మరో శిశువును మింగేసిన నిర్లక్ష్యం
గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో ఊడలు దిగిన నిర్లక్ష్య వటవృక్షపు వేళ్లు మరో శిశువు మెడకు ఉరితాడయ్యాయి. ప్రక్షాళన అంటే గోడలకు సున్నాలు వేయడం, చీపుళ్లు పట్టి ఊడవడం కాదు...
ఆస్పత్రి సిబ్బంది, వైద్యుల మనసుల్లో పేరుకుపోయిన నిర్లక్ష్యాన్ని ఊడ్చిపారేయాలి... వారి మనసు తలుపులు తెరిచి సేవాదృక్పథాన్ని తట్టి లేపాలి. అప్పుడు గానీ జీజీహెచ్‌లో మృత్యుహేల అంతం కాదు...
• జీజీహెచ్‌లో కొనసాగుతున్న మృత్యుహేల
• బంధువుల ఆందోళన
• సిబ్బంది వైఖరిలో మార్పు రావాలి
• ప్రజాసంఘాల ఉద్ఘాటన
గుంటూరు రూరల్: గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఇటీవల ఎలుకలు కొరికి చిన్నారి మృతి చెందిన సంఘటన రాష్ట్ర ప్రజలు మరువక ముందే సిబ్బంది నిర్లక్ష్యం వల్ల సోమవారం మరో ముక్కు పచ్చలారని శిశువు కన్నుమూసింది. చిలకలూరిపేట మండలం తాతపూడికి చెందిన నూతలపాటి అనూష ఏడవ నెల గర్భిణి. స్థానికంగా ఉన్న ప్రభుత్వాసుపత్రికి వెళ్లగా అక్కడ పరీక్షించిన వైద్యులు బిడ్డ పరిస్థితి బాగాలేదని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి రిఫర్‌చేశారు.
దీంతో ఉదయం 12 గంటలకు అనూష భర్త జాన్‌తో కలిసి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. ఓపీ రాసిన వైద్యులు స్కానింగ్ తీయించుకోవాలని చెప్పగా, అక్కడినుంచి స్కానింగ్‌కు వెళ్లారు. స్కానింగ్ వద్ద సిబ్బంది లేకపోవటంతో మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడే వేచి ఉన్నారు. స్కానింగ్ పూర్తయిన వెంటనే వైద్యుని వద్దకు వెళ్లగా అప్పటికే క్యూలో మరో 10 మంది ఉండటంతో కాన్పుల వార్డులో వేచి ఉండాలని సిబ్బంది సూచించారు. క్యూలో నిలబడిన అనూష సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నిలబడలేక కూలబడటంతో అనూష బంధువులు సిబ్బందిని నిలదీశారు.
దీంతో సిబ్బంది వీల్ చైర్‌ను ఇవ్వగా, వీల్ చైర్‌లో కూర్చున్న అనూషకు ఉమ్మనీరు పూర్తిగా పోయింది.నొప్పులు తీవ్రమవడంతో సిబ్బంది అనూషను నడిపించుకుంటూ వార్డుకు తీసుకెళ్లారని ఈ క్రమంలో కాన్పు పూర్తవుతుండగా మంచంపై పడుకోబెట్టగానే ప్రసవించిందని బంధువులు తెలిపారు. ప్రసవం జరిగిన 10 నిమిషాలకు బిడ్డ మృతి చెందాడని వాపోయారు. సిబ్బంది సరైన సమయానికి స్పందించి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని ఆరోపించారు.
జీజీహెచ్‌లో ఇలాంటివి నిత్యకృత్యమయ్యాయి...
జీజీహెచ్‌లో ఇటువంటి సంఘటనలు నిత్యకృత్యమయ్యాయని, కేవలం సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ చాంబర్ వద్ద బాధితులతో కలిసి వారు ఆందోళన నిర్వహించారు. రెండు నెలల క్రితం ఇదేవిధంగా స్కానింగ్ రూం వద్ద వేచిచూస్తూ ఓ గర్భిణి ప్రసవించిందని, అయితే అప్పుడు అదృష్టవశాత్తూ చిన్నారి బతికిందన్నారు. వార్డులో వైద్యుల కోసం ఎదురుచూస్తూ వరండాలో సైతం అనేక కాన్పులు జరిగిన సంఘటనలు కోకొల్లలన్నారు.
సిబ్బందిలో కొరవడిన సేవాదృక్పథం
ప్రక్షాళన పేరుతో జిల్లా స్థాయి అధికారుల నుంచి కలెక్టర్ వరకూ వారం రోజులుగా సమావేశాలతో ఊదరగొడుతూనే ఉన్నా సిబ్బంది వైఖరిలో మాత్రం మార్పు రాలేదు. ప్రక్షాళన అంటే గోడలకు సున్నాలు వేయటం, రోడ్లు రంగులు వేయటం కాదని ముందుగా సిబ్బంది, వైద్యులలో మార్పు వచ్చి సేవా దృక్పథంతో పనిచేసే రోజులు వచ్చేవరకూ ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయని ప్రజా సంఘాల నాయకులు వ్యాఖ్యానించారు. అధికారులు ఇకనైనా స్పందించి సిబ్బంది, వైద్యులలో మార్పుకోసం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.