
సాక్షి,గుంటూరు : ఇటీవల మహారాష్ట్రను వణికిస్తున్న గులియన్ బారే సిండ్రోమ్ (Guillain Barre Syndrome) (జీబీఎస్) నెమ్మదిగా దక్షిణాదికీ వ్యాపిస్తోంది. మహారాష్ట్రలో ఈ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తుండగా.. తాజాగా ఆంధ్రప్రదేశ్ (andhra pradesh) లోని గుంటూరు జీజీహెచ్ (guntur ggh)లో వెలుగులోకి వచ్చాయి. గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతున్న ఐదుగురు బాధితులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఇటీవల,పలు అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన బాధితులకు డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు. ఈ వైద్య పరీక్షల్లో బాధితులకు జీబీఎస్ సోకినట్లు గుర్తించారు. ఐదుగురు బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వ్యాధిగ్రస్తులకు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎస్ఎస్వీ రమణ సమాచారం మేరకు నాలుగు రోజుల్లో ఏడు జీబీఎస్ కేసులు నమోదయ్యాయి. ఈ సందర్భంగా ఎస్‌ఎస్వీ రమణ మాట్లాడుతూ.. కరోనా బాధితుల్లో ఎక్కువగా ఈ సిండ్రోమ్ కనిపిస్తోంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
కలుషిత నీటి వాడకంతో మొదలు..
గతంలో జీబీఎస్ వ్యాధి చాలా అరుదుగా కనిపించేది. ప్రతి లక్ష మందిలో కేవలం ఒకరిద్దరికే ఈ వ్యాధి వచ్చేది. ఇప్పుడు వందలాది మందిని ప్రభావితం చేస్తోంది. ఇటీవల దీని విస్తృతి పెరిగింది. ఇది ఏ వయసువారిలోనైనా రావచ్చు. అయితే పుణేలో అనేక మంది కలుషితమైన నీటిని వాడటంతో ఈ వ్యాధి ప్రబలినట్లు తేలింది. సాధారణంగా పోస్ట్ వైరల్/బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ వ్యాధి వస్తుంటుంది. అక్కడి నీళ్లలో నోరో వైరస్, క్యాంపైలో బ్యాక్టీరియా ఉందని.. ఆ వైరస్, బ్యాక్టీరియాల ప్రభావంతో వ్యాధినిరోధక శక్తి బాధితుల నరాలపై ఉన్న మైలీన్ పొరను దెబ్బతీయడంతో ఈ ఆటోఇమ్యూన్ వ్యాధి వచ్చినట్లు ప్రాథమిక నివేదికల్లో తేలింది.
బాధితులు అచేతనం కావడం ఎందుకంటే...
మనిషి ప్రతి అవయవాన్నీ మెదడు నియంత్రిస్తుంటుంది. మెదడు నుంచి దేహంలోని ప్రతి భాగానికీ ఆదేశాలందించే నరాలపై మైలీన్ అనే పొర ఉంటుంది. సొంత వ్యాధినిరోధక వ్యవస్థలోని యాంటీబాడీస్ తమ సొంత మైలీన్ పొరను దెబ్బతీసినప్పుడు మెదడు నుంచి వచ్చే సిగ్నల్స్ అందకపోవడంతో అవయవాలు చచ్చుబడి అచేతనమవుతాయి.
ఇవీ లక్షణాలు..
⇒ మెదడు నుంచి కాళ్ల వరకు పొడవుగా ఉండే కాలి నరాలు ప్రభావితమై కాళ్లు చచ్చుబడిపోతాయి.
⇒ అచేతనం కావడం కింది నుంచి ప్రారంభమై పైకి పాకుతుంది. దాంతో వీపు భాగం, చేతులు, మెడ కండరాలు ఇలా దేహమంతా పూర్తిగా అచేతనమవుతుంది.
⇒ గొంతు కండరాలు అచేతనమైతే రోగి మాట్లాడలేడు. మింగడమూ కష్టమవుతుంది. ముఖంలోని కండరాలు అచేతనమైతే కళ్లు కూడా మూయలేడు.
⇒ అచేతనమయ్యే ఈ ప్రక్రియ ఛాతీ, కండరాలు, ఊపిరితిత్తులను పనిచేయించే డయాఫ్రమ్ కండరాల వరకు వెళ్లినప్పుడు ఊపిరితీసుకోవడం కష్టమవుతుంది. ఈ జబ్బును పూర్తిగా ప్రమాదకరంగా మార్చే అంశమిదే.
వేర్వేరుగా తీవ్రత స్థాయి
కండరాలు అచేతనం కావడంలోని ఈ తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరిలో స్వల్పంగా ఉంటే మరికొందరిలో తీవ్రత ఎక్కువగా ఉంటుంది. తీవ్రత స్వల్పంగా ఉంటే నడక కష్టమవుతుంది. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే బాధితులు పూర్తిగా మంచానికే పరిమితమవుతారు. చాలా మందిలో తమ ప్రమేయం లేకుండా జరిగిపోయే కీలకమైన జీవక్రియలు చాలా అరుదుగా మాత్రమే ప్రభావితమవుతాయి. కొందరిలో అవి కూడా ప్రభావితమైనప్పుడు గుండె స్పందనలు వేగంగా లేదా మెల్లగా మారడం, బీపీ హెచ్చుతగ్గులకు గురికావడం, ముఖం నుంచి వేడి ఆవిర్లు వస్తున్నట్లు అనిపించడం, బాగా చెమటలు పట్టడం జరగవచ్చు.
ఎప్పుడు ప్రమాదకరమంటే...
వ్యాధి మొదలయ్యాక క్రమంగా 7 నుంచి 14 రోజులపాటు తీవ్రం కావచ్చు. మైలీన్ పొర మళ్లీ యథాస్థితికి వస్తే బాధితుడు క్రమంగా కోలుకో వడం మొదలవుతుంది. ఇలా కోలుకోవడమ న్నది రోజుల వ్యవధి నుంచి ఆరు నెలలలోగా జరగవచ్చు.
జీబీ సిండ్రోమ్ లక్షణాలే కనిపించే మరికొన్ని జబ్బులు
శరీరంలో పొటాషియం లేదా కాల్షియం పాళ్లు తగ్గితే జీబీఎస్‌లో కనిపించే లక్షణాలే కనిపి స్తాయి. అయితే అవి భర్తీ కాగానే అచేతనత్వం తగ్గిపోతుంది. ఇక శరీరంలో అకస్మాత్తుగా క్రియాటినిన్ పాళ్లు పెరిగిపోవడం, డిఫ్తీరియా, హెచ్‌ఐవీ, లింఫోమా వంటి జబ్బుల్లోనూ జీబీ సిండ్రోమ్‌లోని లక్షణాలే కనిపిస్తాయి.
నిర్ధారణ ఇలా..
గులియన్ బ్యారీ సిండ్రోమ్ వంటి లక్షణాలతోనే మరికొన్ని ఇతర సమస్యలు వ్యక్తం కావడంతోపాటు పొటాషియం, కాల్షియం వంటి ఖనిజ లవణాలు తగ్గడం లేదా పెరగడం వల్ల కూడా ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి. కాబట్టి జీబీ సిండ్రోమ్ నిర్థారణ చాలా స్పష్టంగా జరగాలి. అందుకే రోగుల్లో తొలుత సాధారణ రక్తపరీక్ష చేసి అందులో పొటాషియం, కాల్షియం పాళ్లను, క్రియాటినిన్ మోతాదులను పరిశీలిస్తారు. అవన్నీ సక్రమంగా ఉన్నప్పుడు నర్వ్ కండక్షన్ పరీక్షల ద్వారా జీబీ సిండ్రోమ్‌ను నిర్ధారణ చేస్తారు. అయితే ఈ పరీక్షతో వ్యాధి తీవ్రత తెలియదు. కొన్నిసార్లు వెన్ను నుంచి నీరు తీసే ‘సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్’(సీఎస్‌ఎఫ్) పరీక్ష కూడా అవసరం కావచ్చు.
జీబీఎస్ అనేది శరీరంలోని నాడీవ్యవస్థను ప్రభావితం చేసే అరుదైన, తీవ్రమైన నరాల వ్యాధి. ఇదొక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఇది నరాలపై దాడి చేస్తుంది. దీంతో కండరాల బలహీనత, పక్షవాతం, కొన్ని సందర్భాల్లో శ్వాసకోశ వైఫల్యానికి దారితీస్తుంది. ఈ వ్యాధి సోకడానికి కచ్చితమైన కారణం తెలియదు కానీ.. తరచుగా వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల కారణంగా వస్తుంటుంది. ఇది శరీరంలో వేగంగా అభివృద్ధి చెంది రోగ నిరోధక శక్తిపై దాడిచేస్తుంది. దీనివల్ల శ్వాసకోశ కండరాలు ప్రభావితమైతే.. ఇంటెన్సివ్ కేర్‌లో వెంటిలేషన్‌పై ఉంచి చికిత్స అందించాల్సి ఉంటుంది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ల్లో ఈ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచించారు. జీబీఎస్ అంటువ్యాధి కాదని ప్రజలకు భరోసానిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment