జీబీ సిండ్రోమ్‌ భయపెడుతోంది | Concern over rising GBS cases in state | Sakshi
Sakshi News home page

జీబీ సిండ్రోమ్‌ భయపెడుతోంది

Published Sat, Feb 15 2025 5:03 AM | Last Updated on Sat, Feb 15 2025 5:03 AM

Concern over rising GBS cases in state

రాష్ట్రంలో పెరుగుతున్న కేసులతో ఆందోళన

కాళ్ల నుంచి మెడ దాకా క్రమంగా అచేతనం

రాష్ట్ర వ్యాప్తంగా 18 కేసులు యాక్టివ్‌

విశాఖలో ఆరు, కాకినాడలో నాలుగు కేసులు

గుంటూరు జీజీహెచ్‌లో ఐదుగురు బాధితులు 

వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరం 

గతంలో లక్ష మందిలో ఒకరికి.. ఇప్పుడు వందల మందికి..

పరిశుభ్రమైన నీరు, ఆహారమే ముందు జాగ్రత్తలు

సాక్షి, అమరావతి/గుంటూరు మెడికల్‌/సాక్షి ఫ్యామిలీ హెల్త్‌ డెస్క్‌ : లక్ష మందిలో ఒకరికో, ఇద్దరికో అరుదుగా వచ్చే గులియన్‌ బ్యారి సిండ్రోమ్‌ (జీబీఎస్‌) కేసుల నమోదు రాష్ట్రంలో ఒక్కసారిగా పెరుగుతుండటం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల ఈ వ్యాధి కారణంగా శ్రీకాకుళం జిల్లాలో యువంత్‌ (10) అనే బాలుడు మృతి చెందాడు. గుంటూరు జీజీహెచ్‌లో ఏడుగురు బాధితులు ఈ సమస్యతో చేరగా, ఇద్దరు కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. మిగిలిన ఐదుగురిలో గుంటూరు జిల్లా అలసనపల్లికి చెందిన బి.కమలమ్మ ఐసీయూలో, నరసరావుపేటకు చెందిన ఎస్‌.కె.రవీుజాన్‌ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. 

వీరిద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మిగతా ముగ్గురు.. గుంటూరు ఐపీడీకాలనీలోని వి.ఆశీర్వాదం, నెహ్రూనగర్‌కు చెందిన షేక్‌ గౌహర్జాన్, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా సకినేటిపల్లికి చెందిన వి.నాగవేణి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరులో 5, విశాఖలో 6, కాకినాడలో 4, విజయనగరం, విజయవాడ, అనంతపురంలో ఒక్కో కేసు చొప్పున మొత్తంగా 18 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

కర్నూలు, గుంటూరు, కాకినాడ, విశాఖ జీజీహెచ్‌లలో నెలకు 10–15 చొప్పున కొత్త కేసులు నమోదు అవుతున్నాయని వైద్య శాఖ వెల్లడించింది. నెల్లూరులో ఇటీవల లోకల్‌ టీవీ రిపోర్టర్‌ ఒకరు ఈ వ్యాధి బారినపడి కోలుకున్నారు. గుంటూరులో ఏకంగా ఏడుగురు ఈ వ్యాధి బారిన పడటంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు శుక్రవారం స్వయంగా జీజీహెచ్‌కు వచ్చి పరిస్థితిపై ఆరా తీశారు. చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి గురించి న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్‌ ఎన్‌.వి.సుందరాచారితో మాట్లాడారు.

మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జీబీ సిండ్రోమ్‌ కేసుల గురించి ప్రజలు భయాందోళన చెందాల్సిన పనిలేదన్నారు. సాధారణంగా వచ్చే వైరసేనని, గతంలో కూడా చాలా మంది చికిత్స పొంది రికవరీ అయ్యారని చెప్పారు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యులను సంప్రదించాలన్నారు. 

ఇవీ లక్షణాలు
» మెదడు నుంచి కాళ్ల వరకు పొడవుగా ఉండే కాలి నరాలు ప్రభావితమై కాళ్లు చచ్చుబడిపోతాయి. క్రమంగా వీపు భాగం, చేతులు, మెడ కండరాలు ఇలా దేహమంతా పూర్తిగా అచేతనమవుతుంది. గొంతు కండరాలు అచేతనమైతే రోగి మాట్లాడలేడు. మింగడమూ కష్టమవుతుంది. ముఖంలోని కండరాలు అచేతనమైతే కళ్లు కూడా మూయలేడు.

»    ఈ ప్రక్రియ ఛాతీ కండరాలు, ఊపిరితిత్తులను పని చేయించే డయాఫ్రమ్‌ కండరాల వరకు వెళ్లినప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఆ స్థితికి వచ్చిన బాధితులు మృతి చెందే అవకాశం ఉంది. ఈ వ్యాధి తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. తీవ్రత స్వల్పంగా ఉంటే నడక కష్టమవుతుంది. ఎక్కువగా ఉంటే బాధితులు పూర్తిగా మంచానికే పరిమితమవుతారు. 

»  జీవక్రియలు ప్రభావిమతమైనప్పుడు గుండె స్పందనలు వేగంగా లేదా మెల్లగా మారడం, బీపీ హెచ్చు తగ్గులకు గురికావడం, ముఖం నుంచి వేడి ఆవిర్లు వస్తున్నట్లు అనిపించడం, బాగా చెమటలు పట్టడం జరగవచ్చు. వ్యాధి మొదలయ్యాక క్రమంగా 7 నుంచి 14 రోజులపాటు తీవ్రం కావచ్చు. మైలీన్‌ పొర మళ్లీ యథాస్థితికి వస్తే బాధితుడు క్రమంగా కోలుకోవడం మొదలవుతుంది. ఇలా కోలుకోవడమన్నది రోజుల వ్యవధి నుంచి ఆరు నెలలలోగా జరగవచ్చు. 

» శరీరంలో పొటాషియం లేదా క్యాల్షియం పాళ్లు తగ్గితే జీబీఎస్‌లో కనిపించే లక్షణాలే కనిపిస్తాయి. అయితే అవి భర్తీ కాగానే అచేతనత్వం తగ్గిపోతుంది. ఇక శరీరంలో అకస్మాత్తుగా క్రియాటినిన్‌ పాళ్లు పెరిగిపోవడం, డిఫ్తీరియా, హెచ్‌ఐవీ, లింఫోమా వంటి జబ్బుల్లోనూ జీబీ సిండ్రోమ్‌లోని లక్షణాలే కనిపిస్తాయి. కాబట్టి జీబీ సిండ్రోమ్‌ నిర్ధారణ చాలా స్పష్టంగా జరగాలి.

ఎందుకిలా? ఎవరికి వస్తుంది?
ఏదైనా వైరల్‌ లేదా బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్‌ సోకాక పోస్ట్‌ వైరల్‌ లేదా పోస్ట్‌ బ్యాక్టీరియల్‌ వ్యాధిగా కనిపించే గులియన్‌ బ్యారీ సిండ్రోమ్‌ (జీబీఎస్‌) కాళ్లు చచ్చుబడిపోవడంతో ప్రారంభమవుతుంది. చిత్రంగా బాధితుల వైటల్స్‌... అంటే నాడి, రక్తపోటు వంటివన్నీ సాధారణంగానే ఉంటాయి. కానీ కాళ్ల దగ్గర్నుంచి క్రమంగా పై వైపునకు శరీరం అచేతనమవుతూ వస్తుంది. గతంలో ఇది చాలా అరుదుగా కనిపించేది. 

ప్రతి లక్ష మందిలో కేవలం ఒకరిద్దరికే వచ్చే ఈ వ్యాధి ఇప్పుడు వందలాది మందిని ప్రభావితం చేస్తోంది. ఇటీవల దీని విస్తృతి పెరిగింది. ఇది ఏ వయసువారిలోనైనా రావచ్చు. పుణేలో అనేక మంది కలుషితమైన నీటిని వాడటంతో ఈ వ్యాధి ప్రబలినట్లు తేలింది. అక్కడి నీళ్లలో నోరో వైరస్, క్యాంపైలో బ్యాక్టీరియా ఉందని.. వాటి ప్రభావంతో వ్యాధి నిరోధక శక్తి బాధితుల నరాలపై ఉన్న మైలీన్‌ పొరను దెబ్బతీయడంతో ఈ ఆటో ఇమ్యూన్‌ వ్యాధి వచ్చినట్లు ప్రాథమిక నివేదికల్లో తేలింది. 

బాధితులు అచేతనం కావడం ఎందుకంటే.. మనిషి ప్రతి అవయవాన్నీ మెదడు నియంత్రిస్తుంటుంది. మెదడు నుంచి దేహంలోని ప్రతి భాగానికీ ఆదేశాలందించడానికి నరాలపై మైలీన్‌ అనే పొర ఉంటుంది. వ్యాధి నిరోధక వ్యవస్థలోని యాంటీబాడీస్‌ తమ సొంత మైలీన్‌ పొరను దెబ్బతీసినప్పుడు మెదడు నుంచి వచ్చే సిగ్నల్స్‌ అందక  అవయవాలు చచ్చుబడి అచేతనమవుతాయి.

వందలో 95 మందికి ప్రాణాపాయం ఉండదు
జీబీఎస్‌ వ్యాధి చాలా ఏళ్లుగా ఉంటోంది. దీని అసలు పేరు ల్యాండ్రీ గులియన్‌ బ్యారీ సిండ్రోమ్‌. ప్రపంచ వ్యాప్తంగా లక్ష జనాభాలో ఒకరిద్దరు వ్యాధి బారిన పడుతుంటారు. గుంటూరు జీజీహెచ్‌లో నెలకు 10–15 కొత్త కేసులు మేం చూస్తుంటాం. సాధారణంగా వ్యాధి బారిన పడిన వందలో 75 మందికి ఆస్పత్రుల్లో చికిత్స కూడా అవసరం ఉండదు. 95 శాతం మంది రికవరీ అవుతారు. 5 శాతం మందికి ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తుతాయి.

బాధితులకు రూ.5 లక్షల ఖరీదైన ఇమ్యూనో గ్లోబ్యులిన్‌ ఇంజక్షన్లు ఇవ్వడంతో పాటు, ఆరోగ్య పరిస్థితిని బట్టి ఐసీయూ, వెంటిలేటర్‌ మీద చికిత్స అందిస్తుంటాం. ఇది ఒకరి నుంచి మరొకరికి సోకే అంటు వ్యాధి కాదు. ఈ నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదు. కాళ్లు, చేతులు చచ్చుబడటం, కండరాల బలహీన పడటం, స్వతహాగా నిలబడటానికి, నడవడానికి ఇబ్బంది వంటి లక్షణాలున్న వారు వెంటనే వైద్యులను సంప్రదిస్తే సరిపోతుంది.   – డాక్టర్‌ ఎన్‌.వి. సుందరాచారి, సీనియర్‌ న్యూరాలజిస్ట్, ప్రిన్సిపల్, గుంటూరు వైద్య కళాశాల

తక్కువ ఖర్చుతో ప్లాస్మా ఎక్స్‌ఛేంజ్‌ చికిత్స
ఈ జబ్బులో రోగి తన రోజువారీ పనులను సొంతంగా చేసుకోలేని పరిస్థితికి చేరుకుంటే రోగి శరీర బరువు ఆధారంగా వారికి తగిన మోతాదులో ఐదు రోజులపాటు ఇమ్యూనో గ్లోబ్యులిన్‌ ఇంజెక్షన్లు ఇస్తారు. ఇవి దేహంలో మైలీన్‌ షీత్‌ను ధ్వంసం చేసే యాంటీబాడీస్‌ను బ్లాక్‌ చేయడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దుతాయి. 

మరో పద్దతిలో రోగి బరువునుబట్టి ప్రతి కిలోగ్రాముకూ 250 ఎంఎల్‌ ప్లాస్మాను రక్తం నుంచి తొలగిస్తారు. అందులో ఐదు విడతలుగా రోజు విడిచి రోజు రక్తంలోని ప్లాస్మాను తీసేయడం ద్వారా ప్లాస్మాలోని యాంటీబాడీస్‌ను తొలగించడం జరుగుతుంది. ఇందులో ఇమ్యూనో గ్లోబ్యులిన్‌ చికిత్స ఖరీదైనది. 

దానితో పోలిస్తే ప్లాస్మా ఎక్స్‌ఛేంజ్‌ చికిత్స దాదాపు సగం ఖర్చులోనే అవుతుంది. యువత, టీనేజీ పిల్లలు వేగంగా కోలుకుంటారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు కలుషితమైన నీరు, ఆహారం వాడకపోవడం అన్ని విధాలా మేలు.– డాక్టర్‌ బి. చంద్రశేఖర్‌రెడ్డి,  సీనియర్‌ న్యూరో ఫిజీషియన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement