సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పాలనలో 2018 అక్టోబర్ 4న ఒక్కో యూనిట్ కరెంటు కొనుగోలుకు ఎంత వెచ్చించారో తెలుసా? అక్షరాలా రూ.6.56. అప్పటి ప్రభుత్వ పెద్దలు అస్మదీయ విద్యుత్ సంస్థల నుంచే కరెంటు కొనేసి, విచ్చలవిడిగా దోచిపెట్టారు. బహిరంగ మార్కెట్‌లో తక్కువ ధరకే కరెంటు దొరుకుతున్నా అటువైపు చూడలేదు. సరిగ్గా ఏడాది తర్వాత 2019 అక్టోబర్ 4న యూనిట్ కేవలం రూ.3.38 చొప్పున అధికారులు కొన్నారు. అంటే ఒక్కో యూనిట్‌కు రూ.3.18 చొప్పున మిగులుతోందన్నమాట. గత ప్రభుత్వ హయాంలో ప్రజాధనాన్ని ఏస్థాయిలో దోచేశారో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.
ఏపీ విద్యుత్ సంస్థలు(డిస్కమ్‌లు) కారుచౌకగా లభించే విద్యుత్‌నే కొనుగోలు చేస్తున్నాయి. బహిరంగ మార్కెట్‌లో ఎక్కడ తక్కువ ధరకు లభిస్తుందో తెలుసుకుని మరీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాయి. గత కొన్ని రోజులుగా యూనిట్ కరెంటును కేవలం రూ.3.15 చొప్పున కొనుగోలు చేస్తుండడం విశేషం. రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ ధర యూనిట్‌కు రూ.4.50 పడుతోంది. బహిరంగ మార్కెట్‌లో అంతకంటే చౌకగా లభిస్తున్న విద్యుత్ కొనుగోలుకు అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రతిరోజూ డిస్కమ్‌లు 12 మిలియన్ యూనిట్ల మేర చౌకైన విద్యుత్ తీసుకుంటున్నాయి. గతంలో ఇదే విద్యుత్‌ను యూనిట్ రూ.6.56 వరకూ చెల్లించి కొనుగోలు చేశారు. ఇప్పుడు ధర సగానికి సగం తగ్గడం వల్ల నిత్యం రూ.3 కోట్ల వరకూ ప్రజాధనం ఆదా అవుతుండడం గమనార్హం.
బొగ్గు నిల్వల పెంపుపై దృష్టి
థర్మల్ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు పెంచుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. మార్కెట్‌లో విద్యుత్ ధరలు పెరిగినప్పుడు ఈ బొగ్గు నిల్వలను ఉపయోగించుకుని థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎప్పుడు విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంటుందో, ఉత్పత్తి ఎప్పుడు తగ్గుతుందో తెలుసుకునే దిశగా కసరత్తు చేస్తున్నారు. కొన్ని నెలలుగా దక్షిణాది రాష్ట్రాల్లో విద్యుత్ డిమాండ్‌ను అంచనా వేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ తగ్గినప్పుడు బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ ధరలు పడిపోతాయి. ఈ పరిస్థితిని ఏపీ డిస్కమ్‌లు చక్కగా ఉపయోగించుకుంటున్నాయి. తక్కువ ధరకే కరెంటును కొనుగోలు చేస్తున్నాయి. ధర పెరిగినప్పుడు రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌పై ఆధారపడుతున్నారు. ఈ ప్రయోగం మంచి ఫలితాలనిస్తోందని అధికారులు విశ్లేషించారు.
గత ప్రభుత్వ హయాంలో నెలకు రూ.100 కోట్ల భారం
ఏడాది క్రితం వరకూ విద్యుత్ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఉండేది కాదు. అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలను అమలు చేయాల్సి వచ్చేది. దీంతో బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ లభ్యతపై అధికారులు అంచనాలు రూపొందించే అవకాశం చిక్కలేదు. ప్రభుత్వ పెద్దల సన్నిహితులకు చెందిన ప్రైవేటు ప్లాంట్లు ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను విధిగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఆ సమయంలో తక్కువ ధరకే విద్యుత్ అందుబాటులో ఉన్నప్పటికీ ఖరీదైన ప్రైవేటు విద్యుత్‌ను కొనుగోలు చేశారు.
యూనిట్‌కు రూ.6.56 వరకూ వెచ్చించాల్సి వచ్చింది. ఫలితంగా డిస్కమ్‌లపై నెలకు రూ.100 కోట్ల వరకూ భారం పడేది. అప్పటికీ, ఇప్పటికీ భారీ వ్యత్యాసం కనిపిస్తోందని విద్యుత్ వర్గాలు పేర్కొంటున్నాయి. 2018 అక్టోబర్‌లో యూనిట్ రూ.5.99 చొప్పున 9.92 మిలియన్ యూనిట్ల కరెంటు కొన్నారు. 2019 అక్టోబర్ 1న 23.1 మిలియన్ యూనిట్లను యూనిట్ కేవలం రూ.3.38 చొప్పునే కొనుగోలు చేశారు. 2018 అక్టోబర్ 4న గరిష్టంగా యూనిట్ రూ.6.56 చొప్పున కొనగా, 2019 అక్టోబర్ 4న యూనిట్ కేవలం రూ.3.38 చొప్పున కొనుగోలు చేశారు. నవంబర్ 1వ తేదీ నాటికి దీన్ని రూ.3.15కు తగ్గించగలిగారు.
మంచి ఫలితాలొస్తున్నాయ్
‘‘చౌక విద్యుత్‌కే ప్రాధాన్యం ఇవ్వాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో డిమాండ్ పడిపోయినప్పుడు తక్కువ ధరకు లభిస్తున్న కరెంటు కొంటున్నాం. అదే సమయంలో థర్మల్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు పెంచుతున్నాం. ఈ ప్రయోగం సత్ఫలితాలిస్తోంది’’
– శ్రీకాంత్ నాగులపల్లి,ఇంధన శాఖ కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment