
అమాంతం పెరిగిన ఐదు ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం
సచివాలయం, సీఎంవో, విభాగాధిపతుల కార్యాలయాల కోసం సీఆర్‌డీఏ టెండర్లు
చ.అడుగుకు రూ.8,981.56.. ఏకంగా రూ.4,688.82 కోట్ల ఖర్చు
2018లో ఇవే టవర్ల నిర్మాణం రూ.2,271.14 కోట్లకు అప్పగింత.. నాడు చ.అడుగు రూ.4,350.42 మాత్రమే
స్టీలు, సిమెంటు, నిర్మాణ సామగ్రి, ఇంధన ధరల్లో పెద్దగా మార్పు లేకున్నా నిర్మాణ వ్యయం భారీగా పెంపు
అప్పుడూ, ఇప్పుడూ డయాగ్రిడ్ విధానమే
ఈ లెక్కన నిర్మాణ వ్యయం పెరగడానికి అవకాశమే లేదంటున్న ఇంజనీరింగ్ నిపుణులు
అయినా చదరపు అడుగుకు రూ.4,631.14 చొప్పున నిర్మాణ వ్యయం పెంపు
మొత్తం రూ.2,417.68 కోట్లకు పెంచేయడంపై సర్వత్రా విస్మయం.. ఆదిలోనే ఇలా ఉంటే పూర్తయ్యే సరికి ఇక ఎంతకు పెరుగుతుందో!
ముగ్గురు బడా కాంట్రాక్టర్లకు ఒక్కో ప్యాకేజీ అప్పగించేలా ముఖ్యనేత కసరత్తు
పనులు అప్పగించగానే 10% మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లించి కమీషన్ల వసూళ్లకు సిద్ధం
ఆపై బిల్లుల చెల్లింపు సమయంలో పెంచిన అంచనా వ్యయం వసూలుకు స్కెచ్
2015లో తాత్కాలిక సచివాలయం నిర్మాణంలోనూ ఇదే రీతిలో దోపిడీ
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్ల నిర్మాణానికి చదరపు అడుగు రూ.8,981.56 చొప్పున రూ.4,688.82 కోట్లను కాంట్రాక్టుగా విలువగా నిర్ణయించి సీఆర్‌డీఏ(రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) టెండర్లు పిలవడంపై ఇంజనీరింగ్ నిపుణులు విస్తుపోతున్నారు. ఇదే ఐకానిక్ టవర్ల నిర్మాణ పనులను 2018 ఏప్రిల్ 26న చదరపు అడుగు రూ.4,350.42 చొప్పున రూ.2,271.14 కోట్లకు కాంట్రాక్టర్లకు అప్పగిస్తూ నాడు టీడీపీ సర్కారు ఒప్పందం చేసుకుందని గుర్తు చేస్తున్నారు. అప్పటితో పోల్చితే స్టీలు, సిమెంటు, నిర్మాణ సామగ్రి, ఇంధన ధరల్లో పెద్దగా మార్పులేదు. పోనీ.. నిర్మాణ పద్ధతి ఏమైనా మారిందా? అంటే అదీ లేదు. అప్పుడూ ఇప్పుడూ డయాగ్రిడ్ విధానమే. పైగా ఇసుక ఉచితం.
ఈ లెక్కన ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం పెరగకూడదు. కానీ.. 2018తో పోల్చితే చదరపు అడుగుకు ఏకంగా రూ.4,631.14 చొప్పున ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయాన్ని రూ.2,417.68 కోట్లు పెంచేశారు. దీన్నిబట్టి ఐకానిక్ టవర్ల టెండర్లలో భారీ గోల్‌మాల్ జరిగినట్లు స్పష్టమవుతోందని నిపుణులు తేల్చి చెబుతున్నారు. ముఖ్యనేత తన సిండికేట్‌లో ముగ్గురు బడా కాంట్రాక్టర్లు ఒక్కొక్కరికి ఒక్కో ప్యాకేజీ చొప్పున పనులు అప్పగించాలని నిర్ణయించారు. కాంట్రాక్టు విలువలో పది శాతాన్ని మొబిలైజేషన్ అడ్వాన్సుగా ముట్టజెప్పి అందులో 8 శాతాన్ని తొలి విడత కమిషన్‌గా రాబట్టుకుని.. ఆ తర్వాత ప్రతి బిల్లులోనూ పెంచిన అంచనా వ్యయాన్ని కమీషన్ రూపంలో రాబట్టుకోవడానికి ఎత్తులు వేస్తున్నారని పేర్కొంటున్నారు.
తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను 2015లో చ.అడుగు రూ.3,350 చొప్పున కాంట్రాక్టర్లకు అప్పగించి ఆ తర్వాత డిజైన్‌లలో మార్పు, పని స్వభావం మారిందనే సాకులతో చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున పెంచేశారు. ఈ లెక్కన ఇప్పుడు ఐకానిక్ టవర్ల నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం ఇంకెంతకు చేరుకుంటుందోనన్న చర్చ అధికారవర్గాల్లో జోరుగా సాగుతోంది.
డయాగ్రిడ్ విధానంలో నిర్మాణం..
సంప్రదాయ పద్ధతిలో భవనాలను కాలమ్స్ (నిలువు కాంక్రీట్ దిమ్మెలు), బీమ్స్ (అడ్డు కాంక్రీట్ దిమ్మెలు) నిర్మించి కాంక్రీట్‌తో శ్లాబ్ వేస్తారు. ఇటుకలతో గోడలు కట్టి సిమెంట్ ప్లాస్టింగ్ చేస్తారు. ఐకానిక్ టవర్ల(ఆకాశ హర్మ్యాలు)ను సంప్రదాయ పద్ధతిలో నిర్మించడం సాధ్యం కాదు. డయాగ్రిడ్ విధానంలో నిర్మించేలా ఫోస్టర్స్ అండ్ పార్టనర్స్ డిజైన్ చేసింది. డయాగ్రిడ్ విధానంలో కాలమ్స్, బీమ్స్‌ను ఒక మూల నుంచి మరో మూలకు కలుపుతూ కాలమ్స్ నిర్మిస్తారు. దీనివల్ల గాలి వేగాన్ని తట్టుకుని గురుత్వాకర్షణ శక్తితో ఉంటుంది.
అమరావతి ఐకానిక్ టవర్లలో నాలుగింటిని బీ+జీ+39 అంతస్తులతో.. జీఏడీ టవర్‌ను బీ+జీ+49 అంతస్తులతో 4,85,000 చదరపు మీటర్లు (52,20,496 చదరపు అడుగులు) నిర్మిత ప్రాంతంతో కడుతున్నారు. సచివాలయంలో 1, 2, 3, 4, జీఏడీ టవర్‌లో ఒక్కో అంతస్తు 47 మీటర్లు వెడల్పు, 47 మీటర్ల పొడవుతో 2,209 చదరపు మీటర్లు (23,777 చదరపు అడుగులు) నిర్మిత ప్రాంతంతో నిర్మించనున్నారు. ఇందులో 1,200 చదరపు మీటర్లు(12,916 చదరపు అడుగులు) నిర్మిత ప్రాంతాన్ని వినియోగించేలా నిర్మిస్తారు.
వాస్తవానికి చ.అడుగు రూ.2 వేలకు మించదు..!
సంప్రదాయ పద్ధతిలో నిర్మించినా.. డయాగ్రిడ్ విధానంలో నిర్మించినా నిర్మాణ వ్యయంలో పెద్దగా తేడా ఉండదని ఇంజనీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చదరపు అడుగుకు రూ.1,800 నుంచి రూ.2 వేల వరకూ వ్యయం అవుతుందని చెబుతున్నారు. డయాగ్రిడ్ విధానంలో అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గుతుందని పేర్కొంటున్నారు.
అయినా సరే.. 2018తో పోల్చితే ఐకానిక్ టవర్ల అంచనా వ్యయాన్ని రూ.2,417.68 కోట్లు పెంచేసి సీఆర్‌డీఏ టెండర్లు పిలవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. మొత్తం ఐదు ఐకానిక్ టవర్లను పరిశీలిస్తే.. సగటున చదరపు అడుగుకు రూ.8,981.56 చొప్పున కాంట్రాక్టు విలువగా నిర్దేశించినట్లు స్పష్టమవుతోంది. రాజధానిలో ఇప్పటివరకూ ఆమోదించిన టెండర్లను పరిగణలోకి తీసుకుంటే.. ఐకానిక్ టవర్ల పనులను కాంట్రాక్టు విలువ కంటే కనీసం 4.5 శాతం అధిక ధరకు టెండర్లలో నిర్మాణ సంస్థకు అప్పగించే అవకాశం ఉంది.
ఈ లెక్కన అంచనా వ్యయం నిర్మాణం ప్రారంభించక ముందే పెరగనుంది. గతంలో తాత్కాలిక సచివాలయ నిర్మాణాన్ని బట్టి చూస్తే.. ఐకానిక్ టవర్ల నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం ఇంకెంతకు చేరుకుంటుందో ఊహించుకోవచ్చని అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
నాడూ నేడూ అదే దోపిడీ..!
2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు కోట్లను ఎరగా వేసి.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ సాక్ష్యాధారాలతో సీఎం చంద్రబాబు తెలంగాణ సర్కార్‌కు దొరికిపోయారు. ఓటుకు కోట్లు కేసు భయంతో హైదరాబాద్ నుంచి రాత్రికి రాత్రే ఉండవల్లి కరకట్టలోని లింగమనేని అక్రమ బంగ్లాలోకి మకాం మార్చారు. ఆ తర్వాత అమరావతి నుంచి పాలన అంటూ ఆరు లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను చదరపు అడుగు రూ.3,350 చొప్పున రూ.201 కోట్లకు షాపూర్‌జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థలకు అప్పగించారు.
కానీ.. వాటి నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం ఏకంగా రూ.1,151 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున బిల్లులు చెల్లించారు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున కమీషన్లు చేతులు మారాయనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. షాపూర్‌జీ పల్లోంజీ సంస్థ నుంచి కమీషన్లు వసూలు చేసిన వ్యవహారంలో సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి అప్పట్లో ఐటీ శాఖకు పట్టుబడటం కలకలం రేపింది. ఇప్పుడు శాశ్వత సచివాలయం పేరుతో నిర్మిస్తున్న ఐకానిక్ టవర్ల నిర్మాణంలోనూ అదే తరహా దోపిడీకి తెరతీసినట్లు స్పష్టమవుతోంది.
సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం..
అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయంలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం డయాగ్రిడ్ విధానంలో ఐకానిక్ టవర్లు నిర్మించేలా పోస్టర్ అండ్ పార్టనర్స్– జెనిసిస్ ప్లానర్స్–డిజైన్ ట్రీ సర్వీస్ కన్సెల్టెంట్స్ సంస్థలు 2018లో డిజైన్లు రూపొందించాయి. ఆ పనులను 2018 ఏప్రిల్‌లో కాంట్రాక్టు సంస్థలకు టీడీపీ సర్కారు అప్పగించింది. పునాదులు అప్పట్లోనే పూర్తి కాగా మిగిలిన పనులకు సీఆర్‌డీఏ ఇప్పుడు టెండర్లు పిలిచింది.
» సచివాలయం 1, 2 టవర్లను బీ+జీ+39 అంతస్తులతో నిర్మించనున్నారు. ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.1,897.86 కోట్లుగా సీఆర్‌డీఏ అంచనా వేసింది. కాంట్రాక్టు విలువ రూ.1,698.77 కోట్లుగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. ఇదే పనులను 2018లో షాపూర్‌జీ పల్లోంజీ సంస్థకు రూ.932.46 కోట్లకు అప్పగించడం గమనార్హం.
» సచివాలయం 3, 4 టవర్లను బీ+జీ+39 అంతస్తులతో నిర్మించనున్నారు. ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.1,664.45 కోట్లుగా సీఆర్‌డీఏ అంచనా వేసింది. కాంట్రాక్టు విలువ రూ.1,488.92 కోట్లుగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. ఇదే పనులను 2018లో ఎల్ అండ్ టీ సంస్థకు రూ.784.62 కోట్లకు అప్పగించారు.
» ముఖ్యమంత్రి కార్యాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం సచివాలయంలో జీఏడీ టవర్‌ను బీ+జీ+49 అంతస్తులతో నిర్మించనున్నారు. ఈ పనుల అంచనా వ్యయాన్ని రూ.1,126.51 కోట్లుగా సీఆర్‌డీఏ అంచనా వేసింది. కాంట్రాక్టు విలువ రూ.1,007.82 కోట్లుగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. ఇదే పనులను 2018లో రూ.554.06 కోట్లకు ఎన్‌సీసీ సంస్థకు అప్పగించింది.