గుంటూరు జీజీహెచ్‌లో మరో శిశువు మృతి
7 నెలల గర్భంతో 2 గంటలు క్యూలో నిలబడిన గర్భిణి
నడిపిస్తుండగానే ప్రసవం.. బిడ్డ మృతి
గుంటూరు : గుంటూరు సమగ్ర ప్రభుత్వాస్పత్రి(జీజీహెచ్)లో సోమవారం మరో దుర్ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఏడు నెలల గర్భస్థ శిశువు మృతి చెందటంతో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. బాధిత తల్లిదండ్రులు, బంధువుల కథనం మేరకు.. చిలకలూరిపేట తాతపూడికి చెందిన నూతలపాటి అనూష ఏడో నెల గర్భిణి. ఆదివారం నొప్పులు రావడంతో స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా, ఆరోజు అక్కడే ఉండిపోయారు. సోమవారం ఉదయం మళ్లీ నొప్పులు ఎక్కువవడంతో వైద్యులు సెలవులో ఉన్నారని గుంటూరు ప్రభుత్వాస్పత్రికి వెళ్లాలని సిబ్బంది సూచించారు. దీంతో అనూష భర్త జాన్, తల్లి మేరి ఆమెను జీజీహెచ్‌కు తీసుకొచ్చారు.
మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఓపీ రాయించుకుని వైద్యుని వద్దకు వెళ్లగా స్కానింగ్ పరీక్షలు రాశారు. 3 గంటలకు రిపోర్టు తీసుకుని వైద్యుని వద్దకు వెళ్లగా.. ‘నీ కంటే ముందుగా వచ్చిన రోగులు ఉన్నారు. లైనులో నిలబడాలి’ అని సిబ్బంది ఆమెకు సూచించారు. దీంతో రెండు గంటల పాటు లైనులో నిలబడిన అనూష 5 గంటల సమయంలో అక్కడే కుప్ప కూలిపోయింది. దీంతో సిబ్బంది హటాహుటిన వార్డులోనికి నడిపించుకుంటూ వెళుతుండగా అనూషకు డెలివరీ అయి, బిడ్డ మృతి చెందింది. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని బిడ్డ తల్లితండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. తమకు న్యాయం చేయాలని ఆందోళన నిర్వహించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్, పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. బిడ్డ కేవలం 1.5 కిలోల బరువుతో జన్మించడం వల్లే ఇలా జరిగిందని వివరణ ఇచ్చారు.