారు. సరికొత్త టెక్నాలజీ వల్ల కేవలం 15 నిమిషాల్లోనే డిమాండ్‌ను పసిగట్టి అవసరమైన మేరకు ఆర్డర్ ఇవ్వగలిగారు. మరోవైపు కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వ్యవస్థను ట్రాన్స్‌కో ఏర్పాటు చేసింది. గత కొన్నేళ్లుగా విద్యుత్ డిమాండ్, లభ్యతను సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానించి వాస్తవ డిమాండ్, లభ్యతను అంచనా వేశారు. దీనివల్ల విద్యుత్ వృథాను అరికట్టడంతోపాటు ఎక్కువ ధరకు కొనుగోళ్లను నియంత్రించగలిగారు. ఖరీదైన విద్యుత్‌కు కత్తెర.. 625 మెగావాట్ల ఖరీదైన విద్యుత్‌ను నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) ద్వారా తీసుకుంటుండగా దీన్ని కేంద్రానికి అప్పగించారు. ఫలితంగా డిస్కమ్‌లపై రూ. 1,007 కోట్ల భారం తగ్గింది. గతంలో కేంద్ర విద్యుత్తు గ్రిడ్ మూడు నెలలకు ఒకసారి ఏపీ డిస్కంల నుంచి సీటీయూ (సెంట్రల్ ట్రాన్స్మిషన్ యుటిలిటీ), పీవోసీ (పాయింట్ ఆఫ్ కనెక్షన్) చార్జీలు వసూలు చేసేది. రాష్ట్ర ఇంధన శాఖ ఒత్తిడి మేరకు కేంద్రం మార్పులు చేసింది. ఫలితంగా రాష్ట్ర విద్యుత్ సంస్థలకు రూ.350 కోట్లు ఆదా అయింది. ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ – కేంద్ర విద్యుత్తు శాఖ కార్యదర్శి అలోక్ కుమార్ ‘విద్యుత్తు కొనుగోళ్లలో భారీ మొత్తంలో ప్రజల సొమ్మును ఆదా చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కోవిడ్ సంక్షోభంలోనూ రాష్ట్ర ప్రభుత్వ చర్యలు అభినందనీయం. ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలిచింది’ విద్యుత్ శాఖ బలోపేతమే లక్ష్యం – బాలినేని శ్రీనివాసరెడ్డి, విద్యుత్తు శాఖ మంత్రి ‘ఆంధప్రదేశ్ సాధించిన విజయం ప్రశంసనీయం. విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఈ దిశగా ముందుకెళ్లాలి’ -
కరెంటు లోడ్ లెక్కే మేలు
సాక్షి, అమరావతి: ఏపీ విద్యుత్ సంస్థలు ఏప్రిల్ నుంచీ కనీస విద్యుత్ చార్జీలను ఎత్తేశాయి. దీని స్థానంలో కిలోవాట్(కేవీ) లోడ్‌కు కేవలం రూ.10 వసూలు చేస్తున్నాయి. ఈ విధానం వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు విద్యుత్ భారం నుంచి తప్పించుకుంటారు. కరోనా కష్టకాలంలో ఇది ప్రయోజనకరంగా ఉంటుందని విద్యుత్‌రంగ నిపుణులు కూడా చెబుతున్నారు. ఈ సరికొత్త విధానం రాష్ట్రంలోని 1.50 కోట్ల వినియోగదారుల్లో 98 శాతం మందికి మేలు కలిగిస్తుంది. పాత విధానంలో 500 కన్నా తక్కువ యూనిట్లు వాడే వినియోగదారులు నెలకు రూ.25, అంతకుమించి వాడేవారు నెలకు రూ.50 కనీస చార్జీ చెల్లించాలి. ఈ విధానాన్ని గత టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. వినియోగదారులపై అనవసర భారం పడుతున్న ఈ విధానాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎత్తేసింది. ఇప్పుడు ఒక కిలోవాట్ లోడ్‌కు రూ.10 చెల్లిస్తే సరిపోతుంది. ఫలితంగా 500 యూనిట్లలోపు విద్యుత్ వాడేవాళ్లకు రూ.180 (నెలకు రూ.15 చొప్పున 12 నెలలకు) ఆదా అవుతుంది. 500 యూనిట్లకుపైన వాడేవాళ్లకు రూ.480 (నెలకు రూ.40 చొప్పున 12 నెలలకు) భారం తగ్గుతుంది. కరెంట్ బిల్లులకు సర్కార్ కళ్లెం రాష్ట్రంలో 95 లక్షల మంది పేద, మధ్య తరగతి వర్గాలపై గత ప్రభుత్వం భారీగా విద్యుత్ భారం మోపింది. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యక్షంగా రూ.6,549 కోట్ల మేర చార్జీలు పెంచింది. శ్లాబులు మార్చి మరో రూ.19 వేల కోట్లు అదనంగా వడ్డించింది. అయితే.. దీన్ని ట్రూ–అప్‌గా చూపించి కమిషన్ ఆమోదంతో కాలం గడిపింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దీన్ని పూర్తిగా ఎత్తేసింది. ప్రజలపై భారం వేసేందుకు సిద్ధంగా ఉంచిన ట్రూ–అప్ చార్జీలను కూడా ప్రస్తుత విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) యథాతథంగా ఆమోదించలేదు. అన్ని కోణాల్లో పరిశీలించి దాదాపు రూ.16 వేల కోట్ల అదనపు భారాన్ని తిరస్కరించింది. నిర్వహణ వ్యయాన్ని అదుపు చేయడం, అనవసరంగా అత్యధిక రేట్లకు ప్రైవేటు విద్యుత్ కొనుగోలు చేయడాన్ని నివారించడం వల్ల రాష్ట్రంలో గత రెండేళ్లుగా విద్యుత్ చార్జీలు స్వల్పంగా తగ్గాయి. కేవలం సంపన్న వర్గాలకు మాత్రమే గతేడాది యూనిట్‌కు 90 పైసలు పెంచారు. -
కావాల్సినంత 'కరెంట్'
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ ఏడాది పొడవునా విద్యుత్‌కు ఢోకా ఉండదు. కోతల్లేని సరఫరా కోసం ఇప్పటికే విద్యుత్ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. 2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి వరకు విద్యుత్ లభ్యత, డిమాండ్ అంచనాలను డిస్కంలు.. విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 68,368.43 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరముండగా.. 71,380.95 మిలియన్ యూనిట్లు లభిస్తుందని అంచనా వేశారు. ఈసారి మొత్తంగా 3,012.52 మిలియన్ యూనిట్ల మిగులు విద్యుత్ ఉండబోతోంది. అక్టోబర్, నవంబర్లలో మాత్రం డిమాండ్ కన్నా 392.81 మిలియన్ యూనిట్ల తక్కువ విద్యుత్ లభిస్తోంది. ఈ రెండు నెలల్లో పవన, సౌర విద్యుదుత్పత్తి తగ్గడమే ఇందుకు కారణంగా అధికారులు భావిస్తున్నారు. పక్కాగా లెక్క.. అంచనాల రూపకల్పనకు విద్యుత్ సంస్థలు సాంకేతికతను ఉపయోగించుకుంటున్నాయి. గత ఐదేళ్ల డిమాండ్, లభ్యతను ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానం చేశారు. దీని ఆధారంగా ఏ నెలలో.. ఏ ఉత్పత్తి సంస్థ ద్వారా ఎంత విద్యుత్ లభిస్తుంది? ఏ ప్రాంతంలో ఎంత మేర విద్యుత్ వాడకం ఉంటుందనే దానిపై శాస్త్రీయ కోణంలో అంచనాలు తయారు చేశారు. ఉచిత వ్యవసాయ విద్యుత్ విషయంలో మరింత పక్కాగా లెక్కలేశామని కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ పద్మా జనార్థన్‌రెడ్డి తెలిపారు. ఏ సామర్థ్యంతో వాడినా పంపుసెట్లకు నాణ్యమైన విద్యుత్ అందించే ఏర్పాట్లు చేశామని వివరించారు. విద్యుత్ లోటు ఉండే అక్టోబర్, నవంబర్ నెలల కోసం మార్కెట్లో విద్యుత్ కొనుగోలుకు ముందుస్తు వ్యూహాన్ని రూపొందిస్తున్నామని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడాది పొడవునా కోతల్లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పారు. -
‘విద్యుత్’కు సైబర్ ముప్పు!
సాక్షి, అమరావతి: సైబర్ మూకలు విద్యుత్ నెట్‌వర్క్‌పై దాడులకు పాల్పడే అవకాశముందని.. అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. విదేశీ విద్యుత్ ఉపకరణాల దిగుమతిలో కచ్చితమైన జాగ్రత్తలు పాటించాలని సూచించింది. తాము సూచించిన ల్యాబొరేటరీలో పరీక్ష జరపకుండా ఏ ఒక్క వస్తువునూ పవర్ సెక్టార్‌లోకి తీసుకోవద్దంటూ ఇటీవల ఆదేశించింది. దీంతో రాష్ట్ర విద్యుత్ శాఖ అప్రమత్తమై.. పలు చర్యలు తీసుకుంది. విద్యుత్ అనేది ప్రధాన జాతీయ మౌలిక వనరు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది చాలా ముఖ్యమైనది. కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం.. విద్యుత్ వ్యవస్థపై సైబర్ దాడి చేస్తే తక్షణమే కోలుకునే అవకాశం ఉండదు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే అవకాశముంది. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యుత్ శాఖ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. కంప్యూటర్‌తో అనుసంధానం కానీ విద్యుత్ సరఫరా ఎక్కడా లేదు. జాతీయ, రాష్ట్రీయ గ్రిడ్‌లో కమ్యూనికేషన్ సిస్టం ముఖ్యమైనది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ, ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలన్నీ గ్రిడ్‌కే లింక్ అయ్యి ఉంటాయి. విద్యుత్ వాడకం పెరిగినా.. తగ్గినా గ్రిడ్ కంట్రోల్ చేయకపోతే క్షణాల్లో నష్టం భారీగా ఉంటుంది. కీలకమైన లోడ్ డిస్పాచ్ సెంటర్స్‌లోని ఎలక్ట్రానిక్స్ ఉపకరణాలు కూడా ఇంటర్నెట్కు లింక్ అయ్యి ఉంటాయి. విద్యుత్ సెక్టార్లో వాడే ఉపకరణాలను దాదాపుగా విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నారు. వీటి తయారీలో సాఫ్ట్వేర్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ క్రమంలో సైబర్ మూకలు విద్యుత్ ఉపకరణాల ద్వారా వైరస్‌లను పంపే అవకాశముందని కేంద్రం పేర్కొంది. ప్రత్యేక ల్యాబొరేటరీ.. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే విదేశీ ఉపకరణాలను పరీక్షించేందుకు కేంద్రం ప్రత్యేకంగా ల్యాబొరేటరీలను ఏర్పాటు చేసింది. ఇవి కేంద్రం ఆధీనంలోనే ఉంటాయి. దిగుమతి అయిన ఉపకరణాల నాణ్యత, వాటి సెక్యూరిటీని ఇవి పరిశీలిస్తాయి. అవి ధ్రువీకరించిన తర్వాతే ఉపకరణాలను విద్యుత్ సంస్థలు అనుమతించాలని కేంద్రం సూచించింది. ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు కూడా ఈ నిబంధన కచ్చితంగా వర్తిస్తుందని స్పష్టం చేసింది. -
ప్రైవేట్ విద్యుత్తు సంస్థలకు ఏపీఈఆర్సీ షాక్!
సాక్షి, అమరావతి: ప్రజా ధనాన్ని పరిరక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మరో కీలక తీర్పు వెలువరించింది. పెరిగిన గ్యాస్ ధరల ఆధారంగా రెండేళ్ల కాలానికి అదనపు చర వ్యయం (వేరియబుల్ కాస్ట్) ఇవ్వాలంటూ ప్రైవేట్ విద్యుత్ సంస్థలు ల్యాంకో, స్పెక్ట్రం, శ్రీవత్సవ వేసిన పిటిషన్‌ను కమిషన్ తోసిపుచ్చింది. ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి నేతృత్వంలో సభ్యులు పి.రాజగోపాల్‌రెడ్డి, ఠాకూర్ రామ్‌సింగ్ వెలువరించిన తీర్పును కమిషన్ వర్గాలు శుక్రవారం మీడియాకు వెల్లడించాయి. కమిషన్ ఆమోదం లేకున్నా.. ► 2018–19, 2019–20లో పెరిగిన గ్యాస్ ధరల ఆధారంగా అదనపు చర వ్యయం ఇవ్వాలని విద్యుదుత్పత్తి సంస్థలు కమిషన్‌ను ఆశ్రయించాయి. ప్రైవేట్ సంస్థల వాదనపై డిస్కమ్‌లు, విద్యుత్ రంగ నిపుణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వాస్తవానికి ల్యాంకో, స్పెక్ట్రం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు 2016లో, శ్రీవత్సవ పీపీఏ గడువు 2018లోనే ముగిసినా మళ్లీ కుదుర్చుకోవాలని ఆ సంస్థలు పట్టుబట్టాయి. కమిషన్ నుంచి దీనికి ఆమోదం లేకున్నా గత సర్కారు స్వల్పకాలిక పద్ధతిలో వాటి నుంచి విద్యుత్ తీసుకుంది. ► ల్యాంకోకు యూనిట్‌కు రూ.3.29, మిగతా వాటికి యూనిట్‌కు రూ. 3.31 చొప్పున చెల్లించగా కేవలం కొన్ని నెలలకే తీసుకునే ఈ విద్యుత్‌కు నిర్ణయించిన ధరలే వర్తిస్తాయని విద్యుత్ చట్టాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉండటం, మార్కెట్లో అంతకన్నా చౌకగా లభిస్తుండటంతో ఈ ఏడాది కమిషన్ ప్రైవేట్ గ్యాస్ పవర్‌ను అనుమతించలేదు. కోవిడ్ కాలంలో చౌకగా విద్యుత్ తీసుకోవడానికి కేవలం ఆరు నెలలకే కమిషన్ ఒప్పుకుంది. అదనపు చర వ్యయంతో భారీ భారం... ► 2018–19, 2019–20లో గ్యాస్ ధరలు స్వల్పంగా పెరగడంతో ఆ మేరకు ఇవ్వాలని ప్రైవేట్ సంస్థలు కోరాయి. ల్యాంకో విద్యుదుత్పత్తి సామర్థ్యం 355 మెగావాట్లు కాగా, స్పెక్ట్రం 208 మెగావాట్లు, శ్రీవత్సవ 17 మెగావాట్లుగా ఉంది. వీటి నుంచి రెండేళ్లలో సుమారు 4 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను డిస్కమ్‌లు తీసుకున్నాయి. ప్రైవేట్ సంస్థలు కోరినట్లుగా అదనపు చర వ్యయం చెల్లిస్తే డిస్కమ్‌లపై రూ.200 కోట్ల అదనపు భారం పడుతుంది. స్వల్పకాలిక పీపీఏలకూ అదనంగా ఎలాంటి ఖర్చులు అడిగే హక్కు లేదన్న డిస్కమ్‌ల వాదనతో కమిషన్ ఏకీభవించింది. నిపుణుల వాదనలూ పరిగణలోకి తీసుకుంటూ పిటిషనర్లైన ప్రైవేట్ విద్యుదుత్పత్తి సంస్థల వాదనను తోసిపుచ్చింది. -
స్వల్పకాలిక విద్యుత్ రేట్లు తగ్గింపు
సాక్షి, అమరావతి: విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం లేకుండా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెండు స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను పునః సమీక్షించింది. మార్కెట్ రేట్లకు అనుగుణంగా వాటి ధరలను తగ్గించింది. ఫలితంగా డిస్కమ్‌లకు రూ.60 కోట్ల మేర ఆదా అవుతుందని ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి తెలిపారు. ఈ మేరకు కమిషన్ ఆదేశాలు ఇచ్చిందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులకు వివరించారు. ► గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ల్యాంకో, స్పెక్ట్రంతో ఏపీ డిస్కమ్‌లకు ఉన్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం 2016తోనే ముగిసింది. అయినప్పటికీ పాత ప్రభుత్వం గడచిన మూడేళ్లుగా పాత ధరలతోనే విద్యుత్ కొనుగోలు చేస్తోంది. ల్యాంకోకు యూనిట్‌కు రూ.3.29, స్పెక్ట్రంకు యూనిట్‌కు రూ.3.31 చొప్పున డిస్కమ్‌లు చెల్లిస్తున్నాయి. ► అయితే, ఈ ఏడాది రెండు విద్యుత్ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలుకు కమిషన్ అనుమతించలేదు. రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉండటం, ఆ రెండు సంస్థల కన్నా మార్కెట్లో తక్కువకే విద్యుత్ లభిస్తుండటమే కారణంగా ఏపీఈఆర్సీ స్పష్టం చేసింది. ► లాక్డౌన్ కాలంలో బొగ్గు సమస్య రావచ్చని భావించిన డిస్కమ్‌లు గ్యాస్ విద్యుత్‌ను తీసుకోవాలని కోరడంతో ఏప్రిల్, మే నెలలకు కమిషన్ అనుమతించింది. అయితే వారం రోజుల్లోనే ప్రపంచ మార్కెట్లో గ్యాస్ రేట్లు తగ్గాయి. దీంతో జూన్ నుంచి విద్యుత్ తీసుకోవాల్సిన అవసరం లేదని కమిషన్ అభిప్రాయపడింది. ఒకవేళ తీసుకుంటే, స్పెక్ట్రంకు యూనిట్‌కు రూ.3.31కి బదులు రూ. 2.71, ల్యాంకోకు రూ.3.29కి బదులు యూనిట్‌కు రూ.2.69 చొప్పున చెల్లించాలని డిస్కమ్‌లను ఆదేశిస్తూ టారిఫ్ ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్ వరకే అనుమతించింది. ► అక్టోబర్, నవంబర్ నెలల్లో తదుపరి సంవత్సరానికి అవసరమైన వార్షిక, ఆదాయ అవసర నివేదికలను డిస్కమ్‌లు రూపొందిస్తాయి. అప్పుడు ఈ రెండు సంస్థల నుంచి విద్యుత్ తీసుకోవాలా? వద్దా? అనేది నిర్ణయిస్తాయి. ► సెప్టెంబర్ వరకూ తీసుకునే ఈ విద్యుత్ దాదాపు వెయ్యి మిలియన్ యూనిట్లు ఉంటుందని విద్యుత్ సంస్థలు అంచనా వేశాయి. కమిషన్ తగ్గించిన రేట్ల వల్ల విద్యుత్ సంస్థలకు యూనిట్‌కు 60 పైసల చొప్పున, మొత్తం రూ.60 కోట్లు ఆదా అవుతుందని కమిషన్ వర్గాలు తెలిపాయి. -
‘పవర్’ఫుల్.. పొదుపు
సాక్షి, అమరావతి: విద్యుత్తును ఆదా చేస్తే పొదుపు చేసినట్లే... మరి వృథా ఖర్చులను నియంత్రిస్తే ప్రజలపై భారాన్ని కూడా నివారించినట్లే! విద్యుత్తుశాఖ ఇదే సూత్రాన్ని పాటించి ఏడాదిలో ప్రజలపై రూ.4,783.23 కోట్ల మేర భారం పడకుండా చేయగలిగింది. తద్వారా బిల్లుల భారాన్ని తప్పించింది. రాష్ట్ర విద్యుత్ రంగం స్వీయ నియంత్రణతో ఏడాదిలోనే అద్వితీయ పురోగతి సాధించింది. విద్యుత్తు సంస్థల నిర్వహణ వ్యయంలో కొనుగోళ్లే అత్యంత కీలకం. గత సర్కారు అవసరానికి మించి ఖరీదైన ప్రైవేట్ విద్యుత్‌ను తీసుకోవడంతో డిస్కమ్‌లు అప్పుల్లో కూరుకుపోయాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చౌక విద్యుత్‌ను అన్వేషించడంతోపాటు దుబారాకు ఏమాత్రం తావివ్వడం లేదు. ► 2018–19లో రాష్ట్ర విద్యుత్ సంస్థల మొత్తం వ్యయం రూ.48,110.79 కోట్లు కాగా 2019–20లో దీన్ని రూ.43,327.56 కోట్లకు తగ్గించడం ద్వారా ప్రభుత్వం రూ.4,783.23 కోట్లను ఆదా చేసింది. గత సర్కారు చేసిన అప్పులకు ఈ ఏడాది కాలంలో అత్యధిక వడ్డీలు కట్టాల్సి వచ్చింది. లేదంటే ఆదా మరింత ఎక్కువగా ఉండేది. ► గత సర్కార్ అడ్డగోలుగా ప్రైవేట్ విద్యుత్ కొనుగోలు చేయగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పూర్తిగా నియంత్రించింది. 2018–19లో రూ.39,262.81 కోట్లున్న విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని 2019–20లో రూ. 34,775.46 కోట్లకు కుదించారు. 2018–19లో వాస్తవానికి 7,629 మిలియన్ యూనిట్ల మిగులు విద్యుత్ ఉంది. కానీ గత సర్కార్ ప్రైవేట్ సంస్థలకు మేలు చేసేందుకు 6,952 మిలియన్ యూనిట్లు అనవసరంగా కొనుగోలు చేసింది. ► టీడీపీ హయాంలో సౌర విద్యుత్ మార్కెట్లో యూనిట్ రూ.2.44కే లభిస్తున్నా యూనిట్ రూ. 8.09 చొప్పున కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది. ఫలితంగా 2019 డిసెంబర్ 31 నాటికి డిస్కమ్‌లకు రూ. 29 వేల కోట్ల మేర నష్టాలు వచ్చాయి. పవన విద్యుత్‌లోనూ ఇదే తంతు. ► గతంలో సగటున యూనిట్ రూ.7 చొప్పున బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేయగా ఈ ఏడాది యూనిట్ రూ.1.63 నుంచి రూ.2.80కి మించనివ్వలేదు. దీనివల్ల రూ.700 కోట్లు ఆదా అయ్యాయి. అండగా ప్రభుత్వం ► ప్రజాధనాన్ని ఆదా చేసిన విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం అండగా నిలిచింది. 2019–20లో రూ. 17,904 కోట్లు అందించింది. 2019 డిసెంబర్ 31 వరకూ డిస్కమ్‌లకు ఉన్న రూ.13,391 కోట్ల సబ్సిడీలో రూ.8,655 కోట్లు విడుదల చేసింది. 2019–20లో మరో రూ.9,249 కోట్లు విడుదల చేసింది. ► గత సర్కారు ఉత్పత్తిదారులకు బకాయిపడిన రూ.34,384 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. 2019–20లో బిల్లుల చెల్లింపు కోసం రూ. 20,384 కోట్లు విడుదల చేసింది. ► మెట్రిక్ టన్ను బొగ్గు గతంలో రూ.1,824 ఉండగా ఏపీ జెన్కోలో బొగ్గు రవాణాకు రివర్స్ టెండరింగ్ చేపట్టడం వల్ల ఇప్పుడు రూ.1,027కే అందుతోంది. కృష్ణపట్నంలో రూ.1,010కే వస్తోంది. విద్యుత్ రంగం పునరుజ్జీవం రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాత్మక చర్యలు చేపట్టడం వల్ల ఏడాది కాలంగా విద్యుత్ రంగం పునరుజ్జీవం దిశగా పయనిస్తోందని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపారు. ఈమేరకు ప్రభుత్వానికి అందించనున్న నివేదికను ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఏ.చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు. విద్యుత్ కొనుగోళ్లలో అనవసర వ్యయాన్ని అరికట్టామని, చౌక విద్యుత్‌తో ప్రజలపై భారం పడకుండా నియంత్రించామని వివరించారు. ► రాష్ట్ర విద్యుత్ రంగం స్వీయ నియంత్రణతో ఏడాదిలోనే అద్వితీయ పురోగతి సాధించింది. ► గత సర్కారు అవసరానికి మించి ఖరీదైన ప్రైవేట్ విద్యుత్‌ను తీసుకోవడంతో డిస్కమ్‌లు అప్పుల్లో కూరుకుపోయాయి. ► ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం దుబారాకు ఏమాత్రం తావివ్వడం లేదు. దీంతో ఈ ఏడాదిలో ప్రజలపై రూ.4,783.23 కోట్ల మేర భారం పడకుండా చేయగలిగింది. తద్వారా బిల్లుల భారాన్ని తప్పించింది. ► గతంలో యూనిట్ రూ.7 చొప్పున బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేసేవారు. ఈ ఏడాది యూనిట్ రూ.1.63 నుంచి రూ.2.80కి మించనివ్వలేదు. ► దీని వల్ల దాదాపు రూ.700 కోట్లు ఆదా అయ్యాయి. -
కష్టకాలంలో ‘పవర్’ రికార్డ్
సాక్షి, అమరావతి: విద్యుత్ కొనుగోళ్లలో ఏపీ విద్యుత్ సంస్థలు మరో రికార్డు సృష్టించాయి. ఏప్రిల్‌లో బహిరంగ మార్కెట్లో చౌకగా విద్యుత్ కొనుగోలు చేసి రూ.132 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేశాయి. నిర్ధేశిత లక్ష్యం సాధించిన ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్‌బాబును ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి అభినందించారు. విద్యుత్ శాఖ మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం... ► లాక్డౌన్ ప్రకటించిన వెంటనే చౌక విద్యుత్ కొనుగోళ్లపై ఇంధన శాఖ దృష్టి పెట్టింది. వాణిజ్య, పారిశ్రామిక వినియోగం తగ్గిన నేపథ్యంలో విద్యుత్ కొనుగోలులో కొంతైనా ఆదా చేయాలని భావించగా.. దీనికోసం ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్‌బాబు నేతృత్వంలో అనుభవజ్ఞులైన ఇంజనీర్లతో ప్రత్యేక బృందం ఏర్పాటైంది. ► మార్కెట్ పరిస్థితుల్ని అంచనా వేస్తూ అధికారులు పీపీఏలున్న విద్యుత్, మార్కెట్లో లభించే విద్యుత్ ధరలను పోల్చుకుంటూ.. ఏది తక్కువగా ఉంటే దాన్నే కొనుగోలు చేశారు. ► ఏప్రిల్‌లో 824.88 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేశారు. ముందెన్నడూ లేనివిధంగా యూనిట్‌కు రూ.2.16 నుంచి రూ.2.66 మాత్రమే చెల్లించారు. ఏపీ ఈఆర్సీ అనుమతించిన ధర కంటే రూ.1.60 (యూనిట్‌కు) తక్కువకే కొన్నారు. దీనివల్ల ఒక్క ఏప్రిల్ నెలలోనే రూ.132 కోట్లు ఆదా చేయగలిగారు. ► చౌక విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని నిలిపేశారు. దీంతో థర్మల్ కేంద్రాల వద్ద బొగ్గు నిల్వలు పెరిగాయి. నేడు సీఎం సమీక్ష సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి విద్యుత్ శాఖపై బుధవారం సమీక్ష నిర్వహించనున్నారు. వ్యవసాయ ఉచిత విద్యుత్ కోసం చేపడుతున్న 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంపై ఈ సమీక్షలో చర్చించే వీలుంది. లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన ప్రాజెక్టుల పనులను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై చర్చించే అవకాశం ఉందని ట్రాన్స్‌కో వర్గాలు తెలిపాయి. విద్యుత్ బిల్లుల చెల్లింపులు తగ్గిపోవడం.. వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ డిమాండ్ పడిపోవడం తదితర పరిణామాలపై సీఎం ఆరా తీసే వీలుంది. ఇదే కృషి కొనసాగాలి కష్టకాలంలో రూ.132 కోట్ల ప్రజాధనం ఆదా చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంస్థను గట్టెక్కించడానికి ఇదే రకమైన కృషి జరగాలి. – బాలినేని శ్రీనివాసరెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి -
విద్యుత్ కొనడమే బెటర్!
సాక్షి, అమరావతి: ఏపీ విద్యుత్ సంస్థలు వేసవి విద్యుత్ ప్రణాళికపై సరికొత్త విధానాన్ని అనుసరిస్తున్నాయి. మార్కెట్లో లభించే చౌక విద్యుత్‌నే ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయాలని భావిస్తున్నాయి. రాష్ట్రంలో లభించే థర్మల్ విద్యుత్ కన్నా ఇది చౌకగా ఉండటంతో ఈ దిశగా వెళ్తున్నామని ఇంధనశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. పవర్ ఎక్స్చేంజ్లో చౌకగా విద్యుత్ లభిస్తున్న దృష్ట్యా ఈ వ్యూహాన్ని మార్చుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. - కోవిడ్ ప్రభావంతో పలు వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయి దేశంలో 5 శాతం విద్యుత్ డిమాండ్ తగ్గింది. దీనికి తోడు గ్యాస్, విదేశీ బొగ్గు లభించడంతో విద్యుత్ లభ్యత పెరిగింది. ఫలితంగా పవర్ ఎక్స్చేంజ్లో విద్యుత్ యూనిట్ గరిష్టంగా రూ. 2.52లకే లభిస్తోంది. ఈ కారణంగా మార్చిలో మార్కెట్లో లభించే విద్యుత్‌నే తీసుకోవాలని నిర్ణయించారు. - కొన్ని థర్మల్ ప్లాంట్లలో ఉత్పత్తి తగ్గించారు. డిమాండ్‌ను బట్టి దీన్ని పెంచుతారు. అయితే థర్మల్ విద్యుత్ సగటున యూనిట్ రూ. 5.53 వరకూ ఉంటోంది. - ఒప్పందాలున్న థర్మల్ విద్యుత్ తీసుకోకపోతే ఆ ప్లాంట్లకు స్థిర వ్యయం (ఫిక్స్డ్ ఛార్జీలు) రూ. 1.20 వరకూ చెల్లించాలి. దీన్ని కలుపుకున్నా మార్కెట్ విద్యుత్ ధర యూనిట్ రూ. 3.72 వరకూ ఉంటుంది. ఈ లెక్కన యూనిట్‌కు రూ. 1.81 వరకూ విద్యుత్ సంస్థలకు లాభమే ఉంటుంది. - ప్రస్తుతం రోజుకు గరిష్టంగా 10 మిలియన్ యూనిట్ల వరకూ మార్కెట్ నుంచి చౌక విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు. ఏపీ జెన్కో ఉత్పత్తిని తగ్గించిన కారణంగా ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు 10 లక్షల టన్నులకు చేరుకున్నాయని థర్మల్ డైరెక్టర్ చంద్రశేఖర్‌రాజు తెలిపారు. ఈస్థాయిలో నిల్వలు పెరగడం గత ఐదేళ్లలో ఇదే మొదటిసారని ఆయన వివరించారు. -
ప్రైవేటు ‘పవర్’
సాక్షి, అమరావతి: ప్రజలకు చౌకగా విద్యుత్తు అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం విద్యుత్తు సరఫరా రంగంలోకి ప్రైవేటు పంపిణీదారులను తీసుకురానుంది. ఇందుకోసం విద్యుత్ చట్టానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలు ప్రతిపాదించింది. పోటీ ప్రపంచంలో విద్యుత్ సంస్థలనూ పరుగులు పెట్టించేందుకే ఈ మార్పులని కేంద్రం పేర్కొంది. ముఖ్యంగా విద్యుత్ వ్యవస్థలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం అవసరమని అభిప్రాయపడింది. దీనిపై రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది. ఈ నేపథ్యంలో సోమవారం న్యూఢిల్లీలో ఇంధన మంత్రిత్వశాఖ కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ భేటీకి రాష్ట్రం తరపున ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులపల్లి హాజరవుతున్నారు. ప్రతిపాదిత డ్రాఫ్ట్లోని సవరణలు ఈ విధంగా ఉన్నాయి. పోటీతత్వమే శరణ్యం ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలైన పంపిణీ సంస్థలే విద్యుత్ సరఫరా చేసేవి. వీటి స్థానంలో ప్రైవేటు విద్యుత్ పంపిణీ సంస్థలను ప్రోత్సహించాలి. ఏ సంస్థ తక్కువకు విద్యుత్ ఇస్తే దాన్నే వినియోగదారుడు తీసుకోవచ్చు. అంతే ప్రస్తుతం మొబైల్ నెట్‌వర్క్‌ల తరహాలోనే విద్యుత్ పంపిణీలోనూ ప్రైవేటు సంస్థల మధ్య పోటీ వాతావరణం ఉండాలి. ఈ పోటీ వాతావరణాన్ని ఎలా ప్రోత్సహించాలి? ప్రభుత్వ ప్రైవేటు పార్టనర్షిప్ (పీపీపీ) పద్ధతిలోనా? పంపిణీని ఫ్రాంచైజ్ ఇవ్వడమా? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. తక్కువ ధరకే విద్యుత్ వినియోగదారుడికి అతి తక్కువ ధరకే విద్యుత్ చేరాలి. దీనికోసం ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉండేలా డిస్కమ్‌లు చర్యలు చేపట్టాలి. సరఫరా పంపిణీ నష్టాలను గణనీయంగా తగ్గించాలి. ఏ రకమైన విద్యుత్ సబ్సిడీ అయినా నేరుగా ప్రజలకే చేరేలా డిస్కమ్లుండాలి. నేరుగా ప్రయోజనం (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్–డిబిటీ) విధానాన్ని వచ్చే రెండేళ్లలో అమలులోకి తేవాలి. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను అందుబాటులోకి తేవాలి. ఈ విధానాన్ని రెండేళ్లలో అమలులోకి తెచ్చే ఏర్పాటు చేయాలి. డిస్కమ్‌లకు జరిమానా 2003 విద్యుత్తు యాక్ట్‌కు 2016లో చట్ట సవరణ ద్వారా తొలిసారి సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. తాజాగా మరోసారి ఇదే దారిలో కొన్ని ప్రతిపాదనలు రాష్ట్రాల ముందుకు తెచ్చింది. నాణ్యమైన, నిరంతర విద్యుత్ అందించేందుకు పంపిణీ, ఉత్పత్తిదారుల పనివిధానాన్ని విద్యుత్ నియంత్రణ మండళ్లు బేరీజు వేయాలి. సరైన విద్యుత్ సేవలు అందించడంలో డిస్కమ్‌లు విఫలమైతే వినియోగదారులకు నష్టపరిహారం చెల్లించాలి. నిర్థారిత సమయంలో విద్యుత్ అంతరాయాల పరిష్కరించకపోయినా, వినియోగదారులకు ముందుగా సమాచారం ఇవ్వకుండా విద్యుత్ కోతలు విధించినా డిస్కమ్‌లకు జరిమానా విధించాలి. నష్టాలులేని వ్యాపారం విద్యుత్ సంస్థలు నష్టాలు లేకుండా ఉండాలంటే వాణిజ్య విధానాన్ని మార్చుకోవాలని, వ్యాపారణ ధోరణిలోనే వెళ్లాలని కేంద్రం భావిస్తోంది. ప్రైవేటు భాగస్వామ్యం వల్ల ఉత్పత్తిదారులకు జెన్కో వంటి సంస్థలు బకాయిలు పడే వీలుండదని పేర్కొంది. ఈ తరహా విధానాలను కొత్త డ్రాఫ్ట్ పాలసీలో పేర్కొంది. విద్యుత్ వాహనాల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును ప్రస్తావిస్తోంది. సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని పెంచేలా చర్యలకు కేంద్ర సవరణ చట్టం వీలుకల్పిస్తోంది. -
మీ ‘పవర్’.. కాస్త ఆపండి!
నగరంలోని హైడెర్ష్కోఠ్ పీరం చెరువులోని గిరిధారి గేటెడ్ కమ్యూనిటీ నుంచి డిస్కంకు గతంలో నెలకు రూ.12 నుంచి 13 లక్షల వరకు విద్యుత్ బిల్లు వసూలయ్యేది. ఇటీవల ఆ గెటేడ్ కమ్యూనిటీ భవనంపై సోలార్ రూఫ్టాఫ్ ప్యానళ్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నెలవారి విద్యుత్ బిల్లు రూ.6 లక్షలకు తగ్గింది. రాజేంద్రనగర్‌లోని అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి గతంలో ఏడాదికి రూ.కోటికి పైగా విద్యుత్ బిల్లు రాగా.. సోలార్ పలకల ఏర్పాటుతో ప్రస్తుతం రూ.40 లక్షలు తగ్గింది. నిథిమ్ క్యాంపస్ నుంచి నెలకు రూ.2.50 లక్షలు తగ్గింది. వాణిజ్య సంస్థలు, వ్యక్తిగత గృహ వినియోగదారులు తమ నెలవారి విద్యులు బిల్లులను తగ్గించుకునేందుకు ప్రత్యామ్నాయంగా సోలార్ నెట్ మీటరింగ్ ప్యానళ్లను ఏర్పాటు చేసుకుంటుండటంతో విద్యుత్ సరఫరా, పంపిణీ సంస్థల పవర్ సేల్స్ భారీగా పడిపోతున్నాయి. ఆయా వినియోగదారుల నుంచి డిస్కంకు రావాల్సిన రెవెన్యూ తగ్గిపోయి... భవిష్యత్‌లో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి రానుండటంతో ఇప్పటి నుంచే రెడ్కో దూకుడుకు కళ్లెం వేయాలని డిస్కంలు భావించాయి. ఆ మేరకు మీ ‘పవర్’కాస్తా ఆపండి అంటూ అనధికారిక ఆంక్షలు కొనసాగిస్తున్నాయి. సాక్షి, హైదరాబాద్: సోలార్ విద్యుత్ ఉత్పత్తితో డిస్కంల సేల్స్ తగ్గిపోయాయా..? సోలార్ నెట్ మీటరింగ్ కనెక్షన్లకు డిస్ట్రిబ్యూషన్ సంస్థలు బ్రేకులు వేస్తున్నాయా...? అంటే అవువనే అంటున్నారు విద్యుత్ అధికారులు. సంప్రదాయ విద్యుత్‌తో పోలిస్తే హైడల్, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి భారీ ఖర్చుతో కూడుకుని ఉండటం, ఆ ఉత్పత్తికి అవసరమైన వనరులు కూడా పరిమితంగా ఉండటంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ అంశాలపై దృష్టి సారించింది. సంప్రదాయ ఇంధన వనరులను ప్రోత్సహించాలనే ఆలోచనతో ప్రభుత్వం విండ్, సోలార్ ఎనర్జీ ఉత్పత్తులను ప్రోత్సహిస్తోంది. మూడు కిలోవాట్ల సామర్థ్యమున్న ప్యానళ్లపై 40 శాతం, పది కిలో వాట్ల సామర్థ్యమున్న ప్యానళ్లకు 20 శాతం రాయితీ ఇస్తుండటంతో నెలకు సగటున 300పైగా యూనిట్ల విద్యుత్ వాడే వినియోగదారులు సోలార్ రూఫ్‌టాప్ నెట్ మీటరింగ్‌పై దృష్టి సారించారు. పవర్ సేల్స్ పడిపోతుండటంతో... విద్యుత్ సంస్థలు ఏటా కరెంట్ చార్జీలు పెంచుతుండటం, నిర్ధేశిత సమయానికి ఆలస్యంగా రీడింగ్ నమోదు చేస్తుండటం వల్ల స్లాబ్‌రేట్ మారిపోతోంది. అధిక మొత్తంలో బిల్లులు వస్తుండటంతో దీని నుంచి బయటపడేందుకు చాలా మంది రూఫ్‌టాప్ సోలార్ నెట్ మీటరింగ్ ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సోలార్ ద్వారా 90 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా, గ్రేటర్‌లోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో 3,186 మంది తమ బహుళ అంతస్తుల నిర్మాణాలపై సోలార్ పలకను ఏర్పాటు చేసుకుని 60.9 మెగావాట్లకుపైగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. వ్యక్తిగతంగా విద్యుత్ బిల్లులు తగ్గించుకోవడమే కాదు.. విద్యుత్‌ను పంపిణీ సంస్థకు విక్రయిస్తున్నాయి. ఇలాగే నెట్ మీటరింగ్ కనెక్షన్లు ఇచ్చుకుంటూ పోతే డిస్కం పవర్ సేల్స్ భారీగా పడిపోయి వాటి మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం లేకపోలేదని ఇంజనీర్లు భావిస్తున్నారు. దీంతో రెడ్కో దూకుడుకు కళ్లెం వేయాలని నిర్ణయించింది. సోలార్ రూఫ్ టాప్నెట్ మీటరింగ్‌పై అనధికారిక ఆంక్షలు కొనసాగిస్తోంది. డిస్కంలకే విక్రయం... వంద ఎస్ఎఫ్టీ స్థలంలో ఒక కేవీఏ ప్యానల్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక కేవీఏ ప్యానల్ రోజుకు సగటున ఐదు యూనిట్ల చొప్పున ఉత్పత్తి చేస్తుంది. ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే 25 ఏళ్ల వరకు పని చేస్తుంది. ఒక కేవీఏ ప్యానల్‌కు రూ.52 వేలు అవుతుండగా, ఈ మొత్తంలో కేంద్రం 40 శాతం సబ్సిడీ ఇస్తుంది. అపార్ట్మెంట్లకు రూఫ్ టాప్ ప్యానల్‌కు 20 శాతం సబ్సిడీ వస్తుంది. సోలార్ ప్యానళ్ల ధరలు కూడా ఇప్పుడు తగ్గాయి. సీపీడీసీఎల్ పరిధిలో రోజుకు సగటున 90 మెగావాట్ల (అంటే 45,000 యూనిట్ల) సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి అవుతుంది. డిస్కం ఆయా జనరేషన్ సంస్థల నుంచి అవసరాన్ని బట్టి యూనిట్‌కు రూ.6 నుంచి రూ.11 వరకు వెచ్చించి కొనుగోలు చేసి గృహ వినియోగదారులకు సబ్సిడీపై సరఫరా చేస్తుంది. ఈ క్రమంలో ఆదాయం తగ్గి డిస్కం సేల్స్ పడిపోయి, సంస్థ ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుండటంతో అనధికారిక ఆంక్షలు కొనసాగించాల్సి వస్తున్నట్లు డిస్కంలు ప్రకటిస్తున్నాయి. ఆంక్షలు పెట్టడం అన్యాయం ఇంటిపై ఒకసారి సోలార్ రూఫ్‌టాప్ నెట్ మీటరింగ్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా 25 ఏళ్ల వరకు విద్యుత్ బిల్లులను ఆదా చేసుకునే అవకాశం ఉంది. వినియోగదారులకు లబ్ధిచేకూర్చే ఈ పథకాన్ని మరింత ప్రోత్సహించాల్సిన డిస్కంలు తమ రెవెన్యూ పడిపోతుందనే ఆలోచనతో సోలార్ నెట్ మీటరింగ్‌పై అనధికారిక ఆంక్షలు కొనసాగి స్తుండటం అన్యాయం. – బి.అశోక్‌కుమార్‌గౌడ్, అధ్యక్షుడు, తెలంగాణ సోలార్ అసోసియేషన్ మీ ‘పవర్’తగ్గించండి... ‘సోలార్ నెట్ మీటరింగ్ కనెక్షన్ల జారీతో డిస్కం పవర్ సేల్స్ పడిపోతున్నాయి. సంస్థకు అంతో ఇంతో రెవెన్యూఇచ్చే వినియోగదారులే నెట్ మీటరింగ్‌కు వెళ్లిపోయి.. నెలవారి బిల్లులను తగ్గించుకుంటున్నారు. ఇది డిస్కంల నష్టాలకు ఓ కారణమవుతోంది. సోలార్ ఎనర్జీ దూకుడు తగ్గించాలని కోరుతూ ఇప్పటికే టీఎస్ రెడ్కోకు విజ్ఞప్తి చేశాం.’ (శనివారం రాత్రి ఖైరతాబాద్ ఇంజనీర్స్ భవన్లో జరిగిన తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణలో రఘుమారెడ్డి చేసిన వాఖ్యలుఇవి) – రఘుమారెడ్డి, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ -
భలే చౌక విద్యుత్
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పాలనలో 2018 అక్టోబర్ 4న ఒక్కో యూనిట్ కరెంటు కొనుగోలుకు ఎంత వెచ్చించారో తెలుసా? అక్షరాలా రూ.6.56. అప్పటి ప్రభుత్వ పెద్దలు అస్మదీయ విద్యుత్ సంస్థల నుంచే కరెంటు కొనేసి, విచ్చలవిడిగా దోచిపెట్టారు. బహిరంగ మార్కెట్లో తక్కువ ధరకే కరెంటు దొరుకుతున్నా అటువైపు చూడలేదు. సరిగ్గా ఏడాది తర్వాత 2019 అక్టోబర్ 4న యూనిట్ కేవలం రూ.3.38 చొప్పున అధికారులు కొన్నారు. అంటే ఒక్కో యూనిట్‌కు రూ.3.18 చొప్పున మిగులుతోందన్నమాట. గత ప్రభుత్వ హయాంలో ప్రజాధనాన్ని ఏస్థాయిలో దోచేశారో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఏపీ విద్యుత్ సంస్థలు(డిస్కమ్‌లు) కారుచౌకగా లభించే విద్యుత్‌నే కొనుగోలు చేస్తున్నాయి. బహిరంగ మార్కెట్లో ఎక్కడ తక్కువ ధరకు లభిస్తుందో తెలుసుకుని మరీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాయి. గత కొన్ని రోజులుగా యూనిట్ కరెంటును కేవలం రూ.3.15 చొప్పున కొనుగోలు చేస్తుండడం విశేషం. రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ ధర యూనిట్‌కు రూ.4.50 పడుతోంది. బహిరంగ మార్కెట్లో అంతకంటే చౌకగా లభిస్తున్న విద్యుత్ కొనుగోలుకు అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రతిరోజూ డిస్కమ్‌లు 12 మిలియన్ యూనిట్ల మేర చౌకైన విద్యుత్ తీసుకుంటున్నాయి. గతంలో ఇదే విద్యుత్‌ను యూనిట్ రూ.6.56 వరకూ చెల్లించి కొనుగోలు చేశారు. ఇప్పుడు ధర సగానికి సగం తగ్గడం వల్ల నిత్యం రూ.3 కోట్ల వరకూ ప్రజాధనం ఆదా అవుతుండడం గమనార్హం. బొగ్గు నిల్వల పెంపుపై దృష్టి థర్మల్ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు పెంచుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మార్కెట్లో విద్యుత్ ధరలు పెరిగినప్పుడు ఈ బొగ్గు నిల్వలను ఉపయోగించుకుని థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎప్పుడు విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంటుందో, ఉత్పత్తి ఎప్పుడు తగ్గుతుందో తెలుసుకునే దిశగా కసరత్తు చేస్తున్నారు. కొన్ని నెలలుగా దక్షిణాది రాష్ట్రాల్లో విద్యుత్ డిమాండ్‌ను అంచనా వేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ తగ్గినప్పుడు బహిరంగ మార్కెట్లో విద్యుత్ ధరలు పడిపోతాయి. ఈ పరిస్థితిని ఏపీ డిస్కమ్‌లు చక్కగా ఉపయోగించుకుంటున్నాయి. తక్కువ ధరకే కరెంటును కొనుగోలు చేస్తున్నాయి. ధర పెరిగినప్పుడు రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌పై ఆధారపడుతున్నారు. ఈ ప్రయోగం మంచి ఫలితాలనిస్తోందని అధికారులు విశ్లేషించారు. గత ప్రభుత్వ హయాంలో నెలకు రూ.100 కోట్ల భారం ఏడాది క్రితం వరకూ విద్యుత్ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఉండేది కాదు. అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలను అమలు చేయాల్సి వచ్చేది. దీంతో బహిరంగ మార్కెట్లో విద్యుత్ లభ్యతపై అధికారులు అంచనాలు రూపొందించే అవకాశం చిక్కలేదు. ప్రభుత్వ పెద్దల సన్నిహితులకు చెందిన ప్రైవేటు ప్లాంట్లు ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను విధిగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఆ సమయంలో తక్కువ ధరకే విద్యుత్ అందుబాటులో ఉన్నప్పటికీ ఖరీదైన ప్రైవేటు విద్యుత్‌ను కొనుగోలు చేశారు. యూనిట్‌కు రూ.6.56 వరకూ వెచ్చించాల్సి వచ్చింది. ఫలితంగా డిస్కమ్‌లపై నెలకు రూ.100 కోట్ల వరకూ భారం పడేది. అప్పటికీ, ఇప్పటికీ భారీ వ్యత్యాసం కనిపిస్తోందని విద్యుత్ వర్గాలు పేర్కొంటున్నాయి. 2018 అక్టోబర్‌లో యూనిట్ రూ.5.99 చొప్పున 9.92 మిలియన్ యూనిట్ల కరెంటు కొన్నారు. 2019 అక్టోబర్ 1న 23.1 మిలియన్ యూనిట్లను యూనిట్ కేవలం రూ.3.38 చొప్పునే కొనుగోలు చేశారు. 2018 అక్టోబర్ 4న గరిష్టంగా యూనిట్ రూ.6.56 చొప్పున కొనగా, 2019 అక్టోబర్ 4న యూనిట్ కేవలం రూ.3.38 చొప్పున కొనుగోలు చేశారు. నవంబర్ 1వ తేదీ నాటికి దీన్ని రూ.3.15కు తగ్గించగలిగారు. మంచి ఫలితాలొస్తున్నాయ్ ‘‘చౌక విద్యుత్‌కే ప్రాధాన్యం ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ పడిపోయినప్పుడు తక్కువ ధరకు లభిస్తున్న కరెంటు కొంటున్నాం. అదే సమయంలో థర్మల్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు పెంచుతున్నాం. ఈ ప్రయోగం సత్ఫలితాలిస్తోంది’’ – శ్రీకాంత్ నాగులపల్లి,ఇంధన శాఖ కార్యదర్శి -
ఉద్యోగుల ట్రస్టు నిధులు హాంఫట్!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఇప్పటికే ఒక్కో సేవను ప్రైవేట్‌పరం చేస్తూ ఉద్యోగుల పొట్టకొడుతున్న విద్యుత్ సంస్థలు ఇప్పుడు ఏకంగా ఉద్యోగుల ట్రస్టుకే చిల్లు పెట్టేశాయి. ఏకంగా రూ.2 వేల కోట్ల మేర ఉద్యోగుల ట్రస్టు నిధులను దీని నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షిస్తున్న జెన్కో తన సొంతానికి వాడుకుంది. 25 వేల మంది ఉద్యోగుల భవిష్యత్ కోసం భద్రపరచిన సొమ్మును జెన్కో సొంత అవసరాలు, సింగరేణి నుంచి బొగ్గు కొనుగోలు చెల్లింపులు తదితరాలకు వినియోగించడం ఆందోళనకు దారి తీస్తోంది. సిబ్బంది సంక్షేమానికి తూట్లు ఉద్యోగుల పింఛన్ల కోసం భద్రపరిచిన రూ.1,500 కోట్లను జెన్కో ఇప్పటికే వినియోగించగా నాలుగేళ్లుగా అంటే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమ వాటాగా విద్యుత్ సంస్థలు చెల్లించాల్సిన రూ.500 కోట్లను ఇవ్వకుండా వాడుకోవడం చర్చనీయాంశమవుతోంది. జెన్కోతోపాటు ట్రాన్స్‌కో, డిస్కంల ఉద్యోగులందరికీ ఈ ట్రస్టు ద్వారానే పింఛను చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగుల స్థూల వేతనంలో 9 శాతం చొప్పున సిబ్బంది సంక్షేమం కోసం మూడు విభాగాల నుంచి ట్రస్టుకు జమ చేస్తున్నారు. అయితే నాలుగేళ్లుగా సుమారు రూ.500 కోట్లను డిపాజిట్ చేయకుండా జెన్కో అవసరాలకు వినియోగించారు. మళ్లీ నిర్వీర్యం చేసే చర్యలు మొదలు.. ఇంధన ధరల్లో హెచ్చుతగ్గుల ఆధారంగా జెన్కోకు డిస్కంలు ఇంధన సర్దుబాటు చార్జీలు (ఎఫ్ఎస్ఏ) రూపంలో అదనపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఇలా సర్దుబాటు చార్జీల రూపంలో డిస్కంల నుంచి రావాల్సిన మొత్తాన్ని కాగితాల్లో మాత్రం ట్రస్టు నిధులుగా చూపుతున్నట్టు సమాచారం. విద్యుత్ సంస్కరణలో సమయంలో డిస్కంలను ప్రైవేట్‌పరం చేస్తారని, జెన్కోకు చెందిన ఒక్కో ప్లాంటును విక్రయిస్తారని అప్పట్లో విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చెందారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా వచ్చిన తర్వాత జెన్కోకు ప్రభుత్వ గ్యారంటీతో నిధులు ఇవ్వడంతో పాటు భారీగా విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని జెన్కో ఆధ్వర్యంలో చేపట్టారు. అంతేకాకుండా డిస్కంల ప్రైవేటీకరణ ఆలోచనను తిరస్కరించడంతో పాటు వేల మంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు. అయితే చంద్రబాబు మళ్లీ సీఎంగా వచ్చిన తర్వాత తిరిగి విద్యుత్ సంస్థలను నిర్వీర్యం చేసే చర్యలు మొదలయ్యాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంపై జెన్కో ఎండీ కె.విజయానంద్‌ను సంప్రదించగా.. ట్రస్ట్ నిధులను వినియోగించుకునేందుకు అవకాశం లేదన్నారు. ఏమిటీ ట్రస్టు..? గతంలో విద్యుత్ సంస్థలన్నీ కలిపి ఒకే సంస్థగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు (ఏపీఎస్ఈబీ) పేరుతో మనుగడలో ఉండేవి. 1999లో ఏపీఎస్ఈబీని చంద్రబాబు ప్రభుత్వం ముక్కలు చేసింది. ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్‌కో, విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లుగా మూడు ముక్కలు చేసింది. విద్యుత్ సంస్థల్లోని ఉద్యోగులకు మెరుగైన జీతాలు, హోదాతోపాటు పింఛన్లు కూడా ఇస్తామని ఈ సందర్భంగా హామీలను గుప్పించింది. ఈ మేరకు ఏపీఎస్ఈబీ, ప్రభుత్వం, ఉద్యోగులకు 1999లో త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. పెన్షన్ నిధికి రక్షణ కల్పించే ఉద్దేశంతో ఓ ట్రస్టును కూడా ఏర్పాటు చేశారు. మొదట్లో రూ.4 వేల కోట్లతో ఈ ట్రస్టు ఏర్పాటైంది. ఏపీఎస్ఈబీ హయాంలో ఉద్యోగం పొందిన చివరి సిబ్బంది పదవీ విరమణ చేసేవరకూ ఈ ట్రస్టును మనుగడలో ఉంచాలని నిర్ణయించారు. ఇలా 2033 వరకూ ఈ ట్రస్టు మనుగడలో ఉండనుంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ట్రస్టులో రూ. 2,500 కోట్ల మేర నిధులున్నాయి. ఇందులో నుంచి ఇప్పటిదాకా రూ.1,500 కోట్లు వినియోగించారు.