‘వంద శాతం జాబ్ గ్యారెంటీ’, ‘100 శాతం సెలెక్షన్’ వంటి అసత్య ప్రకటనలతో, అబద్ధాలతో అభ్యర్థులను తప్పుదోవ పట్టిస్తున్న కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచి్చంది. ఇలాంటి మోసపూరిత, తప్పుడు ప్రకటనలు ఇస్తే కఠిన చర్యలు తప్పవని పేర్కొంది.
ఈ మేరకు వివిధ పోటీ పరీక్షలకు, ఉద్యోగ నియామక పరీక్షలకు శిక్షణ ఇచ్చే కోచింగ్ కేంద్రాలు తప్పుడు హామీలు ఇవ్వకుండా చర్యలు చేపట్టింది. మోసపూరిత హామీలతో అభ్యర్థులను ఏమార్చవద్దని వాటిని హెచ్చరించింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది. – సాక్షి, ఏపీ,సెంట్రల్ డెస్క్
ఈ ఏడాది 6,980 ఫిర్యాదులు
కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ (సీసీపీఏ)కు వివిధ పోటీ పరీక్షలకు, ఉద్యోగ నియామక పరీక్షలకు శిక్షణ ఇస్తున్న కేంద్రాలపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని కేంద్రం పేర్కొంది. ఫ్యాకల్టీ లేకపోయినా ఉన్నట్లు మభ్యపెట్టడం, తక్కువే సీట్లే ఉన్నాయని.. త్వరపడకపోతే సీట్లు అయిపోతాయని అభ్యర్థులపై ఒత్తిడి తేవడం, గతంలో వచి్చన ర్యాంకుల ఆధారంగా ఎక్కువ ఫీజులు వసూలు చేయడం, తప్పుడు, మోసపూరిత హామీలు ఇవ్వడం వంటి ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది.
ఇలా 2021–22లో 4,815, 2022–23లో 5,351, 2023–24లో 16,276, ఈ ఏడాది ఇప్పటివరకు 6,980 ఫిర్యాదులు అందినట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఫిర్యాదులు ఎదుర్కొంటున్న కోచింగ్ సంస్థలకు సీసీపీఏ 54 నోటీసులు పంపింది. వీటికి రూ.54.60 లక్షలు జరిమానా కింద విధించింది. 2023 సెపె్టంబర్ 1 నుంచి ఈ ఏడాది ఆగస్టు 31 వరకు రూ.1.15 కోట్లను విద్యార్థులకు పరిహారంగా ఇప్పించింది.
తప్పుడు ప్రకటనలు ఇచ్చే కోచింగ్ సంస్థలపై కఠిన చర్యలు ఉండాలి
తప్పుడు ర్యాంకుల ప్రకటనలు ఇచ్చే కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. వాటికి జరిమానాలు విధించడం వల్ల ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం నెరవేరదు. యావజ్జీవ శిక్షకు తగ్గకుండా కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలపై చర్యలు ఉండాలి. అలాగే తమ సంస్థల్లో శిక్షణ తీసుకున్నట్టు చెప్పాలని ర్యాంకులు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయా కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు డబ్బులు ఇస్తాయి.
క్లాస్ రూం కోచింగ్ ఒకరి వద్ద, ఆన్‌లైన్ కోచింగ్ ఇంకొకరి వద్ద, మెటీరియల్/బుక్స్ మరొకరి వద్ద తీసుకున్నామంటూ ఆయా సంస్థల డబ్బులకు ఆశపడి అబద్ధాలు చెప్పే విద్యార్థులు, వారి తల్లిదండ్రులపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. యాజమాన్యాల డబ్బులకు ఆశపడి అనేక కో చింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకున్నామని చెబితే వా రిపై చర్యలు తీసుకోవాలి.
మీడియా కూడా తప్పు డు ప్రకటనల పట్ల జాగరూకతతో ఉండాలి. గతంలో ర్యాంకులు సాధించిన అభ్యర్థుల హా ల్‌టికెట్లను పరిశీలించాకే వారి గురించి ప్రచురించేవి. ఇప్పుడు కూడా ఇలాగే వ్యవహరించాలి. తప్పుడు ప్రకటనలు ఇచ్చే కోచింగ్ సంస్థల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటే అసలు నిజాలు తెలుస్తాయి. – కె.లలిత్ కుమార్, జేఈఈ కోచింగ్ నిపుణులు, ఎడ్యుగ్రామ్360.కామ్
తప్పుదోవ పట్టించే ప్రకటనలకు అడ్డుకట్ట..
కోచింగ్ కేంద్రాలు ఉద్దేశపూర్వకంగా అభ్యర్థుల వద్ద కొంత సమాచారాన్ని దాస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కేంద్రం తెలిపింది. శిక్షణా కేంద్రాలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని.. అయితే వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు నష్టపోకుండా తాజా మార్గదర్శకాలు జారీ చేశామని కేంద్రం వెల్లడించింది. అభ్యర్థులను తప్పుదోవ పట్టించే ప్రకటనలకు అడ్డుకట్ట వేయడమే తమ ఉద్దేశమని స్పష్టం చేసింది.
తమ మార్గదర్శకాలు అభ్యర్థులకు గైడెన్స్, విద్యాపరమైన మద్దతు, ట్యూటరింగ్, స్టడీ ప్రోగ్రామ్స్, విద్యకు సంబంధించిన ప్రకటనలకు వర్తిస్తాయని స్పష్టతనిచి్చంది. కౌన్సెలింగ్, థియేటర్ ఆర్ట్స్, క్రీడలు, డ్యాన్స్, ఇతర సృజనాత్మక కార్యక్రమాలకు వర్తించవని తెలిపింది.
కోచింగ్ సంస్థలకు మార్గనిర్దేశం చేసేందుకు ఈ మార్గదర్శకాలను జారీ చేస్తున్నామని వివరించింది. కోచింగ్ సెంటర్లు ఖచ్చితత్వంలో వ్యవహరించడం ద్వారా అభ్యర్థుల హక్కులను గౌరవించాలని పేర్కొంది. 50 మంది కంటే ఎక్కువ మందికి శిక్షణ ఇచ్చేసంస్థలకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని వెల్లడించింది.
కేంద్రం మార్గదర్శకాలు ఇవి..
» కోర్సు–వ్యవధి, అధ్యాపకుల వివరాలు, ఫీజులు–వాపసు (రిఫండ్) విధానాలు, ఎంపిక, పరీక్ష ఫలితాలు లేదా ఉద్యోగ నియామకం లేదా జీతం పెరుగుదలకు సంబంధించి మోసపూరిత హామీలను, ప్రకటనలను కోచింగ్ సంస్థలు ఇవ్వకూడదు.
» ఉద్యోగాలకు ఎంపికైన లేదా ర్యాంకులు సాధించిన అభ్యర్థుల రాతపూర్వక అనుమతి లేకుండా వారి పేర్లు, ఫొటోలు లేదా ఇతర సమాచారాన్ని శిక్షణ సంస్థలు ఉపయోగించకూడదు. అలాగే వారి సమాచారాన్ని సురక్షితంగా ఉంచాలి.
» సివిల్స్ రాసే అభ్యర్థుల్లో కొందరు ప్రిలిమ్స్, మెయిన్స్‌కు వారే సొంతంగా సిద్ధమవుతారు. ఇంటర్వ్యూకు మాత్రమే శిక్షణ తీసుకుంటారు. ఇందుకు సంబంధించి అభ్యర్థులకు కోచింగ్ సెంటర్లు ముందుగానే స్పష్టతనివ్వాలి.
» అభ్యర్థులకు వారి కోర్సుల గురించి స్పష్టమైన సమాచారాన్ని అందించాలి. వారి అభ్యంతరాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి.
» అభ్యర్థులకు కోచింగ్ సెంటర్లు తప్పనిసరిగా తమ సేవలు, వనరులు, సౌకర్యాలు, మౌలిక సదుపాయాల గురించి వివరించాలి.
» తాము అందిస్తున్న కోర్సులకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) వంటి సంస్థల గుర్తింపు ఉందని నిర్ధారించాలి.
» చట్టబద్ధంగా అనుమతి తీసుకున్న భవనాల్లో మాత్రమే శిక్షణ కేంద్రాలను నడపాలి.
» విద్యార్థులు లేదా అభ్యర్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను, ఇతర సౌకర్యాలను శిక్షణ కేంద్రాలు కల్పించాలి.
» కోర్సులు, కాలపరిమితి, అధ్యాపకుల అర్హతలు, ఫీజు, రిఫండ్ విధానాలు, ఫలితాలు, జాబ్ గ్యారెంటీ వంటి అంశాలపై తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వకూడదు.
» విద్యార్థులపై ఒత్తిడి తెచ్చేందుకు ‘కొన్ని సీట్లే మిగిలి ఉన్నాయి’ వంటి ప్రకటనలు ఇవ్వడం నిషిద్ధం.
» కోచింగ్ సెంటర్లకు ప్రచారం కల్పించే ముందు ఎండార్సర్లు వాటి ప్రకటనలను ధ్రువీకరించుకోవాలి.
» కోచింగ్ సెంటర్ల తరఫున ప్రచారం చేసే సినీ నటులు, ఇతర సెలబ్రిటీలు వారు చేసే ప్రకటనలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది.
» తప్పుడు ప్రకటనలు చేసినా, తప్పుదోవ పట్టించేలా ప్రకటనల్లో నటించినా కోచింగ్ సెంటర్లతోపాటు ప్రచారకర్తలూ బాధ్యత వహించాల్సి ఉంటుంది.
» ఇప్పటిదాకా.. ఏవైనా షరతులు ఉంటే చిన్నగా ‘‘స్టార్’’ గుర్తు పెట్టి.. ప్రకటన చివర్లో కనిపించీ, కనిపించకుండా వాటిని చూపించేవారు. ఇకపై ఇలా కుదరదు. ఏవైనా షరతులు ఉంటే ప్రకటన ఏ ఫాంట్ సైజులో ఉంటే అదే సైజులో షరతులను కూడా ప్రచురించాలి.
» తప్పుదోవ పట్టించే ప్రకటనలపై ఫిర్యాదు చేసేందుకు వీలుగా కోచింగ్ సెంటర్లు కచి్చతంగా జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి
ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment