అదే ఉన్మాదం | Eenadu False Writings On Solar Energy Corporation Of India Agreement With YSRCP Govt | Sakshi
Sakshi News home page

అదే ఉన్మాదం

Published Mon, Dec 9 2024 4:55 AM | Last Updated on Mon, Dec 9 2024 9:46 AM

Eenadu false writings on Solar Energy Corporation of India

సెకీ విద్యుత్‌పై వాస్తవాలు కనిపిస్తున్నా ఆగని ఈనాడు గుడ్డిరాతలు  

అంతర్రాష్ట్ర ప్రసార చార్జీల నుంచి 25 ఏళ్ల పాటు సెకీ విద్యుత్‌కు పూర్తి మినహాయింపు 

ఆ విషయంపై కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ ఆదేశాలు.. సెకీ ఒప్పందంలోనూ స్పష్టం 

రాష్ట్రంలోనే 6,400 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి ప్రాజెక్టు పెట్టాలంటే నెట్‌వర్క్‌ విస్తరణకే రూ.2,600 కోట్లు వ్యయం 

సెకీ నుంచి తీసుకోవడంవల్ల ఆ వ్యయం లేకపోగా భారీగా ఆదా 

ఒకే అబద్ధాన్ని పదేపదే చెప్పడం ద్వారా ప్రజలను ఏమార్చాలని టీడీపీ, దాని కరపత్రిక పన్నాగం  

సాక్షి, అమరావతి: ఏ ప్రభుత్వ హయాంలోనూ.. ఏ ముఖ్యమంత్రి పాలనలోనూ.. ఎప్పుడూ, ఎవరూ చేయని గొప్ప ఆలోచనకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేశారు. రానున్న 30 ఏళ్లల్లో రైతులకు హక్కుగా వ్యవసాయానికి పగటి పూట 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా అందించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ) తో సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాన్ని అత్యంత పారదర్శకంగా గత ప్రభుత్వం కుదుర్చుకుంది. 

కానీ ఈనాడు మాత్రం ఈ ఒప్పందంపై విషం చిమ్ముతూనే ఉంది. సెకీతో 7 వేల మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలు కోసం గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంపై ఇప్పటికే అనేక విధాలుగా వాస్తవాలను ప్రజల ముందు ఉంచినప్పటికీ, టీడీపీ, దాని కరపత్రిక ఈనాడు చేస్తున్న దుష్ప్రచారం కొనసాగుతూనే ఉంది. ఆ క్రమంలోనే అర్ధంలేని ఆరోపణలతో ఆదివారం మరో అబద్దపు కథనాన్ని ఈనాడు వండి వార్చింది. 

రాష్ట్రంలో 6,400 మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనపై సమగ్ర అధ్యయనం చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఇంధన శాఖకు చెందిన సాంకేతిక కమిటీ తప్పుడు లెక్కలతో అంకెల గారడీ చేసిందంటూ ఈనాడు తప్పుడు కథనాన్ని ప్రచురించింది. 6,400 మెగావాట్ల విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల స్థాపన ఖర్చులను అంచనా వేసేటప్పుడు ఏపీ పవర్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ (ఏపీపీసీసీ) తప్పు చేసిందంటూ ఈనాడు నిరాధారంగా ఆరోపణ చేసింది. వాస్తవాలను ఉద్దేశ్యపూర్వకంగా ఆ పత్రిక దాచిపెట్టింది.  

‘ఐఎస్‌టీఎస్‌’ చార్జీలపై అవే అబద్ధాలు
సెకీ ఒప్పందం వల్ల రాష్ట్రానికి అంతర్‌ రాష్ట్ర ప్రసార చార్జీలు ఉండవని సెకీ లేఖ, కేంద్ర విద్యుత్‌  మంత్రిత్వ శాఖ, 
సెంట్రల్‌  ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమీషన్‌ (సీఈఆర్‌సీ), సెకీ ఒప్పందంలో స్పష్టంగా ఉన్నప్పటికీ ఈనాడు మాత్రం 
కళ్లున్నా కబోదిలా నటిస్తూ పచ్చి అబద్దాలను ప్రచురిస్తోంది.

లేఖలోనే ప్రతిపాదించిన సెకీ
రాష్ట్ర ప్రభుత్వానికి 2021 సెప్టెంబర్ 15న సెకీ ఓ లేఖలో..ప్రాజెక్టు వాణిజ్య కార్యకలాపాలు(కమర్షియల్‌ ఆపరేషన్‌ డేట్‌– సీఓడీ)తో సంబంధం లేకుండా ప్రత్యేక ప్రోత్సాహకంగా ఐఎస్‌టీఎస్‌ చార్జీల నుంచి కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చి0దని స్పష్టంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఐఎస్‌టీఎస్‌ ఛార్జీలు వర్తించవని ఆ లేఖలో వివరంగా చెప్పింది.

ప్రత్యేక ప్రోత్సాహకం కింద రాష్ట్రానికి ఐఎస్‌టీఎస్‌ చార్జీల నుంచి పూర్తిగా మినహాయింపు లభిస్తుందని తెలియజేస్తూ 2021 సెపె్టంబర్‌ 15న రాష్ట్ర ప్రభుత్వానికి సెకీ రాసిన లేఖ

సెకీ ఒప్పందంలోనూ ఉంది
సెకీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య జరిగిన విద్యుత్‌ సరఫరా ఒప్పందం(పవర్‌ సేల్‌ అగ్రిమెంట్‌)లోనూ కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రోత్సాహంగా ఐఎస్‌టీఎస్‌ చార్జీల నుంచి మినహాయింపు ఇస్తుందనే అంశం ఉంది.

ఒప్పందంలోని నిబంధన 3.2 ప్రకారం..ఐఎస్‌టీఎస్‌  ఛార్జీలు, ఓపెన్‌ యాక్సెస్‌ ఛార్జీలు, సీటీయూ (సెంట్రల్‌ ట్రాన్స్‌మిషన్‌ యుటిలిటీ) షెడ్యూలింగ్‌ ఛార్జీలే కాకుండా ఇంజెక్షన్‌/డెలివరీ పాయింట్‌ నుంచి సబ్‌స్టేషన్‌ వరకూ ఏ ఇతర చార్జీలు కూడా రాష్ట్ర డిస్కంలు చెల్లించనవసరం లేదని ఒప్పందంలో పొందుపరిచారు. 

దీనిని బట్టి చట్టపరంగానూ, ఒప్పందం పరంగానూ సెకీతో ఏపీ చేసుకున్న ఒప్పందానికి మాత్రమే ఐఎస్‌టీఎస్‌ చార్జీల మాఫీతో పాటు భవిష్యత్తులో జరిగే ఎలాంటి మార్పుల వల్లనైనా ఎలాంటి ఇతర చార్జీలు పడవని స్పష్టమవుతోంది.

సీఈఆర్‌సీ కూడా స్పష్టం చేసింది
2023 ఫిబ్రవరి 7న సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమీషన్‌ అంతర్‌ రాష్ట్ర ప్రసార ఛార్జీలు, నష్టాల భాగస్వామ్యం నిబంధనలపై నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఉత్పత్తి కేంద్రాల నుంచి వచ్చే విద్యుత్‌కు ఎక్స్‌ప్రెస్‌ నిబంధనలను అందులో రూపొందించింది. వాటి ప్రకా­రం సీఓడీతో సంబంధం లేకుండా రెన్యూవబుల్‌ పవర్‌ పర్చేజ్‌ ఆబ్లిగేషన్‌ (ఆర్పిఓ) ఉన్న సంస్థలకు ఐఎస్‌టీఎస్‌ చార్జీల మినహాయింపు 25 ఏళ్ల పాటు లభిస్తుంది.

రాష్ట్రంలో పెడితేనే భారం
నిజానికి రాష్ట్రంలో 6,400 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తే స్టేట్‌ నెట్‌వర్క్‌ పెంపుదల అనివార్యమని, అందుకు వ్యయం రూ.2,600 కోట్లు అవుతుందని ఏపీపీసీ కమిటీ తేల్చి చెప్పింది.  అంతేకాకుండా 6,400 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే, అంతర్‌ రాష్ట్ర గ్రిడ్‌తో అనుసంధానం చేయడం వల్ల రూ.1,021 కోట్ల అదనపు ఐఎస్‌టీఎస్‌ (ఇంటర్‌ స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ సిస్టమ్‌) ఛార్జీలు ఏటా పడతాయని కమిటీ సూచించింది. 

అదే 6,400 మెగావాట్ల నుంచి ఉత్పత్తి 10,092 మిలియన్‌ యూనిట్లకు పెరిగితే అప్పుడు ఐఎస్‌టీఎస్‌ చార్జీలు యూనిట్‌కు దాదాపు రూ.1 చొప్పున చెల్లించాల్సి వస్తుంది. సెకీ నుంచి విద్యుత్‌ను తీసుకోవడం వల్ల ఇవేవీ ఉండవు. రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంలు, అంతిమంగా ప్రజలపైనా భారం తగ్గుతుంది. రాష్ట్ర ప్రసార మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి అయ్యే వ్యయాన్ని భరించాల్సిన అవసరం తప్పుతుంది.

సెకీతోనే అనేక ప్రయోజనాలు
రాష్ట్రంలోనే సౌరవిద్యుత్‌ ఉత్పత్తి చేసి, రైతులకు ఇవ్వాలని, ఏపీ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీజీఈసీఎల్‌) ద్వారా 6400 మెగావాట్ల ప్రాజెక్టుల కోసం టెండర్లు సైతం పిలిచారు. కానీ దానిని రాజకీయ కారణాలతో కొందరు అడ్డుకున్నారు. అదే సమయంలో అంతర్రాష్ట్ర విద్యుత్‌ సరఫరా ఛార్జీల భారం లేకుండా యూనిట్‌ రూ.2.49 చొప్పున అతి చవక ధరకు విద్యుత్‌ను సరఫరా చేస్తామంటూ కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ పర్యవేక్షణలో ఏర్పాటైన సెకీ తనకు తానుగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన లేఖ పంపింది. 

దానిపై కమిటీ వేసి మరీ అధ్యయనం చేసిన తరువాత, ఏపీఈఆర్‌సీ అనుమతితో అత్యంత పారదర్శకంగా ప్రభుత్వం ఒప్పందం కుదర్చుకుంది. దీనివల్ల రాష్ట్రంలో పెట్టాలనుకున్న ప్రాజెక్టుకు అయ్యే రూ.2,600 కోట్ల వ్యయం ఆదా అయ్యింది. ఆ ప్రాజెక్టుకు కేటాయించాల్సిన భూమి కూడా మిగిలింది. 

అంతేకాకుండా అతి తక్కువ ధరకు లభిస్తుండటంతో రాష్ట్ర ఖజానాపై సబ్సిడీ భారం కూడా తగ్గుతుంది. అదనంగా ఐఎస్‌టీఎస్‌ చార్జీల నుంచి మినహాయింపు సైతం వచి్చంది. సెకీ నుంచి విద్యుత్‌ను తీసుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలుంటే టీడీపీ, దాని కరపత్రిక ఈనాడుకు మాత్రం ఇవేవీ కనిపించడం లేదు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement