
ఇంటర్ నుంచి సెట్స్ వరకు వరుసగా వార్షిక పరీక్షలు
అన్ని పరీక్షలకు కలిపి 24.50 లక్షల మంది విద్యార్థులు
మార్చి 1 నుంచి జూన్ మూడో వారం వరకు ఎగ్జామ్స్
1 నుంచి ఇంటర్ పరీక్షలు.. రాసే విద్యార్థులు 10.59 లక్షల మంది
మార్చి 17 నుంచి టెన్త్ ఎగ్జామ్స్.. రాసే వారు 6.49 లక్షల మంది
ఆ తర్వాత పలు ప్రవేశ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పరీక్షల సీజన్ వచ్చేసింది. వార్షిక పరీక్షలతో పాటు ప్రవేశ, పోటీ పరీక్షలు వరుసగా జరగనున్నాయి. దాదాపు 24.50 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. విద్యా సంవత్సరంలో 10 నెలలపాటు నేర్చుకున్న అంశాలను పేపర్‌పై పెట్టి, ప్రతిభను పరీక్షించుకోనున్నారు. మార్చి ఒకటో తేదీన ఇంటర్మీడియట్ పరీక్షలతో మొదలై.. పదో తరగతి, జేఈఈ మెయిన్స్–2, అడ్వాన్స్‌డ్, ఈసెట్.. తదితర పదుల సంఖ్యలో సెట్లు జూన్ మూడో వారం వరకు దాదాపు మూడున్నర నెలల పాటు జరుగుతాయి.
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ గురువారంతో ముగిశాయి. మార్చి 1 నుంచి 20 వరకూ ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం థియరీ పరీక్షలు జరుగుతాయి. ఇంటర్ పరీక్షలు చివరలో ఉండగానే పదో తరగతి పరీక్షలు మార్చి 17న మొదలై 31 వరకు సాగుతాయి. ఇంటర్ పూర్తి చేసిన ఎంపీసీ, బైపీసీ విద్యార్థుల్లో సగం మందికి పైగా ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఏపీఈఏపీ సెట్‌కు హాజరవుతారు. ఎంపీసీ విద్యార్థులు ఐఐటీలు, జాతీయ ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్లు సాధించేందుకు జేఈఈకి హాజరవుతారు.
ఇప్పటికే జేఈఈ తొలి విడత సెషన్ పూర్తవగా, రెండో విడత ఏప్రిల్ 1 నుంచి 8 వరకూ జరుగుతుంది. ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ మే 18న జరుగుతుంది. ఇక డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికీ వరుస పరీక్షలున్నాయి. ఐసెట్, పీజీఈసెట్, ఈసెట్, ఎడ్‌సెట్, లాసెట్... వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే యూజీ, పీజీ నీట్... ఇలా జూన్ మూడో వారం వరకూ పరీక్షలే పరీక్షలు. ఇంటర్‌లో పబ్లిక్ పరీక్షలకు 10.59 లక్షల మంది విద్యార్థులు హాజరవుతుండగా, పదో తరగతి పరీక్షలకు రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు 6.49 లక్షల మంది సిద్ధమవుతున్నారు.
ఇతర సెట్స్‌తో పాటు అన్ని పరీక్షలకు రాష్ట్రంలో సుమారు 24.50 లక్షల మందికి పైగా హాజరు కానున్నారు. విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయడంలో తల్లిదండ్రులు, 3లక్షల మంది ఉపాధ్యాయులు ఎంతో కృషి చేస్తారు. ఈ లెక్కన దాదాపు 70 లక్షల మందికి ఇది పరీక్షా కాలమనే చెప్పాలి. వీరితోపాటు పరీక్ష కేంద్రాలకు ప్రశ్న పత్రాలు పంపడం నుంచి వాటిని మూల్యాంకన కేంద్రాలకు చేరవేసే వరకూ ప్రభుత్వ యంత్రాంగానికి సవాలే. విద్య, వైద్యం, రెవెన్యూ, రవాణా, పోలీస్... ఇలా అన్ని శాఖలకు కూడా ఇది పరీక్షా కాలమే.
తెలంగాణలో 25 లక్షల మంది
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సుమారు 25 లక్షల మంది విద్యార్థులు పరీక్షల పోరుకు సిద్ధమవుతున్నారు. వీరికి అండగా నిలిచే తల్లిదండ్రులు, పరీక్షల సమరానికి సిద్ధం చేసే అధ్యాపకులు, ఇతరులు కలిపి మరో కోటి మంది ఈ క్రతువులో భాగస్వాములవుతారని అంచనా.
పరీక్షల సమయంలో పిల్లలకు అందుబాటులో ఉండేందుకు తల్లిదండ్రులు సెలవులు పెట్టడం లాంటి ఏర్పాట్లు చేసుకుంటుంటే, విద్యాసంస్థలు ప్రత్యేక తరగతులు, మోడల్ టెస్టులతో విద్యార్థులను సన్నద్ధం చేయడంలో నిమగ్నమయ్యాయి. తెలంగాణలో ఇంటర్ పరీక్షలు మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు, టెన్త్ పరీక్షలు మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగనున్నాయి.
ఈఏపీ సెట్ ఏప్రిల్ 29, 30 (అగ్రికల్చర్, ఫార్మా), మే 2 నుంచి 5 (ఇంజనీరింగ్) వరకు జరగనున్నాయి. ఐసెట్ జూన్ 8, 9 తేదీల్లో, పీజీఈసెట్ జూన్ 16 నుంచి 19 వరకు, ఈసెట్ మే 12, ఎడ్‌సెట్ జూన్ 1, లాసెట్ జూన్ 6న జరుగుతాయి. పీఈసెట్ జూన్ 11, 14 తేదీల్లో నిర్వహిస్తారు.

Comments
Please login to add a commentAdd a comment