మంత్రులను అడ్డుకుంటున్న వైఎస్సార్సీపీ నాయకులను నెట్టివేస్తున్న పోలీసులు
సాక్షి, గుంటూరు: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి (జీజీహెచ్)లో ఎలుకలు దాడి చేయగా శిశువు మృతిచెందిన ఘటనపై విపక్షాలు, ప్రజాసంఘాలు తీవ్రంగా స్పందించాయి. ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థల నేతలు ఆస్పత్రికి చేరుకుని జరిగిన ఘటనపై ప్రభుత్వాన్ని నిలదీశారు. శిశువు మృతిపై కలత చెందిన స్థానికులు కూడా గురువారం వేలాదిగా జీజీహెచ్‌కు చేరుకున్నారు. వైఎస్సార్ సీపీ, సీపీఐ నేతలు, కార్యకర్తలు జీజీహెచ్ మిలీనియం బ్లాక్ వద్ద బైఠాయించి ధర్నా చేశారు.
ఆస్పత్రిని సందర్శించిన మంత్రులు డాక్టర్ కామినేని శ్రీనివాస్, పీతల సుజాత, ప్రత్తిపాటి పుల్లారావు, పి. నారాయణ, హెల్త్ సెక్రటరీ సుబ్రహ్మణ్యం, కలెక్టర్ కాంతిలాల్ దండే ఆసుపత్రి అధికారులతో గంటపాటు సమావేశమయ్యారు. ఈ సమయంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు వంగవీటి రాధ శిశువు.. తల్లిదండ్రులు చావలి లక్ష్మి, నాగలను వారి వెంట తీసుకొచ్చారు. బాధితులకు న్యాయం చేయాలంటూ మంత్రులను డిమాండ్ చేశారు.
మంత్రుల ఘెరావ్..
అనంతరం జీజీహెచ్ మిలీనియం బ్లాక్ ఎదుట వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆసుపత్రిలో సమావేశం ముగించుకుని బయటకు వస్తున్న మంత్రులను కదలనీయకుండా విపక్ష నేతలు అడ్డుకున్నారు. పోలీసులు వైఎస్సార్ సీపీ నేతలను బలవంతంగా పక్కకునెట్టి మంత్రుల వాహనాలను పంపివేశారు.
అనంతరం మంత్రి కామినేని శ్రీనివాస్ విలేకరులతో మాట్లాడుతూ ఆసుపత్రి పరిస్థితి తనకు తెలుసుననీ, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా పసికందులో మృతి ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అసలు దోషులను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారికి అధికార టీడీపీ నేతలు అండగా ఉంటున్నారు.