విద్యార్థులు, ప్రజా సంఘాల డిమాండ్.. తిరిగి ఆన్‌లైన్‌లో నిర్వహించాలని వినతి
విశాఖ, తిరుపతిలో నిరసన ప్రదర్శనలు
విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని విజ్ఞప్తి
సీతమ్మధార (విశాఖ జిల్లా): నీట్ యూజీ – 2024 పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని విద్యార్థి, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. నీట్ పరీక్షల్లో అక్రమాలపై శుక్రవారం విశాఖ, తిరుపతిలో విద్యార్థులు, ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఈ పరీక్షను రద్దు చేయించి, తిరిగి నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని మంత్రులు, రాజకీయ నేతలను కోరాయి. నీట్‌లో అక్రమాలను నిరసిస్తూ విశాఖలోని జీవీఎంసీ వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్ద జన జాగరణ సమితి నేతలు, విద్యార్థులు ప్రదర్శన చేశారు.
ఈ పరీక్షలను రద్దు చేసి తిరిగి ఆన్‌లైన్‌లో నిర్వహించేలా రాష్ట్ర మంత్రి సత్యకుమార్ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని జన జాగరణ సమితి విశాఖ నగర కన్వీనర్ చింతపల్లి సునీల్‌కుమార్ డిమాండ్ చేశారు. నీట్ పరీక్షలో అక్రమాలపై పలు రాష్ట్ర్‌ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం బాధాకరమన్నారు. విద్యార్ధుల భవిష్యత్తును గాలికి వదిలేసిన రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
ఆరోగ్య, వైద్య, విద్య శాఖ మంత్రి సత్యకుమార్ ఇక్కడి విద్యార్థులకు కనీసం వివరణ ఇవ్వకుండా మౌనంగా ఉండడం తగదన్నారు. 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి నీట్ పరీక్షలో అక్రమాలపై ప్రధాని నరేంద్ర మోదీ తప్పనిసరిగా స్పందించి, స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. నీట్‌ను ఆన్‌లైన్‌లో మాత్రమే నిర్వహించేలా కేంద్రం ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భార్గవరెడ్డి, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు
తిరుపతి సిటీ: నీట్ పరీక్ష రద్దు కోరుతూ ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ పరీక్షను తిరిగి నిర్వహించాలని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే మల్లికార్జున డిమాండ్ చేశారు. నరేంద్ర మోదీ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని, కనీసం పరీక్ష పపర్ లీకేజిపై స్పందన లేదని మండిపడ్డారు.
కనీసం విద్యార్థులకు భరోసా ఇవ్వకుండా బాధ్యతా రాహిత్యంగా మాట్లాడారని అన్నారు. యుద్ధాలను ఆపగలిగే మోదీ పేపర్ లీకేజిని ఎందుకు ఆపలేకపోయారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షుడు యార్లపల్లి గోపి, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు షేక్ జావెద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment