రూ.818 కోట్లతో లంప్సమ్ కాంట్రాక్టు విధానంలో టెండర్లకు సీఆర్‌డీఏ ఆహ్వానం
జీ+18 అంతస్తులతో 12 టవర్లలో 1,200 అపార్ట్‌మెంట్ యూనిట్లు
టెండర్ డాక్యుమెంట్‌ను తొలుత జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపిన ప్రభుత్వం
జ్యుడీషియల్ ప్రివ్యూ రద్దు చేసిన తర్వాత టెండర్లకు ఆహ్వానం
ప్రాజెక్టు వ్యయంలో 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్
సాక్షి, అమరావతి: అమరావతిలోని నేలపాడులో నిర్మించనున్న హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు చంద్రబాబు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. జ్యుడీషియల్ ప్రివ్యూ చట్టం అమల్లో ఉన్న సెప్టెంబర్ నెలలో ప్రభుత్వం ఈ ప్రాజెక్టు టెండర్ డాక్యుమెంట్‌ను జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపింది. కానీ అప్పటి నుంచి టెండర్లను ఆహ్వానించకుండా.. జ్యుడీషియల్ ప్రివ్యూ రద్దు చేసిన తర్వాత ఇప్పుడు సీఆర్‌డీఏ ద్వారా టెండర్లను ఆహ్వానించడం గమనార్హం.
అలాగే ఈ ప్రాజెక్టు వ్యయాన్ని రూ.720 కోట్ల నుంచి రూ.930 కోట్లకు పెంచుతూ ప్రభుత్వం ఇటీవల పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఇప్పుడు సీఆర్‌డీఏ ద్వారా ఈ ప్రాజెక్టుకు రూ.818.03 కోట్ల అంచనా వ్యయంతో లంప్సమ్ కాంట్రాక్టు విధానంలో టెండర్లను ఆహ్వానించింది.
ప్రాజెక్టు పూర్తికి 24 నెలల గడువు
ఈ ప్రాజెక్టులో భాగంగా జీ+18 అంతస్తులతో 12 టవర్లలో 1,200 అపార్ట్‌మెంట్ యూనిట్లు నిర్మించాలని టెండర్ డాక్యుమెంట్‌లో సీఆర్‌డీఏ పేర్కొంది. షేర్ వాల్ టెక్నాలజీ వినియోగం ద్వారా హ్యాపీనెస్ట్ రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపింది. అంతర్గత–బాహ్య విద్యుత్ పనులు, ప్లంబింగ్, శానిటరీ, అగ్నిమాపక పనులు, లిఫ్ట్‌లు, ల్యాండ్ స్కేపింగ్ తదితర పనులు చేపట్టాలని పేర్కొంది.
ఓపెన్ టెండర్ విధానంలో టెండర్లను ఆహ్వానించనున్నట్లు సీఆర్‌డీఏ తెలిపింది. టెండర్ దక్కించుకున్న సమయం నుంచి 24 నెలల్లోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ప్లంబింగ్, శానిటరీ, ల్యాండ్‌స్కేప్, ఫైర్ ఫైటింగ్, లిఫ్ట్‌లు, సెక్యూరిటీ వ్యవస్థ, ఎక్స్‌టర్నల్ డెవలప్‌మెంట్ తదితరాలను అంశాల వారీగా పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే పనులు పూర్తి చేసినప్పటి నుంచి మూడేళ్ల సమయాన్ని డిఫెక్ట్ లయబిలిటీగా సీఆర్‌డీఏ పేర్కొంది.
10% మొబిలైజేషన్ అడ్వాన్స్..
కాంట్రాక్టు వ్యయంలో 10శాతం మేర మొబిౖలెజేషన్ అడ్వాన్స్‌లు ఇచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం పనులు దక్కించుకున్న సంస్థలకు ముందుగానే పనుల విలువలో పది శాతం మేర మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వనున్నట్లు టెండర్‌లో పేర్కొంది. అంచనావ్యయానికి ఐదు శాతంలోపు కోట్ చేసిన టెండర్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది.
అంతకన్నా ఎక్కువ కోట్ చేసిన టెండర్లను తిరస్కరించనున్నట్లు వెల్లడించింది. టెండర్ల దాఖలుకు వచ్చే నెల 8 వరకు గడువు ఇచ్చింది. 8వ తేదీ సాయంత్రం సాంకేతిక బిడ్‌ను తెరవనున్నట్లు ప్రకటించింది. జనవరి 10న ఆర్థిక బిడ్‌ను తెరవనున్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment