‘సెకీ’ ఒప్పందం సక్రమమే | APERC gets clean chit on deal with Solar Energy Corporation of India Limited | Sakshi
Sakshi News home page

‘సెకీ’ ఒప్పందం సక్రమమే

Published Sat, Feb 22 2025 4:40 AM | Last Updated on Sat, Feb 22 2025 8:43 AM

APERC gets clean chit on deal with Solar Energy Corporation of India Limited

తేల్చి చెప్పిన ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి

ఎలాంటి లోపాలు లేవు.. అంతా నిబంధనల మేరకే జరిగింది

కాబట్టి రద్దు చేయడం కుదరదు.. 

అంతర్రాష్ట్ర ప్రసార చార్జీలు వర్తించవు

సెకీ నుంచి ఈ ఏడాదే 4 వేల మెగావాట్ల కొనుగోలుకు అనుమతి

డిస్కమ్‌ల విద్యుత్‌ సేకరణ ప్రణాళికకు ఆమోదం

ఇన్నాళ్లూ ఒప్పందంపై విషం చిమ్మిన చంద్రబాబు, టీడీపీ కరపత్రం

అది రాష్ట్ర చరిత్రలోనే కారుచౌక ఒప్పందం  

నాడు స్వయంగా లేఖ రాసిన సెకీ.. ఐఎస్‌టీఎస్‌ చార్జీల నుంచి మినహాయింపు.. 25 ఏళ్ల దూరదృష్టి ఒప్పందంతో ఖజానాకు రూ.1.10 లక్షల కోట్లు ఆదా

7 వేల మెగావాట్ల సోలార్‌ ఒప్పందం ఏ ప్రభుత్వంలోనూ జరగలేదు డిస్కమ్‌లు కూడా ఇలాంటి ఒప్పందాన్ని ఎన్నడూ కుదుర్చుకోలేదు

మూడో వ్యక్తి ప్రమేయం, లంచాలకు ఎక్కడా తావే లేదు..  

సెకీ నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ సేకరణకు సంబంధించి అనేక అభ్యంతరాలు వివిధ కారణాలతో వచ్చాయి. సెకీ విద్యుత్‌ సేకరణలో లంచాలకు సంబంధించి మీడియా కథనాలను బట్టి ఏపీఈఆర్‌సీ ఇచ్చిన ఆమోదాన్ని రద్దు చేయాలని కొందరు కోరారు. దీంతో ఈ పీఎస్‌ఏపై ఏపీఈఆర్‌సీ మరోసారి దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీర్పులను క్షుణ్ణంగా పరిశీలించింది. 

కేంద్ర విద్యుత్‌ శాఖ ఆదేశాలు, సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్‌ కమిషన్‌ (సీఈఆర్‌సీ) జనరల్‌ నెట్‌వర్క్‌ యాక్సెన్‌ (జీఎన్‌ఏ) నిబంధనలు, పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌(పీపీఏ) ప్రకారం..‘సెకీ’ విద్యుత్‌కు అంతర్‌ రాష్ట్ర ప్రసార (ఇంటర్‌ స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్‌–ఐఎస్‌టీఎస్‌) చార్జీలు వర్తించవు. అదేవిధంగా ప్రసార నష్టాల మినహాయింపు ఉంటుంది.

సెకీ విద్యుత్‌ కొనుగోలుకు అనుమతించాల్సిందిగా డిస్కంలు ప్రతిపాదించాయి. అందువల్ల ఈ 7 వేల మెగావాట్లలో ఈ ఏడాది (2025–26)లో 4 వేల మెగావాట్లను విద్యుత్‌ సేకరణ ప్రణాళిక (పవర్‌ ప్రొక్యూర్‌మెంట్‌ ప్లాన్‌)లో చేర్చకపోవడానికి కమిషన్‌కు ఎటువంటి కారణం కనిపించడం లేదు.  – ఏపీఈఆర్‌సీ

సాక్షి, అమరావతి: రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని దూరదృష్టితో కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెకీ’తో కారుచౌకగా యూనిట్‌ రూ.2.49కే సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా రూ.1.10 లక్షల కోట్లను ఆదా చేసి సంపద సృష్టించే దిశగా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అడుగులు వేసిందని ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) సాక్షిగా రుజువైంది. గత ప్రభుత్వ హయాంలో సెకీతో జరిగిన ఒప్పందంలో ఎలాంటి లోపాలు లేవని ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. 

7 వేల మెగావాట్ల సౌర విద్యుత్తు కొనుగోలు ఒప్పందం పూర్తిగా నిబంధనల మేరకే జరిగిందంటూ ఆదాయ అవసరాల నివేదిక (అగ్రిగేట్‌ రెవిన్యూ రిక్వైర్‌మెంట్‌–ఏఆర్‌ఆర్‌)లో ఏపీఈఆర్‌సీ స్పష్టం చేసింది. విద్యుత్‌ సేకరణపై తాజాగా విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కమ్స్‌) చేసిన ప్రతిపాదనల్లో సెకీ విద్యుత్‌ కూడా ఉంది. 2025–26లో సెకీ నుంచి 4 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను తీసుకోవడానికి అనుమతించాల్సిందిగా ఏపీఈఆర్‌సీని డిస్కంలు కోరాయి. దీనిపై స్పందించిన కమిషన్‌ ‘సెకీ’ విద్యుత్‌ ఒప్పందంపై తాజాగా పూర్తి స్పష్టత ఇచ్చింది. 

‘‘సెకీ నుంచి తీసుకునే 7 వేల మెగావాట్లలో ఈ ఏడాది (2025–26)లో 4 వేల మెగావాట్లను విద్యుత్‌ సేకరణ ప్రణాళిక (పవర్‌ ప్రొక్యూర్‌మెంట్‌ ప్లాన్‌)లో చేర్చకపోవడానికి కమిషన్‌కు ఎటువంటి కారణం కనిపించడం లేదు’’ అని ఏపీఈఆర్‌సీ పేర్కొంది. ఇక సెకీ నుంచి విద్యుత్‌ సేకరణ ప్రణాళికలో ట్రేడింగ్‌ మార్జిన్‌ తగ్గించడంపై జరిగిన చర్చలను కూడా మండలి ప్రస్తావించింది. సీఈఆర్‌సీ రూ.0.7 పైసల ట్రేడింగ్‌ మార్జిన్‌తో టారిఫ్‌ను ఇప్పటికే ఆమోదించిందని, అందువల్ల దానిపై కమిషన్‌ దీనిపై ఇప్పుడు వ్యాఖ్యానించదని తెలిపింది. 

అంటే గత ప్రభుత్వం కుదుర్చుకున్న ధర యూనిట్‌ రూ.2.49కే సెకీ నుంచి విద్యుత్‌ తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ నేపధ్యంలో సెకీ లాంటి పీఎస్‌ఏ ఒప్పందాలను కొందరు డిమాండ్‌ చేస్తున్నట్లుగా సూమోటోగా కమిషన్‌ రద్దు చేయలేదని తేల్చి చెప్పింది. కాబట్టి ఈ ఏడాది ఏప్రిల్, అక్టోబరులో విద్యుత్‌ సేకరణకు డిస్కంలు కోరిన ప్రణాళికలో సెకీ విద్యుత్‌ను చేర్చడానికి కమిషన్‌ మొగ్గు చూపుతున్నట్లు ప్రకటించింది. 

సెకీతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న సోలార్‌ విద్యుత్తు ఒప్పందంలో భారీ అవినీతి జరిగిందని.. అదానీ రూ.1,750 కోట్లు లంచం ఇచ్చారని.. అంతర్జాతీయ స్థాయికి అవినీతిని చేర్చారని.. పేరుకే సెకీ.. ఒప్పందం అదానీతోనే.. ఐఎస్‌టీఎస్‌ చార్జీలు కట్టాల్సిందే.. జుగల్‌ బందీలు.. రాష్ట్ర ప్రజలపై రూ.లక్ష కోట్ల ఆర్థిక భారం.. ఇలా చిలువలు పలువలుగా.. దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్లుగా ఎల్లో మీడియా, టీడీపీ కూటమి నేతలు సాగించిన దుష్ప్రచారం పూర్తిగా అవాస్తవమని దీన్నిబట్టి తేలిపోయింది. కేవలం మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై బురద చల్లడమే ఏకైక లక్ష్యంగా బరితెగించినట్లు వెల్లడైంది.  

అంటే తప్పులేదని ఒప్పుకున్నట్లేగా
అంతరాష్ట్ర విద్యుత్‌ సరఫరా చార్జీలను (ఐఎస్‌టీఎస్‌) మినహాయించి యూనిట్‌ రూ.2.49 చొప్పున విద్యుత్‌ను సరఫరా చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ తనకు తానుగా 2021 సెప్టెంబర్‌ 15 రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శికి లేఖ ద్వారా ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో యూనిట్‌ రూ.2.49 చొప్పున ఏడు వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ను 25 ఏళ్లపాటు సరఫరా చేసేలా సెకీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. 

ఈ ఒప్పందాన్ని 2021 నవంబర్‌ 11న ఏపీఈఆర్‌సీ కూడా ఆమోదించింది. 2003 విద్యుత్‌ చట్టం ప్రకారం సెకీ ఒప్పందాలకు ఏపీఈఆర్‌సీ అనుమతినిచ్చింది. నిజానికి సెకీ నుంచి గతేడాది సెప్టెంబర్ నుంచి విద్యుత్‌ కొనుగోలు మొదలవ్వాల్సి ఉంది. 

తొలి ఏడాది 2024లో 3వేల మెగావాట్లు, 2025లో మరో 3 వేల మెగావాట్లు, 2026లో 1,000 మెగావాట్లు చొప్పున మొత్తం 7వేల మెగావాట్లను రాష్ట్రం తీసుకుంటుందని ఒప్పందంలో ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వం 4వేల మెగా­వాట్లను ఈ ఏడాదే తీసుకుంటామంటూ ప్రతిపాదించింది. అంటే ఇన్నాళ్లూ తాము చెప్పినవన్నీ శుద్ధ అబద్ధాలని, కల్పిత కథనాలేనని కూటమి ప్రభుత్వం ఒప్పుకున్నట్లైంది!

సంపద సృష్టించిందెవరు?.. గుదిబండ మోపిందెవరు?
సెకీ నుంచి కారుచౌకగా విద్యుత్తు కొనుగోలు ఒప్పందం ద్వారా గత ప్రభుత్వం ఏడాదికి రూ.4,400 కోట్లు ఆదా చేసింది. ఈ లెక్కన 25 ఏళ్లలో రూ.1.10 లక్షల కోట్లను ఆదా చేయడం ద్వారా సంపద సృష్టించింది. అదే చంద్రబాబు హయాంలో 2014–19 మధ్య సౌర విద్యుత్‌ యూనిట్‌ సగటున రూ.5.90 చొప్పున కొనుగోలు ఒప్పందాలు(పీపీఏలు) చేసుకున్నారు. 

సెకీ నుంచి కొనుగోలు చేసిన దానికంటే యూనిట్‌ రూ.3.41 అధికంగా కొన్నారు. దీనివల్ల ఏడాదికి రూ.3,500 కోట్లు చొప్పున 25 ఏళ్లలో రూ.87,500 కోట్ల భారం ప్రభుత్వ ఖజానాపై భారం పడింది. మరి 25 ఏళ్లకు రూ.1.10 లక్షల కోట్లను ఖజానాకు ఆదా చేసి సంపద సృష్టించిన వైఎస్‌ జగన్‌ గొప్పా..? లేక రూ.87,500 కోట్లు ఖజానాపై భారం వేసి సంపదను ఆవిరి చేసిన చంద్రబాబు గొప్పా? 

చేసిన మంచిని దాచలేరు.. 
గాడి తప్పిన విద్యుత్‌ రంగాన్ని చక్కదిద్దేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టింది. వ్యవసాయానికి ఉచితంగా, వివిధ వర్గాలకు రాయితీతో విద్యుత్‌ సరఫరా అందించింది. అందుకుగానూ డిస్కంలకు 2019–24 మధ్య రూ.47,800.92 కోట్లను అందించింది. 2014–19 వరకు టీడీపీ సర్కారు రూ.13,255.76 కోట్లు మాత్రమే సబ్సిడీ చెల్లించింది. రైతులకు ఉచిత విద్యుత్‌ బకాయిలు రూ.8,845 కోట్లు ఇవ్వకుండా ఎగవేసింది. దానిని కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే చెల్లించింది. 

2019–2023 మధ్య వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రెండు లక్షలపైగా వ్యవసాయ డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేసింది. చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో 3.5 లక్షల వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయగా వైఎస్‌ జగన్‌  ప్రభుత్వం సుమారు 5 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చి సాగుకు చేదోడు వాదోడుగా నిలిచింది. 

రాష్ట్రంలో 9 గంటలు వ్యవసాయానికి పగటిపూట విద్యుత్‌ సరఫరా చేసేలా 6,663 ఫీడర్ల సామర్థ్యాన్ని పెంచేందుకు రూ.1,700 కోట్లు వెచ్చించారు. విద్యుత్‌ రంగానికి, రైతన్నలకు ఇంత మంచి చేసిన వైఎస్‌ జగన్‌పై బురద చల్లుతూ సెకీ విద్యుత్‌ ధర ఎక్కువని, ఐఎస్‌టీఎస్‌ చార్జీలు కట్టాల్సి వస్తుందని కూటమి నేతలు, కరపత్రికలు  దు్రష్పచారం చేశాయి. చివరికి అవన్నీ తప్పుడు ఆరోపణలని విద్యుత్‌ నియంత్రణ మండలి తేల్చింది.  

ఇప్పుడేమంటారు బాబూ..?
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో గత ప్రభుత్వం, విద్యుత్‌ పంపిణీ సంస్థల మధ్య త్రైపాక్షిక విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం జరిగింది. ఇందులో ఎలాంటి రహస్యం లేదు. మంత్రి మండలితో పాటు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ఆమోదంతో అత్యంత పారదర్శకంగా బహిరంగంగానే జరిగింది. 

సెకీతో ఒప్పందం వల్ల రాష్ట్రానికి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ యూనిట్‌ రూ.2.49కే పాతికేళ్ల పాటు సరఫరా అవుతుంది. దాన్ని రైతుల వ్యవసాయ అవసరాల కోసం అందించాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సంకల్పించింది. ఆ ధర అప్పటికి ఎన్టీపీసీ సరఫరా చేస్తున్న సౌర ధర రూ.2.79 కన్నా 30 పైసలు తక్కువ. ఈ ఒప్పందంపై చంద్రబాబు కూటమి ప్రభుత్వం, టీడీపీ అనుబంధ కరపత్రిక ఈనాడు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేశాయి.

అదానీపై అమెరికాలో ఏదో కేసు నమోదైందని, అందులో జగన్‌ పేరు ఉందని, లంచం తీసుకున్నారని నిరాధార కథనాలను వండి వార్చాయి. ఈనాడు, టీడీపీ అనుబంధ మీడియా రాసిన అసత్య  కథనాలను పట్టుకుని చంద్రబాబు ప్రోద్బలంతో కూటమి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఊగిపోయారు. ఏకంగా జగన్‌పైనే కేసు పెట్టినట్లు నిందలేస్తూ ఆరోపణలు గుప్పించారు. 

సెకీ ఒప్పందానికి అంతర్‌ రాష్ట్ర ప్రసార చార్జీల నుంచి మినహాయింపు రాదని, యూనిట్‌ రూ.2.49 కూడా ఎక్కువేనని, ప్రజలపై పాతికేళ్లలో రూ.లక్ష కోట్ల భారం పడుతుందంటూ ప్రజలను తప్పుదోవ పట్టించి ఏమార్చేందుకు టీడీపీ కరపత్రికలు యత్నించాయి. అవన్నీ ఇప్పుడు  పటాపంచలయ్యాయి. ఇదే చంద్రబాబు గతంలో అత్యధిక ధరలకు ప్రైవేటు వ్యక్తులు, సంస్థల నుంచి విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) కుదుర్చుకున్నారు. 

అప్పడు మార్కెట్‌లో సౌర విద్యుత్‌ యూనిట్‌ రూ.2.44కే  లభిస్తున్నా ఏకంగా యూనిట్‌ రూ.6.99 చొప్పున కొన్నారు. మిగులు విద్యుత్‌ ఉన్నప్పటికీ చంద్రబాబు దానిని వృథా చేసి మరీ ఇంత ఎక్కువ ధరకు పీపీఏలు చేసుకున్నారు. తాజాగా ఏపీఈఆర్‌సీ ఇచ్చిన స్పష్టత వాటికి చెంపపెట్టులా పరిణమించింది.

ఎల్లో కరపత్రం.. ఎంత విషం చిమ్మిందో.. 

ఆరోపణ:     సెకీతో ఒప్పందాన్ని 7 గంటల్లోనే ఆమోదించారంటూ ఈనాడు వక్రీకరణ
నిజం:     సెకీ లేఖ – ఒప్పందానికి మధ్య దాదాపు రెండున్నర నెలల సుదీర్ఘ సమయం. కమిటీ లోతైన అధ్యయనం తరువాతే కేబినెట్‌ ఆమోదం
ఆరోపణ:     ట్రాన్స్‌మిషన్‌ చార్జీలు పడతాయంటూ ఈనాడు నిస్సిగ్గుగా అబద్ధాలు 
నిజం:     పాతికేళ్ల పాటు అంతరాష్ట్ర ప్రసార చార్జీలు వర్తించవని లేఖలోనే చెప్పిన ’సెకీ’
ఆరోపణ:     సోలార్‌ విద్యుత్తు ఒప్పందంలో భారీ అవినీతి జరిగింది.. అదానీ రూ.1,750 కోట్లు 
లంచం ఇచ్చారు. అంతర్జాతీయ స్థాయికి అవినీతిని చేర్చారు. రాష్ట్ర ప్రజలపై రూ.లక్ష కోట్ల ఆర్ధిక భారం పడుతుంది.
నిజం:     ఈ ఒప్పందంలో మూడో వ్యక్తి ప్రమేయానికి తావే లేదు. ఒప్పందం జరిగింది.. కేంద్ర ప్రభుత్వ సంస్థ.. రాష్ట్ర ప్రభుత్వం.. డిస్కమ్‌ల మధ్య! ఇక లంచాలకు తావెక్కడ?

రాష్ట్ర చరిత్రలోనే కారుచౌక
రాష్ట్ర చరిత్రలోనే ఇంత కారుచౌకగా సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం.. అది కూడా అత్యధికంగా 7 వేల మెగావాట్ల కొనుగోలు కోసం ఒప్పందం గతంలో ఎప్పుడూ, ఏ ప్రభుత్వంలోనూ జరగలేదు. ఏ ముఖ్యమంత్రి హయాంలోనూ జరిగిన దాఖలాలు లేవు. డిస్కమ్‌లు కూడా ఇలాంటి ఒప్పందాన్ని ఎన్నడూ కుదుర్చుకోలేదు. అందులోనూ కేంద్రమే స్వయంగా లేఖ రాసి మరీ యూనిట్‌ రూ.2.49 చొప్పున 25 ఏళ్లపాటు నిరాటంకంగా విద్యుత్తు సరఫరా చేస్తామని ముందుకొస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కాదంటుందా? 

రైతులకు ఉచిత విద్యుత్తుపై వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం దూరదృష్టి, సోలార్‌పై మన విధానాలను అభినందిస్తూ స్వయంగా సెకీ నాడు లేఖ రాసింది. సరఫరా చార్జీల భారం లేకుండా అత్యంత చౌకగా కరెంట్‌ అందిస్తామని సంసిద్ధత తెలిపింది. ఎవరు మాత్రం దీన్ని కాదంటారు? అసలు ఈ ఒప్పందం ఓ రాష్ట్ర ప్రభుత్వం – కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగింది. అలాంటప్పుడు ఇక లంచాలెలా వస్తాయి? 

కేంద్రం ఎక్కడైనా రాష్ట్రానికి లంచం ఇస్తుందా? ఒకవేళ తీసుకోవాలనుకుంటే కేంద్రం రాసిన లేఖకు ఎందుకు స్పందిస్తారు? అలాంటి ఉద్దేశం ఉంటే నేరుగా అదానీతోనే ఒప్పందం చేసుకోవాలి కదా? నేరుగా కేంద్రంతో ఒప్పందం చేసుకున్నప్పుడు ఇందులో మూడో వ్యక్తి అనే ప్రస్తావన ఎందుకు ఉంటుంది?

‘సెకీ’ ఒప్పందంతో లాభాలివీ..
» కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ) యూనిట్‌ రూ.2.49కే సోలార్‌ విద్యుత్తు అందచేస్తామంటూ తనకు తానుగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. ఈ ప్రతిపాదనకు ఏపీ అంగీకరించడం వల్ల 25 ఏళ్ల పాటు ఐఎస్‌టీఎస్‌ చార్జీల నుంచి మినహాయింపు లభిస్తుందని 2021 సెప్టెంబర్‌ 15న రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో సెకీ స్పష్టం చేసింది.
» ఈ చారిత్రక ఒప్పందం వల్ల రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ.లక్ష కోట్ల మేర విద్యుత్తు భారం నుంచి ఆర్ధిక ప్రయోజనం చేకూరుతుంది. 
»   ఐఎస్‌టీఎస్‌ చార్జీల నుంచి మినహాయింపు అనేది మరే ఇతర ప్రాజెక్ట్‌కి దక్కని చాలా కీలకమైన ప్రయోజనం. ఇతర రాష్ట్రంలో ఉన్న సోలార్‌ పవర్‌ ఉత్పాదక కేంద్రం నుంచి విద్యుత్‌ సరఫరా కోసం మరే ఇతర సంస్థతో ఒప్పందం చేసుకుంటే మన రాష్ట్రం ఐఎస్‌టీఎస్‌ ఛార్జీలను చెల్లించాల్సి వచ్చేది. అప్పుడు అది చాలా భారంగా మారుతుంది. ప్రతి నెలా మెగావాట్‌కు సుమారు రూ.4 లక్షలు దానికే ఖర్చవుతుంది. 
» రాష్ట్ర డిస్కంలు మునుపెన్నడూ ఇంత తక్కువ ధరకు సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసిన దాఖలాలు లేవు. 
»  ఇది కేంద్ర సంస్థ సెకీతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం. ఇందులో మూడో వ్యక్తి ప్రమేయానికి తావే లేదు. అలాంటప్పుడు ఇక లంచాలకు ఆస్కారం ఎక్కడుంటుంది?
» టీడీపీ హయాంలో కుదుర్చుకున్న అధిక ధరల పీపీఏలతో పోలిస్తే సెకీతో సగం కంటే తక్కువ ధరకే ఒప్పందం కుదిరింది.

అభినందించాల్సింది పోయి నిందలేస్తారా?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక చరిత్రాత్మక ఒప్పందంæ జరిగితే.. యూనిట్‌ రూ.2.49కే రాష్ట్రానికి  విద్యుత్‌ దొరుకుతుంటే.. పైగా స్పెషల్‌ ఇన్సెంటివ్‌గా అంతరాష్ట్ర ట్రాన్స్‌మిషన్‌ ఛార్జీల నుంచి మినహాయింపు కల్పించడం ద్వారా యూనిట్‌కు మరో రూ.1.98 ఆదా అవుతుంటే.. ఇంత మంచి ప్రతిపాదన రాష్ట్రానికి వస్తే ఎవరైనా క్షణం ఆలోచించకుండా ముందుకెళ్తారు. మేం కూడా అదే చేశాం. 

ఈ ఒప్పందం ద్వారా 25 ఏళ్లలో రూ.1.10 లక్షల కోట్లు ఆదా చేయడం వలన సంపద సృష్టించాం. నిజంగా ఇదొక రోల్‌ మోడల్‌ కేసు. ఇంత మంచి చేస్తే నాపై రాళ్లేస్తారా? ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే. ఆత్మనిర్భర్‌ ప్యాకేజ్‌ కింద తమిళనాడు, ఒడిశా, చత్తీస్‌ఘడ్‌లకు సెకీ ఎంతకు అమ్మిందో తెలుసా? ఆ మూడు రాష్ట్రాలకు యూనిట్‌ రూ.2.61 చొప్పున సరఫరా చేశారు. అంటే వాళ్లకంటే రూ.0.12  తక్కువకే విద్యుత్‌ తీసుకొచ్చిన నన్ను అభినందించి శాలువా కప్పి ప్రశంసించాల్సింది పోయి బురద జల్లుతారా?  

మంచి చేసిన వాడిపై రాళ్లు వేయడమే  ఈనాడు, ఆంద్రజ్యోతి, టీవీ 5తో పాటు చంద్రబాబుకు చెందిన ఎల్లో గ్యాంగ్‌ పనిగా పెట్టుకుంది. వీళ్లు తానా అంటే తందానా అనే ఇతర పార్టీల్లో ఉండే టీడీపీ సభ్యులు మిడిమిడి జ్ఞానంతో చంద్రబాబును మోయాలన్న  తాపత్రయంతో... జగన్‌పై బురద చల్లాలి అనే యావతో నోటికొచ్చినట్టు ఆరోపణలు గుప్పించడం ఎంతవరకు సమంజసం?.     – ఎల్లో మీడియా దుష్ప్రచార కథనాలపై గతంలో వైఎస్‌ జగన్‌ వ్యాఖ్య   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement