Public associations
-
నీట్ పరీక్ష రద్దు చేయాలి
సీతమ్మధార (విశాఖ జిల్లా): నీట్ యూజీ – 2024 పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని విద్యార్థి, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. నీట్ పరీక్షల్లో అక్రమాలపై శుక్రవారం విశాఖ, తిరుపతిలో విద్యార్థులు, ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఈ పరీక్షను రద్దు చేయించి, తిరిగి నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని మంత్రులు, రాజకీయ నేతలను కోరాయి. నీట్లో అక్రమాలను నిరసిస్తూ విశాఖలోని జీవీఎంసీ వద్ద ఉన్న గాంధీ విగ్రహం వద్ద జన జాగరణ సమితి నేతలు, విద్యార్థులు ప్రదర్శన చేశారు. ఈ పరీక్షలను రద్దు చేసి తిరిగి ఆన్లైన్లో నిర్వహించేలా రాష్ట్ర మంత్రి సత్యకుమార్ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని జన జాగరణ సమితి విశాఖ నగర కన్వీనర్ చింతపల్లి సునీల్‌కుమార్ డిమాండ్ చేశారు. నీట్ పరీక్షలో అక్రమాలపై పలు రాష్ట్ర్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం బాధాకరమన్నారు. విద్యార్ధుల భవిష్యత్తును గాలికి వదిలేసిన రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఆరోగ్య, వైద్య, విద్య శాఖ మంత్రి సత్యకుమార్ ఇక్కడి విద్యార్థులకు కనీసం వివరణ ఇవ్వకుండా మౌనంగా ఉండడం తగదన్నారు. 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి నీట్ పరీక్షలో అక్రమాలపై ప్రధాని నరేంద్ర మోదీ తప్పనిసరిగా స్పందించి, స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. నీట్‌ను ఆన్లైన్లో మాత్రమే నిర్వహించేలా కేంద్రం ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భార్గవరెడ్డి, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దుతిరుపతి సిటీ: నీట్ పరీక్ష రద్దు కోరుతూ ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ పరీక్షను తిరిగి నిర్వహించాలని ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే మల్లికార్జున డిమాండ్ చేశారు. నరేంద్ర మోదీ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని, కనీసం పరీక్ష పపర్ లీకేజిపై స్పందన లేదని మండిపడ్డారు. కనీసం విద్యార్థులకు భరోసా ఇవ్వకుండా బాధ్యతా రాహిత్యంగా మాట్లాడారని అన్నారు. యుద్ధాలను ఆపగలిగే మోదీ పేపర్ లీకేజిని ఎందుకు ఆపలేకపోయారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సిటీ అధ్యక్షుడు యార్లపల్లి గోపి, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు షేక్ జావెద్ పాల్గొన్నారు. -
చంద్రబాబు = వంద దుర్యోధనులు
సాక్షి, అమరావతి: సాఫీగా సాగుతున్న పెన్షన్ల పంపిణీకి చంద్రబాబు నాయుడు, అయన అనుకూల వర్గాలు అడ్డు తగిలి వృద్ధుల ఉసురు తీస్తున్నాయని పలువురు మేధావులు, ప్రజా సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్, ఏపీ ఇంటిలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ‘సమాజ సేవలో వలంటీర్ల పాత్ర’ పై రాష్ట్ర స్ధాయి సదస్సు గురువారం జరిగింది. ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వివిఆర్ కృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన సదస్సులో వక్తలు తొలుత వలంటీర్లకు తమ సంఘీభావం తెలిపారు. పచ్చ బ్యాచ్ కుట్రల వల్ల మృతిచెందిన వృద్దులకు ఈ సందర్భంగా సంతాపం తెలిపారు. ఈ వ్యవస్థను విచ్చిన్నం చేయడానికి చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ లాంటివారు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు.. లోకేశ్ అడుగుపెడితే అరిష్టం ముఖ్య వక్తగా పాల్గొన్న ఏపీ తెలుగు అకాడమీ చైర్పర్సన్ డాక్టర్ నందమూరి లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ దివంగత ఎన్టీ రామారావు ప్రజల వద్దకు పాలన తేవాలని ప్రయత్నించగా దానిని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్ధ ద్వారా ఇంటి వద్దకే తెచ్చారన్నారు. 1660 లోనే కేంబ్రిడ్జి వలంటీర్ పదాన్ని విల్ అనే పేరుతో డిక్షనరీలో చేర్చారని, అమెరికా ప్రెసిడెంట్ కూడా వలంటీర్‌గా సేవ చేస్తారని, మన దేశంలో ఇన్నేళ్లలో ఎవరికీ రాని ఆలోచన జగన్మోహన్రెడ్డికి వచ్చిందన్నారు. సొంత బిడ్డలు కూడా చేయని సేవను వృద్ధులు, దివ్యాంగులకు జగన్ చేస్తుంటే పచ్చముఠాకు కళ్ళు కుట్టి రాక్షసంగా వ్యవహరించి వృద్ధులు, వికలాంగుల ఉసురు పోసుకున్నారన్నారు. వంద దుర్యోధనులను కలిపితే ఒక చంద్రబాబు అని, ఎన్నికల తర్వాత అతన్ని అడ్రస్ లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. పచ్చ ముఠాకు చెందిన అష్ట్రగహ కూటమి అరాచకాలను ఎండగట్టడానికి రాష్ట్ర మంతటా వైఎస్సార్సీపీ తరపున ప్రచారం చేస్తానని పేర్కొన్నారు. ‘నిమ్మగడ్డ’ ఓ శకుని ఇంటిలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు పి.విజయబాబు మాట్లాడుతూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శకుని లాగా వ్యవహరిస్తూ, పెన్షన్‌దారుల ఉసురు పోసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వలంటీర్లకు తాము అండగా ఉంటామని, వారి ప్రాధమిక హక్కులను కాలరాసే హక్కు ఎవరికీ లేదన్నారు. వలంటీర్లు ముందు ఈ దేశ పౌరులని, వారు తమ వాదనను స్వేచ్ఛగా వినిపించవచ్చని, తమ మద్దతును బహిరంగంగా తెలుపవచ్చని స్పష్టం చేశారు. ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.వి.ఆర్.కృష్ణంరాజు మాట్లాడుతూ, రాష్ట్రంలోని వలంటీర్ల వ్యవస్ధ సమర్ధవంతంగా పనిచేస్తూ దేశానికే ఆదర్శంగా మారిందన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల ద్వారా రాష్ట్ర ప్రజలకు ఇప్పటి వరకు సుమారు 3.66 కోట్ల పౌర సేవలందాయని తెలిపారు. బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ నరహరిశెట్టి జ్యోతి మాట్లాడుతూ వలంటీర్లను ప్రజా సేవకు దూరం చేయాలనుకోవడం అవివేకమని, రానున్న రోజుల్లో మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ సేవలు యధాతథంగా కొనసాగుతాయన్నారు. వలంటరీ వ్యవస్ధకు అంతర్జాతీయ ప్రశంసలు ప్రవాస భారతీయుడు వెంకట్ మేడపాటి మాట్లాడుతూ వలంటరీ వ్యవస్ధ పలు అంతర్జాతీయ సంస్ధల నుంచి ప్రశంసలు పొందిందని, ఇటువంటి వ్యవస్థ మరే రాష్ట్రంలో లేదన్నారు. వలంటీర్లు, పెన్షనర్లపై చంద్రబాబు దురాగతాలు రాష్ట్రానికి హెచ్చరిక లాంటిదన్నారు. ఈ పెత్తందార్లు తిరిగి అధికారంలోకి వస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుందని హెచ్చరించారు. రాజకీయ విశ్లేషకుడు ఎల్. శివరామప్రసాద్ మాట్లాడుతూ వలంటీర్లు సమర్ధవంతంగా పని చేస్తూ రూ. 85 వేల కోట్లు పంపిణీ చేశారన్నారు. వేల కోట్ల రూపాయలు వారి చేతుల మీదుగా పంపిణీ చేసినప్పటికీ ఎక్కడా పైసా దుర్వినియోగం కాలేదన్నారు. మారుతీ మహిళా సొసైటీ గౌరవ అధ్యక్షురాలు సునీతా లఖంరాజు మాట్లాడుతూ వలంటీర్లను ప్రజలు తమ కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో బ్యాంకింగ్ రంగ నిపుణులు ఎస్.ధనలక్ష్మి, నాయి బ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి తుళ్ళూరు సూరిబాబు, ఆటో డ్రైవర్స్ యూనియన్ ప్రతినిధి గోమతోటి వినోద్ పాల్, ఎమ్మార్పీఎస్ నేత మేడర సురేష్ తదితరులు ప్రసంగించారు. -
సంక్షేమాభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా ఏపీ
సాక్షి, అమరావతి: సంక్షేమాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మేధావులు, ప్రజా సంఘాల నాయకులు చెప్పారు. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతోందని కేంద్ర నివేదికలు చెబుతుంటే.. ప్రతిపక్షాలు, కొన్ని పత్రికలు మాత్రం అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఏపీ ఇమేజ్ను దెబ్బతీసే కుట్రలను పౌరసమాజం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని గత పాలకుల పాపాలు మరింత కష్టాల్లోకి నెట్టాయని చెప్పారు. బిల్డింగులు, పరిశ్రమలు, వంతెనలు కడితేనే అభివృద్ధి కాదని, సామాన్యుడి జీవనం బాగుపడాలని స్పష్టంచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సామాజిక న్యాయం దిశగా పయనిస్తోందన్నారు. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెటర్ ఫర్ ఏపీ సొసైటీ పేరుతో పౌరులకు వాస్తవాలను తెలియజేసేందుకు రూపొందించిన ‘ఆంధ్రప్రదేశ్ ప్రగతి నాడు–నేడు’ సమగ్ర నివేదికను శుక్రవారం విజయవాడలో విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన సదస్సులో పలువురు మేధావులు, ప్రజా సంఘాల నేతలు మాట్లాడారు. ‘ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు బేరీజు వేసుకుంటే మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. చిన్న రాష్ట్రం అయినప్పటికీ, దేశానికి ఆర్థిక శక్తిని అందించడంలో ఏపీ కీలకంగా మారింది. ఆర్బీఐ, నీతి ఆయోగ్, సోషియో ఎకనామిక్ రిపోర్టు.. ఇలా అన్ని నివేదికల్లో నాలుగేళ్లుగా ఏపీ సాధిస్తున్న వృద్ధి కనపడుతోంది. ఎటువంటి అవినీతికి తావు లేకుండా నాలుగేళ్లలో 3.26 లక్షల కోట్ల సంక్షేమాన్ని ప్రజలకు అందించడం చరిత్రలోనే ప్రథమం. ఫలితంగా పేదలు ఆర్థి క పరిపుష్టి సాధించారు. వారిలో కొనుగోలు శక్తి పెరిగింది. ఫలితంగా 16.22 శాతం స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటుతో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగుతోంది. దేశంలో అత్యధిక ప్రభుత్వ ఆస్పత్రులతో సామాన్య ప్రజలకు కార్పొరేట్ వైద్యం ఏపీలోనే లభిస్తోంది. పరిశ్రమల నెట్ అసెట్ విలువలో దక్షిణాదిన టాప్‌లో, ఫ్యాక్టరీల సంఖ్యలో దేశంలో నాలుగో స్థానం, చిన్న, మధ్య తరహా పారిశ్రామిక యూనిట్లలో రెండో స్థానం, ఎగుమతుల్లో 9 నుంచి 4వ స్థానానికి వచ్చింది. ఇంత అభివృద్ధి జరిగింది కాబట్టే.. 2018–19లో తలసరి ఆదాయం రూ.1.50 లక్షలు ఉంటే ఇప్పుడు 2.30 లక్షలకు పెరిగింది. పేదరికం 6.6 శాతానికి దిగివచ్చింది. కోవిడ్ సంక్షోభంలోనూ రాష్ట్రాన్ని సమర్థంగా నడిపించిన తీరు సీఎం జగన్ దార్శనికతకు అద్దం పట్టింది. సంక్షేమ పథకాలు లేకుంటే కోవిడ్ సమయంలో ప్రజా జీవనం తల్లకిందులయ్యేది. వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఏపీలో పరిశ్రమలకంటే వ్యవసాయంపైనే ఎక్కువ దృష్టి సారిస్తే మంచిది’ అని వారు వెల్లడించారు. ఈ సమావేశంలో నేత్ర వైద్యులు బి.సుబ్బారావు, వాకర్స్ ఇంటర్నేషనల్ డి్రస్టిక్ట్ గవర్నర్ రామలింగరాజు, లోక్‌సత్తా ఉద్యమ సంస్థ నగర అధ్యక్షుడు అశోక్ కుమార్, రిటైర్డు ప్రొఫెసర్ రెహా్మన్, సీనియర్ జర్నలిస్టు పీజీకే మూర్తి, సామాజికవేత్త అనంత హృదయరాజ్, గీతా విజన్ ట్రస్టు చైర్మన్ గీతా సుబ్బారావు, ఫోరం ఫర్ బెటర్ సొసైటీ కో–కన్వినర్ ఎస్.కోటేశ్వరరావు, తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, సిల్వెస్టర్, సామాజిక కార్యకర్త బి.జయప్రకాశ్ తదితరులు ప్రసగించారు. అంతకు ముందు కళాశాల విద్యార్థులకు ‘రాష్ట్రంలో నాడు–నేడు అభివృద్ధి’పై క్విజ్ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. అసత్యాలే వారికి ఆయుధాలు సమాజాన్ని పీడిస్తున్న ప్రధాన సమస్య ఫేక్ న్యూస్. ఏపీలో బాధ్యతాయుత మీడియా సైతం అభివృద్ధి లేదని ప్రచారం చేయడం సిగ్గుచేటు. నిత్యం పత్రికల్లో వచ్చే వార్తలను చూసి ఏపీ అభివృద్ధిపై వాస్తవాలు తెలుసుకునేందుకు అధ్యయనం చేశాం. మా పరిశీలనలో ఏపీ ఏ రంగంలోనూ వెనుకబడలేదు. – వీవీఆర్ కృష్ణంరాజు, అధ్యక్షుడు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ నాలుగు రెట్ల పారిశ్రామిక వృద్ధి ఆంధ్రప్రదేశ్ ప్రగతి పథంలో పయనిస్తుంటే తప్పుడు ప్రచారం చేసే మీడియాను అందరూ ఎండగట్టాలి. రాష్ట్రంలో గ్రామీణ ప్రజలను దృష్టిలో పెట్టుకుని పాలన సాగుతోంది. పారిశ్రామిక రంగం వృద్ధి గతంలో 3.2 శాతం ఉంటే ఇప్పుడు 12 శాతానికి పెరిగింది. ఒకప్పుడు 60 వేల ఎంఎస్ఎంఈలు ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 1.10 లక్షలకు చేరింది. 10 లక్షలకు పైగా ఉద్యోగులకు మేలు జరిగింది. 600 పెద్ద పరిశ్రమల్లో 6 లక్షలకు పైగా ఉపాధి వచ్చింది. – మేడపాటి వెంకట్, అధ్యక్షుడు, ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ సామాజిక మార్పుతోనే అభివృద్ధి సాధ్యం సామాజిక మార్పు ద్వారానే నిజమైన అభివృద్ధి సాధ్యం. జీడీపీ పెరిగిందంటే ప్రజా జీవనం బాగుపడినట్టే. రాష్ట్రంలో పేదరికం తగ్గింది. అంటే సామాజిక న్యాయం కచ్చితంగా జరిగింది. ప్రస్తుత ప్రభుత్వం గతేడాది ఏకంగా రూ.44 వేల కోట్లు సామాజిక న్యాయానికి ఖర్చు చేసింది. – ఏఆర్ సుబ్రహ్మణ్యం, అధ్యక్షుడు,నవ్యాంధ్ర ఇంటెలెక్చువల్ ఫోరం నిత్యం అప్పులంటూ విష ప్రచారం రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల కుప్పగా మార్చేస్తే.. సీఎం జగన్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. చంద్రబాబు రూ. 2.64 లక్షల కోట్లు అప్పు చేస్తే ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1.77లక్షల కోట్లు మాత్రమే అప్పు తెచ్చింది. కానీ, ఎల్లో మీడియా, ప్రతిపక్షాలు రూ.10 లక్షల కోట్లు అప్పు అంటూ దు్రష్పచారం చేయడం సిగ్గుచేటు. ఇప్పుడిస్తున్న సంక్షేమ పథకాలు గతంలో ఎన్నడూ లేవు. అప్పట్లో తెచ్చిన డబ్బంతా ఎటు పోయిందని ఎవరూ అడగట్లేదు. టీడీపీ హయాంలో సంపద పంపిణీ కొంత మంది చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ప్రజల చేతుల్లోకి వెళ్లింది. – పి.విజయ్‌బాబు, అధ్యక్షుడు, అధికార భాషా సంఘం సమానత్వం కోసం కృషి జరుగుతోంది స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇప్పుడు ఏపీలో సమానత్వం కోసం కృషి జరుగుతోంది. చంద్రబాబు 14 ఏళ్లలో ఒక్క ఇంటి పట్టా కూడా ఇవ్వలేదు. సీఎం జగన్ రూ.21 వేల కోట్లతో 30 లక్షలకు పైగా ఇళ్లు కట్టిస్తున్నారు. అసైన్డ్ భూములకు హక్కులు ఇచ్చారు. అమరావతిలో ఇప్పుడు 50 వేల ఇళ్ల పట్టాలతో రూ.3 లక్షల కోట్ల ఆస్తి రాబోతోంది. – మాదిగాని గుర్నాథం, అధ్యక్షుడు, సోషల్ డెమోక్రాటిక్ ఫ్రంట్ పేదల అభివృద్ధే నిజమైన సూచీ మనిషి జీవన ప్రమాణం పెరుగుదలే నిజమైన అభివృద్ధికి సూచీ. ఏపీపై కేంద్రం సవతి ప్రేమ చూపిస్తోంది. ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయి. సీఎం జగన్ మాత్రం పేదల సంక్షేమమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. పోర్టులు, ఎయిర్ పోర్టుల నిర్మాణం సాగుతోంది. కొత్తగా 17 వైద్య కళాశాలలు వస్తున్నాయి. – గౌతమ్‌రెడ్డి, చైర్మన్, ఏపీ ఫైబర్ నెట్ ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తీసుకెళ్లారు చంద్రబాబు హయాంలో దళితులు ఎంఎస్ఎంఈలు పెట్టుకోవాలంలే సబ్సిడీ వచ్చేది కాదు. కానీ, సీఎం జగన్ ఎంఎస్ఎంఈలను బలోపేతం చేశారు. ఒక్క కరోనాలోనే రూ. 2 వేల కోట్లు ఎంఎస్ఎంఈల కోసం ఖర్చు చేశారు. జగనన్న బడుగు వికాసం, ఇతర కార్యక్రమాల ద్వారా ఊపిరిపోశారు. దళితులను ఉద్యోగం చేసుకునే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి తీసుకెళ్లారు. – కాలే వెంకటరమణారావు, దళిత ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు -
కూర రాజన్నను విడుదల చేయాలి
సాక్షి, హైదరాబాద్: కూర రాజన్నను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని షోయబ్‌హాల్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించను న్నామని ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక నేతలు వంగల సంతోష్, పట్టోళ్ల నాగిరెడ్డి తెలిపారు. బొమ్మకంటి కొమురయ్య అధ్యక్షతన జరిగే ఈ భేటీకి ప్రొఫె సర్ హరగోపాల్, ప్రొఫెసర్ ఎల్.విశ్వేశ్వర్రావు, ఎస్.జీవన్ కుమార్, ఆచార్య కట్టా భగవంతరెడ్డి, విమలక్క, తదితరు లను ఆహ్వానిస్తున్నామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో బీజేపీ మినహా మిగిలిన రాజకీయ పార్టీలు, కార్మిక ప్రజా సంఘాలు, ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా విశాల ఉద్యమం నిర్మించాలని సదస్సు పిలుపునిచ్చింది. వచ్చే నెల మొదటి వారంలో విస్తృతంగా సంతకాలు సేకరించి బడ్జెట్ సమావేశాల నాటికి పార్లమెంటుకు కోటి సంతకాలు పంపాలని సదస్సు తీర్మానించింది. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర సదస్సు జరిగింది. ఉక్కు పరిశ్రమ పరిరక్షణే ధ్యేయంగా కోటి సంతకాల సేకరణ, జిల్లా వ్యాప్త సదస్సులు, భవిష్యత్ కార్యక్రమాలు రూపొందించాలని సదస్సులో తీర్మానించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు కె.ఎం. శ్రీనివాస్, ఆదినారాయణ మాట్లాడారు. ఏపీ ఎస్ఎఫ్ఎల్ చైర్మన్ పూనూరు గౌతంరెడ్డి, సీపీఎం పశ్చిమ కృష్ణా కార్యదర్శి డి.వి.కృష్ణ, కె.పోలారి (ఇఫ్టూ), నరహరశెట్టి నరసింహారావు, పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ జి.ఓబులేసు, సీఐటీయూ నాయకులు పి.అజయ్‌కుమార్, ఎం.వి.సుధాకర్, ఎ.వెంకటేశ్వరరావు, టి.తాతయ్య తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయ గోదాలో... ఓటర్లే ఈటెలు
తెలంగాణ ఏర్పడగానే ఇక ధర్నాచౌక్‌ల అవసరమే రాదని కేసీఆర్ అంటే, ధర్మగంట మోగగానే సెక్రటేరియట్ తలుపులు తెరుచుకొని సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయని ఉద్యమ సంఘాలు ఆశించినాయి. కానీ ఎన్కౌంటర్లు, లాకప్‌డెత్‌లు, సకల రంగాల్లో ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తెచ్చే ధర్నాచౌక్‌లో ధర్నాలకు అనుమతి నిరాకరించింది తెలంగాణ ప్రభుత్వం. కొంత షాక్‌కు గురయినా అందరం కోర్టు మెట్లెక్కి ప్రభుత్వానికి మొట్టికాయలు కొట్టిస్తే చాలా నెలల తరువాత అనుమతిని సాధించాం. అయినా ఒక్క నిరసన నినాదం మీడియా కంట కనబడకుండా ఆంక్షలు సాగుతూనే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ముందు వరుసలో ఉన్న తెలంగాణ ప్రజా ఫ్రంట్, విప్లవ రచయితల సంఘం, తెలంగాణ విద్యార్థి సంఘం, పౌరహక్కుల సంఘం, తదితర 16 సంఘాలు మార్చి 30న జీవో 73 జారీతో నిషేధానికి గురైనాయి. తెలంగాణ ప్రజా భద్రతా చట్టం 1992 ఉమ్మడి రాష్ట్రంలోని చట్టం. నిర్బంధాలు పోయి ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలని తెచ్చుకున్న స్వరాష్ట్రంలో తెలంగాణ సాధన సంఘాలే నిషేధానికి గురైనాయి. దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసనెదుర్కొంటున్న స్టాన్ స్వామి మరణానికి దారి తీసిన పరిస్థితుల్లో ప్రధానమైనది కుట్రపూరితంగా భీమ్ కోరేగామ్ కేసులో ఆయనను ఇరికించడం. స్టాన్ స్వామితో పాటు వరవరరావు, ప్రొఫెసర్ సాయి బాబా, రోనా విల్సన్ తదితరులను విడుదల చేయాలని ఈ 16 ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నాయనీ, శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా ఆంక్షలు విధిస్తున్నామనీ ప్రభుత్వం చెప్పింది. ఈ జీవో 73ను సవాలు చేస్తూ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో పౌర హక్కుల సంఘం, అమరుల బంధుమిత్రుల సంఘం పిటిషన్ వేయడం, కోర్టులు నోటీసు జారీ చేయడం జరిగింది. ఈ నిషేధాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తెలంగాణ ఇంటి పార్టీ 25 ఏప్రిల్ 2021 నాడు బహిరంగ లేఖ రాసింది. తెలంగాణలో మేధావులు, రచయితలు ఎంతో మంది ఇలా లేఖలు రాసినా కేసీఆర్ ప్రభుత్వ వైఖరిలో మార్పు రాలేదు. కానీ హుజూరాబాద్ ఉప ఎన్నికలు, కోర్టు మెట్లు నిషేధాన్ని ఎత్తివేయించగలిగాయి. ప్రజా సంఘాలపై నిషేధం ఇప్పట్లో ఎత్తివేయాలని కేసీఆర్ అనుకోలేదు. కాంగ్రెస్ శాసనసభా పక్షాన్నే టీఆర్ఎస్లో కలపడం, ఏ ప్రతిపక్షాన్నీ ప్రగతి భవన్ రానివ్వకపోవడం గమనించిందే. అన్ని రోజులు ఒకేలా ఉండవు. ప్రజా క్షేత్రంలో వ్యతిరేకతను వేగులు సరిగానే సమాచారం చేరవేసిండ్రు. దాని ఫలితమే ప్రగతి భవన్ నుండి భట్టి విక్రమార్క తదితరులకు ఫోన్, ఆహ్వానం, మరియమ్మ ఘటనపై విచారణ, ఆర్థిక సహాయం, మరునాడు దళిత సాధికారతపై చర్చ, అనేక తాయిలాల ప్రకటన. ఎవరేమి అను కున్నా ఇవన్నీ తరుముకొస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక, ఓటర్లు విసిరే ఈటెల ముప్పుగానే భావిం చాలి. ఎన్నో రాస్తారోకోలు, బంద్‌లు చేసినా మరింత నిర్బంధం తప్ప ముందుకుపోని స్థితి నుండి, ఒక ఉప ఎన్నికతో ఎన్నో సానుకూల ఫలితాలు వచ్చాయి. నిషేధించిన 16 సంస్థల్లో ఒకటైన పౌర హక్కుల సంఘం రాష్ట్ర మహాసభల్లో కేసీఆర్ తనను సంఘం అధ్యక్షుడిని చేస్తే పౌర హక్కుల కోసం పోరాడుతాన న్నారు. ప్రతిపక్షాలుగా ఉన్నప్పుడు భావ స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛపై ఉపన్యాసాలు ఇచ్చినవాళ్లు, అధికారంలోకి రాగానే నియంతలుగా అవతారమెత్తితే ఓటరు విసిరే ఈటెలకు గాయాల పాలుకాక తప్పదు. ఓపికగా ఉద్యమాలను కొనసాగించడమంటే అది మితవాద వైఖరిగా, జావగారిపోయిన తీరుగా, జబ్బలు జారవేసిన తీరుగా భావించడం, ముద్ర వేయడం ప్రజలకు ఎంతో నష్టం కలిగించింది. ప్రపం చంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశాల్లో ఒకటైన మన దేశం పత్రికా స్వేచ్ఛలో 142వ స్థానంలో ఉండడం యాదృచ్ఛికం ఏమీ కాదు. స్టాన్ స్వామిలాంటి ఆక్టోజె నేరియన్ను మన వ్యవస్థల నిష్క్రియాపరత్వంతో ఆక్టో పస్లా చుట్టుముట్టి అంతం చేస్తే మూల్యం భవిష్యత్తు తరాలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మూల్యం ఎన్ని కల్లో ఓటర్లు విసిరే ఈటెల కంటే పెద్దది. వ్యాసకర్త డా. చెరుకు సుధాకర్ తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు మొబైల్ : 98484 72329 -
బాబు ప్రోద్బలంతో నిమ్మగడ్డ దుస్సాహసం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంక్షేమాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యూహాత్మకంగా కుట్రలు పన్నుతున్నారని వివిధ సంఘాల నేతలు ధ్వజమెత్తారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాన్ని వారు తప్పుపడుతున్నారు. రాజకీయ పార్టీల నేతలతో కనీసం సంప్రదించకుండా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఏకపక్షంగా ప్రకటించడం సరికాదంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై వ్యక్తిగతంగా ద్వేషం పెంచుకున్న నిమ్మగడ్డ.. చంద్రబాబు ప్రోద్బలంతో ఇటువంటి దుస్సాహసాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గత ఏడాది ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి ఎవరినీ సంప్రదించకుండా నిమ్మగడ్డ వాయిదా వేశారని.. ఇప్పుడు ఎన్నికలకు సరైన సమయం కాదని అన్ని వర్గాల వారు చెబుతున్నా వినకుండా అడుగులు వేస్తున్న రమేశ్‌కుమార్‌ను నడిపిస్తున్నది ప్రతిపక్ష పార్టీయేనని ఆ నేతలు వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం పండుగలా కొనసాగుతోందని.. 11న అమ్మఒడి పథకం కింద డబ్బులు చెల్లించే కార్యక్రమం జరగనుందని.. ఇవి ప్రజలకు అందకుండా చేసేందుకే పన్నాగాలు పన్నుతున్నారని వారు ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీరుపై శనివారం వివిధ సంఘాల నాయకులు ఏమన్నారంటే.. నిమ్మగడ్డపై సుమోటోగా కేసు పెట్టాలి రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ చంద్రబాబు దర్శకత్వంలో నిమ్మగడ్డ రమేశ్‡ యాక్షన్ చేస్తున్నారు. ఈయనపై హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలి. సంక్షేమ పథకాలను ముందుకు సాగనివ్వకుండా చేయాలని.. ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. – డేరంగుల ఉదయకిరణ్, జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు సీఎం సంకల్పాన్ని అడ్డుకోలేరు అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందాలన్న సీఎం జగన్ సంకల్పాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు. ప్రభుత్వాన్ని శాసిస్తానంటూ అడుగులు వేస్తున్న రమేశ్‌కు గుణపాఠం తప్పదు. – ఎ.సూరిబాబు, చైర్మన్, కళింగ వైశ్య కార్పొరేషన్ చంద్రబాబు కుట్రలు సాగవు సంక్షేమాన్ని అడ్డుకునేందుకు నిమ్మగడ్డను టీడీపీ వాడుకుంటోంది. చంద్రబాబు కుట్రలు వైఎస్ జగన్ పాలనలో సాగవు. – వడిత్యా శంకర్‌నాయక్, జాతీయ అధ్యక్షుడు, గిరిజన ప్రజా సమాఖ్య -
‘ఇన్నేళ్లు అద్దె రాజధానిలో ప్రజలు గడిపారు’
సాక్షి, విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అభివృద్ధి వికేంద్రీకరణను ప్రజా సంఘాల జేఏసీగా స్వాగతిస్తున్నామని ఏపీ ప్రజా సంఘాల జేఏసీ నేత జేటీ రామారావు అన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల వెనకబాటును గుర్తించి ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. ఏపీ ప్రజా సంఘాల జేఏసీ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ లాంటి మహా నగరాన్ని వదిలి వచ్చినా ఢిల్లీ పెద్దలు ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు ఒక్క ప్యాకేజీ కూడా ఇవ్వలేదని విమర్శించారు. కనీసం వెనుకబాటు అధ్యయనానికి ఒక్క కమిటీ, కమీషన్ గానీ వేయలేదని పేర్కొన్నారు. మద్రాస్, కర్నూలు, అమరావతిలో అద్దె రాజధానిలో ఉత్తరాంధ్ర ప్రజలు గడిపారని, విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించడంతో సొంత ఇంటికి వచ్చినంత ఆనందంగా ఉందన్నారు. బడుగు, బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. అమరావతి రైతులకు తాము వ్యతిరేకం కాదని జేటీ రామారావు స్పష్టం చేశారు. రాష్ట్ర నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాగతించి ఏపీకి ప్రాజెక్టులు,వెనుకబడి ప్రాంతాలు ప్యాకేజీలు ఇచ్చి ఏపీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. విశాఖపట్టణాన్ని రాజధానిగా ప్రకటించాలని శివరామకృష్ణ కమిటీ, శ్రీకృష్ణ కమిటీకి వినతి పత్రాలు ఇచ్చామన్నారు. కమీటీ సిఫార్సులపై చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీలో చర్చ పెట్టకపోగా సిఫార్సులు చట్టబుట్టలో వేశారని మండిపడ్డారు. ఉత్తరాంధ్రకు రాజధాని వస్తే వంశధారా, పోలవరం ప్రాజెక్టుల సమస్యలు తొలిగిపోతాయని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారని, 70 సంవత్సరాల తరువాత ఉత్తరాంధ్ర వాసుల కల నెరవేరుతుందని ఆనందం వ్యక్తం చేశారు. 1956 విశాఖకు ఆంధ్రాయూనివర్సిటీ,1971లో స్టీల్ ప్లాంట్,2020 లో సీఎం జగన్ పుణ్యమా అని ఎగ్జిగుటివ్ రాజధాని వస్తుందన్నారు. అధికార వికేంద్రీకరణను స్వాగతిస్తున్నామని తెలిపారు. ఎంతో మంది ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు మారినా.. ఉత్తరాంధ్ర తలరాత మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా ‘‘శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాయలసీమకు హైకోర్టు ఇవ్వడం న్యాయం. హై కోర్టు బెంచ్‌లతో అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుంది. అప్పుడు కల్పింది జవహర్ లాల్ నెహ్రు, ముంచింది ఇందిరాగాంధీ, రాచి రంపాన పెట్టింది సోనియా గాంధీ, నటిస్తున్నది నరేంద్రమోదీ. ఇంత బాధలో సైతం నేను ఉన్నానని ముందడుగు వేసింది వైఎస్ జగన్మోహన్రెడ్డి. జీయన్ రావ్, బోస్టన్ కమీటీలు అద్భుతమైన గ్రౌండ్ రియాలిటీ తో రిపోర్ట్స్ ఇస్తున్నారు. ఏసీ గదుల్లో కూర్చుని తయారు చేసినవి కావు ఆ నివేదికలు. వైఎస్ జగన్‌కు ప్రజలు ఇచ్చిన వినతి పత్రాలే జీవోలుగా చట్టాలవుతున్నాయి. చంద్రబాబు వినతి పత్రాలు ఏనాడు అయినా తీసుకున్నాడా.. ఆయన పాలనలో అరెస్టులు, బైండోవర్లే సరిపోయాయి. ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకున్న వారికి సమస్యలు తెలుస్తాయి. చంద్రబాబు అమరావతి అంటూ అక్కడి రైతులను మభ్యపెట్టారు. వంశధార ప్రాజెక్టు, భూమాలు కోల్పోయిన, స్టీల్ ప్లాంట్ కు భూముల ఇచ్చిన వారికి ఇప్పటికీ న్యాయం జరగలేదు. ఇప్పటికే 3 తరాలు నష్టపోయాయి. వాటి గురించి చర్చించరు. ఎందుకు...? పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా ఉత్తరాంద్ర అభివృద్ధి అడ్డం పడవద్దని కోరుతున్నాము. అమరావతిలో అసెంబ్లీ ఉంటుంది. రాష్ట్రంలోని అందరూ ఎమ్మెల్యే లు అక్కడికి వస్తారు’’ అని జేఏసీ నేత జేటీ రామారావు స్పష్టం చేశారు. -
లింగయ్య మృతదేహానికి రీపోస్టుమార్టం
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి మార్చురీలో సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రీజనల్ కార్యదర్శి లింగయ్య మృతదేహానికి శుక్రవారం రీపోస్టుమార్టం నిర్వహించారు. గత నెల 31న లింగయ్యను పోలీసులు బూటకపు ఎన్కౌంటర్లో చంపేశారంటూ ఆరోపిస్తూ రాష్ట్ర పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ అత్యవసర ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేయడంతో లింగయ్య మృతదేహానికి రీపోస్టుమార్టం చేయాలని హైకోర్టు ఆదేశించిన సంగతి విదితమే. ఈ మేరకు శుక్రవారం వేకువ జామున 3 గంటలకు లింగయ్య మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. గాంధీ సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ పర్యవేక్షణలో ముగ్గురు ఫోరెన్సిక్ వైద్యులు సుమారు మూడు గంటల పాటు లింగయ్య మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించారు. ఈ సమాచారం తెలుసుకున్న పలు ప్రజా సంఘాల ప్రతినిధులు గాంధీ మార్చురీ వద్దకు చేరుకునేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నార్త్‌జోన్ డీసీపీ కల్మేశ్వర్ సింగన్వార్ నేతృత్వంలో గోపాలపురం ఏసీపీ శ్రీనివాసరావు, చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి, డీఐ నర్సింహరాజుల ఆధ్వర్యంలో పోలీసులు ఆస్పత్రి ప్రాంగణంలో భారీగా మోహరించారు. మీడియాను గాంధీ మార్చురీలోకి అనుమతించలేదు. పలు ప్రజాసంఘాల ప్రతినిధులు మార్చురీ వద్దకు వెళ్లేందుకు యత్నించడంతో వారిని అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేసి బొల్లారం ఠాణాకు తరలించారు. పోలీసులపై విమలక్క, సంధ్య ఆగ్రహం అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, ఐద్వా నేత సంధ్య పోలీసుల కళ్లు గప్పి రోగుల మాదిరిగా ఆటోల్లో ఆస్పత్రిలోకి ప్రవేశించారు. అక్కడి నుంచి మార్చురీ వద్దకు వెళ్తున్న క్రమం లో గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. లింగయ్య మృతదేహాన్ని కడసారి చూసేందుకు అనుమతించకపోవడంతో పోలీసుల చర్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం అనంతరం లింగయ్య మృతదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్‌లో స్వస్థలానికి తరలించారు. 17 మంది ఆందోళనకారులను అరెస్ట్ చేసినట్లు చిలకలగూడ పోలీసులు తెలిపారు. విమలక్క, సంధ్య అరెస్టు అన్యాయం: రేణుకాచౌదరి లింగయ్య ఎన్కౌంటర్ సందర్భంగా శవాన్ని రీ–పోస్టుమార్టం చేస్తున్న ప్రాంతానికి వెళ్లిన అరుణోదయ అధ్యక్షురాలు విమలక్క, పీఓడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్యలను అరెస్టు చేయడం అన్యాయమని మాజీ ఎంపీ రేణుకాచౌదరి అన్నారు. ఇది దుర్మార్గమైన చర్య అని, అప్రజాస్వామికమని అభిప్రాయపడ్డారు. సామాజిక ఉద్యమకారులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియంతృత్వంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. పోలీసు కాల్పుల పేరుతో ప్రాణాలను పొట్టన పెట్టుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని శుక్రవారం ఒక ప్రకటనలో రేణుక పేర్కొన్నారు. -
హోరెత్తిన హన్మకొండ
హన్మకొండ: నిరసనలతో హన్మకొండ హోరెత్తింది. తొమ్మిది నెలల పసిపాపపై అత్యాచారం.. ఆపై హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ ఆందోళనకారులు రోడ్డెక్కారు. ర్యాలీలు, రాస్తారోకోలతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. నిందితుడిని బహిరంగంగా ఉరి తీయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఒక దశలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరగడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హన్మకొండలోని తెలంగాణ అమరవీరుల స్తూపం కూడలి, కాళోజి కూడలి, అంబేడ్కర్ కూడలిలో విద్యార్థులు, యువకులు, మహిళలు, ప్రజా సంఘాలు వేలాదిగా చేరుకుని నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ నిరసన తెలిపాయి. కాళోజి కూడలిలో టైర్లు దగ్ధం చేయడం, కోర్టు ఎదుట ఆందోళన చేస్తున్న నిరసనకారులను పోలీసులు చెదరగొట్టే క్రమంలో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులు అటు వైపు రాకుండా పోలీసులు వచ్చిన వారిని వచ్చినట్లు చెదరగొట్టారు. మరోవైపు చిన్నారి శ్రీహితపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వం, పోలీసుల వైఫల్యాన్ని చేతకానితనంగా ఎండగడుతూ పెద్ద ఎత్తున జనం రోడ్డుపైకి వచ్చారు. హన్మకొండ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా బయలుదేరగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ‘వీ వాంట్ జస్టిస్’.. సీఎం స్పందించా లంటూ నినాదాలు చేశారు. ర్యాలీ బాలసముద్రంలోని ఏకశిల పార్కు వద్దకు రాగానే పోలీసులు బారికేడ్లు అడ్డుపెట్టి అడ్డుకోగా అక్కడే రెండు గంటల పాటు కూర్చున్నారు. పోలీసులు శాంతింప జేసి శ్రీహిత తల్లిదండ్రులతో పాటు కొంత మంది బృందాన్ని వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వద్దకు తీసుకెళ్లారు. కలెక్టర్‌ను కలసి వినతి పత్రం అందించి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
దళితులకు రక్షణ కరువు
►‘గరగపర్రు’ దోషులను శిక్షించాలి ► గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన ► ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజా సంఘాలు ద్వారకానగర్ (విశాఖ దక్షిణ) : దళితులకు దేశంలో రక్షణ కరువైందని, వారిపై విచక్షణా రహితంగా దాడులు పెరిగిపోతున్నాయని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి అన్నారు. సోమవారం సాయంత్రం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద దళిత, ప్రజా సంఘాలు, మేధావులు, వివిధ రాజకీయ పార్టీలు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న జేవీ మాట్లాడుతూ గోరక్షణ పేరుతో దేశవ్యాప్తంగా హత్యాదాడులు పెరిగాయన్నారు. యూపీలో బీజేపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చాక మహిళలపై 30 శాతం దాడులు పెరిగాయన్నారు. ఏపీలో కూడా ఆదే సంస్క్రతి ఉందని ఆరోపించారు. అగిరిపల్లి, గరగపర్రు వంటి గ్రామాల్లో దళితులపై సాంఘిక బహిష్కరణ జరిగినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. దళితలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని ధ్వజమెత్తారు. స్వేచ్ఛగా మాట్లాడే హక్కు, దేవుడిని పూజించే హక్కుతో పాటు స్వేచ్ఛగా తినే హక్కును కూడా ప్రభుత్వాలు మంటగలుపుతున్నాయన్నారు. గరగపర్రు దాడులను చూస్తూ ప్రభుత్వం ఖండిచకపోవడం దుర్మార్గమన్నారు. వెంటనే దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆచార్య సూరప్పుడు, సామాజిక హక్కుల వేదిక నాయకుడు బొడ్డు కల్యాణరావు, మాజీ వీసీ రమణ, సీపీఐ నగర కార్యదర్శి దేవరకొండ మార్కండేయులు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎ.విమల, ఎం.పైడిరాజు, వైఎస్సార్సీపీ మహిళా విభాగ నగర కన్వీనర్ పసుపులేటి ఉషాకిరణ్, బొట్టా స్వర్ణ, ఏపీ మహిళా సమాఖ్య నాయకురాలు ఎం.ఎ. బేగం, దళిత నాయకులు కొత్తపల్లి వెంకటరమణ, సీపీఐ నగర సహాయ కార్యదర్శి జేడీ నాయుడు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పి. చంద్రశేఖర్, సీపీఐ నాయకులు పైల ఈశ్వరరావు, జి,వామనమూర్తి, రాజుబాబు, సత్యనారా యణ, తదితరులు పాల్గొన్నారు. ‘గరగపర్రు’పై ఏయూ బంద్ నినదించిన పరిశోధకులు, విద్యార్థులు ఏయూక్యాంపస్ (విశాఖ తూర్పు) : రాష్ట్రంలో దళితులకు పూర్తిస్థాయిలో భద్రత కల్పించాల్సి న బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఏయూ పరి శోధకులు, విద్యార్థులు నినదించారు. ప.గో జిల్లాలోని గరగపర్రు సంఘటనకు నిరసనగా సోమవారం విశ్వవిద్యాలయంలో బంద్ నిర్వహించారు. ఈ నెల 6వ తేదీన ‘చలో గరగపర్రు’ కార్యక్రమం నిర్వహిచేందుకు నిర్ణ యం తీసుకున్నారు. తొలుత ఆర్ట్స్, సైన్స్, ఇంజినీరింగ్ విద్యార్థులు, గ్రంథాలయాల సిబ్బందిని పం పించేసి బంద్ నిర్వహించారు. చివరన పరీక్షలు, పరిపాలనా విభాగాల సిబ్బందిని పంపించేసి బంద్ నిర్వహించారు. సాంఘిక బహిష్కరణకు గురైన గరగపర్రు దళితులకు తగిన న్యాయం చేయాలన్నారు. జేఏసీ సభ్యులు బోరుగడ్డ మోహన బాబు, ఆరేటి మహేష్, టి.వి రాఘవులు, రంగనాథ్‌రాయ్ వైఎస్ఆర్సీపీ నాయకులు బి.కాంతారావు, తుళ్లి చంద్రశేఖర యాదవ్, సునీల్‌కుమార్, ఆనంద రత్నకుమార్, రామక్రిష్ణ, వరుణ్ చైతన్య, కె.రవికుమార్, శిరీష్, రమణ, శ్యామ్ సుందర్, టి. సురేష్ కుమార్, ప్రియాంక, రొయ్యి వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏయూ అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. -
ధర్నాచౌక్‌ను పునరుద్ధరించాలి
- వామపక్షాలు, ప్రజాసంఘాల డిమాండ్ - ప్రభుత్వం దిగిరాకపోతే ఈ నెల 15 నుంచి రిలే దీక్షలు - మే 10న ధర్నాచౌక్ ఆక్రమణ సాక్షి, హైదరాబాద్: ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ను టీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని వివిధ వామపక్షాలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. ఈ విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఈ నెల 15 నుంచి సమాజంలోని వివిధ వర్గాలు, ప్రజాసంఘాల ప్రతినిధులతో వచ్చేనెల 9 వరకు రిలే నిరాహారదీక్షలను చేపట్టనున్నట్లు ప్రకటించాయి. ధర్నాచౌక్ పరిరక్షణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడంలో భాగంగా మే 10న ఇందిరాపార్కు ఆక్రమణ పేరిట రాష్ట్రవ్యాప్త ‘చలో ధర్నాచౌక్’ను నిర్వహించనున్నట్లు తెలిపాయి. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ వర్కింగ్‌గ్రూప్ సభ్యులు మల్లేపల్లి ఆదిరెడ్డి (సీపీఐ), చెరుపల్లి సీతారాములు (సీపీఎం), కె.గోవర్ధన్ (న్యూడెమోక్రసీ–చంద్రన్న), పోటురంగారావు (న్యూడెమోక్రసీ–రాయల), పీఎల్ విశ్వేశ్వరరావు (ఆప్), రవిచందర్ (తెలంగాణ ప్రజాస్వామిక వేదిక), కె.సజయ (సామాజిక పరిశోధకురాలు), పంజుగుల శ్రీశైల్‌రెడ్డి (ప్రజాతెలంగాణ) విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 20 వరకు అన్ని జిల్లాల్లో ధర్నాచౌక్ పరిరక్షణపై రౌండ్‌టేబుల్ సమావేశాలు, ఇతరత్రా కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి సీపీఐ కార్యాలయం మగ్దూంభవన్ ఆవరణలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిలే దీక్షలు ఉంటాయన్నారు. 15న మొదట వామపక్షాల నేతలు, 16న కార్మికసంఘాలు, 17న వ్యవసాయకార్మిక సంఘాలు, 18న విద్యార్థి సంఘాలు, 19న యువజన సంఘాలు, ఇంకా మే 2న ట్రాన్స్‌జెండర్స్, మే 8న బీడి కార్మిక సంఘాలు, మే 9న ట్రాన్స్‌పోర్టు (బస్సు,ఆటో) సంఘాల ప్రతినిధులు ఈ దీక్షల్లో పాల్గొంటారని చెప్పారు. అంతకుముందు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ప్రజాసంఘాల రాష్ట్ర సదస్సులో 50కి పైగా సంఘాల ప్రతినిధులు పాల్గొని ధర్నాచౌక్ పరిరక్షణ కార్యాచరణపై తమ అభిప్రాయాలను వెల్లడించారని వారు తెలియజేశారు. -
బీచ్ లవ్ ఫెస్టివల్ రద్దు!
ప్రకటించిన మంత్రి గంటా సాక్షి, విశాఖపట్నం: తీవ్ర వివాదం రేపిన బీచ్ లవ్ ఫెస్టివల్ ఎట్టకేలకు రద్దయింది. ఈ విషయాన్ని ప్రభుత్వం బుధవారం అధికారికంగా ప్రకటించింది. విశాఖ తీరంలో వచ్చే ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు ఈ ఫెస్టివల్‌ను నిర్వహించడానికి ప్రభుత్వం ఉబలాట పడిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాన్ని నవంబరు 3న ‘బాబు సర్కారు సమర్పించు బీచ్ లవ్’ శీర్షికన ‘సాక్షి’ ప్రధాన సంచిక ప్రచురించిన సంగతి విదితమే. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మహిళా, విద్యార్థి, ప్రజా సంఘాలు భగ్గుమన్నాయి. (చదవండి : బాబు సర్కార్ సమర్పించు..బీచ్ లవ్ ) ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఈ బీచ్ లవ్ ఫెస్టివల్ జరగదని, రద్దయిందని బుధవారం విశాఖలో విలేకరులకు మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. వచ్చే నెల 28, 29, 30 తేదీల్లో విశాఖ ఉత్సవ్ జరుగుతుందని మంత్రి తెలిపారు. -
వద్దంటున్నా.. ఆగడం లేదు!
ప్రశాంతంగా ఉన్న తమ ప్రాంతంలో థర్మల్‌ప్లాంటును ఏర్పాటు చేసి జీవితాలను నాశనం చేయవద్దని వేడుకుంటున్న ప్రజల గోడు ప్రభుత్వానికి పట్టడం లేదు. తమదే పైచేయి కావాలన్నట్టు వ్యవహరిస్తూ ముందుకు పోతోంది. జపాన్‌కు చెందిన సుమితోమా సంస్థ ఆర్థిక సహకారంతో పోలాకి మండలంలో నిర్మించతలపెట్టిన 400 మెగావాట్ల ఆల్ట్రామెగా థర్మల్ప్లాంటు ఏర్పాటును ఈ ప్రాంతీయులు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే పలు విధాలుగా నిరసన వ్యక్తం చేశారు. అయితే అధికారులు మాత్రం ససేమిరా అంటున్నారు. ప్లాంటు ప్రతిపాదిత ప్రాంతాల్లో శుక్రవారం భూ సర్వేకు పూనుకున్నారు. దీన్ని రైతులు, ప్రజాసంఘాలు అడ్డుకోవడంతో పోలీసులు కొంతమందిని అరెస్టు చేశారు. భారీ బందోబస్తు మధ్య సర్వేను కొనసాగించారు. అరెస్టు చేసిన వారిని వ్యక్తిగత పూచీకత్తుపై సాయంత్రం విడుదల చేశారు. * ఉద్యమంపై ఉక్కుపాదం * భారీ పోలీసు బందోబసు నడుమ ‘థర్మల్’ సర్వే * అడ్డుకున్న ప్రజాసంఘాల నాయకులు అరెస్టు, విడుదల * ఆటంకం కలిగిస్తే ఎంతమందినైనా అరెస్టు చేస్తామన్న పోలీసులు తోటాడ(పోలాకి): ప్రజలు ఎంత వ్యతిరేకిస్తున్నా థర్మల్‌ప్లాంట్ నిర్మాణానికే ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. పోలీసుల సాయంతో ఉద్యమంపై ఉక్కుపాదం మోపేందుకు వెనుకాడడం లేదు. పోలాకి ప్రాంతంలో 38 వేల కోట్ల రూపాయలతో నిర్మించాలని భావిస్తున్న మెగాఆల్ట్రా థర్మల్ ప్లాంట్ కోసం భూసర్వేకు ఇటీవల అధికారులు పూనుకోవడంతో ప్రజలు అడ్డుకున్నారు. అయితే అప్పటికి వెనక్కి తగ్గిన అధికారులు శుక్రవారం మరోసారి సర్వేకు వచ్చారు. ఈసారి భారీగా పోలీసులను వెంటతీసుకొచ్చారు. అరుుతే థర్మల్ వ్యతిరేకులు కూడా వెనక్కి తగ్గలేదు. తోటాడ వద్ద జెన్కో, రెవెన్యూ అధికారులు చేపడుతున్న సర్వేను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు పోలాకి, నరసన్నపేట, జలుమూరు స్టేషన్ల నుంచి సిబ్బందిని రప్పించారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్సై ఎన్.లక్ష్మణ్ మాట్లాడుతూ సర్వేను అడ్డుకోవద్దని జనాలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వారు వినలేదు. సర్వే బృందాలను వెనక్కి వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో ఈటీసీ యంత్రాలను పట్టుకుని సిబ్బంది వెనక్కి వచ్చేశారు. అదే సమయంలో నరసన్నపేట సీఐ చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో జలుమూరు ఎస్ఐతోపాటు మరికొంతమంది సిబ్బంది అక్కడకు చేరుకుని సర్వే అడ్డుకోవద్దని, ప్రజలు సహకరించాలని కోరారు. దీంతో అక్కడే ఉన్న ఏపీ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.మోహనరావు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్.సురేష్‌బాబులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇప్పటివరకూ గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించిన అధికారులు సర్వే నిలుపుదల చేస్తామని ప్రకటించి ఇలాంటి దౌర్జన్యానికి పాల్పడటం ఎంతవరకు సమంజసం అని నిలదీశారు. వారితోపాటు ప్రజలు కూడా సర్వే తీరుపై తీవ్రంగా విరుసుకుపడ్డారు. దీంతో పోలీసులు ముందుగా ప్రజాసంఘాల నాయకులు కె.మోహనరావు, సురేష్‌బాబు, వారికి మద్దతిచ్చిన రైతు పైశాగి అప్పలస్వామిలను అరెస్టు చేసి.. పోలీసు వాహనంలో ఎక్కించి నరసన్నపేట స్టేషన్‌కు తరలించారు. వారి అరెస్టులను అడ్డుకున్న స్థానికులను కూడా పోలీసులు బలవంతంగా పక్కకు నెట్టేశారు. ఎంతమందినైనా అరెస్టు చేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ మరికొన్ని వాహనాలను తెప్పించారు. దీంతో ప్రజలు భయంతో వెనక్కి తగ్గారు. అనంతరం పోలీసు బందోబస్తు మధ్య సర్వేను కొనసాగించారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు కేవలం దౌర్జన్యంగా, అధికార బలంతో.. అడ్డగోలుగా చేస్తున్న సర్వేను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అరుుతే పోలీసు బందోబస్తు మధ్య కొనసాగించటం దారుణమైన చర్య. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు. గతంలో కూడా పోలాకి థర్మల్పవర్ప్లాంట్ విషయంలో అనేక అరెస్టులను చూశాం. ఇలాంటి వాటికి భయపడేదిలేదు. సర్వేను అడుగడుగునా అడ్డుకుని తీరుతాం. - కె.మోహనరావు, ఏపీ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నిరసన వ్యక్తం చేసే పద్ధతి ఇదికాదు ప్రభుత్వం చేపడుతున్న సర్వేపై అనుమానాలు, వ్యతిరేకత ఉంటే వేరే పద్ధతుల్లో నిరసన చేపట్టండి. అంతేగాని సర్వేచేస్తు న్న అధికారులును అడ్డుకుంటే సహిం చం. కొంతమంది కావాలనే స్థానికులను రెచ్చగొడుతున్నారు. అలాంటి వారిని నమ్మోద్దు. నేరుగా ప్రజాప్రతినిధులు, అధికారుల ద్వారా ప్రజాభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. - ఆర్.ఎస్.ఎస్.చంద్రశేఖరరావు, సీఐ, నరసన్నపేట -
‘తమ్మిడిహెట్టి’పై ఒత్తిళ్లకు తలొగ్గిన కేసీఆర్
* విపక్ష పార్టీలు, ప్రజా సంఘాల వేదిక ఆరోపణ * 152 మీటర్ల ఎత్తులోనే ప్రాజెక్టు నిర్మించాలి సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా తమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదించిన ప్రధాన ప్రాజెక్టును రీడిజైనింగ్ పేరిట మేడిగడ్డకు మార్చడంలో సీఎం కేసీఆర్ మహారాష్ట్ర ఒత్తిళ్లకు తలొగ్గారని విపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నేతలు ఆరోపించారు. శనివారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రిటైర్డు జస్టిస్ చంద్రకుమార్, తెలంగాణ జల సాధన సమితి నేత నైనాల గోవర్దన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. తమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిరక్షించలేకపోయిందని చంద్రకుమార్ విమర్శించారు. వ్యాప్కోస్ నివేదిక మేరకే గతంలో తమ్మిడిహెట్టి వద్ద 160 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందనే అంచనాతో ప్రధాన ప్రాజెక్టును ప్రతిపాదించారన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలిక్ సంస్థ నుంచి నివేదిక తీసుకోకుండా మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చడాన్ని ఆయన తప్పుబట్టారు. రూ.5 వేల కోట్లకు పైగా ఖర్చు చేసి తమ్మిడిహెట్టి నుంచి కాల్వలు తవ్వారని.. ప్రాజెక్టు స్థలం మార్పుతో ప్రజాధనం వృథా అవుతుందన్నారు. ఇంజనీర్లపై ఒత్తిడి తెచ్చి మేడిగడ్డ వద్ద ప్రాజెక్టును ప్రతిపాదిస్తున్నారని చంద్రకుమార్ ఆరోపించారు. తమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తున ప్రాజెక్టు నిర్మించేలా మహారాష్ట్ర, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అఖిలపక్షాన్ని తీసుకె ళ్లాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు డిజైన్ మార్పు ఎందుకు? ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నా రీ డిజైనింగ్ పేరిట ప్రభుత్వం ప్రాజెక్టు స్థలాన్ని ఎందుకు మారుస్తోందని నైనాల గోవర్దన్ ప్రశ్నించారు. కమీషన్ల కోసం రీ డిజైనింగ్ పేరిట ప్రభుత్వ పెద్దలు నాటకాలు ఆడుతున్నారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ ఆరోపించారు. రీ డిజైనింగ్ వల్ల తెలంగాణలో 40 వేల ఎకరాలు ముంపునకు గురవుతుందన్నారు. గతంలో తమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మిస్తామని చెప్పి.. నీళ్లు లేవనే సాకుతో మేడిగడ్డకు ప్రాజెక్టును మార్చడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. ప్రజల సొమ్ముకు సీఎం కేసీఆర్ కేవలం కస్టోడియన్ మాత్రమేనని.. ప్రజా ధనాన్ని వృథా చేయడాన్ని ప్రశ్నించారు. గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టును నింపే అవకాశం వున్నా.. అబద్దాల పునాదులపై ప్రాజెక్టులను నిర్మించే ప్రయత్నం జరుగుతోందని దుయ్యబట్టారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పరిధి నుంచి రంగారెడ్డి జిల్లా ఆయకట్టును తొలగించి.. పాలమూరు ఎత్తిపోతల పథకంలో చేర్చడం ద్వారా రంగారెడ్డి జిల్లాకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని చాడ ఆరోపించారు. సమావేశంలో రైతు సంఘం నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, సీపీఐ ఎంల్ న్యూ డెమొక్రసీ నాయకులు వేములపల్లి వెంకట్రామయ్య, ఆప్ నాయకులు శ్రీశైలం. రాం నర్సయ్య, ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పగటిపూట 9 గంటల కరెంటుకు రెడీ
రైతులు వద్దంటేనే పగలు, రాత్రి సరఫరా చేస్తున్నాం.. ♦ ఎన్పీడీసీఎల్ సీఎండీ వెంకటనారాయణ ♦ ఈఆర్సీ చార్జీల పెంపు ప్రతిపాదన ♦ మండిపడ్డ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు సాక్షి ప్రతినిధి, కరీంనగర్: వ్యవసాయానికి పగటిపూట 9 గంటలపాటు విద్యుత్ సరఫరా చేయడానికి తాము అన్నివిధాలా సిద్ధంగా ఉన్నామని తెలంగాణ రాష్ట్ర ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ ఎన్పీడీసీఎల్) సీఎండీ వెంకటనారాయణ చెప్పారు. అందుకోసం అవసరమైన మౌలిక అభివృద్ధి పనుల కోసం రూ.635.48 కోట్ల ఖర్చుతో పనులు చేపట్టినట్లు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీఎస్ ఈఆర్సీ) ఎదుట ప్రతిపాదించారు. రైతుల విజ్ఞప్తి మేరకే పగలు, రాత్రి వేళల్లో దశల వారీగా 9 గంటల కరెంటును సరఫరా చేస్తున్నామన్నారు. కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో క్రాస్ సబ్సిడీ, అదనపు సర్‌చార్జీల పెంపు ప్రతిపాదనలపై టీఎస్ ఈఆర్సీ చైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్, సభ్యులు ఎల్.మనోహర్‌రెడ్డి, శ్రీనివాసులు ఆధ్వర్యంలో శనివారం బహిరంగ విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ వెంకటనారాయణ మాట్లాడుతూ ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో విద్యుత్ సరఫరా, పంపిణీ, వినియోగదారుల సేవలు, మౌలిక వసతుల అభివృద్ధిలో సాధించిన విజ యాలు, ఆదాయ వ్యయాలతోపాటు చార్జీల పెంపు అవసరాన్ని వివరించారు. ఎన్పీడీ సీఎల్ పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరంలో నికర లోటు రూ.4,236 కోట్లుగా పేర్కొన్న సీఎండీ... రిటైల్ సప్లయ్, క్రాస్ సబ్సిడీ సర్చార్జిలు, అదనపు సర్‌చార్జిల ప్రతిపాదిత ధరల ద్వారా రూ.385 కోట్లు సమకూర్చుకునే అవకాశముందని పేర్కొన్నారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో 36.62 లక్షల గృహ వినియోగదారులుండగా, అందులో 30.03 లక్షల(82 శాతం) గృహ వినియోగదారులు నెలకు 100 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించే వారేనని పేర్కొన్నారు. చార్జీల పెంపు ప్రతిపాదిత ధరలవల్ల ఆయా వర్గాలపై ఎలాంటి భారం ఉండబోదని చెప్పారు. 9 గంటల విద్యుత్ వాడకుండా కుట్ర దీనిపై పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు. బీజేపీ ప్రతినిధి నరహరి వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయానికి రాత్రిపూట కరెంటు సరఫరా చేయాలని రాష్ర్టంలో రైతులెవరూ కోరుకోవడంలేదని అన్నారు. వ్యవసాయ బోర్లకు ఆటోస్టార్టర్లు పెడితే కేసులుపెట్టి ప్రాసిక్యూట్ చేయాలని విద్యుత్ అధికారులు పేర్కొనడం వెనుక కుట్ర దాగి ఉందని విమర్శించారు. ‘రాత్రిపూట రైతులు పొలాల్లోకి వెళితే చీకట్లో విష సర్పాల బారిన పడే ప్రమాదముందని ఆటో స్టార్టర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. అట్లా చేస్తే కేసులు పెడతామంటే రైతులెవరూ రాత్రిపూట కరెంటు వాడుకునే పరిస్థితి ఉండదు. అసలే సాధారణ సాగుతో పోలిస్తే ఖరీఫ్‌లో 50 శాతం మాత్రమే పంట సాగైంది. ఇక రబీలోనైతే 70 శాతం సాగు చేయలేదు. అసలే కరెంటు వినియోగం తక్కువ. అందులోనూ అధికారులు ఇలాంటి నిబంధనలతో 9 గంటల కరెంటును వాడుకోకుండా కుట్ర చేస్తున్నారు’ అని మండిపడ్డారు. -
బడాబాబులకి దోచిపెట్టి.. భారం ప్రజలపైనా?
ఏపీఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజాగ్రహం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రజలపై విద్యుత్ భారం మోపడం ఏమిటని విద్యుత్ పంపిణీ సంస్థలను ప్రజా సంఘాలు నిలదీశాయి. పంపిణీ సంస్థల నష్టాలకు ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లు కారణం కాదా అని ప్రశ్నించాయి. కాంట్రాక్టుల విషయంలో సాక్షాత్తూ సీఎంపైనే అవినీతి ఆరోపణలు వచ్చిన వైనాన్ని గుర్తుచేశాయి. రూ. 5,145 కోట్ల వార్షిక ఆర్థిక లోటు ఉన్నట్టు తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు ఇటీవల ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి తెలిపాయి. దీనిని పూడ్చుకోవడానికి విద్యుత్ చార్జీల పెంపునకు అనుమతినివ్వాలని కోరాయి. ఈ నేపథ్యంలో ఏపీఈఆర్సీ కార్యాలయంలో సోమవారం బహిరంగ ప్రజా విచారణ జరిగింది. ఈ కార్యక్రమంలో పలు ప్రజా సంఘాలు, విద్యుత్ వినియోగదారులు పాల్గొన్నారు. ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ భవానీ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు రఘు, రామ్మోహన్ పాల్గొన్నారు. సీఎంపైనే అవినీతి ఆరోపణలు: జెన్కో ప్రాజెక్టుల ఈపీసీ కాంట్రాక్టు వ్యవహారంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ వేణుగోపాల్ పేర్కొన్నారు. సోలార్ ప్రాజెక్టులు ప్రభుత్వంలో ఉన్న పెద్దలవి కావా? అని ప్రశ్నించారు. సీఎంపైనే అవినీతి ఆరోపణలు వస్తున్నాయన్నారు. -
భూములివ్వని రైతులపై దౌర్జన్యం..
-
భూములివ్వని రైతులపై దౌర్జన్యం..
* పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం కుట్రలు * బాధితులనే ముద్దాయిలుగా చిత్రీకరించే యత్నం * విచారణ పేరుతో వేధింపులు * గత డిసెంబరులో జరిగిన పంట దహనం కేసుల్లోనూ ఇదే తీరు * ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతు, ప్రజాసంఘాలు సాక్షి, గుంటూరు: రాజధానికి భూమి ఇవ్వనందుకు గుంటూరు జిల్లా మల్కాపురం లో చెరకు పంటను దహనం చేసిన సంఘటనపై బాధిత రైతు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఫిర్యాదు చేయడం, ఆయన పొలాన్ని స్వయంగా పరిశీలించడంతో ప్రభుత్వ పరువు మంట కలిసిందనే ఆగ్రహంతో పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు మరో కుట్రకు తెర తీశారు. బాధితులను పంట దహనం కేసులో బాధ్యులుగా చేసేందుకు రైతు చంద్రశేఖర్ మేనల్లుడు సురేశ్‌ను రెండు రోజుల క్రితం తీసుకెళ్లి రహస్యంగా విచారణ జరుపుతున్నారు. పంటను తానే దహనం చేసినట్లుగా ఒప్పుకోవాలంటూ పోలీసులు సురేశ్‌పై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. పంట దహనం సంఘటనకు పాల్పడింది తానేనంటూ సురేశ్ చేతనే చెప్పించి ప్రభుత్వానికి ఆ మరక అంటకుండా చూసేందుకు కొందరు పోలీసు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా చంద్రశేఖరే తనను దహనం చేయమని చెప్పినట్లుగా సురేశ్ చేత చెప్పించి కేసులో ఆయన్ను సైతం ఇరికించేందుకు భారీ స్థాయిలో పథక రచన చేశారు. ఇందులో భాగంగా చంద్రశేఖర్‌ను కూడా గురువారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలిసింది. విషయం తెలుసుకున్న రైతు, ప్రజాసంఘాల నాయకులు, ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో మండి పడుతున్నారు. ఈనెల 23న తుళ్లూరు మండలం మల్కాపురంలో ల్యాండ్‌పూలింగ్‌లో భూములు ఇవ్వని రైతు గద్దె చంద్రశేఖర్ పొలంలో చెరకు పంటను గుర్తుతెలియని దుండగులు దహనం చేసిన విషయం తెలిసిందే. ఈనెల 26న సంఘటనా స్థలాన్ని పరిశీలించిన వై.ఎస్.జగన్ బాధిత రైతులకు అండగా ఉంటానని హామీ ఇవ్వడం, పోలీసుల వ్యవహార శైలిపై బాధిత రైతు చంద్రశేఖర్ ఆయనకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సర్కారు మాట వినని రైతులపై కక్ష సాధింపులు గుంటూరు జిల్లాలో రాజధాని నిర్మాణ ప్రకటన వెలువడినప్పటి నుంచి మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లోని రైతులకు నిద్ర లేకుండాపోతోంది. భూ సమీకరణ పేరుతో అనేక మంది రైతుల వద్ద నుంచి బలవంతంగా భూములు లాక్కొన్న ప్రభుత్వ పెద్దలు తమ మాట వినని రైతులను టార్గెట్ చేసుకుని కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. తిరిగి వారిపైనే కేసులు పెడుతూ తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు. ఇంత చేస్తున్నా రైతులు లొంగకపోవడంతో పంటలను దహనం చేసే స్థాయికి దిగజారుతున్నారు. గతేడాది డిసెంబర్లో రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాలకు చెందిన ఆరు గ్రామాల్లో 13 మంది రైతులకు చెందిన పంట పొలాల్లో వెదురు బొంగులు దహనం చేసిన సంఘటన తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఘటన సంచలనం కలిగించినప్పటికీ ఇంత వరకు ఈ కేసులో అసలైన బాధ్యులను గుర్తించి అరెస్టు చేసిన దాఖలాలు లేవు. పైగా అప్పట్లో విచారణ పేరుతో ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇవ్వని రైతులను, వైఎస్సార్సీపీకి చెందిన రైతులను స్టేషన్లకు పిలిచి రోజుల తరబడి విచారణ పేరుతో బెదిరింపులకు దిగుతూ తీవ్ర వేధింపులకు గురిచేశారు. అప్పట్లో వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఇతర నేతలంతా గవర్నర్‌ను కలిసి పోలీసులు, ప్రభుత్వ తీరుపై ఫిర్యాదులు చేశారు. అయినప్పటికీ వీరి తీరు మాత్రం మారలేదు. -
ఇంత నిర్లక్ష్యమా?
సాక్షి, గుంటూరు: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి (జీజీహెచ్)లో ఎలుకలు దాడి చేయగా శిశువు మృతిచెందిన ఘటనపై విపక్షాలు, ప్రజాసంఘాలు తీవ్రంగా స్పందించాయి. ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థల నేతలు ఆస్పత్రికి చేరుకుని జరిగిన ఘటనపై ప్రభుత్వాన్ని నిలదీశారు. శిశువు మృతిపై కలత చెందిన స్థానికులు కూడా గురువారం వేలాదిగా జీజీహెచ్‌కు చేరుకున్నారు. వైఎస్సార్ సీపీ, సీపీఐ నేతలు, కార్యకర్తలు జీజీహెచ్ మిలీనియం బ్లాక్ వద్ద బైఠాయించి ధర్నా చేశారు. ఆస్పత్రిని సందర్శించిన మంత్రులు డాక్టర్ కామినేని శ్రీనివాస్, పీతల సుజాత, ప్రత్తిపాటి పుల్లారావు, పి. నారాయణ, హెల్త్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం, కలెక్టర్ కాంతిలాల్ దండే ఆసుపత్రి అధికారులతో గంటపాటు సమావేశమయ్యారు. ఈ సమయంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు వంగవీటి రాధ శిశువు.. తల్లిదండ్రులు చావలి లక్ష్మి, నాగలను వారి వెంట తీసుకొచ్చారు. బాధితులకు న్యాయం చేయాలంటూ మంత్రులను డిమాండ్ చేశారు. మంత్రుల ఘెరావ్.. అనంతరం జీజీహెచ్ మిలీనియం బ్లాక్ ఎదుట వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆసుపత్రిలో సమావేశం ముగించుకుని బయటకు వస్తున్న మంత్రులను కదలనీయకుండా విపక్ష నేతలు అడ్డుకున్నారు. పోలీసులు వైఎస్సార్ సీపీ నేతలను బలవంతంగా పక్కకునెట్టి మంత్రుల వాహనాలను పంపివేశారు. అనంతరం మంత్రి కామినేని శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ ఆసుపత్రి పరిస్థితి తనకు తెలుసుననీ, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా పసికందులో మృతి ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అసలు దోషులను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారికి అధికార టీడీపీ నేతలు అండగా ఉంటున్నారు. -
ప్రత్యేక హోదాపై సీపీఐ ప్రచారోద్యమం
1న శ్రీకాకుళంలో ప్రచార జాతా ప్రారంభం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు ఆగస్టు 1నుంచి ప్రచారోద్యమాన్ని చేపట్టనున్నాయి. 9 రోజులు సాగే ఈ ప్రచార జాతా శ్రీకాకుళం నుంచి ప్రారంభమవుతుంది. 5న గుంటూరులో భారీ బహిరంగ సభ, 9న అనంతపురం లేదా హిందూపురంలో ముగింపు సభ జరుగుతుంది. ప్రచార జాతా ప్రారంభ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర నేతలతో పాటు ఆంధ్రామేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ కిసాన్ విభాగం కన్వీనర్ నాగిరెడ్డి, రైతు సంఘాల సమాఖ్య నాయకుడు ఏర్నేని నాగేంద్ర తదితరులు పాల్గొంటారు. -
ప్రొఫెసర్ సాయిబాబాను విడుదల చేయాలి
ప్రజాసంఘాల నేతల డిమాండ్ హైదరాబాద్: ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని వివిధ సంఘాల, పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాను అక్రమంగా అరెస్టు చేసి ఏడాది అయిన సందర్భంగా డాక్టర్ సాయిబాబా విడుదల పోరాట కమిటీ ఆధ్వర్యంలో శనివారమిక్కడ ఇందిరాపార్కు వద్ద ధర్నా జరిగింది. ఈ ధర్నాలో విరసం నేత వరవరరావు మాట్లాడుతూ పార్లమెంటరీ ప్రత్యామ్నాయ రాజకీయాలను బలపర్చే, ప్రజల పక్షాన పోరాడేవారిపై ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్బంధకాండకు సాయిబాబా అరెస్టు ప్రతీక అని అన్నారు. ఢిల్లీ కేంద్రంగా ప్రజాస్వామిక ఉద్యమాలను, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలను నడపడాన్ని సహించలేకే ఆయనను అక్రమంగా అరెస్టు చేశారని పేర్కొన్నారు. బయటి ఆహారాన్ని, మందులను అనుమతించకపోవడాన్ని బట్టి సాయిబాబాను జైలులోనే హత్య చేసే కుట్ర సాగుతుందని ఆరోపించారు. టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న సాయిబాబాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రముఖనటుడు నారాయణమూర్తి మాట్లాడుతూ సాయిబాబా ఏమైనా మోస్ట్ వాంటెడ్ క్రిమినలా? అని నిలదీశారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు రాములు, రామనర్సింహ్మరావు(సీపీఐ), సీపీఐ(ఎంఎల్) న్యూడెమాక్రసీ నాయకుడు వేములపల్లి వెంకట్రామయ్య, గోవర్ధన్(న్యూడెమెక్రసీ), భూతం వీరయ్య(సీపీఐఎంఎల్), మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. సామాజిక కార్యకర్తలు కూడా... సాక్షి, న్యూఢిల్లీ: ప్రొఫెసర్ సాయిబాబాను తక్షణం విడుదల చేయాలంటూ శనివారం ఢిల్లీ, జవహర్లాల్, జామియా మిలియా ఇస్లామియా, ఇంద్రప్రస్థ, అంబేడ్కర్ వర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు, సామాజిక కార్యకర్తలు ఢిల్లీ వర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద దీక్ష చేశారు. -
కదిలించిన ‘సాక్షి’ కథనం
కామారెడ్డి: ఎందరినో ఉన్నతులుగా తీర్చిదిద్దిన కామారెడ్డి ప్రభుత్వ కళాశాల దీనస్థితికి చేరుకున్న వైనంపై గత డిసెం బర్ 13న ‘సాక్షి’లో ‘కూలుతున్న విద్యా వృక్షం’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనం విద్యార్థులను కదిలించింది. ఉద్యమబాట పట్టించి విజయబాటలో పయనించేలా చేసింది. పలువురు ‘సాక్షి’ కథనం క్లిప్పింగులను సామాజిక ప్రసార మాద్యమాలలో ఉంచి షేరింగ్ చేయడంతో, దేశ,విదేశాలలో ఉన్న ఈ ప్రాంతవాసులు సైతం కాలేజీని కాపాడాలంటూ కామెంట్లు పెట్టారు. మొదట ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు మొదలు కాగా, తరువాత మిగతా సంఘాలన్నీ కలిసి జేఏసీగా ఏర్పడి దీక్షలలో కూర్చున్నాయి. నెల రోజులుగా దీక్ష లతోపాటు రాస్తారో కోలు, ధర్నాలు నిర్వహించారు. ఆందోళనకు జేఏసీ, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. డిగ్రీ కాలేజీ దీనస్థితిపై ఎప్పటికప్పుడు ‘సాక్షి’లో కథనాలు వెలువడడం, విద్యార్థుల ఆందోళనలతో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ స్పందించి కలెక్టర్ రొనాల్డ్ రాస్తో మాట్లాడారు. దీంతో ఆయన డీసీఓ శ్రీహరిని విచారణకు పం పించారు. శుక్రవారం విప్ జేఏసీ, విద్యార్థి సంఘాల నేతలను తీసుకుని సీఎంను కలిసి కాలేజీ గురించి చర్చించారు. కాలేజీ యాజమాన్యం ఆస్తులను అప్పగిస్తే వారిని సన్మానిద్దామని, అప్పగించకుంటే ప్రభుత్వపరంగా చర్యలు తీసుకుందామని సీఎం తెలిపారు. కాగా, కాలేజీ యాజమాన్య కమిటీ సభ్యులు ఇప్పటికే ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించడానికి ముందుకు వచ్చారు. ఈ నెల 22న కామారెడ్డిలో సీఎం పర్యటన సందర్భంలో పూర్తి రికార్డులను ప్రభుత్వానికి అప్పగించనున్నారు. విద్యార్థుల్లో హర్షం కాలేజీని స్వాధీనం చేసుకోవడడానికి సీఎం హామీ ఇవ్వడంతో విద్యార్థులలో హర్షం వ్యక్తమవుతోంది. దీంతోపాటు విద్యాభివృద్దికి చర్యలు తీసుకుంటామని సీఎం ప్ర కటిం చిన దరిమిలా విద్యార్థి సంఘాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కాలేజీని పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకునేంతవరకు దీక్షలు కొనసాగుతాయని విద్యార్థి జేఏసీ నేతలు పేర్కొన్నారు. -
ఆందోళనలతో దద్ధరిల్లిన ఉద్యాన నగరి
అత్యాచార ఘటనలపై ప్రజాసంఘాలు ఆందోళన సాక్షి ప్రతినిధి, బెంగళూరు : స్థానిక ఫ్రేజర్ టౌన్లో పీజీ విద్యార్థినిపై, మారతహళ్లిలోని విబ్‌గ్యార్ స్కూలులో చిన్నారిపై జరిగిన అత్యాచారాలకు నిరసనగా నగరం గురువారం ఆందోళనలతో హోరెత్తింది. వివిధ ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు లైంగిక దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. ఇక్కడి రేస్ కోర్సు రోడ్డులోని హోం మంత్రి కేజే. జార్జ్ నివాసాన్ని ఏబీవీపీ కార్యకర్తలు ముట్టడించారు. అత్యాచారాలకు పాల్పడిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. శాంతి భద్రతలను కాపాడడంలో విఫలమయ్యారని ఆరోపిస్తూ, వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు విద్యార్థులను అరెస్టు చేసి, సాయంత్రం విడుదల చేశారు. బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు పులకేశి న గర్ పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. పీజీ విద్యార్థినిపై లైంగిక దాడికి సంబంధించిన కేసు తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నించిన ఇన్స్పెక్టర్ మహమ్మద్ రఫిక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మైసూరు బ్యాంకు సర్కిల్లో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ఫ్రేజర్ టౌన్ సంఘనటకు సంబంధించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్యకర్తలు నినాదాలు చేశారు. సినీ నటి మాళవిక, ఎమ్మెల్సీలు విమలా గౌడ, తార, ఎమ్మెల్యే శశికళ జొల్లె ప్రభృతులు ఆందోళనలో పాల్గొన్నారు. జేడీఎస్ నాయకులు, కార్యకర్తలు ఆనందరావు సర్కిల్లో ధర్నా నిర్వహించారు. లైంగిక దాడులకు పాల్పడిన వారిని గుర్తించడంలో విఫలమైనందుకు హోం మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
అయ్య బాబోయ్!
- రైతు మెడపై కత్తిలా బ్యాంకు రుణాలు - ఖరీఫ్ పెట్టుబడులపై దిక్కుతోచని వైనం - ఓటేసి మోసపోయామంటూ మహిళల శాపనార్థాలు - పెంచిన పింఛన్లేవంటూ లబ్ధిదారుల గగ్గోలు - బెల్టుషాపులపై గ్రామీణ మహిళల ఆందోళన - ముఖ్యమంత్రి ఉత్తుత్తి సంతకాలపై సర్వత్రా విమర్శలు - రోడ్డున పడిన ఆదర్శరైతు, ఉపాధి ఉద్యోగుల కుటుంబాలు - ఉద్యమాలు తప్పవంటున్న ప్రజాసంఘాలు సాక్షి, ఒంగోలు: కొత్త ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలు ఒక్కొక్కటిగా ఆవిరవుతున్నాయి. ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టగానే తొలి,మలి సంతకాలతో మేలు చేస్తానన్న నేత ప్రజలకు హామీలపై స్పష్టతనివ్వడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పట్లో రైతుల రుణాలు మాఫీ అవుతాయా? రీషెడ్యూల్ చేసి చేతులు దులుపుకుంటారా..? అంటూ జిల్లాలో ఎక్కడ విన్నా ఇదే చర్చ నడుస్తోంది. ‘బ్యాంకులకు రుణాలు చెల్లించొద్దు. మేం అధికారంలోకి రాగానే రుణాలన్నీ మాఫీచేస్తాం..’ అనేమాటను తెలుగుదేశం పార్టీ అధినేత నుంచి వార్డుస్థాయి కార్యకర్త వరకు ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఆదర్శ రైతులు, రైతుసంఘాల ప్రతినిధులతో సమావేశాలు పెట్టిమరీ .. రుణమాఫీ హామీని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఆపార్టీ లక్ష్యం నెరవేరింది. పార్టీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. వచ్చీరాగానే.. ఆదర్శరైతువ్యవస్థ రద్దుతో జిల్లాలో 1859 రైతుకుటుంబాల్ని రోడ్డున పడేశారు. రుణాలు చెల్లించమంటూ బ్యాంకర్లు రైతుమెడపై కత్తిపెట్టినట్లు నోటీసులిచ్చారు. ఇప్పుడే మొదలైన ఖరీఫ్ సీజన్ సాగుకు చేతిలో రైతుకు చిల్లిగవ్వలేని పరిస్థితి నెలకొంది. ఇవన్నీ చాలవన్నట్టు చంద్రబాబు పాలనలో కరువు ఖాయమంటూ వినిపిస్తున్న సెంటిమెంట్ మాటలతో రైతుల గుండెలదిరిపోతున్నాయి. కష్టాలసాగు చేయాలా.. వద్దా..? అనే తరుణంలో డొక్కల కరువు కమ్ముకొస్తుందేమోననే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. రుణమాఫీ అయ్యేనా..? జిల్లాలో పంట రుణాల కింద కిందటేడాది పంపిణీ చేసిన వాటితో కలుపుకుని మొత్తం రూ.5,600 కోట్ల బకాయిలు మాఫీకావాల్సి ఉంది. ఈమొత్తం బకాయి రికవరీ అయితేనే.. ఖరీఫ్ సాగుకు కొత్తగా రుణాలందిస్తామని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. ఈమేరకు రుణాలు రద్దవుతాయో..రీషెడ్యూల్ ప్రతిపాదన చేస్తారో..? అనే ఆందోళన రైతుల్లో వినిపిస్తోంది. - ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించే అధికారి కరువయ్యాడు. - ఒకవైపు ఎరువుల ధరలు పెరిగిపోగా, విత్తనాల కొరత తీవ్రంగా ఉంది. సాగునీటి విడుదలపై స్పష్టత కొరవడింది. పంటకాలువలు, చెరువులు ఎండిపోయాయి. - అదేవిధంగా జిల్లాలో డ్వాక్రాసంఘాల మహిళలు మొత్తం 47 వేల మంది ఉండగా, సుమారు రూ.770 కోట్ల రుణాలు రద్దుకావాల్సి ఉంది. ఈ అంశంపైనా ప్రభుత్వం స్పష్టతనివ్వకపోవడంతో.. బ్యాంకర్లు మహిళా సంఘాలపై కూడా నోటీసుల యుద్ధం ప్రకటించారు. బాబు సంతకం చేసి చాలారోజులైనా రుణాలు రద్దుకాకపోవడంపై మహిళలు టీడీపీ ప్రభుత్వంపై శాపనార్థాలు పెడుతూ ఎదురుచూస్తున్నారు. సుజలం దొరకకున్నా.. అంతటా ‘మద్యం’కంపే: ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరిట మినరల్ వాటర్‌ను అతితక్కువ ధరకు అందిస్తామని చేసిన సంతకం కార్యరూపం దాల్చకపోవడం గమనార్హం. జిల్లాలో ఫ్లోరైడ్పీడతో ఇప్పటికే 271 గ్రామాలు ఉండగా, ముందుగా ఆయాగ్రామాలపై దృష్టి సారించి మినరల్ వాటర్‌ను ప్రజలకు నామమాత్రపు రుసుంతో అందివ్వాల్సిన అధికారులు దాని ఊసే పట్టించుకోవడం లేదు. ఇదిలాఉంటే, జిల్లావ్యాప్తంగా 3,800కు పైగానే బెల్టుదుకాణాలు యథేచ్ఛగా నిర్వహిస్తూనే ఉన్నారు. అక్టోబర్ వరకు పింఛన్‌పాట్లు తప్పవా..? వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్ రూ.200 నుంచి రూ.వెయ్యికి పెంచుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చేయగా.. దానికి సంబంధించిన మార్గదర్శకాలు, పంపిణీపై జిల్లాప్రభుత్వ అధికారుల వద్దనే స్పష్టత కొరవడింది. జిల్లాలో 3.27 లక్షల మంది లబ్ధిదారులు పెరిగిన పింఛన్‌సొమ్ము తీసుకోవాలనే ఆతృతతో ఎదురుచూస్తున్నారు. అయితే, అక్టోబర్ వరకు పెరిగిన పింఛన్‌సొమ్ము అందనట్టేనని స్థానిక అధికారులు చెబుతుండటంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. జాబ్ సరే.. రోడ్డునపడిన కుటుంబాల గతేంటి..? ‘జాబ్ కావాలంటే..బాబు అధికారంలోకి రావాల్సిందే’నంటూ ఇటీవల ఎన్నికల్లో తెలుగుదేశం నేతలు గ్రామాల్లో విస్తృత ప్రచారం చేశారు. అయితే, జాబు సంగతి సరే... బాబు తీసుకున్న నిర్ణయంతో ఉపాధి కోల్పోయి రోడ్డునపడిన కుటుంబాల్ని ఆదుకునేదెవరనే ప్రశ్న అంతటా వినిపిస్తోంది. - ఎన్నికల్లో పలురకాల అంశాలపై ఆదర్శ రైతులను మభ్యపెట్టి వాడుకున్న తెలుగుదేశం పార్టీ.. అధికారంలోకి రాగానే, వారి సేవలు చాలించాలంటూ సంతకాలు చేయడంపై విమర్శలొస్తున్నాయి. - జిల్లాలో మొత్తం 1859 మంది ఆదర్శ రైతులుండగా, వీరు ప్రభుత్వానికి రైతులకు మధ్య వారధిలా పనిచేస్తుండేవారు. నెలకు రూ.వెయ్యి గౌరవ వేతనంతో నిర్దేశించిన గ్రామాల్లో విస్తృతంగా సేవలందించేవారు. ఎప్పటికప్పుడు వ్యవసాయశాఖ సూచనల్ని రైతులకు చేరవేసి.. సాగుకు చేయూతనివ్వడంలో ముందుండే ‘ఆదర్శం’ బాబు పాలన ఆరంభంలోనే అభాసుపాలవుతోందనే అభిప్రాయం రైతుసంఘాల నేతల్లో కలుగుతోంది. - ఆయా సమస్యల పరిష్కారానికి ఉద్యమబాటే ఏకైక పరిష్కారమని ప్రజా, రైతుసంఘాలు హెచ్చరిస్తున్నాయి.