
3,100 మెగావాట్ల విద్యుదుత్పత్తికి ఒప్పందం
మరో 1,600 మెగావాట్ల థర్మల్, 1,500 మెగావాట్ల సౌర విద్యుత్‌కు అవకాశం
సింగరేణికి 74 శాతం, రాజస్తాన్‌కు 26 శాతం వాటాలు
విద్యుదుత్పత్తి, వ్యాపార విస్తరణే లక్ష్యంగా..
ఇప్పటికే ఒడిశాలోని నైనీబ్లాక్‌లో బొగ్గు ఉత్పత్తికి ఒప్పందం
గోదావరిఖని: విద్యుదుత్పత్తి.. వ్యాపార విస్తరణ కోసం సింగరేణి కీలక ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. బొగ్గు ఉత్పత్తితోపాటు విద్యుత్ రంగంలో ముందుకు సాగుతోంది. 3,100 మెగావాట్ల విద్యుదుత్పత్తి కోసం రాజస్తాన్ రాష్ట్రంతో ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే ఒడిశా రాష్ట్రంలోని నైనీబ్లాక్‌లో బొగ్గు ఉత్పత్తికి నడుం బిగించింది. తాజాగా రాజస్తాన్‌లో విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. సింగరేణి ప్రస్తుతం 1,200 మెగావాట్ల థర్మల్, 245.5 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి చేస్తోంది. తాజా ఒప్పందంతో మరో 1,600 మెగావాట్ల థర్మల్, 1,500 మెగావాట్ల సౌర విద్యుత్ (Solar Power) అందుబాటులోకి వస్తుంది.
మరో మైలురాయి
పెరుగుతున్న దేశ విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వ్యాపార విస్తరణపై సింగరేణి దృష్టి పెట్టింది. రాజస్తాన్ విద్యుత్ సంస్థతో కలిసి సింగరేణి 74 శాతం, రాజస్తాన్ 26 శాతం పెట్టుబడితో ఒప్పందం చేసుకుంది. లాభాల్లో కూడా ఇవే వాటాలు ఉంటాయి. 136 ఏళ్ల సింగరేణి చరిత్రలో వ్యాపార విస్తరణకు ఇది ఎంతో దోహదం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం అపార బొగ్గు నిల్వలతో థర్మల్ విద్యుత్‌కు కేంద్రంగా నిలిచింది. ఒప్పందం ప్రకారం 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ (Thermal Power) ప్లాంట్ల ఏర్పాటుతోపాటు 1,500 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు. పెట్టుబడిలో సింగరేణి 74 శాతం, రాజస్తాన్ విద్యుత్ ఉత్పాదన్ నిగం లిమిటెడ్ 26 శాతం వాటాను చెల్లించనున్నాయి.
రాజస్తాన్ ప్రభుత్వం తన వాటా కింద చెల్లించాల్సిన 26 శాతం సొమ్మును సౌర, థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు అవసరమైన స్థలాలు, మౌలిక సదుపాయాల రూపంలో అందించనుంది. సింగరేణి తన వాటాగా అంగీకరించిన 74 శాతాన్ని ధన రూపంలో చెల్లించనుంది. ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలాన్ని అన్ని రకాల అనుమతులతో సింగరేణికి ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్పగించనుంది. ఈ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తు కొనుగోలుకు డిస్కంలతో ఒప్పందాలు (పీపీఏ) తదితర అంశాలను రాజస్తాన్ ప్రభుత్వ విద్యుత్ శాఖ ద్వారా చేపట్టేలా అంగీకరించారు.
మారిపోనున్న సింగరేణి ముఖచిత్రం
సింగరేణి ఇప్పటివరకు కేవలం తెలంగాణ రాష్ట్రం వరకే పరిమితమై తన బొగ్గు ఉత్పత్తి, థర్మల్, సౌర విద్యుత్ రంగాల్లో అడుగుపెట్టి విద్యుదుత్పత్తి చేస్తోంది. ప్రస్తుతం 1,200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద ఏర్పాటు చేయగా.. అదే ప్రదేశంలో మరో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ ఏర్పాటు పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం 245.5 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి చేస్తున్న సింగరేణి.. 2026 నాటికి 450 మెగావాట్లకు పైగా సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసి బొగ్గు సంస్థల్లో నెట్ జీరో కంపెనీగా నిలవాలని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది.
చదవండి: చేనేత కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
వ్యాపార విస్తరణలో భాగంగా.. ఒడిశా రాష్ట్రంలోని నైనీ వద్ద ఏటా కోటి టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే ప్రాజెక్టును చేపట్టింది. ఇది మరో 30 రోజుల్లో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించనుంది. తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ఇదే ప్రాంతంలో 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి.

200 ఏళ్ల భవిష్యత్ దిశగా..
సింగరేణి సంస్థకు మరో 200 ఏళ్ల భవిష్యత్ దిశగా దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాం. 2070 నాటి జీరోనెట్ దిశగా ప్రపంచం ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో ఇతర వ్యాపారాలపై దృష్టి సారిస్తున్నాం. రాబోయే రోజుల్లో బొగ్గు బ్లాకులు, థర్మల్ విద్యుదుత్పత్తి కనుమరుగయ్యే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో కొత్తవ్యాపారాల దిశగా సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాబోయే రోజుల్లో గ్రీన్ ఎనర్జీ లక్ష్యంగా ముందుకు సాగుతాం.
– ఎన్.బలరాం, సీఎండీ, సింగరేణి
Comments
Please login to add a commentAdd a comment