ఐఐటీ, నీట్‌లో ర్యాంకుల కోసం శిక్షణ కేంద్రాల ఒత్తిడి
వారం వారం పరీక్షల పరుగులే
అంచనాలను అందుకోలేక తీవ్ర మానసిక వేదన
రాలిపోతున్న విద్యా కుసుమాలు..
రాజస్థాన్ తరహాలో ప్రత్యేక చట్టాలు అవసరమంటున్న నిపుణులు
సాక్షి, అమరావతి: ఐఐటీ, నీట్ లాంటి పోటీ పరీక్షల శిక్షణకు రాజస్థాన్‌లోని కోటా నగరం ప్రసిద్ధి చెందింది. అక్కడ ప్రతి ఇల్లూ ఓ శిక్షణ సంస్థే. కోటా ఇన్‌స్టిట్యూట్స్‌లో శిక్షణ తీసుకుంటే ర్యాంక్ గ్యారంటీ అనే ప్రచారం బలంగా ఉండడంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల విద్యార్థులు వస్తుంటారు. అయితే అక్కడి పరిస్థితులు ఎంత దయనీయంగా ఉంటాయో ఇతరులకు తెలియదు.
శిక్షణ కోసం కోటా వచ్చిన విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక గతేడాది 26 మంది ఆత్మహత్యకు పాల్పడగా ఈ ఏడాది ఇప్పటి వరకు 13 మంది ప్రాణాలు వదిలారు. వీరంతా 17–19 ఏళ్ల వయసువారే. ఇక సివిల్స్ శిక్షణకు బ్రాండ్ సిటీ లాంటి ఢిల్లీలో ఇటీవల ఓ పేరొందిన స్టడీ సర్కిల్‌ను వరద ముంచెత్తడంతో ముగ్గురు అభ్యర్థులు మృతి చెందారు.
తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి వీటికి భిన్నంగా ఏమీ లేదు. మన వద్ద కూడా అన్ని కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఇంటర్, పోటీ పరీక్షల్లో ర్యాంకుల కోసం విద్యార్థులపై ఇదే తరహా ఒత్తిడి నెలకొంది.
పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థ
కోచింగ్ సెంటర్ కంట్రోల్ అండ్ రెగ్యులేషన్ బిల్లు ఆధారంగా ప్రత్యేక చట్టాన్ని రాజస్థాన్ ప్రభుత్వం తేనుంది. శిక్షణ సంస్థలపై పర్యవేక్షణకు 12 మంది అధికారులతో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి నేతత్వంలో పాఠశాల, వైద్య, సాంకేతిక విద్య కార్యదర్శులు, డీజీపీ సభ్యులుగా ఉంటారు. కోచింగ్ సంస్థల ప్రతినిధులు కూడా సభ్యులుగా ఉంటారు. కోచింగ్ సెంటర్లు తమ వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి.
నిబంధనలు ఉల్లంఘిస్తే రెండుసార్లు వరకు జరిమానా, ఆ తరువాత సంస్థ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తారు. విద్యార్థి శిక్షణ మధ్యలో మానేస్తే దామాషా ప్రకారం ఫీజు రీఫండ్ చేయాల్సి ఉంటుంది. కోటాలో వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలపై అధ్యయనం అనంతరం ఐఐటీ, నీట్ ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ పేరుతో 16 ఏళ్లలోపు విద్యార్థులను చేర్చుకోవడం, సాధారణ పాఠశాలల్లో చేరిన వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించడంపై రాజస్థాన్ ప్రభుత్వం నిషేధం విధించింది.
బలవన్మరణాలు..
విశాఖ పీఎం పాలెంలోని ఓ కార్పొరేట్ స్కూల్‌లో ఈ ఏడాది జనవరిలో 9వ తరగతి చదివే ఓ విద్యార్థికి టెన్త్ పాఠ్యాంశాలు బోధిస్తూ టెస్టుల పేరుతో తీవ్ర ఒత్తిడికి గురి చేయడంతో భరించలేక ప్రాణాలు తీసుకున్నాడు. గతేడాది ఫిబ్రవరిలో తిరుపతి జిల్లా గూడూరులో ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో తనిఖీల సందర్భంగా రికార్డులు సమర్పించాలని యాజమాన్యం ఒత్తిడి చేయడంతో 21 ఏళ్ల విద్యార్థి హాస్టల్ భవనంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) గణాంకాలు 2021లో ఏపీలో 523 మంది విద్యార్థులు వివిధ కారణాలతో బలవన్మరణాలకు పాల్పడినట్లు వెల్లడిస్తున్నాయి. వాస్తవానికి ఈ సంఖ్య మూడింతలు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 2014 తరువాత 57 శాతానికి పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థులపై మార్కులు, ర్యాంకుల ఒత్తిడి పెరగడంతో అంచనాలను అందుకోలేక సగటున వారానికి ఒక్కరు ప్రాణాలు కోల్పోతున్నట్లు పేర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో రాజస్థాన్ తరహాలో ప్రత్యేక చట్టం తెచ్చి కార్పొరేట్ విద్యాసంస్థల వేధింపులను నియంత్రించాలని నిపుణులు సూచిస్తున్నారు. రాజస్థాన్‌లో ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయడంతో పాటు కోచింగ్ సెంటర్ల నియంత్రణకు ‘‘కంట్రోల్ అండ్ రెగ్యులేషన్ బిల్లు–2024’’ పెద్ద ముందడుగుగా భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment