ఆశలు ఎండ‘మామిడి’ | Climate change affecting mango fruit in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఆశలు ఎండ‘మామిడి’

Published Thu, Mar 20 2025 4:05 AM | Last Updated on Thu, Mar 20 2025 4:05 AM

Climate change affecting mango fruit in Andhra Pradesh

పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు.. రాత్రిళ్లు మంచు ప్రభావం 

ఫ్రూట్‌ సెట్టింగ్‌ను దెబ్బతీస్తున్న వాతావరణ మార్పులు

నల్లతామర ఉధృతికి తోడు తొలిసారి మ్యాంగో లూఫర్‌ విజృంభణ 

పిందెలను తినేస్తున్న కొత్త రకం తెగుళ్లు.. పురుగులు 

తేనెమంచు పురుగు, ఇతర రసం పీల్చే పురుగులతో ఉక్కిరి బిక్కిరి

వాతావరణం, తెగుళ్లతో రాలిపోతున్న పూత, పిందెలు 

దాదాపు 10 లక్షల ఎకరాలపై ప్రభావం.. రైతన్నకు తీరని నష్టం 

హెక్టార్‌కు 3–4 టన్నుల దిగుబడీ కష్టమేనంటున్న అధికారులు

సాక్షి, అమరావతి: చెట్టంతా పూత.. దీంతో ఈ ఏడాది ఇక చింత లేదనుకున్నారు..! పిందె పడడమే ఆలస్యం.. తమ పంట పండినట్లేనని భావించారు..! కానీ, పగబట్టినట్లుగా వాతావరణ మార్పులు.. కొత్త రకం పురుగులు కలిపి దాడి చేశాయి..! 

ఫలితంగా పూతతో పాటు రైతుల ఆశలూ నేలరాలుతున్నాయి. నాలుగు డబ్బులు మిగులుతాయని భావిస్తే.. ఎర్రటి ఎండల్లో నీటి జాడను భ్రమింపజేసే ఎండమావుల్లా మారింది వారి పరిస్థితి. ‘ఆంధ్రప్రదేశ్‌ మామిడి’ అంటే దేశ విదేశాల్లో గొప్ప పేరు..! 

అయితే, ప్రస్తుతం చిత్తూరు నుంచి నూజివీడు దాకా ఎటుచూసినా మామిడి రైతులో నిర్వేదమే కనిపిస్తోంది. బంగినపల్లి మొదలు రసాల వరకు పంటను చూస్తే బెంగ పట్టుకుంటోంది. వాస్తవానికి ఏటా డిసెంబరు, జనవరిలో మామిడి పూత వస్తుంది. ఈ ఏడాది మాత్రం ఫిబ్రవరిలో మొదలైంది. అయితే, శ్రీకాకుళం మొదలు చిత్తూరు వరకు ఏ చెట్టు చూసినా పూత బ్రహ్మాడంగా కాసింది. 

దీంతో దిగుబడికి దిగులు ఉండదని రైతులు ఆశపడ్డారు. కానీ, పూత పిందె కట్టేలోగా వారి ఆశలు ఆవిరయ్యాయి. ఒక్కసారిగా వాతావరణ మార్పులకు తోడు ‘మాంగో లూఫర్‌’ అనే కొత్త రకం పురుగు, తెగుళ్లు విజృంభణతో కళ్లెదుటే పూత మాడిపోయి, పిందెలు రాలిపోతున్నాయి. ఇదంతా చూసి రైతులు దిగాలు పడుతున్నారు.   

దాదాపు 10 లక్షల ఎకరాల్లో.. 
రాష్ట్రంలో 9.97 లక్షల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. సువర్ణ రేఖ, నీలం, తోతాపూరి, బంగినపల్లి ప్రధానంగా పండిస్తున్నారు. గత రెండేళ్లలో వరుసగా 49.85 లక్షల టన్నులు, 35.78 లక్షల టన్నులు దిగుబడులు వచ్చాయి. ఈ ఏడాది కనీసం 45 లక్షల టన్నుల దిగుబడిని అంచనా వేశారు. అయితే, పూత పట్టింది మొదలు తెగుళ్లు, వైరస్‌లు విజృంభించాయి. 

మరోపక్క ఉష్ణోగ్రతలు అనూహ్యంగా 3 నుంచి 5 డిగ్రీల మేర పెరిగిపోయాయి. అసలే పూత ఆలస్యంతో ఇబ్బంది పడుతుండగా, ఉష్ణోగ్రతల ప్రభావం ప్రూట్‌ సెట్టింగ్‌ను దెబ్బతీసింది. జనవరి, ఫిబ్రవరిలో 28–29 డిగ్రీల మేర ఉన్న ఉష్ణోగ్రత, ప్రస్తుతం 36–38 డిగ్రీలకు చేరడం మామిడి పంటపై ప్రభావం చూపుతోంది. 


మరోవైపు రాత్రిపూట మంచు ప్రభావం తీవ్రంగా ఉంది. అనూహ్య వాతావరణ పరిస్థితులతో మగ, ద్విలింగ పుష్పాల నిష్పత్తి (రేషియో) మారిపోయి ఆశించిన స్థాయిలో పిందెలు ఏర్పడడం లేదు. 

⇒ మిరపను ఆశిస్తున్న నల్ల తామర పురుగు.. రెండేళ్లుగా మామిడిపైనా దాడి చేస్తోంది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో దీని దెబ్బకు మామిడి పూత చాలావరకు మాడిపోయింది. 40 శాతం పైగా పంట మీద నల్ల తామర పురుగు ఉ«ధృతి కనిపిస్తోంది.

రాయలసీమలో లిచీ లూఫర్‌ పురుగు దాడి 
లిచీ పంటలో కనిపించే అరుదైన మ్యాంగో లూఫర్‌ (కొత్త రకం గొంగలి పురుగు) ఏపీలో తొలిసారి మామిడిపై వ్యాపిస్తోంది. రాయలసీమతో పాటు కృష్ణా, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఇది ఎక్కువగా ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. లార్వా దశలోనే పువ్వులు, ఆకులను తినేసే, పిందెల్లోకి చొరబడే ఈ పురుగులు 20–30 శాతం తోటలను దెబ్బతీస్తున్నాయి. 

వీటికితోడు వాతావరణ పరిస్థితులను బట్టి మంగు, మసి, పండు ఈగ, పెంకు, తేనె మంచు పురుగు, కాండంతొలుచు, కొమ్మ తొలిచే, గూడు పురుగు వంటి ఇతర రసం పీల్చే పురుగుల ఉధృతి మరీ ఎక్కువగా కనిపిస్తోంది. ఫలితంగా పూత మాడిపోతూ  పిందెలు రాలిపోతున్నాయి. 

సాధారణంగా హెక్టార్‌కు 10 టన్నుల దిగుబడి రావాల్సి ఉండగా, ఈ ఏడాది   మూడు నుంచి నాలుగు టన్నులకు మించి వచ్చే అవకాశాలు లేవని అంచనా వేస్తున్నారు. 

పురుగుమందుల ఖర్చు రెట్టింపు 
⇒ విస్తృతంగా పురుగుమందుల వినియోగంతో రైతులకు పెట్టుబడులు తడిసి మోపెడు అవుతున్నాయి. గతంలో ఎకరాకు రూ.20 వేలు వ్యయం కాగా..  ప్రస్తుతం సగటున రూ.40–50 వేల మధ్య ఖర్చు చేస్తున్నారు.

సస్యరక్షణ చర్యలు ఇలా...
⇒ అజాడిరక్టివ్‌ 2 మిల్లీ లీటర్‌ ఒక లీటర్‌ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఆ తరువాత బీటీ ఫార్ములేషన్‌ బాసిల్లస్‌ తురింజియోస్పిస్‌ వెరైటీ కుర్‌స్టాకి(డిపెల్‌) 1.5–2 మిల్లీ లీటర్లు ఒక లీటర్‌ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. 
⇒ క్లోరోఫైరిఫాస్‌ 50శాతం ఈసీ ఒక మిల్లీ లీటర్‌ ఒక లీటర్‌ నీటిలో లేదా ఇమామోక్టిన్‌ బెంజోయేట్‌ 0.5 గ్రాములు ఒక లీటర్‌ నీటిలో లేదా నోవాల్యురాన్‌ 5.25 శాతం ప్లస్‌ ఇండోక్సా కార్బ్‌ 4.5 శాతం ఒక మిల్లీ లీటర్‌ ఒక లీటర్‌ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. 
⇒ పురుగుల ఉధృతిని నియంత్రించేందుకు ఎకరాకు 8 పండు ఈగ బుట్టలు పెట్టుకోవాలి. 
⇒ 10 ఏళ్లు పైబడిన మామిడి తోటలకు రోజుకు ఒక చెట్టుకు కనీసం 100 లీటర్ల నీటిని అందించాలి. 
⇒ పిందెలు ఎక్కువగా రాలిపోతుంటే నాఫ్తలిన్‌ అసిటిక్‌ యాసిడ్‌ (ప్లానోఫిక్స్‌) 100 ఎంఎల్‌ 500 లీటర్ల నీటిలో (50 చెట్లు) పిచికారీ చేయాలి. 
⇒ నీటి వసతి లేని రైతులైతే పొటాíÙయం నైట్రేట్‌ 10 గ్రాములు ఒక లీటర్‌ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. 
⇒ తేనె మంచు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే డైనోటోప్యూరాన్‌ 0.25 గ్రాములు ఒక లీటర్‌ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. 
⇒ నల్లతామర ఉధృతి ఎక్కువగా ఉంటే చెట్టుకొక బ్లూ కలర్‌ జిగురు అట్ట అమర్చుకోవాలి.

ఏం చేయాలో పాలుపోవడం లేదు
నాకు 6 ఎకరాల మామిడి తోట ఉంది. పూత బాగా వచ్చినప్పటికీ ఎండల తీవ్రతతో పాటు నల్లతామర, కొత్త రకం పురుగుల ప్రభావంతో మాడిపోయింది. పిందెలను కాపాడడానికి పురుగుమందులు విపరీతంగా పిచికారీ చేయాల్సి వస్తోంది. ఎకరాకు రూ.40 వేల పైనే ఖర్చు అవుతోంది. ఇంకా పెట్టుబడి పెట్టాలంటే భయంగా ఉంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే పెట్టుబడీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. గతంలోలా అధికారులు తోటలను పరిశీలించి సలహాలు ఇవ్వడం లేదు. నిరుడు ధర లేక మామిడిని తోటల్లోనే వదిలేశాం. ఈ ఏడాదైనా గట్టెక్కుదాం అనుకుంటే అసలు ఏంచేయాలో పాలుపోవడంలేదు. 
– ఆకేపాటి రంగారెడ్డి, అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం తూర్పుపల్లి

పెట్టుబడి కూడా వచ్చేలా లేదు 
2.5 ఎకరాల్లో 12 ఏళ్ల వయస్సున్న 200 చెట్లు ఉన్నాయి. ఎండల ప్రభావం, బంక తెగులుతో పూత మొత్తం నేలవాలింది. ఒకటీ అరా పిందెలు వచ్చినా కొత్తరకం పురుగులతో రాలిపోతోంది. ఇప్పటికే పురుగు మందుల కోసం రూ.40–50 వేలు ఖర్చు చేశా. కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చా. తీరా కాపు కొచ్చేసరికి తెగుళ్లు, ఎండలు మా కడుపు కొడుతున్నాయి. ఈసారి దిగుబడికి అవకాశం లేదు. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. 
–కె.వెంకటసుబ్బయ్య, అనంతపల్లె, పుల్లంపేట మండలం, అన్నమయ్య జిల్లా

70 శాతం పూత దెబ్బ.. 
నాకు సొంతంగా ఐదెకరాలుండగా, 15 ఎకరాల్లో తోటలు లీజుకు తీసుకున్నా. ప్రారంభంలో మంచి పూతే వచ్చింది. ఇటీవల కురుస్తున్న మంచుకు తోడు పగటి ఉష్ణోగ్రతల ప్రభావానికి పూర్తిగా మాడిపోయింది. తేనె మంచు, రసం పీల్చే పురుగుల ప్రభావంతో రాలిపోయింది. 60–70 శాతం పూత దెబ్బతిన్నది. మిగిలిన పూతలో అక్కడక్కడా పిందెలు కట్టినా నిలుస్తాయో లేదోనని అనుమానంగా ఉంది. ఈ ఏడాది లీజుతో పాటు పురుగుమందులకు రూ.8 లక్షల వరకు పెట్టుబడి పెట్టా. అది కూడా వచ్చే పరిస్థితి కన్పించడం లేదు. 
–దుంగ వెంకటరమణ, నీలకంఠాపురం, లక్కవరపుకోట మండలం, విజయనగరం జిల్లా

ఫ్రూట్‌ కవర్స్‌తో కొంత మేర రక్షణ 
కొత్త రకం గొంగలి పురుగు మ్యాంగో లూఫర్‌తో పాటు నల్లతామర ఉధృతి ఎక్కువగా ఉంది. పూత ఆలస్యమవడంతో పాటు పెరిగిన ఉష్ణోగ్రతల ప్రభావంతో ఫ్రూట్‌ సెట్టింగ్‌ జరగక పిందెకట్టడం తగ్గిపోయింది. ఈసారి దిగుబడులు తగ్గే అవకాశాలు కన్పింస్తున్నాయి. పురుగుల ఉధృతిని ఎదుర్కొనేందుకు సస్యరక్షణ చర్యలు పాటించాలి. పురుగు మందులను  సిఫార్సుల మేరకే వాడాలి. పిందెలను కాపాడుకునేందుకు రైతులు ఫ్రూట్‌ కవర్స్‌ కట్టాలి. పిందె నిమ్మకాయ పరిమాణంలోకి వచ్చిన తర్వాత కవర్లు కడితే కాయల సైజుతో పాటు నాణ్యత కూడా పెరుగుతుంది.  
–డి.శ్రీనివాసరెడ్డి, సీనియర్‌ శాస్త్రవేత్త ఉద్యాన పరిశోధనా కేంద్రం, తిరుపతి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement