
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)పై ఒకప్పటి సహచర ఆటగాడు, అతడి స్నేహితుడు అమన్ ఖాన్ (Aman Khan) ప్రశంసలు కురిపించాడు. అయ్యర్‌లో ఆత్మవిశ్వాసం మెండు అని.. ఓ మ్యాచ్‌లో చెప్పి మరీ తమ జట్టు బౌలింగ్‌ను చితక్కొట్టాడని గుర్తు చేసుకున్నాడు. ప్రత్యర్థి ఎవరన్న అంశంతో సంబంధం లేకుండా దూకుడుగా ముందుకు సాగుతాడని కొనియాడాడు.
పునరాగమనంలో సూపర్ హిట్
కాగా గాయం సాకు చూపి రంజీ మ్యాచ్ ఆడకుండా తప్పించుకున్నాడన్న ఆరోపణలతో శ్రేయస్ అయ్యర్ గతేడాది సెంట్రల్ కాంట్రాక్టు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. జాతీయ జట్టుకు దూరమైన అతడు.. కఠిన శ్రమకోర్చి దేశవాళీ క్రికెట్‌లో తనను తాను మరోసారి నిరూపించుకున్నాడు.
ముంబై తరఫున బరిలోకి దిగి రంజీ (ఫస్ట్ క్లాస్), విజయ్ హజారే ట్రోఫీ (వన్డే), సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (టీ20)లలో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో పరుగుల సునామీ సృష్టించాడు. ఈ క్రమంలో తిరిగి జాతీయ జట్టుకు ఎంపికైన శ్రేయస్ అయ్యర్.. ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లోనూ అదరగొట్టాడు.
దుబాయ్ వేదికగా జరిగిన ఈ వన్డే టోర్నమెంట్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన అయ్యర్.. టీమిండియా చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా 243 పరుగులు సాధించి భారత్ తరఫున టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025 మెగా వేలంలో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ భారీ ధర పలికిన విషయం తెలిసిందే.
రూ. 26.75 కోట్లు
పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ. 26.75 కోట్లకు శ్రేయస్ అయ్యర్‌ను కొనుగోలు చేసి.. కెప్టెన్‌గా నియమించింది. గతేడాది కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చాంపియన్‌గా నిలిపిన అతడిని ఈసారి తమ సొంతం చేసుకుని పగ్గాలు అప్పగించింది. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ గురించి కోల్‌కతా మాజీ ఆల్‌రౌండర్ అమన్ ఖాన్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
రేపు మీ బౌలింగ్‌ను చితక్కొడుతాను చూడు
‘‘విజయ్ హజారే మ్యాచ్‌కు ముందు.. నేను, శ్రేయస్ డిన్నర్‌కు వెళ్లాం. ప్రత్యర్థులుగా పోటీ పడటం గురించి చర్చిస్తూ సరదాగా గడిపాము. శ్రేయస్ ముంబైకి ఆడుతుంటే.. నేను పాండిచ్చేరికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. మరుసటి రోజు మ్యాచ్ గురించి చెబుతూ.. ‘రేపు మీ బౌలింగ్‌ను చితక్కొడుతాను చూడు’ అన్నాడు.
పదహారు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో
అన్నట్లుగానే సెంచరీ చేశాడు. కేవలం 133 బంతుల్లోనే 137 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిగతా ముంబై బ్యాటర్లంతా పరుగులు రాబట్టేందుకు ఆపసోపాలు పడుతున్న వేళ శ్రేయస్ అయ్యర్ మాత్రం ముందు రోజు రాత్రి నాకేం చెప్పాడో అది చేసి చూపించాడు’’ అని అమన్ ఖాన్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు.
కాగా గతేడాది విజయ్ హజారే మ్యాచ్‌లో భాగంగా పాండిచ్చేరితో తలపడ్డ ముంబై.. 82 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన వేళ శ్రేయస్ బ్యాట్ ఝులిపించాడు. పదహారు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో శతక్కొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2022స సీజన్‌లో శ్రేయస్ కెప్టెన్సీలో కేకేఆర్ తరఫున అమన్ ఖాన్ ఆడాడు. తాము తప్పకుండా టైటిల్ గెలుస్తామని అతడు తరచూ చెప్పేవాడని.. అన్నట్లుగానే 2024లో కోల్‌కతాను చాంపియన్‌గా నిలిపాడని అమన్ ఖాన్ గుర్తు చేసుకున్నాడు. ఆటగాళ్లపై అరవడం, మైదానంలో దూకుడుగా కనిపించడం శ్రేయస్ శైలి కాదని.. కూల్‌గానే తను అనుకున్న ఫలితం రాబట్టడంలో అతడు దిట్ట అని ప్రశంసించాడు.
చదవండి: ముగ్గురు టీమిండియా కెప్టెన్లు.. అది నా అదృష్టం: హార్దిక్ పాండ్యా
Comments
Please login to add a commentAdd a comment