
సాక్షి, అమరావతి: ఏపీ విద్యుత్ సంస్థలు వేసవి విద్యుత్ ప్రణాళికపై సరికొత్త విధానాన్ని అనుసరిస్తున్నాయి. మార్కెట్లో లభించే చౌక విద్యుత్‌నే ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయాలని భావిస్తున్నాయి. రాష్ట్రంలో లభించే థర్మల్ విద్యుత్ కన్నా ఇది చౌకగా ఉండటంతో ఈ దిశగా వెళ్తున్నామని ఇంధనశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. పవర్ ఎక్స్చేంజ్‌లో చౌకగా విద్యుత్ లభిస్తున్న దృష్ట్యా ఈ వ్యూహాన్ని మార్చుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
- కోవిడ్ ప్రభావంతో పలు వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోయి దేశంలో 5 శాతం విద్యుత్ డిమాండ్ తగ్గింది. దీనికి తోడు గ్యాస్, విదేశీ బొగ్గు లభించడంతో విద్యుత్ లభ్యత పెరిగింది. ఫలితంగా పవర్ ఎక్స్చేంజ్‌లో విద్యుత్ యూనిట్ గరిష్టంగా రూ. 2.52లకే లభిస్తోంది. ఈ కారణంగా మార్చిలో మార్కెట్లో లభించే విద్యుత్‌నే తీసుకోవాలని నిర్ణయించారు.
- కొన్ని థర్మల్ ప్లాంట్లలో ఉత్పత్తి తగ్గించారు. డిమాండ్‌ను బట్టి దీన్ని పెంచుతారు. అయితే థర్మల్ విద్యుత్ సగటున యూనిట్ రూ. 5.53 వరకూ ఉంటోంది.
- ఒప్పందాలున్న థర్మల్ విద్యుత్ తీసుకోకపోతే ఆ ప్లాంట్లకు స్థిర వ్యయం (ఫిక్స్‌డ్ ఛార్జీలు) రూ. 1.20 వరకూ చెల్లించాలి. దీన్ని కలుపుకున్నా మార్కెట్ విద్యుత్ ధర యూనిట్ రూ. 3.72 వరకూ ఉంటుంది. ఈ లెక్కన యూనిట్‌కు రూ. 1.81 వరకూ విద్యుత్ సంస్థలకు లాభమే
ఉంటుంది.
- ప్రస్తుతం రోజుకు గరిష్టంగా 10 మిలియన్ యూనిట్ల వరకూ మార్కెట్ నుంచి చౌక విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు. ఏపీ జెన్‌కో ఉత్పత్తిని తగ్గించిన కారణంగా ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు 10 లక్షల టన్నులకు చేరుకున్నాయని థర్మల్ డైరెక్టర్ చంద్రశేఖర్‌రాజు తెలిపారు. ఈస్థాయిలో నిల్వలు పెరగడం గత ఐదేళ్లలో ఇదే మొదటిసారని ఆయన వివరించారు.